టీనగర్: లైంగిక ఫిర్యాదు కేసులో ఎంపీ శశికళ పుష్ప సోమవారం పుదుక్కోట్టై మహిళా పోలీసు స్టేషన్‌లో హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు ఆమె వద్ద విచారణ జరిపారు. శశికళ పుష్ప, ఆమె భర్త లింగేశ్వర తిలకన్, కుమారుడు ప్రదీప్‌రాజాలపై ఇంట్లో పనిచేస్తున్న భాను, జాను పుదుక్కోట్టై మహిళా పోలీసు స్టేషన్‌లో లైంగిక ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇలావుండగా తనను అరెస్టు చేసేందుకు స్టే విధించాలని కోరుతూ శశికళ పుష్ప సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆరు వారాలపాటు ఆమెను అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఇలావుండగా పుదుక్కోట్టై మహిళా పోలీసు స్టేషన్‌లో జరుగుతున్న విచారణ కోసం సోమవారం శశికళ పుష్ప వచ్చారు. తూత్తుకుడి వాగైకుళం విమానాశ్రయానికి చేరుకున్న ఆమె విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జయలలిత సంపూర్ణంగా కోలుకోవాలని, ఆమె పరిస్థితి ఎలా వుందనే విషయం గురించి సీనియర్ మంత్రులు ప్రజలకు తెలియజేయాలన్నారు. దక్షిణ జిల్లాలలో నాడార్ వర్గానికి బెదిరింపులు ఉన్నాయని, నాడార్ వర్గానికి చెందిన రాకెట్ రాజాపై ప్రతీకారం తీర్చుకునే ఉద్ధేశంతో వల్లియూరు డీఎస్పీ వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. దీనిగురించి పార్లమెంటులో గళం విప్పుతానని అన్నారు. ఆ తర్వాత శశికళ పుష్ప పుదుక్కోట్టై మహిళా పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ ఆమెతో రూరల్ డీఎస్పీ సీమైసామి, ఇన్‌స్పెక్టర్ అన్నత్తాయ్, ఎస్‌ఐ లత విచారణ జరిపారు.
ఆన్‌లైన్‌లో ఎఫ్‌ఐఆర్: పోలీసు స్టేషన్లలో అందజేసే ఫిర్యాదులను నమోదు చేసే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) వివరాలను ఆన్‌లైన్ ద్వారా తెలుసుకునే సౌకర్యాన్ని అమలులోకి తీసుకువచ్చారు. ఈ పథకం ప్రయోగాత్మకంగా కాంచీపురం జిల్లాలో మొదటగా అమలులోకి వచ్చింది. ఇలావుండగా ప్రజల నుంచి అనూహ్య ఆదరణ లభించడంతో గాంధీ జయంతి రోజైన ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలులోకి వచ్చింది. కేసులకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో ప్రతిరోజూ నమోదు చేసేందుకు కంప్యూటర్ నాలెడ్జి కలిగిన పోలీసు కానిస్టేబుల్ ఒకరిని నియమిస్తున్నారు.
మదురైలో ఈ పథకం నగర పోలీసు కమిషనర్ శైలేష్‌కుమార్ యాదవ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్‌ఐఆర్ సహా అనేక దస్తావేజులను చేతితో రాయడం, టైప్ చేసి ఉపయోగించడం జరుగుతోందని, ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఎఫ్‌ఐఆర్‌ను కంప్యూటర్‌లో టైప్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశంలోనే ప్రప్రథమంగా రాష్ట్రంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.
మహిళా పోలీస్ స్టేషన్‌లో శశికళ పుష్ప
Published Tue, Oct 4 2016 3:13 AM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM
Advertisement
Advertisement