
లీగల్ నోటీసు పంపించినా వారు స్పందించలేదు
ఓలా సహ–వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్
న్యూఢిల్లీ: మ్యాప్‌లను కాపీ చేశారంటూ మ్యాప్‌మైఇండియా తమపై చేస్తున్న ఆరోపణల్లో విశ్వసనీయత లేదని ఓలా సహ–వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. ఓలా ఎలక్ట్రిక్ లిస్టింగ్‌ను అడ్డం పెట్టుకుని లబ్ధి పొందేందుకే ఆ కంపెనీ తమపై మ్యాప్‌ల కాపీయింగ్ ఆరోపణలు చేసిందని ఆయన పేర్కొన్నారు. తాము లీగల్ నోటీసు పంపినా మ్యాప్‌మైఇండియా నుంచి ఎటువంటి సమాధానం రాలేదని అగర్వాల్ పేర్కొన్నారు.
సొంతంగా దేశీ నావిగేషన్ మ్యాప్ తయారు చేశామంటూ ఓలా మాతృసంస్థ ఏఎన్‌ఐ టెక్నాలజీస్ ప్రకటించడం ఓ గిమ్మిక్కు అంటూ మ్యాప్‌మైఇండియా ఆరోపించడం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఓలా ఎలక్ట్రిక్ ఐపీవో సంబంధ ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయడానికి మూడు రోజుల ముందు జూలై 23న మ్యాప్‌మైఇండియా ఆ సంస్థకు నోటీసులు పంపింది. ఓలా ఎలక్ట్రిక్ ఆగస్టు 9న లిస్టయింది.
ఈ నేపథ్యంలోనే అగర్వాల్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాము చాలాకాలంగా రైడ్ షేరింగ్ వ్యాపారంలో ఉన్నందున తమ దగ్గర మ్యాపింగ్‌కి సంబంధించిన డేటా..టెక్నాలజీ బోలెడంత ఉందని, ఒక సంస్థను కూడా కొనుగోలు చేశామని అగర్వాల్ తెలిపారు. బహుశా మ్యాప్‌మైఇండియా కస్టమర్లు ఓలా మ్యాప్స్ వైపు మళ్లుతున్నారేమోనని, ఇది సమస్యగా మారడం వల్లే ఆ కంపెనీ తమపై ఆరోపణలు చేస్తోందని అగర్వాల్ పేర్కొన్నారు.