justice jasti chelameswar
-
సీఎం జగన్‌ను కలిసిన జస్టిస్ చలమేశ్వర్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చలమేశ్వర్‌ను శాలువా, జ్ఞాపికతో సాదరంగా సీఎం జగన్ సత్కరించారు. చలమేశ్వర్ వెంట అధికార భాషా సంఘం అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఉన్నారు. కాగా, గతేడాది జూన్ 11న విజయవాడలో ‘పెద్దల సభలో తెలుగు పెద్ద’ పుస్తకావిష్కరణ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు చలమేశ్వర్ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. (చదవండి: మాట నిలబెట్టుకున్న సీఎం జగన్) జస్టిస్ చలమేశ్వర్‌ను సత్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ -
‘రామ మందిర నిర్మాణానికి చట్టం తేవొచ్చు’
ముంబై: అయోధ్యలో రామమందిర నిర్మాణం వివాదం సుప్రీంకోర్టులో ఉండగానే ప్రభుత్వం చట్టం తెచ్చి ఆలయాన్ని నిర్మించేందుకు అవకాశం ఉందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఆలిండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ నిర్వహించిన సమావేశంలో జస్టిస్ చలమేశ్వర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ‘చట్టం ద్వారా ఆలయాన్ని నిర్మించొచ్చా? లేదా? అనేది ఒక అంశం. అసలు ఈ ప్రభుత్వం చట్టం తెచ్చి గుడిని కడుతుందా? లేదా? అనేది మరో అంశం. అయితే కొత్త చట్టం తీసుకురావడం ద్వారా సుప్రీంకోర్టులోని కేసుతో సంబంధం లేకుండా ఆలయాన్ని నిర్మించడం మాత్రం సాధ్యమే. సుప్రీంకోర్టు తీర్పుల నుంచి తప్పించుకోడానికి చట్ట ప్రక్రియను ప్రభుత్వాలు ఉపయోగించుకున్న సందర్భాలు గతంలో ఉన్నాయి’ అని చలమేశ్వర్ అన్నారు. -
‘తొడగొట్టే సంస్కృతి అవసరం లేదు’
విజయవాడ : రాజకీయాలలో తొడగొట్టే సంస్కృతి అవసరం లేదని, ఎటువంటి అంశాన్ని అయినా సున్నితంగా చెబితే సరిపోతుందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు. ఆదివారం సిద్ధార్థ అకాడమీలో మాజీ రాజ్యసభ సభ్యుడు యలమంచిలి శివాజీ రచించిన "తలుచుకుందాం... ప్రేమతో" అనే పుస్తక ఆవిష్కరణ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..నేటి రాజకీయ వ్యవస్థలో సత్యానికి(నిజానికి) స్థానం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ సత్యం-అహింసలే ఆయుధంగా సామాజిక మార్పు తెచ్చారని, యలమంచిలి శివాజీ మాదిరిగా తెలుగులో రాజకీయ నేతలు సమాజానికి స్పూర్తి దాయకమైన రచనలు చేయాలని సూచించారు. ఎక్కువగా ఇంగ్లీషులోనే ఈ తరహా రచనలు వస్తున్నాయన్నారు. యలమంచిలి శివాజీ తన పుస్తకం ద్వారా ప్రముఖులతో తన అనుబంధాలను చక్కగా వ్యక్తీకరించారని అన్నారు. తనను ప్రభావితం చేసిన ప్రముఖుల వ్యక్తిత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. నేటితరం రాజకీయ నాయకుల్లో రచనా వ్యాసాంగం పట్ల ఆసక్తి లేకుండా పోతోందన్న బాధ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమ్మెస్కో విజయ్ కుమార్, చంద్రశేఖర్, ప్రమీలా రాణి తదితరులు పాల్గొన్నారు. -
‘సుప్రీంకోర్టులో అవాంఛనీయ ఘటనలు’.. ఏమిటవి?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ న్యాయచరిత్రలోనే అరుదైన ఘట్టంగా నిలిచే సంఘటన.. భారత అత్యున్నత న్యాయస్థానం సిట్టింగ్ జడ్జిల విషయంలో చోటుచేసుకుంది. సీనియర్ జడ్జిలు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్‌లు ఉమ్మడిగా బుధవారం ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. గడిచిన కొన్ని నెలలుగా కేసుల కేటాయింపులు, పరిపాలనా విధానం గాడితప్పాయని, జరగకూడని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని జడ్జిల బృందం విమర్శించింది. పలు ప్రయత్నాలు విఫలమైన తర్వాత తప్పని పరిస్థితుల్లో తాము మీడియా ముందుకు వచ్చామంది. ఏమిటా అవాంఛనీయ ఘటనలు? : తెలుగువారైన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సహా నలుగురు జడ్జిలు చేసిన ఆరోపణలన్నీ.. నేరుగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై ఎక్కుపెట్టినవే. 2017 ఆగస్టులో జస్టిస్ మిశ్రా సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే.. ‘యూపీ మెడికల్ సీట్ల కుంభకోణం’ కేసులో అనూహ్యంగా వ్యవహరించారు. ఆ కేసులో జస్టిస్ చలమేశ్వర్ ఇచ్చిన ఆదేశాలను కొట్టేయడమేకాదు.. ‘సుప్రీంకోర్టుకు సీజేఐనే మాస్టర్’ అని దీపక్ మిశ్రా వ్యాఖ్యలు చేశారు. సుప్రీంలో ‘కేసులు, ధర్మాసనాల పరిధి తదితర అన్ని అంశాల్లో ప్రధాన న్యాయమూర్తిదే సంపూర్ణ అధికారం’ అని కూడా తేల్చేశారు. అంతకు ఒకరోజు ముందే ‘జడ్జి అవినీతి ఆరోపణల కేసు’ను విచారిస్తోన్న రాజ్యాంగ బెంచి నుంచి జస్టిస్ చలమేశ్వర్‌ను సీజేఐ తప్పించారు. గతేడాది నవంబర్‌లో చోటుచేసుకున్న ఈ రెండు పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. నేటి ప్రెస్మీట్లో జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ.. ‘‘ఆయా వివాదాల విషయంలో ఓ పద్ధతి ప్రకారం ముందుకు వెళ్దామని ప్రధాన న్యాయమూర్తిని కోరాం. నేటి(శుక్రవారం) ఉదయం కూడా ఆయనను కలిశాం. అయినాసరే ఆశించిన ఫలితం రాకపోవడంతో లేఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని గుర్తుచేశారు. ఆ రెండు కేసులూ సంక్లిష్టమైనవే.. : వెలుగులోకి రాని వివాదాల సంగతి అటుంచితే, నేటి ప్రెస్మీట్లకు ప్రధాన కారణంగా కనిపించేవి, జస్టిస్ చలమేశ్వర్‌ను విచారణ నుంచి తొలగించినవి.. పరస్రస్పరం సంబంధమున్న రెండు కేసులు. 1. యూపీ మెడికల్ సీట్ల కుంభకోణం, 2. ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి ఇష్రత్‌పై అవినీతి ఆరోపణలు. పూర్వాపరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని లఖ్నో కేంద్రంగా నడిచే ప్రసాద్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కు చెందిన మెడికల్ కాలేజీతోపాటు 46 ఇతర మెడికల్ కాలేజీల్లో సరైన వసతులులేని కారణంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) వాటిలో అడ్మిషన్లను రద్దు చేసింది. అయితే.. ఈ విషయంలో సుప్రీంకోర్టులో అనుకూలమైన ఆదేశాలు వచ్చేలా చూస్తామంటూ కొందరు కాలేజీ యాజమాన్యాలతో భారీ డీల్ కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసిన సీబీఐ.. డీల్స్ కుదుర్చుకున్నది మరెవరోకాదు సాక్షాత్తూ ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి(2004-10 మధ్య పనిచేశారు) ఇష్రత్ మస్రూర్ ఖుద్దూసీ, ఆయన అనుచరుడు భావనా పాండే, మరో మధ్యవర్తి విశ్వనాథ్ అగ్రావాలాలే అని తేల్చింది. ఈ క్రమంలో గత సెప్టెంబర్‌లో జస్టిస్ ఇష్రత్ సహా ఐదుగురిని సీబీఐ అరెస్టు చేసింది. కాగా, సుప్రీంకోర్టు నో చెప్పినా ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్టులో అడ్మిషన్లు మాత్రం జరిగిపోయాయి. కాగా, ఈ కేసులో స్వయంగా జడ్జిలపైనే ఆరోపణలు వచ్చినందున... సీజేఐ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేయాలని ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలా లేదా అనే దానిపై వాదనలు విన్న జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. చివరకు పిటిషన్‌ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించి, దానిని సుప్రీంకోర్టులోని ఐదుగురు సీనియర్ జడ్జిలతో కూడిన ధర్మాసనానికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కానీ సదరు ధర్మాసనంలో సీజేఐ దీపక్ మిశ్రా ఉండరాదంటూ పిటిషన్ దాఖలు చేసిన స్వచ్ఛంద సంస్థ కోరింది. ఎందుకంటే.. ‘అడ్మిషన్లు జరుపుకోవచ్చు’అన్న తీర్పు ఇచ్చింది మిశ్రా ధర్మాసనమే కాబట్టి! అన్ని వాదనలు పూర్తయిన తర్వాత తుది ఆదేశాలు ఇచ్చేందుకు చలమేశ్వర్ బెంచ్ సిద్ధమయ్యారు. అంతలోనే.. ‘ఈ వ్యవహారాన్ని ఇంకో బెంచ్‌కు అప్పగించాలంటూ’ సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నుంచి హుటాహుటిన ఆదేశాలు వచ్చాయి. అయినాసరే, చలమేశ్వర్ బెంచ్ ఆదేశాలు ఇచ్చేసింది. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 145(3) ప్రకారం సీజేఐ లేకుండానే బెంచ్‌ను ఏర్పాటుచేసింది. అంతకు ముందురోజే.. జస్టిస్ ఇష్రత్ పేరుతో ముడుపుల కేసును విచారిస్తున్న రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్ చలమేశ్వర్‌ను తప్పిస్తూ సీజేఐ మిశ్రా ఉత్తర్వులిచ్చారు. అయితే, పరస్పరం సంబంధమున్న ఈ రెండు కేసుల్లో సీజేఐ వ్యవహార శైలిపై సీనియర్ న్యాయమూర్తులు లోలోన అభ్యంతరాలు వ్యక్తంచేశారు. చివరికి జాస్తి చలమేశ్వర్ సహా నలుగురు జడ్జిలు మీడియా ముందుకొచ్చి ‘గోడు’ వెళ్లబోసుకున్నారు. కాగా, నలుగురు జడ్జిల ఆరోపణలపై ఎదురుదాడి చేసేందుకు సీజేఐ దీపక్ మిశ్రా సిద్ధమయ్యారు. ఆయన కూడా మీడియా ముందుకే వచ్చి మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కొలీజియం ద్వారా నియామకాలు, పారదర్శకత, కేసుల కేటాయింపులు తదితర వ్యవహారాల్లో చోటుచేసుకున్న వివాదాలతో సుప్రీంకోర్టు ప్రతిష్ట మసకబారిందన్న విమర్శల నడుమ తాజా వివాదాం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో వేచిచూడాలి. జడ్జిల వివాదం కొనసాగుతుండగానే.. ప్రధాని నరేంద్ర మోదీ.. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. -
'జస్టిస్ జాస్తి చలమేశ్వర్ డే'గా అక్టోబర్ 14
ఇల్లినాయిస్: భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌కు అరుదైన గౌరవం లభించింది. సంయుక్త ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, గౌహతీ, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా చారిత్రాత్మకమైన తీర్పులు అందించినందుకు గానూ అమెరికాలోని ఇల్లినాయిస్లోని నేపర్విల్ నగర మేయర్ స్టీవ్ చిరికో అక్టోబర్ 14వ తేదీని 'జస్టిస్ జాస్తి చలమేశ్వర్ డే'గా ప్రకటించారు. సమాచార సాంకేతిక చట్టంలోని 66ఏ అధికరణను జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కొట్టివేయడం ద్వారా సామాజిక మాధ్యమాల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వెసులుబాటు కల్పించారని స్టీవ్ కొనియాడారు. భారత ప్రధాన న్యాయమూర్తుల నియామకాల్లో కొలిజీయం విధానాల లొసుగులను, లోటుపాట్లను నిష్కర్షగా విమర్శించడం, ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించేందుకు ఆధార్ కార్డు ఒక్కటే ప్రామాణికమని అది లేని వారికి సేవలను నిరాకరించే చట్టానికి స్వస్తి పలకడం వంటి చారిత్రాత్మకమైన తీర్పులను వెలువరించి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ న్యాయవ్యవస్థకు మరింత వన్నె తెచ్చారని స్టీవ్ ప్రశంసించారు. ఈ అరుదైన గౌరవాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా భారత న్యాయవ్యవస్థ గొప్పతనాన్ని ఆయన వివరించారు. మానవ హక్కులకు సంబంధించిన తీర్పులు వెలువరించే సమయంలో తాను అమెరికా సుప్రీం కోర్టు గతంలో నిర్దేశించిన తీర్పులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటి ఆధారంగా తన తీర్పులను తీర్చిదిద్దుకుంటానని జస్టిస్ జాస్తి వెల్లడించారు. యార్లగడ్డకు రెండు పురస్కారాలు పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు సాహిత్య భారతి పురస్కారాన్ని చికాగో కేంద్రంగా పనిచేస్తున్న భారతీ తీర్థ సంస్థ చికాగోలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అందించింది. భారతీ తీర్థ-సప్నా సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ తాతా ప్రకాశం చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందించారు. యార్లగడ్డకు జ్ఞాపికను అందిస్తున్న నేపర్విల్ రోటరీ క్లబ్ ప్రతినిధురాలు నీనా మెనిస్, తాతా ప్రకాశం, శారదాపూర్ణ. చిత్రంలో జస్టిస్ జాస్తి. హిందీ, తెలుగు భాషల్లో రెండు పీహెచ్డీ పట్టాలు అందుకుని ఆయా భాషల అభివృద్ధికి, వ్యాప్తికి నిరంతరం కృషి చేస్తూ 64 పుస్తకలు రచించిన అరుదైన ఘనత సొంతం చేసుకున్నందుకుగానూ యార్లగడ్డను నేపర్విల్ నగర రోటరీ క్లబ్ ప్రతినిధి నీన మెనిస్ "పాల్ హ్యారిస్" పురస్కారంతో సత్కరించారు. అనంతరం ప్రసంగించిన యార్లగడ్డ తెలుగు భాషా, సంస్కృతి, సంగీత, సాహిత్యాల వైశిష్ట్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శొంఠి శారదపూర్ణ, చికాగో తెలుగు సంఘం, గ్రేటర్ చికాగో తెలుగు సంఘం, అమెరికా తెలుగు సంఘం, ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), మనబడి, చికాగో హిందూ దేవాలయం, నేపర్విల్ రోటరీ క్లబ్, నేపర్విల్ నగర కౌన్సిల్ సభ్యులు, ప్రతినిధులు తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
విశ్వసనీయతపైనే రాజ్యాంగ వ్యవస్థల మనుగడ
- శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల కంటే ప్రజలు న్యాయ వ్యవస్థపైనే ఎక్కువ బాధ్యత ఉంచారు - న్యాయమూర్తులకు పదవీ విరమణ వరకూ నిత్యం కఠిన పరీక్షలు తప్పవు.. - జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఉద్ఘాటన - ముగిసిన ఉభయ రాష్ట్రాల న్యాయాధికారుల సమావేశం - ఇకపై మూడేళ్లకొకసారి నిర్వహణ - స్పష్టం చేసిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే సాక్షి, హైదరాబాద్: దేశంలోని శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు కాలానుగుణంగా పరీక్షలు ఎదుర్కొంటుంటే న్యాయవ్యవస్థ మాత్రం రోజూ కఠిన పరీక్షలు ఎదుర్కొంటోందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. విశ్వసనీయతతోనే ఈ పరీక్షల్లో నెగ్గడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ విశ్వసనీయత సాయంతో న్యాయవ్యవస్థను కాపాడాలని న్యాయాధికారులకు పిలుపునిచ్చారు. రాజ్యాంగ వ్యవస్థల మనుగడ సైతం విశ్వసనీయతపైనే ఆధారపడి ఉందన్నారు. పరిస్థితులు ఏవైనా, ఎలా ఉన్నా అంతిమంగా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత న్యాయమూర్తులపైనేఉంటుందని స్పష్టం చేశారు. ఆదివారం హోటల్ మారియట్‌లో జరిగిన ఉభయ రాష్ట్రాల న్యాయాధికారుల రాష్ట్రస్థాయి సమావేశం ముగింపు కార్యక్రమానికి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తులు జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్, జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి, జస్టిస్ పి.నవీన్‌రావు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ.. 2006లో జరిగిన న్యాయాధికారుల రాష్ట్రస్థాయి సదస్సు దశాబ్దంగా మళ్లీ జరగకపోవడం దురదృష్టకరమన్నారు. శాసన వ్యవస్థకు ప్రతి ఐదేళ్లకోసారి పరీక్ష ఉంటుందన్నారు. అందులో ప్రజాప్రతినిధులను ప్రజలు సామూహికంగా ఇంటికి పంపే అవకాశం ఉందని, న్యాయవ్యవస్థలో మాత్రం ఇలాంటి పరీక్ష ఉండదన్నారు. న్యాయమూర్తులు పదవీ విరమణ వరకు విధుల్లో ఉంటారని, అప్పటివరకు కఠిన పరీక్ష ఎదుర్కొంటూనే ఉంటారన్నారు. విడాకులు, రుణ సంబంధ, ఆస్తి పంపక వివాద కేసులను కక్షిదారులు తమ యుక్త వయస్సులో దాఖలు చేస్తుంటే.. అవి తేలే సమయానికి వారు వృద్ధాప్యంలోకి వెళుతున్నారన్నారు. ఎక్కడ లోపం ఉందో తెలుసుకోవాలని, అది వ్యవస్థాగత లోపమా? లేక మన లోపమా? అని గుర్తించాల్సినఅవసరం ఉందని చెప్పారు. అంతకుముందు జస్టిస్ బొసాలే మాట్లాడుతూ.. ఇకపై ప్రతీ మూడేళ్లకోసారి న్యాయాధికారుల సమావేశం, ఏటా జిల్లా జడ్జీలతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కాగా, ఈ సమావేశంలో వివిధ అంశాలపై జరిగిన చర్చల సారాంశాన్ని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌కు వివరించారు. ఈ సందర్భంగా జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి మాట్లాడుతూ న్యాయమూర్తులు తమ కలంతోనే మాట్లాడుతారని, వారికి కలమే బలమన్నారు. కేరళ న్యాయవ్యవస్థలో అవినీతి ఎంతమాత్రం లేదని, ఉభయ రాష్ట్రాల్లోనూ అవినీతిరహిత న్యాయవ్యవస్థ తయారు చేయడమే మనందరి లక్ష్యం కావాలన్నారు. -
MYS ప్రసాద్‌కు గౌరవ డాక్టరేట్