‘కర్కశత్వం’పై కదలిక
♦ జిల్లా మానవ హక్కుల వేదిక కన్వీన ర్ రాకతో కదిలిన అధికార గణం
♦ ఘటన జరిగి వారం గడుస్తున్నా పట్టించుకోని అధికారులు
♦ అధికారుల తీరుపై మండిపడ్డ జయశ్రీ
♦ పిల్లలను జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖకు తరలించేందుకు చర్యలు
లక్కిరెడ్డిపల్లె : జిల్లా మానవ హక్కుల వేదిక కన్వీనర్ రాకతో ఎట్టకేలకు అధికారుల్లో కదలిక వచ్చింది. మండలంలోని రాయచోటి -వేంపల్లె మార్గంలో ప్రజాచైతన్య సేవాసంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథాశ్రమంలో అటెండర్ సంపూర్ణమ్మ రూ.450 నగదు పోయిందంటూ అనాథ పిల్లల చేతుల్లో కర్పూరం వెలిగించి ప్రమాణం చేయించిన ఘటనపై సాక్షిలో కథనం ప్రచురితమైంది. నాలుగు రోజులు గడుస్తున్నా అధికారుల్లో చలనం రాకపోవడంతో సోమవారం జిల్లా మానవ హక్కుల వేదిక కన్వీనర్ జయశ్రీ రాకతో అధికార బృందం కట్టకట్టుకొని ప్రజా చైతన్య సేవా సంఘం అనాథాశ్రమానికి పరుగులు పెట్టారు.
పిల్లలు పాఠశాలకు వెళ్లారని తెలిసి బాధిత విద్యార్థులైన నాగార్జున, నాగరాజు, నాగమల్లేష్‌లను పిలిపించి జరిగిన విషయంపై ఆరా తీశారు. ఆ విద్యార్థులు తమను కర్పూరం వెలిగించి కాల్చిందని చెబుతుంటే ఒళ్లు గగుర్పాటుకు గురై వెంటనే మండల విద్యాధికారి, తహసీల్దార్, ఎంపీడీఓ, సీడీపీఓ, సీఐ, ఎస్‌ఐలతో పాటు జిల్లా మహిళా శిశు సంక్షేమశాఖ చైర్ పర్సన్‌తో ఫోన్లో సంప్రదించారు. వెంటనే అనాథ పిల్లలకు మంచి సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, లేదంటే రాష్ట్ర మానవహక్కుల వేదికకు నివేదిస్తానని చెప్పడంతో అధికారులందరూ అరగంటలోపే లక్కిరెడ్డిపల్లెకు వాలిపోయారు.
అడిగితే కొడతారు
అధికారులు పిల్లలను పిలిపించి ఏం జరిగిందని అడగ్గా అక్కడ జరుగుతున్న తంతును వారికి వివరించారు. వారానికి ఒక్కరోజే స్నానం అని, అది కూడా బట్టలు ఉతికే సబ్బుతో స్నానం చేసుకొనే వారమని పేర్కొన్నారు. స్నానపు గదులు, మరుగుదొడ్లు ఉన్నా తమను మాత్రం రోడ్డుకు అటువైపు వున్న చేతిపంపు వద్దకు తీసుకువెళ్లేవారని వారు చెప్పుకొచ్చారు. ఉదయం గంజి తాగి పాఠశాలకు వచ్చే వారమని చెప్పడంతో అధికారులు కంగుతిన్నారు. పాఠశాలలో నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగులు ఇస్తే అటెండర్ అన్నీ లాక్కునేదని వారు వాపోయారు.
వెంటనే సీజ్ చేయాలి : జయశ్రీ
అనంతరం అన్ని శాఖల అధికారులతో కలిసి అనాథాశ్రమాన్ని తనిఖీ చేయగా చెత్తా చెదారంతో కూడిన గదులు, దుర్వాసన వస్తుండంతో వెంటనే సీజ్ చేయాలని జిల్లా మానవ హక్కుల వేదిక కన్వీనర్ జయశ్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనాథ పిల్లల కోసం రూ.లక్షలు ఖర్చు చేస్తుంటే ప్రైవేటు వ్యక్తులు కొంత మంది ప్రభుత్వ ఖాజానాకు గండి కొడుతున్నారని, అన్నీ తెలిసి కూడా అధికారులు నిమ్మకుండి పోవడంతో ప్రభుత్వ లక్ష్యాలు నీరుగారిపోతున్నాయని ఆమె వాపోయారు వెంటనే అటెండెర్ సంపూర్ణమ్మతో పాటు చైర్మన్ చెన్నారెడ్డిలపై కేసు నమోదు చేసి అనాథాశ్రమాన్ని సీజ్ చేయాలని ఆమె సూచించారు.
జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రొటెక్షన్ అధికారి సునీత తన సిబ్బందికి తెలియజేసి అనాథ పిల్లలను మెరుగైన సౌకర్యాలు ఉన్న చోటకి తరలిస్తామని చెప్పడంతో ఆ పిల్లలు ఆనందం వ్యక్తం చేశారు. తహసీల్దార్ శ్రీరాములు నాయక్, సూపరింటెండెంట్ హైదర్ వల్లీ, సీడీపీఓ క వితాదేవి, ప్రధానోపాధ్యాయుడు పురుషోత్తం రెడ్డి, మానవ హక్కుల వేదిక సంఘం నాయకులు సుబ్బన్న, వీఆర్‌లోలు నరేంద్రారెడ్డి, గంగాధర్, అన్వర్ బాషా, ఉపాధ్యాయులు శిద్దేశ్వరుడు, శ్రీనివాసులు, దామోదర్‌రెడ్డి, రఘురామయ్య పాల్గొన్నారు.