
సాక్షి, అమరావతి: ఆ ఇంటికి వచ్చిన కొత్త కోడలిని ఆరు నుంచి 11 ఏళ్ల మధ్య ఉన్న నలుగురు పిల్లలు వరకట్నం కోసం వేధించారట. గుంటూరు పోలీసులు ఆ పిల్లలపై ఏకంగా కేసు నమోదు చేశారంటే నమ్మక తప్పదు కదండీ.. ఇదేం అన్యాయం అంటూ ఆ పిల్లలు హైకోర్టును ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసి అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ కేసు ద్వారా అత్యుత్సాహాన్ని ప్రదర్శించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు పట్టణ మహిళా పోలీస్‌స్టేషన్ అధికారులు నమోదు చేసిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా చంద్రాపురానికి చెందిన పొన్నెకంటి బిందుకు ఆదరణకుమార్‌తో గత ఏడాది వివాహం జరిగింది.
ఈ ఏడాది సెప్టెంబర్ 26న గుంటూరు మహిళా పోలీస్‌స్టేషన్‌లో బిందు ఫిర్యాదు చేశారు. తన భర్త, అత్తమామలు, ఆడపడుచులు, వారి భర్తలు తనను అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారంటూ అందులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మహిళా పోలీస్‌స్టేషన్ పోలీసులు బిందు భర్తతో పాటు అత్త, మామలు, రేణుక, సిల్వన్ రాజు, నాయనమ్మ వజ్రమ్మ, ఆడపడుచులు జయకుమారి, సరళ, సంధ్య, పద్మ, వీరి భర్తలు రాజేశ్, నిరీక్షణరావు, రాజేంద్రకుమార్‌లను నిందితులుగా చేరుస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఇంతటితో ఆగకుండా 6, 6, 9, 11 సంవత్సరాల వయస్సున్న ఆడపడుచుల కుమారులు, కుమార్తెలు నలుగురుని కూడా నిందితుల జాబితాలో చేర్చారు. వీరిపై కూడా వరకట్న వేధింపుల నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కేసు పెట్టారు. దీంతో ఆ చిన్నారులు ఇప్పడు హైకోర్టును ఆశ్రయించారు. తమ పెద్దలతో సహా తమపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. చిన్నారులను నిందితులుగా చేర్చడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని పిటిషనర్లు వివరించారు. ఈ వ్యాజ్యంపై హైకోర్టు బుధవారం విచారణ జరిపే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment