ఉల్లంఘనల్లో నక్సల్స్ టాప్
రెండేళ్లలో నక్సల్స్‌ను రూపుమాపుతాం
తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రల పనితీరు అద్భుతం
వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సుల్లో అమిత్ షా వ్యాఖ్య
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మానవహక్కుల్ని నక్సల్స్ దారుణంగా ఉల్లంఘిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆరోపించారు. 2026 మార్చికల్లా నక్సల్స్‌ను అంతంచేస్తామని ప్రకటించారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా పరిస్థితిపై సమీక్ష, నక్సల్స్ ఏరివేతకు ఉమ్మడి వ్యూహం, నక్సల్స్ ప్రభావిత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, అందుకు కేంద్రం సాయం తదితర అంశాలపై సోమవారం అమిత్ షా నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య కార్యదర్శులు, డీజీపీలు, కేంద్ర మంత్రులు, కేంద్ర సాయుధ బలగాల, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
‘‘దేశంలో గిరిజనులుసహా 8 కోట్ల మంది ప్రజలకు అభివృద్ధి, కనీస సంక్షేమ అవకాశాలు దక్కకుండా నక్సల్స్ దారుణంగా మానవహక్కుల్ని ఉల్లంఘిస్తున్నారు. అటవీ, మారుమూల ప్రాంతాలకు విద్య, ఆరోగ్యం, అనుసంధానత, బ్యాంకింగ్, పోస్టల్ సేవలు అందకుండా అడ్డుకుంటున్నారు.
అభివృద్ధికి అవరోధంగా తయారయ్యారు’’ అని అమిత్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘భద్రతాబలగాలు గతంలో రక్షణాత్మక ధోరణిని అవలంభించేవి. ఇప్పుడు దీటుగా సమాధానమిస్తున్నాయి. ఇటీవలికాలంలో బలగాలు ఘన విజయాలను సాధించాయి’’ అని ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ను అమిత్ షా పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘ నక్సల్స్‌తో పోరాటం తుది అంకానికి చేరుకుంది.
అందరి సహకారంతో 2026 మార్చికల్లా నక్సల్స్‌ను రూపుమాపుతాం. దీంతో దశాబ్దాల సమస్యకు ముగింపు పలుకుతాం. మావోయిస్టుల ప్రభావిత గిరిజన, ఆదివాసీ ప్రాంతాలకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందిస్తూనే మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి్దపై దృష్టి పెట్టినప్పుడు నక్సలిజాన్ని అడ్డుకోగలం.
పోలీస్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర పనితీరు అద్భుతం. ఛత్తీస్‌గఢ్‌లో వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడంలో గ్రేహౌండ్స్ పైచేయి సాధించింది. 2022 ఏడాదిలో గత 30 ఏళ్లలో ఎన్నడూలేనంతగా వామపక్ష ప్రభావిత హింసకారణంగా మరణాలు వందలోపునకు దిగొచ్చాయి. ఇప్పటిదాకా ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్, వామపక్ష ప్రభావిత ప్రాంతాల నుంచి 13,000 మంది హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. ఇకనైనా నక్సల్స్ ఆయుధాలు వీడాలి’’ అని అమిత్ షా పిలుపునిచ్చారు.
ఛత్తీస్‌గఢ్ విజయం స్ఫూర్తిదాయకం
‘‘ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అన్ని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో కొత్త అభివృద్ధి ప్రచారాన్ని ప్రారంభించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను గిరిజ నులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో ఈఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా 237 మంది నక్సలైట్లు చనిపో యారు. 812 మంది అరెస్టయ్యారు. 723 మంది నక్సలైట్లు లొంగిపోయారు’’ అని వివరించారు.
తగ్గిన హింసాత్మక ఘటనలు
‘‘ఇటీవలికాలంలో నక్సల్స్ హింసాత్మక ఘటనలు గణనీయంగా తగ్గాయి. నక్సల్స్ హింస ఘటనలు 16,463 నుంచి 7,700కి దిగొచ్చాయి. పౌరులు, భద్రతా సిబ్బంది మరణాలు 70శాతం తగ్గాయి. హింస బారినపడిన జిల్లాల సంఖ్య 96 నుంచి 16కు తగ్గింది. తమ పరిధిలో హింసాత్మక ఘటనలు జరుగుతున్న పోలీసు స్టేషన్ల సంఖ్య 465 నుంచి 171కి తగ్గింది. ఇది కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి ప్రయత్నాల ఫలితం. నక్సలిజం రూపుమాపేందుకు తీసుకునే చర్యల పురోగతిని సీఎంలు నెలకోసారి సమీక్షించాలి. డీజీపీలు ప్రతి 15 రోజులకే సమీక్ష జరపాలి’’ అని అమిత్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment