జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌కు ప్రకటనా పత్రాన్ని అందిస్తున్న నేపర్‌విల్ నగర అధికార ప్రతినిధి పాల్ గస్టిన్
ఇల్లినాయిస్: భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌కు అరుదైన గౌరవం లభించింది. సంయుక్త ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, గౌహతీ, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా చారిత్రాత్మకమైన తీర్పులు అందించినందుకు గానూ అమెరికాలోని ఇల్లినాయిస్లోని నేపర్‌విల్ నగర మేయర్ స్టీవ్ చిరికో అక్టోబర్ 14వ తేదీని 'జస్టిస్ జాస్తి చలమేశ్వర్ డే'గా ప్రకటించారు.
సమాచార సాంకేతిక చట్టంలోని 66ఏ అధికరణను జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కొట్టివేయడం ద్వారా సామాజిక మాధ్యమాల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు వెసులుబాటు కల్పించారని స్టీవ్ కొనియాడారు. భారత ప్రధాన న్యాయమూర్తుల నియామకాల్లో కొలిజీయం విధానాల లొసుగులను, లోటుపాట్లను నిష్కర్షగా విమర్శించడం, ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించేందుకు ఆధార్ కార్డు ఒక్కటే ప్రామాణికమని అది లేని వారికి సేవలను నిరాకరించే చట్టానికి స్వస్తి పలకడం వంటి చారిత్రాత్మకమైన తీర్పులను వెలువరించి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ న్యాయవ్యవస్థకు మరింత వన్నె తెచ్చారని స్టీవ్ ప్రశంసించారు.
ఈ అరుదైన గౌరవాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. ఈ సందర్భంగా భారత న్యాయవ్యవస్థ గొప్పతనాన్ని ఆయన వివరించారు. మానవ హక్కులకు సంబంధించిన తీర్పులు వెలువరించే సమయంలో తాను అమెరికా సుప్రీం కోర్టు గతంలో నిర్దేశించిన తీర్పులను క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటి ఆధారంగా తన తీర్పులను తీర్చిదిద్దుకుంటానని జస్టిస్ జాస్తి వెల్లడించారు.
యార్లగడ్డకు రెండు పురస్కారాలు
పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు సాహిత్య భారతి పురస్కారాన్ని చికాగో కేంద్రంగా పనిచేస్తున్న భారతీ తీర్థ సంస్థ చికాగోలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అందించింది. భారతీ తీర్థ-సప్నా సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ తాతా ప్రకాశం చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందించారు.
యార్లగడ్డకు జ్ఞాపికను అందిస్తున్న నేపర్‌విల్ రోటరీ క్లబ్ ప్రతినిధురాలు నీనా మెనిస్, తాతా ప్రకాశం, శారదాపూర్ణ. చిత్రంలో జస్టిస్ జాస్తి.
హిందీ, తెలుగు భాషల్లో రెండు పీహెచ్‌డీ పట్టాలు అందుకుని ఆయా భాషల అభివృద్ధికి, వ్యాప్తికి నిరంతరం కృషి చేస్తూ 64 పుస్తకలు రచించిన అరుదైన ఘనత సొంతం చేసుకున్నందుకుగానూ యార్లగడ్డను నేపర్‌విల్ నగర రోటరీ క్లబ్ ప్రతినిధి నీన మెనిస్ "పాల్ హ్యారిస్" పురస్కారంతో సత్కరించారు. అనంతరం ప్రసంగించిన యార్లగడ్డ తెలుగు భాషా, సంస్కృతి, సంగీత, సాహిత్యాల వైశిష్ట్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శొంఠి శారదపూర్ణ, చికాగో తెలుగు సంఘం, గ్రేటర్ చికాగో తెలుగు సంఘం, అమెరికా తెలుగు సంఘం, ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా), మనబడి, చికాగో హిందూ దేవాలయం, నేపర్‌విల్ రోటరీ క్లబ్, నేపర్‌విల్ నగర కౌన్సిల్ సభ్యులు, ప్రతినిధులు తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.