MP sasikala pushpa
-
రచ్చకెక్కిన వివాదాస్పద ఎంపీ పెళ్లి
టీ.నగర్: వివాదాస్పద ఎంపీ శశికళ పుష్పపెళ్లి వివాదం రచ్చకెక్కింది. ఆమె పెళ్లి చేసుకోనున్న రామస్వామిపై మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్నాడీఎంకే వివాదాస్పద ఎంపీ శశికళ పుష్ప రామస్వామి అనే వ్యక్తిని వివాహం చేసుకునేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 26న వీరి వివాహం ఢిల్లీలో జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంగళవారం రామస్వామి మొదటి భార్య తెరమీదకు వచ్చారు. మదురై మహాలింగ పట్టికి చెందిన తనకు, రామస్వామితో 2014లో వివాహం జరిగిందని మంగళవారం విలేకర్లకు వెల్లడించింది. అందుకు తగిన ఆధారాలను, తన బిడ్డతో పాటు ఉన్న చిత్రాన్ని చూపింది. దీని గురించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
చిన్నమ్మకు షాక్!
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆంతరంగికురాలు శశికళ నటరాజన్ అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కానున్నారనే అంచనాలపై పార్టీ బహిష్కృత నేత, రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు.అలా జరగడానికి వీల్లే దని ఆమె తెగేసి చెపుతున్నారు. తన ప్రాణం పోయేంత వరకు చిన్నమ్మ(శశికళ) మీద పోరాటం చేస్తానని ఆమె సవాల్ చేశారు. తన చివరి శ్వాస వరకూ ఆమె కుట్రలను సాగనివ్వనని హెచ్చరించారు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన శశికళ పుష్ప కేవలం శశికళ గ్రూపు కారణంగానే అమ్మకు ఏదో జరిగిందన్న అందరూ నమ్ముతున్న ప్రస్తుత తరుణంలో ఆమె పార్టీ భవిష్యత్ నేత ఎలా అవుతుందని ప్రశ్నించారు. కనీసం పార్టీలో సభ్యత్వం కూడా లేనిశశికళ నటరాజన్ కు కు ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు ఎలా అప్పగిస్తారని పార్టీ సీనియర్లను ప్రశ్నించారు. శశికళ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా భాద్యతలు తీసుకున్న తరువాత ఆ పార్టీని ఆమె భర్త నటరాజన్ నడిపిస్తాడని, అందులో ఎలాంటి డౌట్ లేదని శశికళ పుష్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. శశికళకు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై మద్దుతుపై ప్రశ్నించినపుడు అన్నాడీఎంకే పార్టీలోని సీనియర్లను శశికళ నటరాజన్ కుటుంబసభ్యులు బెదిరిస్తున్నారని, అందుకే వారు పార్టీ పగ్గాలను ఆమెకు అప్పగించడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ కుట్రలను తాను అడ్డుకుంటానని అన్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని పార్టీకి దిశా నిర్దేశం చేయాలని ఆశిస్తున్నాన్నారు. సీనియర్లకే ఆ పదవి వచ్చేలా చెయ్యాలని, శశికళ నటరాజన్ కుట్రలను అడ్డుకోవాలని శశికళ పుష్ప కోరారు. జయలలితకు శశికళ 35 సంవత్సరాలు సేవ చేసినంత మాత్రాన అన్నాడీఎంకే పార్టీ ప్రధాని కార్యదర్శి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మా ఇంటిలో గత 25 సంవత్సరాల నుంచి ఒకరు పని చేస్తున్నారు అయితే తన పదవిని ఎలా ఇచ్చేస్తానంటూ ఎద్దేవా చేశారు. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ ఉండటానికి ఆ పార్టీ కార్యకర్తలు, తమిళనాడు ప్రజలు అంగీకరించరన్నారు. శశికళ నటరాజన్ చేతికి పగ్గాలు ఇస్తే వారి కుటుంబ సభ్యులను రాజ్యసభలకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తారని ఆరోపించారు.ఇప్పటికైన పార్టీ లీడర్లు జోక్యం చేసుకుని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని తీసుకుని కార్యకర్తలకు అండగా నిలవాలన్నారు. కాగా అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి సి. పొన్నియన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి సీనియర్లు పోటీ పడుతున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని ,శశికళనే పార్టీ పగ్గాలు చేపడుతారనే సంకేతాలు అందించిన సంగతి తెలిసిందే. -
అమ్మపై కుట్ర
సీబీఐ విచారణకు ఎంపీ శశికళ పుష్ప డిమాండ్ శశికళ పథకం ప్రకారమే అన్నీ జరుగుతున్నాయి సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యాన్ని అవకాశంగా తీసుకుని అన్నాడీఎంకే పార్టీని, ప్రభుత్వాన్ని కైవసం చేసుకునేందుకు శశికళ, ఆమె కుటుంబ సభ్యులు కుట్రపన్నుతున్నారని ఆ పార్టీ బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప ఆరోపించారు. అక్రమంగా జయ సంతకాన్ని ఫోర్జరీ చేసే ప్రమాదం కూడా ఉందని పేర్కొంటూ తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావుకు సోమవారం ఆమె ఒక లేఖను పంపారు. సోమవారం మీడియాతో ఆమె మాట్లాడుతూ జయలలిత నెచ్చెలి శశికళపై ఆమె పలు ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చుట్టూ జరిగే అనేక సంఘటనలకు శశికళ కుటుంబ సభ్యులే పాత్రధారులని, అన్నీ ఓ పథకం ప్రకారం జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. జయలలిత అనారోగ్యానికి దారితీసిన పరిస్థితుల్లో సీబీఐ విచారణ అవసరమని శశికళ పుష్ప డిమాండ్ చేశారు. శశికళ, నటరాజన్ వారి కుటుంబ సభ్యులపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నందున వారందరినీ అపోలో నుంచి పంపించేయాలన్నారు. అన్నాడీఎంకే దిశగా కాంగ్రెస్ గత పదేళ్లుగా డీఎంకేకు మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్.. ఇపుడు అన్నాడీఎంకే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేతల వైఖరి సైతం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. జయ స్థానంలో పార్టీ పగ్గాలు చేతపుచ్చుకునేందుకు శశికళ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. రానున్న ఉప ఎన్నికల్లో తంజావూరు నియోజకవర్గం నుంచి ఆమె పోటీచేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం ఊపందుకొంది. అన్నాడీఎంకేకు ఒక జాతీయ పార్టీ అండదండలు అవసరమని భావిస్తున్న శశికళ.. కాంగ్రెస్‌కు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. జయలలితను పరామర్శించేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అకస్మాత్తుగా రావడం శశికళ వ్యూహంలో భాగమేనని విశ్లేషకులు అంటున్నారు. -
మహిళా పోలీస్ స్టేషన్లో శశికళ పుష్ప
టీనగర్: లైంగిక ఫిర్యాదు కేసులో ఎంపీ శశికళ పుష్ప సోమవారం పుదుక్కోట్టై మహిళా పోలీసు స్టేషన్లో హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు ఆమె వద్ద విచారణ జరిపారు. శశికళ పుష్ప, ఆమె భర్త లింగేశ్వర తిలకన్, కుమారుడు ప్రదీప్రాజాలపై ఇంట్లో పనిచేస్తున్న భాను, జాను పుదుక్కోట్టై మహిళా పోలీసు స్టేషన్లో లైంగిక ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇలావుండగా తనను అరెస్టు చేసేందుకు స్టే విధించాలని కోరుతూ శశికళ పుష్ప సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆరు వారాలపాటు ఆమెను అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఇలావుండగా పుదుక్కోట్టై మహిళా పోలీసు స్టేషన్లో జరుగుతున్న విచారణ కోసం సోమవారం శశికళ పుష్ప వచ్చారు. తూత్తుకుడి వాగైకుళం విమానాశ్రయానికి చేరుకున్న ఆమె విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జయలలిత సంపూర్ణంగా కోలుకోవాలని, ఆమె పరిస్థితి ఎలా వుందనే విషయం గురించి సీనియర్ మంత్రులు ప్రజలకు తెలియజేయాలన్నారు. దక్షిణ జిల్లాలలో నాడార్ వర్గానికి బెదిరింపులు ఉన్నాయని, నాడార్ వర్గానికి చెందిన రాకెట్ రాజాపై ప్రతీకారం తీర్చుకునే ఉద్ధేశంతో వల్లియూరు డీఎస్పీ వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. దీనిగురించి పార్లమెంటులో గళం విప్పుతానని అన్నారు. ఆ తర్వాత శశికళ పుష్ప పుదుక్కోట్టై మహిళా పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ ఆమెతో రూరల్ డీఎస్పీ సీమైసామి, ఇన్స్పెక్టర్ అన్నత్తాయ్, ఎస్ఐ లత విచారణ జరిపారు. ఆన్లైన్లో ఎఫ్ఐఆర్: పోలీసు స్టేషన్లలో అందజేసే ఫిర్యాదులను నమోదు చేసే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) వివరాలను ఆన్లైన్ ద్వారా తెలుసుకునే సౌకర్యాన్ని అమలులోకి తీసుకువచ్చారు. ఈ పథకం ప్రయోగాత్మకంగా కాంచీపురం జిల్లాలో మొదటగా అమలులోకి వచ్చింది. ఇలావుండగా ప్రజల నుంచి అనూహ్య ఆదరణ లభించడంతో గాంధీ జయంతి రోజైన ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం అమలులోకి వచ్చింది. కేసులకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో ప్రతిరోజూ నమోదు చేసేందుకు కంప్యూటర్ నాలెడ్జి కలిగిన పోలీసు కానిస్టేబుల్ ఒకరిని నియమిస్తున్నారు. మదురైలో ఈ పథకం నగర పోలీసు కమిషనర్ శైలేష్‌కుమార్ యాదవ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ సహా అనేక దస్తావేజులను చేతితో రాయడం, టైప్ చేసి ఉపయోగించడం జరుగుతోందని, ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఎఫ్ఐఆర్ను కంప్యూటర్లో టైప్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశంలోనే ప్రప్రథమంగా రాష్ట్రంలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు.