
(ఫైల్ ఫోటో)
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నా దృష్టిలో హీరో అని మాజీ రాజ్యసభ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. దివంగత రాజశేఖర్‌రెడ్డి సంస్కారవంతుడు కాబట్టే తెలుగు గంగ ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టారని తెలిపారు. సోనియా గాంధీ కేంద్ర మంత్రిని చేస్తానన్నప్పటికీ జగన్ ఓదార్పు యాత్ర చేసి ఎన్నికలకు వెళ్లారని గుర్తు చేశారు.
'నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ 151 సీట్లు సాధించిన జగన్‌ను నేను ఎందుకు తిట్టాలి?. జగన్‌ను తిట్టి వేరే పార్టీ వాళ్లను పొగడాలా?. ఆయన సీఎం అయ్యాక నన్ను గౌరవించారు. అడగకుండానే చైర్మన్‌ను చేశారు. జగన్ కచ్చితంగా హీరోనే. ఆనాడు ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే, అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని. బాబు హయాంలో గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు ఎన్టీఆర్ పేరేందుకు పెట్టలేదు?' అని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రశ్నించారు.
'నా రాజీనామా విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. నేను స్వరం మార్చలేదు. నాపై విమర్శలు చేసే వారికి ఫోన్ల ద్వారా వివరణ ఇస్తున్నా. యూనివర్శిటీ పేరు మార్పుపై లక్ష్మీపార్వతి వ్యాఖ్యలు తన సొంత అభిప్రాయం' అని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు.