‘సుప్రీంకోర్టులో అవాంఛనీయ ఘటనలు’.. ఏమిటవి? | Extraordinary consequences at the highest court | Sakshi
Sakshi News home page

‘సుప్రీంకోర్టులో అవాంఛనీయ ఘటనలు’.. ఏమిటవి?

Published Fri, Jan 12 2018 2:11 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

Extraordinary consequences at the highest court - Sakshi

ప్రెస్‌మీట్‌లో జస్టిస్‌లు జాస్తి చలమేశ్వర్‌, కురియన్‌ జోసెఫ్‌, రంజన్‌ గగోయ్‌, మదన్‌ బి లోకూర్‌లు(ఎడమ నుంచి కుడికి)

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ న్యాయచరిత్రలోనే అరుదైన ఘట్టంగా నిలిచే సంఘటన.. భారత అత్యున్నత న్యాయస్థానం సిట్టింగ్‌ జడ్జిల విషయంలో చోటుచేసుకుంది. సీనియర్‌ జడ్జిలు జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌, జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌, జస్టిస్‌ మదన్‌ బి లోకూర్‌లు ఉమ్మడిగా బుధవారం ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. గడిచిన కొన్ని నెలలుగా కేసుల కేటాయింపులు, పరిపాలనా విధానం గాడితప్పాయని, జరగకూడని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని జడ్జిల బృందం విమర్శించింది. పలు ప్రయత్నాలు విఫలమైన తర్వాత తప్పని పరిస్థితుల్లో తాము మీడియా ముందుకు వచ్చామంది. 

ఏమిటా అవాంఛనీయ ఘటనలు? : తెలుగువారైన జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ సహా నలుగురు జడ్జిలు చేసిన ఆరోపణలన్నీ.. నేరుగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాపై ఎక్కుపెట్టినవే. 2017 ఆగస్టులో జస్టిస్‌ మిశ్రా సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే.. ‘యూపీ మెడికల్‌ సీట్ల కుంభకోణం’ కేసులో అనూహ్యంగా వ్యవహరించారు. ఆ కేసులో జస్టిస్‌ చలమేశ్వర్‌ ఇచ్చిన ఆదేశాలను కొట్టేయడమేకాదు.. ‘సుప్రీంకోర్టుకు సీజేఐనే మాస్టర్‌’ అని దీపక్‌ మిశ్రా వ్యాఖ్యలు చేశారు. సుప్రీంలో ‘కేసులు, ధర్మాసనాల పరిధి తదితర అన్ని అంశాల్లో ప్రధాన న్యాయమూర్తిదే సంపూర్ణ అధికారం’ అని కూడా తేల్చేశారు. అంతకు ఒకరోజు ముందే ‘జడ్జి అవినీతి ఆరోపణల కేసు’ను విచారిస్తోన్న రాజ్యాంగ బెంచి నుంచి జస్టిస్‌ చలమేశ్వర్‌ను సీజేఐ తప్పించారు. గతేడాది నవంబర్‌లో చోటుచేసుకున్న ఈ రెండు పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. నేటి ప్రెస్‌మీట్‌లో జాస్తి చలమేశ్వర్‌ మాట్లాడుతూ.. ‘‘ఆయా వివాదాల విషయంలో ఓ పద్ధతి ప్రకారం ముందుకు వెళ్దామని ప్రధాన న్యాయమూర్తిని కోరాం. నేటి(శుక్రవారం) ఉదయం కూడా ఆయనను కలిశాం. అయినాసరే ఆశించిన ఫలితం రాకపోవడంతో లేఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని గుర్తుచేశారు.

ఆ రెండు కేసులూ సంక్లిష్టమైనవే.. :
వెలుగులోకి రాని వివాదాల సంగతి అటుంచితే, నేటి ప్రెస్‌మీట్లకు ప్రధాన కారణంగా కనిపించేవి, జస్టిస్‌ చలమేశ్వర్‌ను విచారణ నుంచి తొలగించినవి.. పరస్రస్పరం సంబంధమున్న రెండు కేసులు. 1. యూపీ మెడికల్‌ సీట్ల కుంభకోణం, 2. ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి ఇష్రత్‌పై అవినీతి ఆరోపణలు.

పూర్వాపరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని లఖ్నో కేంద్రంగా నడిచే ప్రసాద్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌కు చెందిన మెడికల్‌ కాలేజీతోపాటు 46 ఇతర మెడికల్‌ కాలేజీల్లో సరైన వసతులులేని కారణంగా మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(ఎంసీఐ) వాటిలో అడ్మిషన్లను రద్దు చేసింది. అయితే.. ఈ విషయంలో సుప్రీంకోర్టులో అనుకూలమైన ఆదేశాలు వచ్చేలా చూస్తామంటూ కొందరు కాలేజీ యాజమాన్యాలతో భారీ డీల్‌ కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసిన సీబీఐ.. డీల్స్‌ కుదుర్చుకున్నది మరెవరోకాదు సాక్షాత్తూ ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి(2004-10 మధ్య పనిచేశారు) ఇష్రత్‌ మస్రూర్‌ ఖుద్దూసీ, ఆయన అనుచరుడు భావనా పాండే, మరో మధ్యవర్తి విశ్వనాథ్‌ అగ్రావాలాలే అని తేల్చింది. ఈ క్రమంలో గత సెప్టెంబర్‌లో జస్టిస్‌ ఇష్రత్‌ సహా ఐదుగురిని సీబీఐ అరెస్టు చేసింది. కాగా, సుప్రీంకోర్టు నో చెప్పినా ప్రసాద్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టులో అడ్మిషన్లు మాత్రం జరిగిపోయాయి.

కాగా, ఈ కేసులో స్వయంగా జడ్జిలపైనే ఆరోపణలు వచ్చినందున... సీజేఐ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)ను ఏర్పాటు చేయాలని ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్‌ వేసింది. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలా లేదా అనే దానిపై వాదనలు విన్న జస్టిస్‌ చలమేశ్వర్‌, జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. చివరకు పిటిషన్‌ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించి, దానిని సుప్రీంకోర్టులోని ఐదుగురు సీనియర్‌ జడ్జిలతో కూడిన ధర్మాసనానికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కానీ సదరు ధర్మాసనంలో సీజేఐ దీపక్‌ మిశ్రా ఉండరాదంటూ పిటిషన్‌ దాఖలు చేసిన స్వచ్ఛంద సంస్థ కోరింది. ఎందుకంటే.. ‘అడ్మిషన్లు జరుపుకోవచ్చు’అన్న తీర్పు ఇచ్చింది మిశ్రా ధర్మాసనమే కాబట్టి! అన్ని వాదనలు పూర్తయిన తర్వాత తుది ఆదేశాలు ఇచ్చేందుకు చలమేశ్వర్‌ బెంచ్‌ సిద్ధమయ్యారు. అంతలోనే.. ‘ఈ వ్యవహారాన్ని ఇంకో బెంచ్‌కు అప్పగించాలంటూ’ సీజేఐ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నుంచి హుటాహుటిన ఆదేశాలు వచ్చాయి. అయినాసరే, చలమేశ్వర్‌ బెంచ్‌ ఆదేశాలు ఇచ్చేసింది. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 145(3) ప్రకారం సీజేఐ లేకుండానే బెంచ్‌ను ఏర్పాటుచేసింది. అంతకు ముందురోజే.. జస్టిస్‌ ఇష్రత్‌ పేరుతో ముడుపుల కేసును విచారిస్తున్న రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్‌ చలమేశ్వర్‌ను తప్పిస్తూ సీజేఐ మిశ్రా ఉత్తర్వులిచ్చారు. 

అయితే, పరస్పరం సంబంధమున్న ఈ రెండు కేసుల్లో సీజేఐ వ్యవహార శైలిపై సీనియర్‌ న్యాయమూర్తులు లోలోన అభ్యంతరాలు వ్యక్తంచేశారు. చివరికి జాస్తి చలమేశ్వర్‌ సహా నలుగురు జడ్జిలు మీడియా ముందుకొచ్చి ‘గోడు’ వెళ్లబోసుకున్నారు. కాగా, నలుగురు జడ్జిల ఆరోపణలపై ఎదురుదాడి చేసేందుకు సీజేఐ దీపక్‌ మిశ్రా సిద్ధమయ్యారు. ఆయన కూడా మీడియా ముందుకే వచ్చి మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కొలీజియం ద్వారా నియామకాలు, పారదర్శకత, కేసుల కేటాయింపులు తదితర వ్యవహారాల్లో చోటుచేసుకున్న వివాదాలతో సుప్రీంకోర్టు ప్రతిష్ట మసకబారిందన్న విమర్శల నడుమ తాజా వివాదాం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో వేచిచూడాలి. జడ్జిల వివాదం కొనసాగుతుండగానే.. ప్రధాని నరేంద్ర మోదీ.. న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement