సీజేఐగా జస్టిస్ దీపక్ మిశ్రా
► సుప్రీంకోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం
► జస్టిస్ మిశ్రాకు అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ దీపక్ మిశ్రా(64) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ జేఎస్ ఖేహర్ స్థానంలో 45వ సీజేఐగా దీపక్‌మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జస్టిస్ మిశ్రా చేత ప్రమాణం చేయించారు. జస్టిస్ దీపక్ మిశ్రా ఇంగ్లిష్‌లో దేవునిపై ప్రమాణం చేసి బాధ్యతలను స్వీకరించారు. ఆయన 2018 అక్టోబర్ 2 వరకూ సీజేఐగా కొనసాగనున్నారు. తదుపరి సీజేఐగా జస్టిస్ మిశ్రా పేరును జస్టిస్ ఖేహర్ గత నెలలో ప్రతి పాదించారు. జస్టిస్ దీపక్ మిశ్రా 1977లో ఒరిస్సా హైకోర్టులో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు.
1996లో ఒరిస్సా హైకోర్టులో అదనపు జడ్జిగా నియమితులయ్యారు. అనంతరం మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయిన ఆయన 1997 డిసెంబర్ 19న శాశ్వత జడ్జి అయ్యారు. 2009లో పట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యారు. 2010లో ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన పట్నా హైకోర్టు, ఢిల్లీ హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. 2011 అక్టోబర్‌లో సుప్రీంకోర్టుకు బదిలీ అయ్యారు. జస్టిస్ మిశ్రా ప్రస్తుతం కీలకమైన కావేరీ, కృష్ణా జలాల వివాదాలు, బీసీసీఐ సంస్కరణలు, సహారా తదితర కేసులకు సంబంధించి వాదనలు వింటున్న ధర్మాసనాల్లో సభ్యునిగా ఉన్నారు.
సినిమా హాళ్లలో జాతీయ గీతాన్ని పాడాలని తీర్పునిచ్చిన ధర్మాసనానికి జస్టిస్ మిశ్రా నేతృత్వం వహించారు. అలాగే నిర్భయ కేసులో నిందితులకు మరణశిక్ష విధించిన ధర్మాసనం లోనూ ఆయన సభ్యునిగా ఉన్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణïస్వీకార కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్, పలువురు కేంద్ర మంత్రులు హాజర య్యారు. నూతన సీజేఐగా బాధ్యతలు స్వీకరిం చిన జస్టిస్ మిశ్రాకు ప్రధాని మోదీ అభినంద నలు తెలిపారు. ఆయన పదవీ కాలం ఫలప్రదంగా కొనసాగాలని కోరుకుంటున్నానని ట్వీటర్‌లో ఆకాంక్షించారు.