
తిరువనంతపురం: కేరళలో ఎల్‌డీఎఫ్ ప్రభుత్వానికి, గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్‌కు వివాదం ముదురుతోంది. ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టేలా వర్సిటీ విద్యార్థుల దగ్గర ప్రసంగాలు చేశారని, ఆయనపై రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం పినరయి విజయన్‌కు గవర్నర్ సూచించారు. ఆర్థిక మంత్రిపై తాను విశ్వాసం కోల్పోయానని, ఆయన్ను పదవి నుంచి తొలగించాలన్న అర్థం వచ్చేలా బుధవారం లేఖ రాశారు. గవర్నర్ డిమాండ్‌ను సీఎం తోసిపుచ్చారు.
యూపీ నుంచి వచ్చే విద్యార్థులకు కేరళలో పరిస్థితులు అర్థం కావడం సంక్లిష్టంగా ఉంటుందని ఈ నెల 18న కేరళ వర్సిటీలో విద్యార్థుల సమావేశంలో బాలగోపాల్ అన్నారు. ‘‘మంత్రి తన ప్రమాణాన్ని మరిచారు. దేశ ఐక్యత, సమగ్రతలను తక్కువ చేసి చూపిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి పదవిలో ఉండకూడదు. ఆయన నా విశ్వాసాన్ని కోల్పోయారు’’ అంటూ లేఖలో పేర్కొన్నారు. మంత్రిపై తనకు పరిపూర్ణ విశ్వాసముందంటూ సీఎం ఘాటుగా బదులిచ్చారు. ఆయనను తప్పించడానికి ఏ కారణాలూ లేవన్నారు. కేరళలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల్లో వీసీల నియామకం అంశంలో ఇప్పటికే ప్రభుత్వం, రాజ్‌భవన్ మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది.