Justice Dipak Misra
-
మతం పేరిట మహిళలను అలా.. ఎలా?
ఖత్నా ఆచారం.. మహిళా జననాంగ విరూపణం (FGM)పై సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మతం పేరిట మహిళలను భౌతికంగా హింసించటం ఖచ్ఛితంగా నేరమని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఖత్నాకు వ్యతిరేకంగా దాఖలైన ఓ పిటిషన్‌పై సోమవారం వాదనలు జరగ్గా.. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ పలు వ్యాఖ్యలు చేసింది. సాక్షి, న్యూఢిల్లీ: ‘మత సంప్రదాయం పేరిట మహిళల మర్మాంగాలను తాకటం ఏంటి? వారి ఆరోగ్యాన్ని దెబ్బతీయటం ఏంటి?.. ఇది ముమ్మాటికీ వారిని భౌతికంగా హింసించటమే. మహిళ ఆత్మగౌరవానికి భంగం కలిగించినట్లే అవుతుంది. పోక్సో చట్టం ప్రకారం ఆడపిల్లలపై ఈ ఆచారం ప్రయోగించటం లైంగిక నేరం కిందకి వస్తుంది. ఇది ముమ్మాటికీ తీవ్రమైన నేరమే’ అని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం అభిప్రాయపడింది. వాదనలు సాగాయిలా... ఖత్నా పేరిట మహిళలపై హింస కొనసాగుతోందని పిటిషనర్ సునీతా తివారీ తరపు న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదించారు. ఈ వాదనలతో బెంచ్ ఏకీభవించింది. ఆపై దావూదీ బోహ్రా(ఖత్నాను పాటిస్తున్న ముస్లిం సమాజం) తరపున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. ‘వేల సంవత్సరాలుగా ఈ సంప్రదాయం పాటిస్తూ వస్తున్నారని, దీనికి రాజ్యాంగబద్ధమైన హక్కు కూడా ఉందని గుర్తు చేశారు. ట్రిపుల్ తలాక్, నిఖా హలాల, బహుభార్యత్వం(పాలీగమీ) అంశాల రాజ్యాంగ బద్ధతను నిర్ధారించేందుకు ఏర్పాటు చేసిన రాజ్యాంగ ధర్మాసనానికి ఈ వ్యవహారాన్ని బదిలీ చేయాలని’ సింఘ్వీ బెంచ్‌ను కోరారు. సింఘ్వీ వాదనలను అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తప్పబట్టారు. ‘మగవాళ్లలో సున్తీ ప్రక్రియ కొన్ని ఆరోగ్యకరమైన లాభాలను అందిస్తాయన్న వాదన ఉంది. కానీ, మహిళల విషయానికొస్తే ఇది చాలా తీవ్రమైన అంశం. వారి ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుంది. ప్రాథమిక హక్కుల ప్రకారం ఇది ఖచ్ఛితంగా నిషేధించాల్సిన అంశం. అంతర్జాతీయ సమాజం ఈ ఆచారాన్ని ముక్తకంఠంతో ఖండించింది. ఇప్పటికే అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, 27 ఆఫ్రికన్ దేశాలు ఖత్నాను నిషేధించాయి కూడా’ అని బెంచ్‌కు ఏజీ విన్నవించారు. ఇరువర్గాల వాదనలను విన్న బెంచ్.. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను జూలై 16కి వాయిదా వేసింది. ఖత్నా గురించి... సాధారణంగా ఇస్లాంలో సున్తీ పురుషులకు చేస్తుంటారు. అయితే కొన్ని దేశాల్లో మహిళలపై కూడా ఈ ఆచారాన్ని అమలు చేస్తున్నారు. అదే ఖత్నా.. దీనినే స్త్రీ సున్తీ మరియు స్త్రీ జననేంద్రియ కట్టడం అని కూడా పిలుస్తారు. ఇది బాహ్య మహిళ జననేంద్రియాల యొక్క మొత్తం లేదా అన్నింటిని తొలగించే ప్రక్రియ(మహిళల జననేంద్రియంలో క్లైటోరిస్ అనే భాగాన్ని కత్తిరించడం). ఆ తర్వాత నొప్పి నుంచి ఉపశమనం కలిగించేందుకు పసుపు, వేడి నీళ్లు, సాధారణ పైపూత మందును వాడుతారు. ఆంగ్లంలో 'ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్' (ఎఫ్‌జీఎం)గా దీన్ని వ్యవహరిస్తున్నారు. భారత్ విషయానికొస్తే... బొహ్రా ముస్లిం సమాజం (దావూదీ బొహ్రా, సులైమానీ బొహ్రా)లో ఇది సర్వ సాధారణం.గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో బొహ్రా ముస్లింలు ఎక్కువ. దేశంలో వీరి జనాభా దాదాపు 10 లక్షల దాకా ఉంటుంది. అయితే దావూదీ బొహ్రా ముస్లింలు దేశంలోని విద్యావంతమైన ముస్లిం సమాజాల్లో ఒకటి. అయినప్పటికీ ఆ ఆచారాన్ని పాటిస్తుండటం గమనార్హం. తొలుత పరిశుద్ధత పేరిట వాదనను వినిపించిన ఆ వర్గం.. ఆ తర్వాత క్లైటోరిస్ ఉండడం వల్ల అమ్మాయిల్లో లైంగికవాంఛ పెరుగుతుందని, అందుకే దీనిని ఆచరిస్తున్నామని చెబుతుండటం గమనార్హం. అయితే ఆడపిల్లల్ని శారీరకంగా హింసించే ఈ సంప్రదాయానికి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా జరుగుతుండగా.. గతేడాది సునీతా తివారీ అనే ఉద్యమవేత్త సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఐరాస నిషేధం... మరోవైపు ''స్త్రీ జననేంద్రియంలో వెలుపలి భాగాన్ని కోసివేయడం లేదా చర్మాన్ని తొలగించడాన్ని ఎఫ్‌జీఎంగా వ్యవహరించాలి'' అని ఐక్యరాజ్యసమితి నిర్వచించింది. ఈ విధానాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా ఐక్యరాజ్యసమితి పరిగణించింది కూడా. ప్రపంచవ్యాప్తంగా ఎఫ్‌జీఎం పద్ధతికి ముగింపు పలుకుతూ, 2012 డిసెంబర్లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. దీనిపై 194 దేశాలు(భారత్ సహా) సంతకం చేశాయి. ఆ తర్వాత కొన్ని దేశాలు ఎఫ్‌జీఎంను నిషేధిస్తూ చట్టాలు చేసుకోగా.. భారత్ మాత్రం చట్టం చేయలేదు. ఎఫ్‌జీఎంను నిర్మూలించేందుకు, దీనిపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ప్రతి యేటా ఫిబ్రవరి 6ను 'ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో టోలరన్స్ ఫర్ ఎఫ్‌జీఎం'గా జరుపుకోవాలని ఐరాస ప్రకటించింది కూడా. -
కారుణ్య మరణంపై సంచలన తీర్పు
-
‘సుప్రీంకోర్టులో అవాంఛనీయ ఘటనలు’.. ఏమిటవి?
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ న్యాయచరిత్రలోనే అరుదైన ఘట్టంగా నిలిచే సంఘటన.. భారత అత్యున్నత న్యాయస్థానం సిట్టింగ్ జడ్జిల విషయంలో చోటుచేసుకుంది. సీనియర్ జడ్జిలు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్‌లు ఉమ్మడిగా బుధవారం ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. గడిచిన కొన్ని నెలలుగా కేసుల కేటాయింపులు, పరిపాలనా విధానం గాడితప్పాయని, జరగకూడని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని జడ్జిల బృందం విమర్శించింది. పలు ప్రయత్నాలు విఫలమైన తర్వాత తప్పని పరిస్థితుల్లో తాము మీడియా ముందుకు వచ్చామంది. ఏమిటా అవాంఛనీయ ఘటనలు? : తెలుగువారైన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సహా నలుగురు జడ్జిలు చేసిన ఆరోపణలన్నీ.. నేరుగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై ఎక్కుపెట్టినవే. 2017 ఆగస్టులో జస్టిస్ మిశ్రా సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే.. ‘యూపీ మెడికల్ సీట్ల కుంభకోణం’ కేసులో అనూహ్యంగా వ్యవహరించారు. ఆ కేసులో జస్టిస్ చలమేశ్వర్ ఇచ్చిన ఆదేశాలను కొట్టేయడమేకాదు.. ‘సుప్రీంకోర్టుకు సీజేఐనే మాస్టర్’ అని దీపక్ మిశ్రా వ్యాఖ్యలు చేశారు. సుప్రీంలో ‘కేసులు, ధర్మాసనాల పరిధి తదితర అన్ని అంశాల్లో ప్రధాన న్యాయమూర్తిదే సంపూర్ణ అధికారం’ అని కూడా తేల్చేశారు. అంతకు ఒకరోజు ముందే ‘జడ్జి అవినీతి ఆరోపణల కేసు’ను విచారిస్తోన్న రాజ్యాంగ బెంచి నుంచి జస్టిస్ చలమేశ్వర్‌ను సీజేఐ తప్పించారు. గతేడాది నవంబర్‌లో చోటుచేసుకున్న ఈ రెండు పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. నేటి ప్రెస్మీట్లో జాస్తి చలమేశ్వర్ మాట్లాడుతూ.. ‘‘ఆయా వివాదాల విషయంలో ఓ పద్ధతి ప్రకారం ముందుకు వెళ్దామని ప్రధాన న్యాయమూర్తిని కోరాం. నేటి(శుక్రవారం) ఉదయం కూడా ఆయనను కలిశాం. అయినాసరే ఆశించిన ఫలితం రాకపోవడంతో లేఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని గుర్తుచేశారు. ఆ రెండు కేసులూ సంక్లిష్టమైనవే.. : వెలుగులోకి రాని వివాదాల సంగతి అటుంచితే, నేటి ప్రెస్మీట్లకు ప్రధాన కారణంగా కనిపించేవి, జస్టిస్ చలమేశ్వర్‌ను విచారణ నుంచి తొలగించినవి.. పరస్రస్పరం సంబంధమున్న రెండు కేసులు. 1. యూపీ మెడికల్ సీట్ల కుంభకోణం, 2. ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి ఇష్రత్‌పై అవినీతి ఆరోపణలు. పూర్వాపరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని లఖ్నో కేంద్రంగా నడిచే ప్రసాద్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కు చెందిన మెడికల్ కాలేజీతోపాటు 46 ఇతర మెడికల్ కాలేజీల్లో సరైన వసతులులేని కారణంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) వాటిలో అడ్మిషన్లను రద్దు చేసింది. అయితే.. ఈ విషయంలో సుప్రీంకోర్టులో అనుకూలమైన ఆదేశాలు వచ్చేలా చూస్తామంటూ కొందరు కాలేజీ యాజమాన్యాలతో భారీ డీల్ కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసిన సీబీఐ.. డీల్స్ కుదుర్చుకున్నది మరెవరోకాదు సాక్షాత్తూ ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి(2004-10 మధ్య పనిచేశారు) ఇష్రత్ మస్రూర్ ఖుద్దూసీ, ఆయన అనుచరుడు భావనా పాండే, మరో మధ్యవర్తి విశ్వనాథ్ అగ్రావాలాలే అని తేల్చింది. ఈ క్రమంలో గత సెప్టెంబర్‌లో జస్టిస్ ఇష్రత్ సహా ఐదుగురిని సీబీఐ అరెస్టు చేసింది. కాగా, సుప్రీంకోర్టు నో చెప్పినా ప్రసాద్ ఎడ్యుకేషన్ ట్రస్టులో అడ్మిషన్లు మాత్రం జరిగిపోయాయి. కాగా, ఈ కేసులో స్వయంగా జడ్జిలపైనే ఆరోపణలు వచ్చినందున... సీజేఐ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేయాలని ఓ స్వచ్ఛంద సంస్థ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలా లేదా అనే దానిపై వాదనలు విన్న జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. చివరకు పిటిషన్‌ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించి, దానిని సుప్రీంకోర్టులోని ఐదుగురు సీనియర్ జడ్జిలతో కూడిన ధర్మాసనానికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కానీ సదరు ధర్మాసనంలో సీజేఐ దీపక్ మిశ్రా ఉండరాదంటూ పిటిషన్ దాఖలు చేసిన స్వచ్ఛంద సంస్థ కోరింది. ఎందుకంటే.. ‘అడ్మిషన్లు జరుపుకోవచ్చు’అన్న తీర్పు ఇచ్చింది మిశ్రా ధర్మాసనమే కాబట్టి! అన్ని వాదనలు పూర్తయిన తర్వాత తుది ఆదేశాలు ఇచ్చేందుకు చలమేశ్వర్ బెంచ్ సిద్ధమయ్యారు. అంతలోనే.. ‘ఈ వ్యవహారాన్ని ఇంకో బెంచ్‌కు అప్పగించాలంటూ’ సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా నుంచి హుటాహుటిన ఆదేశాలు వచ్చాయి. అయినాసరే, చలమేశ్వర్ బెంచ్ ఆదేశాలు ఇచ్చేసింది. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 145(3) ప్రకారం సీజేఐ లేకుండానే బెంచ్‌ను ఏర్పాటుచేసింది. అంతకు ముందురోజే.. జస్టిస్ ఇష్రత్ పేరుతో ముడుపుల కేసును విచారిస్తున్న రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్ చలమేశ్వర్‌ను తప్పిస్తూ సీజేఐ మిశ్రా ఉత్తర్వులిచ్చారు. అయితే, పరస్పరం సంబంధమున్న ఈ రెండు కేసుల్లో సీజేఐ వ్యవహార శైలిపై సీనియర్ న్యాయమూర్తులు లోలోన అభ్యంతరాలు వ్యక్తంచేశారు. చివరికి జాస్తి చలమేశ్వర్ సహా నలుగురు జడ్జిలు మీడియా ముందుకొచ్చి ‘గోడు’ వెళ్లబోసుకున్నారు. కాగా, నలుగురు జడ్జిల ఆరోపణలపై ఎదురుదాడి చేసేందుకు సీజేఐ దీపక్ మిశ్రా సిద్ధమయ్యారు. ఆయన కూడా మీడియా ముందుకే వచ్చి మాట్లాడాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కొలీజియం ద్వారా నియామకాలు, పారదర్శకత, కేసుల కేటాయింపులు తదితర వ్యవహారాల్లో చోటుచేసుకున్న వివాదాలతో సుప్రీంకోర్టు ప్రతిష్ట మసకబారిందన్న విమర్శల నడుమ తాజా వివాదాం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో వేచిచూడాలి. జడ్జిల వివాదం కొనసాగుతుండగానే.. ప్రధాని నరేంద్ర మోదీ.. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. -
సీజేఐగా జస్టిస్ దీపక్ మిశ్రా
► సుప్రీంకోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం ► జస్టిస్ మిశ్రాకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ దీపక్ మిశ్రా(64) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ జేఎస్ ఖేహర్ స్థానంలో 45వ సీజేఐగా దీపక్‌మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జస్టిస్ మిశ్రా చేత ప్రమాణం చేయించారు. జస్టిస్ దీపక్ మిశ్రా ఇంగ్లిష్‌లో దేవునిపై ప్రమాణం చేసి బాధ్యతలను స్వీకరించారు. ఆయన 2018 అక్టోబర్ 2 వరకూ సీజేఐగా కొనసాగనున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ మిశ్రా పేరును జస్టిస్ ఖేహర్ గత నెలలో ప్రతి పాదించారు. జస్టిస్ దీపక్ మిశ్రా 1977లో ఒరిస్సా హైకోర్టులో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. 1996లో ఒరిస్సా హైకోర్టులో అదనపు జడ్జిగా నియమితులయ్యారు. అనంతరం మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయిన ఆయన 1997 డిసెంబర్ 19న శాశ్వత జడ్జి అయ్యారు. 2009లో పట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యారు. 2010లో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన పట్నా హైకోర్టు, ఢిల్లీ హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. 2011 అక్టోబర్‌లో సుప్రీంకోర్టుకు బదిలీ అయ్యారు. జస్టిస్ మిశ్రా ప్రస్తుతం కీలకమైన కావేరీ, కృష్ణా జలాల వివాదాలు, బీసీసీఐ సంస్కరణలు, సహారా తదితర కేసులకు సంబంధించి వాదనలు వింటున్న ధర్మాసనాల్లో సభ్యునిగా ఉన్నారు. సినిమా హాళ్లలో జాతీయ గీతాన్ని పాడాలని తీర్పునిచ్చిన ధర్మాసనానికి జస్టిస్ మిశ్రా నేతృత్వం వహించారు. అలాగే నిర్భయ కేసులో నిందితులకు మరణశిక్ష విధించిన ధర్మాసనం లోనూ ఆయన సభ్యునిగా ఉన్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణïస్వీకార కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్, పలువురు కేంద్ర మంత్రులు హాజర య్యారు. నూతన సీజేఐగా బాధ్యతలు స్వీకరిం చిన జస్టిస్ మిశ్రాకు ప్రధాని మోదీ అభినంద నలు తెలిపారు. ఆయన పదవీ కాలం ఫలప్రదంగా కొనసాగాలని కోరుకుంటున్నానని ట్వీటర్లో ఆకాంక్షించారు. -
‘గో రక్షక గ్రూపుల’పై సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: గో రక్షక గ్రూపులపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్ నేపథ్యంలో.. రాజస్థాన్ సహా ఆరు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. దీనిపై సమాధానమివ్వాలంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఎ.ఎం.ఖన్విల్కర్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసిన రాష్ట్రాల్లో రాజస్థాన్ , మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. సమాధానమిచ్చేందుకు ధర్మాసనం మూడు వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను మే మూడోతేదీకి వాయిదా వేసింది. -
సోదరి వారసత్వ ఆస్తిపై హక్కులేదు
సుప్రీంకోర్టు తీర్పు న్యూఢిల్లీ: వివాహిత సోదరికి భర్త నుంచి వచ్చిన వారసత్వ ఆస్తిపై ఆమె సోదరుడికి ఎటువంటి హక్కు ఉండదని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. హిందూ మత వారసత్వ చట్టంలోని ఓ నిబంధనను సుప్రీం కోర్టు పరిగణనలోనికి తీసుకుని ఈ తీర్పును వెలువరించింది. మామ, లేదా భర్త నుంచి సదరు మహిళకు సంక్రమించిన వారసత్వ ఆస్తిపై ఆ మహిళ మరణానంతరం ఆమె సోదరుడికి ఎటువంటి హక్కులు ఉండవని సెక్షన్ 15లో చాలా స్పష్టంగా పేర్కొన్నట్లు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్. భానుమతిలతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరిం చింది. ఉత్తరాఖండ్ డెహ్రడూన్ కు చెందిన ఓ వ్యక్తి వేసిన పిటిషన్ ను విచారించిన ఆ రాష్ట్ర హైకోర్టు... సోదరి వారసత్వ ఆస్తిపై ఎటువంటి హక్కు ఉండదని తీర్పు నిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. -
ఇకచాలు.. కథలొద్దు: సుప్రీంకోర్టు
సర్కారు బడుల్లో వసతులపై సుప్రీంకోర్టు అసంతృప్తి న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల లేమిపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లేమిపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా మంగళవారం జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ యంత్రాంగం తీరును తప్పుపట్టింది. మౌలిక వసతులపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీకి సారథ్యం వహించిన అశోక్ గుప్తా తన వాదనలు ప్రారంభిస్తూ ‘ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు నిధులు మంజూరు చేయడం లేదు. మరుగు దొడ్లను శుభ్రపరిచేందుకు ప్రధానోపాధ్యాయులు తమ జేబు నుంచి డబ్బులు వెచ్చిస్తున్నారు..’ అని వివరించారు. దీనిపై ఏపీ ప్రభుత్వ న్యాయవాదని ధర్మాసనం ప్రశ్నించగా ప్రధానోపాధ్యాయులకు సంబంధిత నిధులు పంపిణీ చేస్తున్నామని వివరించారు. దీనిపై ధర్మాసనం మరింత లోతుగా ప్రశ్నించింది. నిధులు ఏ శాఖ ద్వారా వస్తున్నాయని ప్రశ్నించగా ప్రభుత్వం తరపు న్యాయవాది ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని ధర్మాసనం కథలు చెప్పొద్దంటూ వ్యాఖ్యానించింది. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు వెచ్చిస్తున్న నిధులపై అఫిడవిట్ సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 12 వేల ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం మూసివేసే యోచనలో ఉందని, తెలంగాణలో 2012 నుంచి ఇప్పటివరకు ఉపాధ్యాయుల నియామకం జరగలేదని పిటిషనర్ల తరపు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను నడిపేందుకు రూపొందించిన నూతన పథకం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకురాగా పథకం అమలు నివేదికను 8 వారాల్లోగా సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 9కి వాయిదా వేసింది. -
శబరిమల కేసు రాజ్యాంగ బెంచ్‌కి బదిలీ!
న్యూఢిల్లీ: ఎన్నో శతాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న శబరిమల ఆలయ వివాదాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళల ప్రవేశంపై నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదంపై జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ విచారించింది. ‘దేవాలయాలు ప్రజల ఆధ్యాత్మిక కేంద్రాలు కాబట్టి మహిళలను ఆలయాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకోకూడదు. ఇది కచ్చితంగా వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే అవుతుంది. ఈ వివాదాన్ని రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాలని అనుకోవడం లేదు. కానీ ఒకవేళ ఆ పరిస్థితే వస్తే ఆ ధర్మాసనానికి పూర్తి ఉత్తర్వులు ఇస్తాం’ అని వ్యాఖ్యానించింది. -
సుప్రీంకోర్టు గురించి 151 నిజాలు
పుస్తకాన్ని ఆవిష్కరించిన జస్టిస్ దీపక్‌మిశ్రా న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం గురించి తెలుసుకునేందుకు వీలుగా రూపొందించి న ఒక పుస్తకాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దీపక్‌మిశ్రా ఆవిష్కరించారు. శనివారం ఢిల్లీలోని హేబిటాట్ సెంటర్లో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జస్టిస్ దీపక్ మిశ్రా మాట్లాడుతూ.. పుస్తకాలు, సంకలనాలు సమాచార ఉపయక్తమైనవని, వాటిలో ఉండే సమాచారం చారిత్రక వాస్తవాల పట్ల ఆసక్తి ఉన్న వారిని ఆలోచింపజేస్తుందన్నారు. ‘సుప్రీంకోర్టును మరింత ఉన్నతంగా అర్థం చేసుకోవడం - తెలుసుకోదగిన 151 నిజాలు’ పేరుతో ఈ పుస్తకాన్ని న్యాయ సమాచార కేంద్రం రూపొదించింది. ఇందులో 1950 నుంచి 2013 మధ్య కాలంలో 212 మంది న్యాయమూర్తులు వెలువరించిన 43వేల తీర్పుల అధ్యయన సమాచారాన్ని పొందుపరిచారు. దీన్ని తీసుకురావడానికి కృషి చేసిన వారిని జస్టిస్ దీపక్ మిశ్రా ఈ సందర్భంగా మెచ్చుకున్నారు. ఈ పుస్తకంలో ఉన్న నిజాలు సుప్రీంకోర్టులో ఐదు దశాబ్దాల పాటు పనిచేసిన వారికి సైతం తెలియవని సీనియర్ న్యాయవాది పీపీ రావు అన్నారు. ఇది అంత ప్రత్యేకమైన, విలక్షణమైన పుస్తకమని చెప్పారు. ఈ పుస్తకం న్యాయ సమాజానికి శక్తిమంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని న్యాయ సమాచార కేంద్రం అధ్యక్షుడు అరుణేశ్వర్ గుప్తా అన్నారు. -
పది రోజుల్లోగా స్పందించండి
న్యూఢిల్లీ: ఢిల్లీలో రాష్ట్రపతిపాలనను సవాల్ చేస్తూ ఆమ్ ఆద్మీపార్టీ(ఏఏపీ) వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభించింది. దీనిపై పది రోజుల్లోగా స్పందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది. కాంగ్రెస్, బీజేపీలకు నోటీసులు ఇవ్వాలన్న ఏఏపీ విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. ఇది రాజ్యాంగానికి సంబంధించిన అంశమని రాజకీయ పార్టీలకు సంబంధం లేదని జస్టిస్ ఆర్ఎమ్ లోధా, జస్టిస్ దీపక్ మిశ్రాలతో కూడిన బెంచ్ పేర్కొంది. ముఖ్యమంత్రి పదవి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే.