విశ్వసనీయతపైనే రాజ్యాంగ వ్యవస్థల మనుగడ | survive of the constitutional systems based on reliability, justice jasti chelameswar says | Sakshi
Sakshi News home page

విశ్వసనీయతపైనే రాజ్యాంగ వ్యవస్థల మనుగడ

Published Mon, Mar 21 2016 3:39 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఆదివారం న్యాయమూర్తుల సదస్సులో మాట్లాడుతున్న జస్టిస్ జాస్తి చలమేశ్వర్ - Sakshi

ఆదివారం న్యాయమూర్తుల సదస్సులో మాట్లాడుతున్న జస్టిస్ జాస్తి చలమేశ్వర్

- శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల కంటే ప్రజలు న్యాయ వ్యవస్థపైనే ఎక్కువ బాధ్యత ఉంచారు
- న్యాయమూర్తులకు పదవీ విరమణ వరకూ నిత్యం కఠిన పరీక్షలు తప్పవు..
- జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఉద్ఘాటన
- ముగిసిన ఉభయ రాష్ట్రాల న్యాయాధికారుల సమావేశం
- ఇకపై మూడేళ్లకొకసారి నిర్వహణ
- స్పష్టం చేసిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే


సాక్షి, హైదరాబాద్:
దేశంలోని శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు కాలానుగుణంగా పరీక్షలు ఎదుర్కొంటుంటే న్యాయవ్యవస్థ మాత్రం రోజూ కఠిన పరీక్షలు ఎదుర్కొంటోందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు.
విశ్వసనీయతతోనే ఈ పరీక్షల్లో నెగ్గడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ విశ్వసనీయత సాయంతో న్యాయవ్యవస్థను కాపాడాలని న్యాయాధికారులకు పిలుపునిచ్చారు. రాజ్యాంగ వ్యవస్థల మనుగడ సైతం విశ్వసనీయతపైనే ఆధారపడి ఉందన్నారు. పరిస్థితులు ఏవైనా, ఎలా ఉన్నా అంతిమంగా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత న్యాయమూర్తులపైనేఉంటుందని స్పష్టం చేశారు. ఆదివారం హోటల్ మారియట్‌లో జరిగిన ఉభయ రాష్ట్రాల న్యాయాధికారుల రాష్ట్రస్థాయి సమావేశం ముగింపు కార్యక్రమానికి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కార్యక్రమంలో ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తులు జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి, జస్టిస్ పి.నవీన్‌రావు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ.. 2006లో జరిగిన న్యాయాధికారుల రాష్ట్రస్థాయి సదస్సు దశాబ్దంగా మళ్లీ జరగకపోవడం దురదృష్టకరమన్నారు. శాసన వ్యవస్థకు ప్రతి ఐదేళ్లకోసారి పరీక్ష ఉంటుందన్నారు. అందులో ప్రజాప్రతినిధులను ప్రజలు సామూహికంగా ఇంటికి పంపే అవకాశం ఉందని, న్యాయవ్యవస్థలో మాత్రం ఇలాంటి పరీక్ష ఉండదన్నారు.

న్యాయమూర్తులు పదవీ విరమణ వరకు విధుల్లో ఉంటారని, అప్పటివరకు కఠిన పరీక్ష ఎదుర్కొంటూనే ఉంటారన్నారు. విడాకులు, రుణ సంబంధ, ఆస్తి పంపక వివాద కేసులను కక్షిదారులు తమ యుక్త వయస్సులో దాఖలు చేస్తుంటే.. అవి తేలే సమయానికి వారు వృద్ధాప్యంలోకి వెళుతున్నారన్నారు. ఎక్కడ లోపం ఉందో తెలుసుకోవాలని, అది వ్యవస్థాగత లోపమా? లేక మన లోపమా? అని గుర్తించాల్సినఅవసరం ఉందని చెప్పారు.

అంతకుముందు జస్టిస్ బొసాలే మాట్లాడుతూ.. ఇకపై ప్రతీ మూడేళ్లకోసారి న్యాయాధికారుల సమావేశం, ఏటా జిల్లా జడ్జీలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కాగా, ఈ సమావేశంలో వివిధ అంశాలపై జరిగిన చర్చల సారాంశాన్ని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌కు వివరించారు. ఈ సందర్భంగా జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి మాట్లాడుతూ న్యాయమూర్తులు తమ కలంతోనే మాట్లాడుతారని, వారికి కలమే బలమన్నారు. కేరళ న్యాయవ్యవస్థలో అవినీతి ఎంతమాత్రం లేదని, ఉభయ రాష్ట్రాల్లోనూ అవినీతిరహిత న్యాయవ్యవస్థ తయారు చేయడమే మనందరి లక్ష్యం కావాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement