‘వేధింపుల కేసుల్లో’ వేరే కోణం! | Another angle of Section 498A misuse | Sakshi
Sakshi News home page

‘వేధింపుల కేసుల్లో’ వేరే కోణం!

Published Sun, Jan 26 2014 12:40 PM | Last Updated on Fri, May 25 2018 12:56 PM

‘వేధింపుల కేసుల్లో’ వేరే కోణం! - Sakshi

‘వేధింపుల కేసుల్లో’ వేరే కోణం!

హైదరాబాద్: ‘వరకట్న దురాచారాన్ని రూపుమాపేందుకు తీసుకొచ్చిన 498-ఏ కేసు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఈ కేసు పెడితే భర్త తమ దారిలోకి వస్తారనే ఉద్దేశంతో అనే మంది ఉంటున్నారు’.
 - రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తేల్చి చెప్పిన అంశమిది.
 
* హైదరాబాద్‌కు  చెందిన ఓ వివాహిత తన ఆడపడుచు కుమార్తె (రెండు నెలలు) తరచు ఏడుస్తుండటంతో తనకు మానసిక వేధింపులు ఎదురవుతున్నాయంటూ ఫిర్యాదు చేశారు.

* కెనడాలో ఉండే ఆడపడుచు తరచూ తన భర్తకు ఫోన్ చేస్తోందని,  ఫోన్‌లో మాట్లాడిన తర్వాత భర్త తనపై చేయి చేసుకుంటున్నాడని మరో గృహిణి ఫిర్యాదు చేసింది. విదేశంలో ఉంటున్న ఆడపడుచుతో పాటు భర్త నిందితులుగా పేర్కొంది.

* ఉద్యోగస్తులైన ఓ జంట మనస్పర్థల కారణంగా విడిపోవాలనుకుంది.  కొన్నాళ్ల క్రితం పరస్పరం ‘ఎస్సెమ్మెస్‌లు’ ఇచ్చుకొని విడిపోయి.. ఎవరికి వారు జీవిస్తున్నారు. తనకు చెందిన ఓ నగ ‘మాజీ భర్త’ వద్ద ఉందని భా వించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

* ఈ ముగ్గురు మహిళలను మించి మరో వివాహిత ఇంకో చిత్రమైన ఫిర్యాదు చేసిం ది. తనను ఇంట్లో వారితో పాటు పక్కింట్లో ఉండే వృద్ధుడూ వేధిస్తున్నాడని ఆరోపించింది. అతడిపై కేసు ఎలా నమోదు చేస్తామని పోలీసులు అడగ్గా..  ‘చనిపోయిన మా మామగారు దెయ్యమై పక్కింటాయన్ని ఆవహించి వేధిస్తున్నాడు’.. అని అంది.

* నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని మహిళా ఠాణా అధికారులకు ఇటీవల అందిన ఈ ఫిర్యాదులు వారి దిమ్మ తిరిగేలా చేశాయి.  498-ఏగా పిలిచే వరకట్న వేధింపుల కేసుల్లో వేరే కోణాన్ని ఆవిష్కరించడానికి ఈ ఉదాహరణలు చాలు.
 
వేరు కుంపటి కోసం వేధింపుల పేరు...
వరకట్న వేధింపుల కేసు పేరు చెప్తే చాలు పెళ్లైన మగాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. భార్య ఫిర్యాదు చేస్తే చాలు... తనతో పాటు తల్లిదండ్రులు, తోడపుట్టిన వాళ్లు కూడా కటకటాల్లోకి వెళ్లాల్సి వస్తుందని పలువురు భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో అనేక మంది నలిగిపోతున్నారని పోలీసులే అంటున్నారు.ఎగువ మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చే ఫిర్యాదుల్లో అనేకం బోగస్‌వి ఉంటున్నాయంటున్నారు. అత్తమామలతో కలిసి ఉండటం ఇష్టం లేక, వేరే కాపురం కావాలంటూ పలువురు తమను ఆశ్రయిస్తున్నారని సీసీఎస్ అధికారులు చెప్తున్నారు. ఫిర్యాదులో మాత్రం వరకట్న వేధింపులని పేర్కొంటున్న వివాహితలు కౌన్సిలింగ్ వద్దకు వచ్చేసరికి భర్త వేరు కాపురం వస్తే చాలంటున్నారని తెలిపారు.

‘అమ్మతో పోల్చిచూడటంతో’ అనేక అపార్థాలు...
ప్రస్తుతం సమాజంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు కావడం అనివార్యంగా మారింది. ఉద్యోగానికి వెళ్తుండంతో భార్యకు కొన్ని దైనందిన కార్యక్రమాలు నిర్వహించడం కష్టంగా మారుతోంది. ఇక్కడే సదరు భర్తల అహం దెబ్బ తింటోందని అధికారులంటున్నారు. తన తల్లి తమ విషయం లో కనబరిచిన శ్రద్ధను భార్య తనతో పాటు పిల్లలపైనా చూపడంలేదన్న భావన భర్తల్లో కలిగి స్పర్థలకు కారణమవుతోందంటున్నారు. నాటి-నేటి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, జీవన ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటే ఇబ్బందే ఉండదని.. అయితే ఆ కోణంలో ఆలోచించే భర్త లు తక్కువగా ఉంటున్నారంటున్నారు.

ఈ అపార్థంతో మొదలయ్యే స్పర్థలు వేధింపుల కేసుల వర కు వెళ్తున్నాయి. ఓ మహిళకు రక్షణ కల్పించడం కోసం ఏర్పాటు చేసిన ‘498-ఏ’ సెక్షన్‌ను దుర్వినియోగం చేయడం వల్ల అత్త, ఆడపడుచు, మరిది ... ఇలా మరికొందరు మహిళలు సామాజికంగా, చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్పష్టం చేస్తున్నారు. వ్యక్తిగత కారణాల నేపథ్యంలోనే అనేక మంది భర్తతో పాటు ఆయన కుటుంబీకులపైనా... ఒక్కోసారి భర్తను వదిలేసి కుటుంబీకులపై కట్న వేధింపుల ఫిర్యాదులు చేస్తున్నారని సీసీఎస్ పోలీసులు చెప్తున్నారు.
 
‘లాభాలు’ కోరడంతో సాధ్యంకాని రాజీలు...
ఈ తరహా ఫిర్యాదుల్లో అనేక రాజీలకు సాధ్యం కావట్లేదని పోలీసులంటున్నారు. ‘రాజీ అంటేనే ఇరువురూ ఎంతో కొంత నష్టపోవడం. అయితే భార్యాభర్తలు సంపాదిస్తున్న కేసుల్లో మాత్రం ఇది అమలుకావట్లేదు.  ఇద్దరూ ఎదుటి వారి కంటే తామే ఎక్కువ లాభపడాలని ఆశిస్తున్నారు. ఫలితంగా కౌన్సెలింగ్‌లో రాజీ సాధ్యం కావట్లేదు’ అని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇలాంటప్పుడు భార్య కూడా ఉద్యోగస్తురాలు కావడం, అప్పటికి పిల్లలు పుట్టకపోవడం వంటి పరిస్థితులు ఉంటే తేలిగ్గా విడిపోతున్నారని, ఇది వరకట్న వేధింపుల కేసుకు దారితీస్తోందని ఆయన అన్నారు.  ఇలాంటి కేసుల్లో ఆడపడుచులు, వదినల్ని నిందితులుగా చేస్తుండటంతో వారి కుటుంబ జీవితాలు కూడా దెబ్బతింటున్నాయని స్పష్టం చేశారు.
 
చక్కదిద్దే చర్యలు...
ఈ పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు సీసీఎస్ అధికారులు కొన్ని ప్రత్యేక చర్యల్ని చేపడుతున్నారు.
* కేసు నమోదుకు ముందు భార్యాభర్తల్ని పిలిచి కౌన్సెలింగ్ చేస్తున్నారు.
* వేధింపులు నిజమని నిర్థారణైతే సంబంధిత సెక్షన్ల కింద  కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నారు.
* ఇది నిష్పాక్షికంగా జరగడం కోసం ఏసీపీ స్థాయి అధికారి ఆధ్యంతం పరిశీలిస్తున్నారు.
 * ప్రధాన నిందితుడు (భర్త) మినహా మిగిలిన వారికి అరెస్టు చేయడంలో పూర్తి విచక్షణతో వ్యవహరిస్తున్నారు.
* కేసులో ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా ఇరికించారని తేలితే, కేసుతో సంబంధంలేని వారి పేర్లను డీసీపీ  తొలగిస్తున్నారు.
* అరెస్టులు తప్పనిసరి కాని కేసుల్లో నేరుగా చార్జ్‌షీట్ దాఖలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement