ఇకచాలు.. కథలొద్దు: సుప్రీంకోర్టు
సర్కారు బడుల్లో వసతులపై సుప్రీంకోర్టు అసంతృప్తి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల లేమిపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లేమిపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా మంగళవారం జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ యంత్రాంగం తీరును తప్పుపట్టింది. మౌలిక వసతులపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన కమిటీకి సారథ్యం వహించిన అశోక్ గుప్తా తన వాదనలు ప్రారంభిస్తూ ‘ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు నిధులు మంజూరు చేయడం లేదు. మరుగు దొడ్లను శుభ్రపరిచేందుకు ప్రధానోపాధ్యాయులు తమ జేబు నుంచి డబ్బులు వెచ్చిస్తున్నారు..’ అని వివరించారు. దీనిపై ఏపీ ప్రభుత్వ న్యాయవాదని ధర్మాసనం ప్రశ్నించగా ప్రధానోపాధ్యాయులకు సంబంధిత నిధులు పంపిణీ చేస్తున్నామని వివరించారు. దీనిపై ధర్మాసనం మరింత లోతుగా ప్రశ్నించింది.
నిధులు ఏ శాఖ ద్వారా వస్తున్నాయని ప్రశ్నించగా ప్రభుత్వం తరపు న్యాయవాది ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని ధర్మాసనం కథలు చెప్పొద్దంటూ వ్యాఖ్యానించింది. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు వెచ్చిస్తున్న నిధులపై అఫిడవిట్ సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 12 వేల ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం మూసివేసే యోచనలో ఉందని, తెలంగాణలో 2012 నుంచి ఇప్పటివరకు ఉపాధ్యాయుల నియామకం జరగలేదని పిటిషనర్ల తరపు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను నడిపేందుకు రూపొందించిన నూతన పథకం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ధర్మాసనం దృష్టికి తీసుకురాగా పథకం అమలు నివేదికను 8 వారాల్లోగా సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 9కి వాయిదా వేసింది.