Women Police Station
-
హరర్ మూవీలు చూపించి.. అమెరికా అల్లుడి వికృత చేష్టలు
సాక్షి, బంజారాహిల్స్: ఎన్ఆర్ఐ భర్త మోసం చేయడంతో బాధిత యువతి ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడమే కాకుండా మంగళవారం యూసుఫ్‌గూడ ఎల్ఎననగర్లోని అత్తింటి ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగింది. వివరాల్లోకి వెళ్తే... యూసుఫ్‌గూడ ఎల్‌ఎన్‌నగర్‌కు చెందిన మారి మహేష్ 2022 మే 26న రామేశ్వరిని వివాహం చేసుకున్నాడు. అదే ఏడాది జూన్ 18న యూఎస్ఏలోని టెక్సాస్‌కు తీసుకెళ్లాడు. అయితే ఆ మర్నాటి నుంచే నీ వల్ల కట్నం తక్కువగా వచ్చింది మరొకరిని చేసుకుంటే ఎక్కువ కట్నం వచ్చేదంటూ గొడవ పడుతున్నాడు. రామేశ్వరిని వదిలించుకోవాలని పలుమార్లు ఆమెపై దాడి చేశాడు. హరర్ మూవీలు చూపించేవాడు. బలవంతంగా హుక్కా తాగించేవాడు. ఆ తర్వాత రెండు నెలలకే గత ఆగస్టు 18న రామేశ్వరితో పాటు ఇండియాకు వచ్చిన మహేష్ ఆమెను దోమల్‌గూడలోని పుట్టింట్లో వదిలేసి ఆ తెల్లవారే అమెరికా వెళ్లిపోయాడు. ఆమెకు తెలియకుండానే రానుపోనూ టికెట్లు బుక్ చేసుకున్నాడు. తనను తీసుకెళ్లాలని ఫోన్ చేస్తే టికెట్ దొరకడం లేదంటూ బుకాయించాడు. దీంతో ఆమె తల్లిదండ్రులు గత అక్టోబర్ 23న అమెరికాకు టికెట్ బుక్ చేసి రామేశ్వరిని భర్త వద్దకు పంపించారు. రామేశ్వరి ఫ్లైట్ ఎక్కగానే ఈ విషయమై ఆమె తండ్రి మహేందర్ అల్లుడికి ఫోన్ చేయగా తనకు ఏం సంబంధం లేదని ఆమె ఎవరో తనకు తెలియదంటూ అసభ్యంగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు. ఆమె అమెరికా వెళ్లాక కూడా ఘర్షణ పడటమేగాక విడాకుల నోటీసుపై సంతకం కూడా పెట్టించాడు. ఈ విషయమే రామేశ్వరి తల్లిదండ్రులు మహేష్ తల్లిదండ్రులతో మాట్లాడటానికి ప్రయత్నించగా తమపై దాడి చేయడానికి వచ్చారంటూ మహేష్ తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అక్రమ కేసులు బనాయించారు. పోలీసుల సూచన మేరకు బాధితురాలు ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పది రోజులు గడిచినా మహేష్‌ను, ఆమె తల్లిదండ్రులను పోలీసులు పిలవకపోవడంతో రామేశ్వరి తన తల్లిదండ్రులతో కలిసి అత్తమామను కలవడానికి వెళ్లగా ఇంటికి తాళం వేసి బయటికి గెంటేశారు. తన ఇంటికి తనను రావొద్దని చెప్పడానికి వారి ఏం హక్కు ఉందంటూ బాధితురాలు అత్తింటి ఎదుట ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని, తక్షణం మహేష్‌ను అమెరికా నుంచి పిలిపించాలని కోరింది. (చదవండి: అంతం చేసింది అత్త కొడుకే..) -
పసిమొగ్గపై కిరాతకం
బనశంకరి: గత పదేళ్లుగా నిరంతరం తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఓ బాలిక ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బెంగళూరు తూర్పువిభాగ మహిళా పోలీస్‌స్టేషన్‌లో 8 మందిపై కేసు నమోదుచేశారు. లైంగికదాడి, పోక్సో చట్టాల కింద అభియోగాలను నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. బాలిక తండ్రి చర్చ్ ఫాదర్‌గా పనిచేస్తుంటాడు. ఆమెకు 6 ఏళ్ల వయసులో స్నేహితుని ఇంట్లో వదలిపెట్టాడు. 10 ఏళ్లు వయసులో స్నేహితుని కుమారుడు బాలికకు మొబైల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు, వీడియోలు చూడాలని బలవంతం చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. మూడునాలుగేళ్లు దారుణం కొనసాగించాడు. అతని వేధింపులను తట్టుకోలేక బాలిక పాఠశాల ఉపాధ్యాయునికి మొరపెట్టుకుంది. ఆ ఉపాధ్యాయుడు, అతడి భార్య కలిసి యువకున్ని మందలించారు. అదే సమయంలో నీ గురించి అందరికీ చెబుతానని బెదిరించిన ఆ ఉపాధ్యాయుడు బాధిత బాలిక మీద రెండేళ్ల నుంచి అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. తన స్నేహితురాలిపై కూడా లైంగికదాడికి పాల్పడ్డాడని, ఇది తెలిసి మరో 6 మంది తమపై దారుణానికి ఒడిగట్టారని బాలిక ఆరోపించింది. నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బుధవారం 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కామాంధ తండ్రికి జైలుశిక్ష బనశంకరి: కంటికి రెప్పలా బిడ్డను చూసుకోవాల్సిన తండ్రి కామంతో కళ్లు మూసుకుపోయి అకృత్యానికి ఒడిగట్టాడు. ఆ కిరాతక తండ్రికి 20 ఏళ్ల కఠిన శిక్ష విధిస్తూ బుధవారం మంగళూరు జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. విట్ల పేరువాయి గ్రామ నివాసి 2020 మార్చిలో మైనర్ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేరంపై విట్ల పోలీస్‌స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. విచారణలో నేరం రుజువు కావడంతో జడ్జి కేఎం.రాధాకృష్ణ దోషికి 20 ఏళ్ల కఠినశిక్షతో పాటు రూ.25 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. (చదవండి: విశాఖ ఆర్కే బీచ్‌లో అదృశ్యమైన సాయిప్రియ కేసులో మరో బిగ్ ట్విస్ట్) -
నాలుగు పెళ్లిళ్లు.. ఆరుగురితో సహజీవనం
సాక్షి, హైదరాబాద్ : నాలుగు పెళ్లిళ్లు చేసుకోవడమేగాక మరో ఆరుగురితో సహజీవనం చేస్తున్న తన భర్తపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ మంగళవారం సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. హిమబిందు అనే మహిళకు మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా 2018లో మియాపూర్‌లోని హెచ్ఎంటీ స్వర్ణప్యాలస్‌లో ఉంటున్న వెంకటబాలకృష్ణ పవన్‌కుమార్‌తో వివాహం జరిగిందన్నారు. కట్నంగా రూ.28లక్షలు, పెళ్లి ఖర్చులకు మరో రూ.10లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. వివాహం అనంతరం తనను దుబాయ్ తీసికెళ్లిన పవన్‌కుమార్ అక్కడ వేధింపులకు పాల్పడినట్లు తెలిపింది. తనకు ఇదివరకే మరో ముగ్గురితో పెళ్లి జరిగిందని, మొదటి భార్య, రెండో భార్యను వదిలేసినట్లు అతనే స్వయంగా తనతో చెప్పాడని, మూడో భార్యను నేరుగా తనకు పరిచయం చేయడమేగాక ఆమె తన నిజమైన భార్య అని చెప్పినట్లు ఆరోపించింది. ఓ రోజు ఐరన్‌బాక్స్‌తో తన ముఖంపై కాల్చేందుకు ప్రయత్నించాడని, ఆ తర్వాత కూడా పలుమార్లు హత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఏడాది క్రితం మహిళా పోలీసు స్టేషన్లో కేసు పెట్టానని, న్యాయం కోసం పోలీసు స్టేషన్, కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్లు తెలిపారు. కొద్దిరోజులుగా తన ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ హ్యాక్ చేశారని ఆరోపించింది. తన భర్త పవన్‌కుమార్‌కు కఠినంగా శిక్షించి కట్నం డబ్బులు, పెళ్లి ఖర్చులు మొత్తం రూ.38లక్షలు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది. -
కామాంధునికి ‘దిశ’ బేడీలు
తాడేపల్లిరూరల్ (మంగళగిరి): గౌరవప్రదమైన ఉద్యోగం, మంచి కుటుంబం ఉన్నా కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు పాల్పడ్డాడు. డబ్బు, వస్తువులు ఆశ చూపి అభంశుభం తెలియని యువతులను మోసం చేశాడు. శృతిమించిన అతని చేష్టలతో విసిగిపోయిన భార్య దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసి అరెస్టు చేయించింది. అతని బారి నుంచి ఓ విద్యార్థినిని కాపాడింది. కామాంధుడి చెర నుంచి విద్యార్థినిని రక్షించినందుకు మేరీ జెస్సికాను అందరూ అభినందించారు. వివరాలివీ.. - గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన టి.అనిల్‌కుమార్ విజయవాడలో రైల్వే గార్డు. - మాయమాటలు చెప్పి, డబ్బు ఆశ చూపి ఆడపిల్లలను వలలో వేసుకుంటాడు. వారి జీవితాలను నాశనం చేస్తాడు. - తన ఇంటి సమీపంలోనే డిగ్రీ చదివే ఓ విద్యార్థినికి మొబైల్ ఫోన్ ఆశ చూపి వశపరుచుకున్నాడు. ఏకాంతంలో ఉండగా తీసిన ఫొటోలను చూపి బెదిరించి తన కోరికలు తీర్చుకున్నాడు. - విషయం తెలుసుకున్న భార్య మేరీ జెస్సికా వారించింది. - అతనిలో మార్పు రాకపోవడంతో ఆ విద్యార్థిని కుటుంబాని అక్కడి నుంచి దూరంగా పంపేసింది. - అయినా అనిల్ ఆ విద్యార్థినిని వదలలేదు. ఆదివారం మధ్యాహ్నం విజయవాడలో ప్రైవేటు క్లాసుకు వెళ్లి వస్తున్న విద్యార్థినిని బెదిరించి, హోటల్‌కు తీసుకువెళ్లేందుకు యత్నించాడు. - విషయం తెలుసుకున్న భార్య మేరీ జెస్సికా అక్కడికి చేరుకుంది. దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. - రెండు నిమిషాల్లో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనిల్‌కుమార్‌ను, విద్యార్థినిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. - ఆరు నెలలుగా అనిల్‌కుమార్ తనను ఏ విధంగా వేధిస్తున్నదీ విద్యార్థిని పోలీసులకు వివరించింది. - విద్యార్థిని ఫిర్యాదు మేరకు సత్యనారాయణపురం స్టేషన్ మహిళా ఎస్ఐ స్వాతి కేసు నమోదు చేశారు. అనంతరం కేసును తాడేపల్లి స్టేషన్‌కు బదిలీ చేశారు. - అనిల్‌కుమార్‌ను అరెస్టు చేశారు. -
ఇదీ.. నా కల
ఒక గ్రామం నుంచి మనిషి బయటకు పోవాల్సిన పనిలేకుండా అన్నీ అందుబాటులో ఉండేలా అడుగులు వేస్తున్నాం.. అలాగే అక్రమాలపై మహిళా సంరక్షణ పోలీస్ రిపోర్ట్ ఇచ్చాక దానిపై యాక్షన్ తీసుకోవడం ముఖ్యం. అప్పుడే ఊళ్లో మార్పు కనిపిస్తుంది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘గ్రామం బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఒక గ్రామం ఎలా ఉంటే బావుంటుందో ఒక్కసారి ఊహిస్తే.. అది మన కళ్లముందు కనిపిస్తుంది. 72 గంటల్లో సేవలందించేలా గ్రామ సచివాలయం, స్కూలు, ఆసుపత్రి, రైతు భరోసా కేంద్రం, అంగన్వాడీ కేంద్రం, ఓ మహిళా సంరక్షణ పోలీసు.. ఇలా అన్నీ వరుసగా కనిపిస్తాయి. ఇది కేవలం ఊహగానే మిగిలి పోకుండా మన కళ్లెదుట సాక్షాత్కరింప చేయడానికి మన ప్రభుత్వం నడుం బిగించింది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. విజయనగరంలోని పోలీస్ బ్యారెక్స్‌లో సోమవారం ఆయన దిశ మహిళా పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన తన కలల గ్రామాన్ని నిజం చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఒక గ్రామం నుంచి మనిషి బయటకు పోవాల్సిన పని లేకుండా అన్నీ అందుబాటులో ఉండేలా అడుగులు వేస్తున్నామన్నారు. సీఎం వైఎస్ జగన్ ఏం చెప్పారంటే.. ఎనిమిది నెలలుగా విప్లవాత్మక కార్యక్రమాలు ‘పోలీస్ అంటే ఊర్లో కొద్దో గొప్పో భయం ఉంటుంది. అందుకే గ్రామ మహిళ సంరక్షణ కార్యదర్శి పేరును ‘మహిళ సంరక్షణ పోలీస్’గా మారుద్దామని డీజీపీకి చెప్పాను. ఈ పేరు అయితే బావుంటుంది. గ్రామ, వార్డు పరిధిలో మహిళ సంరక్షణ పోలీస్‌లు, మహిళా పోలీస్ మిత్రలు, పోలీస్ చెల్లెమ్మల భుజస్కందాలపై ఉన్న బాధ్యతను గుర్తు చేయాల్సిన పరిస్థితి. ఒక గ్రామం ఎలా ఉంటే బావుంటుందో.. అలా మార్చేందుకు మన ప్రభుత్వం గత 8 నెలల కాలంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. రాబోయే రోజుల్లో గ్రామం అన్నది ఏలా ఉంటుందంటే.. ప్రతి 2 వేల జనాభాకు కావాల్సిన ప్రతి సేవ అందుబాటులో ఉండేట్టు గ్రామ సచివాలయం ఉంటుంది. అన్ని సేవలూ అక్కడే లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. లంచాలు, వివక్షకు తావులేకుండా ప్రతీ సేవ నిర్ణీత గడువులోగా అందేలా చూస్తున్నాం. దిశ పోలీస్ స్టేషన్ బయట మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సీఎం వైఎస్ జగన్ గ్రూప్ ఫొటో గ్రామ సచివాలయం పక్కనే మెరుగైన వసతులతో ఒక ఇంగ్లిష్ మీడియం స్కూలు కనిపిస్తుంది. అదే గ్రామంలో ఒక అడుగు ముందుకు వేస్తే వైఎస్సార్ విలేజ్ క్లినిక్ అనే ఒక ఆసుపత్రి కనిపిస్తుంది. రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు 2,400 సబ్ సెంటర్స్ కూడా లేవు. రానున్న రోజుల్లో మొత్తం 11,158 గ్రామ సచివాలయాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్ తీసుకొస్తాం. అక్కడ డీఎస్సీ చదివిన నర్సు, ఒక ఏఎన్ఎం ఉంటారు. వారు అదే ఊళ్లో ఉంటూ 24 గంటలు వైద్య సేవలు అందిస్తారు. గ్రామ సచివాలయం నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతు భరోసా కేంద్రం ఉంటుంది. అన్ని విషయాల్లో రైతులకు తోడుగా ఉంటుంది. ఈ క్రాప్ బుకింగ్, పంటలు, వాతావరణం, గిట్టుబాటు ధర, మార్కెట్‌కు సంబంధించిన సూచనలు ఇస్తారు. శిక్షణ కూడా ఉంటుంది. నాణ్యతతో కూడిన పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్,విత్తనాలు అందుబాటులో ఉంటాయి. మహిళా సంరక్షణ పోలీస్‌ది కీలక పాత్ర మహిళా సంరక్షణ పోలీస్‌లు, మహిళా పోలీస్ మిత్రాలు చురుగ్గా ఉండాలి. మీ గ్రామంలో ఎవరైనా, ఎక్కడైనా ఇల్లీగల్ లిక్కర్ అమ్ముతున్నారంటే వాళ్లకు సింహస్వప్నం కావాలి. మీరు ఒక్క మెసేజ్ కొడితే ఎస్పీ అలర్ట్ అవుతారు. పోలీసులను పంపించి క్లీన్ చేసేస్తారు. గ్రామంలో ఎలాంటి తప్పులు జరుగుతున్నా వెంటనే మీరు అలర్ట్ అయ్యి రిపోర్టు చేయాలి. మీరు చేసిన రిపోర్టు మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో పరిశీలించి రోబోయే రోజుల్లో డైరెక్ట్‌గా డీజీపీ, హోంమినిస్టర్, నేను కూడ ఇన్వాల్వ్ అవుతాం. ఎందుకంటే మీరు రిపోర్ట్ ఇచ్చాక దానిపై యాక్షన్ తీసుకోవడం అన్నది వెరీ ఇంపార్టెంట్. అప్పుడే ఊర్లో మార్పు కనిపిస్తుంది. అంగన్వాడీ సెంటర్లు మీ అధీనంలో ఉంటాయి. గ్రామంలో ఉన్న స్కూళ్లు, ఆ స్కూళ్ల వ్యవహారాలు, ఆస్కూల్లో బూత్‌రూంలు, మధ్యాహ్న భోజన పథకం నాణ్యత.. ఇలా అన్నీ కూడా గ్రామ సెక్రటేరియట్ పరిధిలోకి తీసుకొస్తున్నాం. వీటి పర్యవేక్షణలో మీరు భాగస్వాములవుతున్నారు. మీ అందరికీ ఒక అన్నలా బెస్ట్ విషెస్ చెబుతున్నా. మీ వల్ల గ్రామానికి మంచి జరగాలని, ప్రభుత్వానికి మంచి పేరు రావాలని ఆశిస్తున్నా’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. -
6 నిమిషాల్లో..ఆకతాయి ప్రొఫెసర్ ఆటకట్టు
తెల్లవారుజాము 4.21 గంటల సమయం.. విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ బస్సు..ఏలూరు సమీపంలోని కలపర్రు టోల్‌ప్లాజా..ప్రయాణికులంతా నిద్రమత్తులో ఉన్నారు... ఓ పోకిరిలో మాత్రం కామ పిశాచి నిద్ర లేచింది..!ఉన్నతమైన అధ్యాపక వృత్తిలో ఉన్నా వివేకం నశించడంతో అసభ్య చేష్టలకు దిగాడు..ధైర్యాన్ని కూడదీసుకున్న బాధిత మహిళ ‘దిశ యాప్’ ద్వారా సమాచారం ఇచ్చారు...ఫిర్యాదు అందిన 6 నిమిషాల్లోనే అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళను క్షేమంగా గమ్య స్థానానికి పంపించారు. సాక్షి, అమరావతి, విశాఖపట్నం/ ఏలూరు టౌన్ : ఆపదలో ఉన్న మహిళలు, చిన్నారుల రక్షణ కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన ‘దిశ’ యాప్ సత్ఫలితాన్నిచ్చింది.. వేళకాని వేళ మహిళపై వేధింపులకు దిగిన ఓ పోకిరీ భరతం పట్టింది.. తక్షణ రక్షణ తథ్యం.. అని నిరూపించింది.. కేవలం ఆరు నిమిషాల్లో పోలీసులను బాధితురాలి వద్దకు చేర్చి అభయమిచ్చింది.. తద్వారా అక్కచెల్లెమ్మల జోలికొస్తే ఖబడ్దార్.. అని హెచ్చరించింది.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 8న దిశ యాప్ ప్రారంభమైన నేపథ్యంలో తొలిసారి ఓ మహిళకు అండగా నిలిచింది. భరోసా కల్పించిన దిశ యాప్.. ప్రభుత్వ మహిళా ఉద్యోగి ఒకరు సోమవారం రాత్రి విశాఖ నుంచి విజయవాడకు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బయలుదేరారు. ఇదే బస్సులో ప్రయాణిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన కాలోతు బసవయ్య నాయక్ విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీలో కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. బస్సులో సీట్లు ఖాళీగా ఉండడంతో తెల్లవారుజామున మహిళా అధికారి సీటు వద్దకు చేరుకుని పోకిరీ చేష్టలతో వేధింపులకు గురిచేశాడు. ముఖ్యమంత్రి జగన్ తాజాగా ప్రారంభించిన దిశ యాప్ గుర్తుకురావటంతో బాధితురాలు 4.21 గంటల సమయంలో తన మొబైల్ ఫోన్‌ను ఐదు పర్యాయాలు అటుఇటు కదిలించారు. యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్‌ను నొక్కటంతో ఆపదలో ఉన్నట్లు సమాచారం అందుకున్న దిశ కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. బాధిత మహిళ ఏలూరు సమీపంలో ఉన్నట్లు గుర్తించి పశ్చిమ గోదావరి ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవల్‌కు సమాచారం అందించారు. ఎస్పీ ఆదేశాలతో ఏలూరు త్రీ టౌన్ పోలీసులు వెంటనే బయలుదేరి తెల్లవారుజామున 4.27 గంటలకు(కాల్ వచ్చిన 6 నిమిషాల్లో) బస్సు వద్దకు చేరుకున్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళకు ధైర్యం చెప్పి ఆకతాయిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి రిమాండ్ విధించిన కోర్టు బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఏయూ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ కె.బసవయ్య నాయక్‌పై ఏలూరు త్రీటౌన్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదైనట్లు సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్ తెలిపారు. అనంతరం పెదపాడు పోలీస్ స్టేషన్‌కు రిఫర్ చేయడంతో క్రైమ్ నెంబర్ 52/2020 సెక్షన్ 354, 354(ఏ) కింద కేసు నమోదు చేశారు. బసవయ్య నాయక్‌ను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్టు పోలీసులు తెలిపారు. ఏలూరు రూరల్ సీఐ శ్రీనివాసరావు కేసును దర్యాప్తు చేస్తున్నారు. వర్సిటీలో ఇనార్గానిక్, అనలిటికల్ విభాగాధిపతిగా విధులు నిర్వహిస్తున్న బసవయ్యపై చర్యలు తీసుకుంటామని ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు వచ్చినప్పటి నుంచి ఆకతాయి ప్రొఫెసర్ అరెస్టు వరకు దిశ ప్రత్యేకాధికారి దీపిక పాటిల్ పర్యవేక్షించారు. పోలీసులకు సీఎం జగన్ అభినందనలు దిశ యాప్ ద్వారా అందిన తొలి ఫిర్యాదుపై పోలీసులు స్పందించిన తీరు పట్ల ముఖ్యమంత్రి జగన్ అభినందనలు తెలిపారు. పోలీసులు అతి తక్కువ సమయంలో స్పందించి ఆపదలో ఉన్న మహిళకు అండగా నిలిచారని ప్రశంసించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పోలీసులను కోరారు. ఘటన వివరాలను డీజీపీ గౌతమ్ సవాంగ్ సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. ఆరు నిమిషాల్లో ఆరు కి.మీ – బాధితురాలు ఆపదలో ఉన్నట్లు దిశ కంట్రోల్ రూమ్ నుంచి సమాచారం అందుకున్న ఏలూరు త్రీటౌన్ కానిస్టేబుల్ నాగదాసి రవి ఆరు కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఆరు నిమిషాల్లో చేరుకున్నాడు. – త్రీటౌన్ ఎస్ఐ బీఎస్‌డీఆర్ ప్రసాద్, మరో కానిస్టేబుల్ టి.సతీష్ కూడా స్వల్ప వ్యవధిలోనే అక్కడకు చేరుకుని నిందితుడిని బస్సులో నుంచి అదుపులోకి తీసుకున్నారు. – బాధిత అధికారి 4.10 గంటల సమయంలో తొలుత విశాఖ మహిళా పోలీస్‌స్టేషన్ ఏసీపీ ప్రేమ్కాజల్కి ఫోన్ చేయగా డయల్–100కి కాల్ చేయాలని సూచించారు. ఆ వెంటనే బాధితురాలు దిశ యాప్‌ను వినియోగించడంతో అతి వేగంగా సాయం అందింది. -
జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి: హోం మంత్రి
సాక్షి, గుంటూరు: పరిధి చూడకుండా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. మంగళవారం ఆమె గుంటురు మహిళ పోలీసు స్టేషన్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పోలీసు స్టేషన్లో ఉన్న అన్ని రికార్డులను పరిశీలించారు. అనంతరం సుచరిత మీడియాతో మాట్లాడుతూ.. నిర్భయ, దిశ ఘటనలతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని.. పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. అంతేకాకుండా పరిధి చూడకుండా సంబంధిత ఘటనలపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆమె పోలీసులకు సూచించారు. మహిళ భద్రతపై తీవ్రంగా చర్చ జరుగుతోందని.. ఫిర్యాధిదారులతో పోలీసులు ఎట్టిపరిస్థితుల్లో దురుసుగా వ్యవహరించకూడదని పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంతో వ్యవహరించాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ల వద్ద ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మహిళా పోలీసు స్టేషన్లో మహిళా అధికారులను నియమించనున్నామని హోంమంత్రి సుచరిత వెల్లడించారు. -
కట్నం కోసం.. ఆ పిల్లలూ వేధించారట!
సాక్షి, అమరావతి: ఆ ఇంటికి వచ్చిన కొత్త కోడలిని ఆరు నుంచి 11 ఏళ్ల మధ్య ఉన్న నలుగురు పిల్లలు వరకట్నం కోసం వేధించారట. గుంటూరు పోలీసులు ఆ పిల్లలపై ఏకంగా కేసు నమోదు చేశారంటే నమ్మక తప్పదు కదండీ.. ఇదేం అన్యాయం అంటూ ఆ పిల్లలు హైకోర్టును ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసి అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ కేసు ద్వారా అత్యుత్సాహాన్ని ప్రదర్శించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు పట్టణ మహిళా పోలీస్‌స్టేషన్ అధికారులు నమోదు చేసిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా చంద్రాపురానికి చెందిన పొన్నెకంటి బిందుకు ఆదరణకుమార్‌తో గత ఏడాది వివాహం జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ 26న గుంటూరు మహిళా పోలీస్‌స్టేషన్‌లో బిందు ఫిర్యాదు చేశారు. తన భర్త, అత్తమామలు, ఆడపడుచులు, వారి భర్తలు తనను అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారంటూ అందులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మహిళా పోలీస్‌స్టేషన్ పోలీసులు బిందు భర్తతో పాటు అత్త, మామలు, రేణుక, సిల్వన్ రాజు, నాయనమ్మ వజ్రమ్మ, ఆడపడుచులు జయకుమారి, సరళ, సంధ్య, పద్మ, వీరి భర్తలు రాజేశ్, నిరీక్షణరావు, రాజేంద్రకుమార్‌లను నిందితులుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇంతటితో ఆగకుండా 6, 6, 9, 11 సంవత్సరాల వయస్సున్న ఆడపడుచుల కుమారులు, కుమార్తెలు నలుగురుని కూడా నిందితుల జాబితాలో చేర్చారు. వీరిపై కూడా వరకట్న వేధింపుల నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కేసు పెట్టారు. దీంతో ఆ చిన్నారులు ఇప్పడు హైకోర్టును ఆశ్రయించారు. తమ పెద్దలతో సహా తమపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. చిన్నారులను నిందితులుగా చేర్చడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని పిటిషనర్లు వివరించారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం విచారణ జరిపే అవకాశం ఉంది. -
మహిళా పోలీస్ స్టేషన్లో శశికళ పుష్ప
టీనగర్: లైంగిక ఫిర్యాదు కేసులో ఎంపీ శశికళ పుష్ప సోమవారం పుదుక్కోట్టై మహిళా పోలీసు స్టేషన్లో హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు ఆమె వద్ద విచారణ జరిపారు. శశికళ పుష్ప, ఆమె భర్త లింగేశ్వర తిలకన్, కుమారుడు ప్రదీప్రాజాలపై ఇంట్లో పనిచేస్తున్న భాను, జాను పుదుక్కోట్టై మహిళా పోలీసు స్టేషన్లో లైంగిక ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇలావుండగా తనను అరెస్టు చేసేందుకు స్టే విధించాలని కోరుతూ శశికళ పుష్ప సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆరు వారాలపాటు ఆమెను అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఇలావుండగా పుదుక్కోట్టై మహిళా పోలీసు స్టేషన్లో జరుగుతున్న విచారణ కోసం సోమవారం శశికళ పుష్ప వచ్చారు. తూత్తుకుడి వాగైకుళం విమానాశ్రయానికి చేరుకున్న ఆమె విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జయలలిత సంపూర్ణంగా కోలుకోవాలని, ఆమె పరిస్థితి ఎలా వుందనే విషయం గురించి సీనియర్ మంత్రులు ప్రజలకు తెలియజేయాలన్నారు. దక్షిణ జిల్లాలలో నాడార్ వర్గానికి బెదిరింపులు ఉన్నాయని, నాడార్ వర్గానికి చెందిన రాకెట్ రాజాపై ప్రతీకారం తీర్చుకునే ఉద్ధేశంతో వల్లియూరు డీఎస్పీ వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. దీనిగురించి పార్లమెంటులో గళం విప్పుతానని అన్నారు. ఆ తర్వాత శశికళ పుష్ప పుదుక్కోట్టై మహిళా పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ ఆమెతో రూరల్ డీఎస్పీ సీమైసామి, ఇన్స్పెక్టర్ అన్నత్తాయ్, ఎస్ఐ లత విచారణ జరిపారు. ఆన్లైన్లో ఎఫ్ఐఆర్: పోలీసు స్టేషన్లలో అందజేసే ఫిర్యాదులను నమోదు చేసే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) వివరాలను ఆన్లైన్ ద్వారా తెలుసుకునే సౌకర్యాన్ని అమలులోకి తీసుకువచ్చారు. ఈ పథకం ప్రయోగాత్మకంగా కాంచీపురం జిల్లాలో మొదటగా అమలులోకి వచ్చింది. ఇలావుండగా ప్రజల నుంచి అనూహ్య ఆదరణ లభించడంతో గాంధీ జయంతి రోజైన ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలులోకి వచ్చింది. కేసులకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో ప్రతిరోజూ నమోదు చేసేందుకు కంప్యూటర్ నాలెడ్జి కలిగిన పోలీసు కానిస్టేబుల్ ఒకరిని నియమిస్తున్నారు. మదురైలో ఈ పథకం నగర పోలీసు కమిషనర్ శైలేష్‌కుమార్ యాదవ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ సహా అనేక దస్తావేజులను చేతితో రాయడం, టైప్ చేసి ఉపయోగించడం జరుగుతోందని, ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఎఫ్ఐఆర్ను కంప్యూటర్లో టైప్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశంలోనే ప్రప్రథమంగా రాష్ట్రంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. -
ఆమెకు అండగా పోలీస్ నిఘా !
శ్రీకాకుళం క్రైం : మహిళలపై దాడులు జరగకుండా త్వరలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనున్నట్టు శ్రీకాకుళం మహిళా పోలీస్‌స్టేషన్ విభాగం డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు వెల్లడించారు. పబ్లిక్ పార్కులు, జనం గుమిగూడి ఉండే ప్రాంతాల్లో మహిళా కానిస్టేబుళ్లు, సిబ్బందితో కూడిన బృందాల నిఘా ఉంటుందన్నారు. డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. బాధితులు నేరుగా రావచ్చు శ్రీకాకుళం పరిధిలో రణస్థలం, పొందూరు, లావేరు, గార, శ్రీకాకుళం, ఆమదాలవలస, సరుబుజ్జిలి, ఎల్‌ఎన్‌పేట, నరసన్నపేట, జలుమూరు తదితర ప్రాంతాల్లో మహిళలపై జరిగే ఎలాంటి సంఘటన పైనైనా కేసులు నమోదు చేస్తామన్నారు. మహిళా పోలీస్‌స్టేషన్ తొలుత హోంగార్డులతో ప్రారంభమై ప్రస్తుతానికి డీఎస్పీ స్థాయికి ఎదిగినట్టు వివరించారు. మొదట్లో కేవలం భార్యభర్తల మధ్య తలెత్తే వివాదాలపై ఇద్దరికీ కౌన్సెలింగ్ నిర్వహించి వారు కలిసి ఉండేలా ప్రయత్నించేవాళ్లమన్నారు. ఇప్పుడు తమ బాధ్యతలు పెరిగాయన్నారు. మహిళల్ని చిన్నచూపు చూడడం, గృహహింస, వరకట్న వేధింపులు, నిర్బంధం, చులకనగా మాట్లాడడం, హత్యలు, ఆత్మహత్యాయత్నాలు, మానభంగం, కొట్లాట వంటి కేసుల్ని శాంతిభద్రతల పోలీస్‌స్టేషన్‌కు సమానంగా మహిళా పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేస్తామన్నారు. నాలుగు రకాలుగా కౌన్సెలింగ్ కేసు తీవ్రతను బట్టి నాలుగు రకాలుగా కౌన్సెలింగ్ చేస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. న్యాయవాదుల బృందం, ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్, డీఆర్డీఏ పరిధిలోని బృందంతో పాటు పోలీసుల ద్వారా కౌన్సెలింగ్ చేస్తూ కుటుంబాల్లో రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తుంటామన్నారు. ఇంకా తప్పదు అనుకుంటేనే కేసు నమోదు చేస్తామన్నారు. మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసుల నమోదు సంఖ్య పెరుగుతున్నందున.. అందుకు తగ్గ సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మహిళా ఎస్ఐతో పాటు సిబ్బంది నియామకం, వాహనాల మంజూరుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని డీఎస్పీ కోరారు. గతంలో కేవలం మహిళా పోలీస్‌స్టేషన్‌గా ఉంటూ శ్రీకాకుళం పరిధిలోనే కేసులు నమోదు చేసేవారమని, ఇప్పుడు పరిధి పెరగడంతో ఒత్తిడి తప్పడం లేదన్నారు. కేసు నమోదు, అరెస్టు, చార్జిషీటు తయారు చేయడం, శిక్ష పడేందుకు అవసరమైన పత్రాల్ని కోర్టుకు సమర్పించేందుకు మరికొంత మంది సిబ్బంది అవసరం ఉందన్నారు. త్వరలో చైతన్య సదస్సులు మహిళలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో త్వరలో చైతన్య సదస్సులు నిర్వహించనున్నట్టు డీఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇందుకోసం మహిళా సంఘాల సభ్యులు, స్వచ్ఛందసంస్థలు, విద్యార్థులు, కళాశాల, పాఠశాలల నిర్వహకులు, పోలీస్‌శాఖ ఉన్నతాధికారులు, వివిధ ప్రభుత్వ విభాగాల సహాయం అవసరమన్నారు. ప్రతీ వారం ఒక్కో చోట చట్టం, న్యాయం, పోలీసుల విధులు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. నిర్భయ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత మహిళలపై దాడులు తగ్గుతున్నా అక్కడక్కడా తీవ్ర నేరాలు నమోదవుతున్నట్టు వివరించారు. ఇందుకోసం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో మహిళా పోలీసులకు పలుమార్లు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. కేసుల నమోదు విషయంలో అలసత్వం వహించకుండా చర్యలు చేపడతున్నామన్నారు. కడియం నుంచి మొక్కల్ని తీసుకువచ్చి మహిళా పోలీస్‌స్టేషన్ ఆవరణలో గ్రీనరీ పెంపునకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. త్వరలో టెక్కలి, పలాస వంటి ప్రాంతాల్లో సబ్ సెంటర్లు పెట్టే అవకాశం ఉందన్నారు. మహిళల హక్కులకు భంగం వాటిల్లకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించనున్నట్టు చెప్పారు. -
ఈ ఏడాది నేరాలు అదుపులోనే..
ఒంగోలు క్రైం: ‘గత ఏడాది కంటే ఈ ఏడాది నేరాలు అదుపులోనే ఉన్నాయి. రాష్ట్ర విభజన ఉద్యమాలు, వరుస ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాం. వచ్చే ఏడాది నేరాలు ఇంకా తగ్గుముఖం పట్టేందుకు సిబ్బందిని అప్రమత్తం చేశాం’ అని ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ అన్నారు. ఈ ఏడాది జరిగిన నేరాలకు సంబంధించిన వివరాలను స్థానిక తన చాంబర్లో ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ విలేకర్లకు వివరించారు. ఈ ఏడాది జరిగిన అన్ని రకాల నేరాల వివరాలను ఎస్పీ వెల్లడించారు. దొంగతనాలు, మహిళలపై లైంగికదాడులు, రోడ్డు ప్రమాదాలు గతేడాది కంటే అధికంగానే జరిగాయన్నారు. వాటి అదుపు కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేకంగా రాష్ట్ర విభజన సందర్భంగా తలెత్తిన ఉద్యమాల విషయంలో పోలీసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ఎలాంటి నష్టం జరగకుండా చూశారన్నారు. వరుస ఎన్నికలను కూడా పోలీసులు విజయవంతంగా నిర్వహించగలిగారని చెప్పారు. మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయటం ద్వారా మహిళలపై లైంగిక దాడులు, వరకట్న వేధింపుల కేసుల విషయంలో పరిష్కారాన్ని వేగవంతం చేయవచ్చన్నారు. అదే విధంగా ఒంగోలు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయడానికి సిబ్బందిని ఎక్కువ మొత్తంలో కేటాయించడంతో పాటు డీఎస్పీ స్థాయి అధికారిని నియమించి ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. క్లూస్ టీంను బలంగా తయారు చేశామని, ఆ టీమ్‌కు కావాల్సిన సిబ్బందిని ఏర్పాటు చేశామని చెప్పారు. రక్షక్ వాహనాలను ఏర్పాటు చేసి విజిబుల్ పోలీసింగ్ విధానాన్ని నగరంలో విస్తృతపరిచినట్లు పేర్కొన్నారు. సైబర్ నేరాలపై దృష్టి: సైబర్ నేరాలను అదుపు చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని ఎస్పీ వివరించారు. అందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సైబర్ టీమ్ ఇప్పటి వరకు ఫోన్లకు సంబంధించిన కాల్డీటైల్స్ తీయడానికి మాత్రమే పరిమితమయ్యారని, అలా కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని నేరాలకు పాల్పడుతున్న వారిపై దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. ఆర్థికపరమైన నేరాల అదుపుపై ఎస్సై స్థాయి నుంచి నిఘా ఉంచాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. జిల్లాకు ఫేస్బుక్ సౌకర్యాన్ని కల్పించామని, ప్రజలు నేరుగా పోలీస్స్టేషన్లకు వెళ్లకుండానే ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ఆ ఫిర్యాదులపై సవివరమైన సమాచారాన్ని కూడా ఫిర్యాదుదారుడికి అందిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన విచారించేందుకు జిల్లాలో ఇద్దరు డీఎస్పీలను ఏర్పాటు చేశామని, వారికి సహాయంగా సిబ్బందిని కేటాయించామన్నారు. అలాంటి కేసుల్లో బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఇళ్లలో దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లకు సంబంధించి సీసీఎస్ సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. డీఎస్పీ స్థాయి అధికారిని ఇందుకోసం కేటాయించి నేరాల అదుపుపై పట్టు సాధించేందుకు చర్యలు చేపట్టామన్నారు. వచ్చే ఏడాదికి ముందస్తు ప్రణాళిక: 2015 సంవత్సరానికిగాను ప్రత్యేకమైన ముందస్తు ప్రణాళికలు రూపొందించినట్లు ఎస్పీ వివరించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. ప్రజలను మోసం చేసి చిట్టీలు, డిపాజిట్లు, అధిక వడ్డీలతో ప్రజలను దోచుకునే శక్తులపై దృష్టి సారించి మోసపోకుండా చేయటంలో అవగాహన కల్పించేలా పోలీసులను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. పోలీసులకు సహకరించి నేరాల అదుపునకు దోహదపడాలని జిల్లా ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ బి.రామానాయక్, డీసీఆర్బీ డీఎస్పీ మరియదాస్, ఎస్బీ డీఎస్పీ రాయపాటి శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీలు కె.వి.రత్నం, ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, కందుకూరు డీఎస్పీ శంకర్, మార్కాపురం ఓఎస్డీ సి.సమైజాన్‌రావు, దర్శి డీఎస్పీ లక్ష్మినారాయణ, చీరాల డీఎస్పీ జయరామరాజు తదితరులున్నారు.