chief ministers meeting
-
మానవ హక్కుల్ని కాలరాశారు: అమిత్‌షా
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మానవహక్కుల్ని నక్సల్స్ దారుణంగా ఉల్లంఘిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆరోపించారు. 2026 మార్చికల్లా నక్సల్స్‌ను అంతంచేస్తామని ప్రకటించారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా పరిస్థితిపై సమీక్ష, నక్సల్స్ ఏరివేతకు ఉమ్మడి వ్యూహం, నక్సల్స్ ప్రభావిత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, అందుకు కేంద్రం సాయం తదితర అంశాలపై సోమవారం అమిత్ షా నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్య కార్యదర్శులు, డీజీపీలు, కేంద్ర మంత్రులు, కేంద్ర సాయుధ బలగాల, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ‘‘దేశంలో గిరిజనులుసహా 8 కోట్ల మంది ప్రజలకు అభివృద్ధి, కనీస సంక్షేమ అవకాశాలు దక్కకుండా నక్సల్స్ దారుణంగా మానవహక్కుల్ని ఉల్లంఘిస్తున్నారు. అటవీ, మారుమూల ప్రాంతాలకు విద్య, ఆరోగ్యం, అనుసంధానత, బ్యాంకింగ్, పోస్టల్ సేవలు అందకుండా అడ్డుకుంటున్నారు. అభివృద్ధికి అవరోధంగా తయారయ్యారు’’ అని అమిత్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘భద్రతాబలగాలు గతంలో రక్షణాత్మక ధోరణిని అవలంభించేవి. ఇప్పుడు దీటుగా సమాధానమిస్తున్నాయి. ఇటీవలికాలంలో బలగాలు ఘన విజయాలను సాధించాయి’’ అని ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ను అమిత్ షా పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘ నక్సల్స్‌తో పోరాటం తుది అంకానికి చేరుకుంది. అందరి సహకారంతో 2026 మార్చికల్లా నక్సల్స్‌ను రూపుమాపుతాం. దీంతో దశాబ్దాల సమస్యకు ముగింపు పలుకుతాం. మావోయిస్టుల ప్రభావిత గిరిజన, ఆదివాసీ ప్రాంతాలకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందిస్తూనే మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి్దపై దృష్టి పెట్టినప్పుడు నక్సలిజాన్ని అడ్డుకోగలం. పోలీస్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర పనితీరు అద్భుతం. ఛత్తీస్‌గఢ్‌లో వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడంలో గ్రేహౌండ్స్ పైచేయి సాధించింది. 2022 ఏడాదిలో గత 30 ఏళ్లలో ఎన్నడూలేనంతగా వామపక్ష ప్రభావిత హింసకారణంగా మరణాలు వందలోపునకు దిగొచ్చాయి. ఇప్పటిదాకా ఈశాన్య రాష్ట్రాలు, కశ్మీర్, వామపక్ష ప్రభావిత ప్రాంతాల నుంచి 13,000 మంది హింసను వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. ఇకనైనా నక్సల్స్ ఆయుధాలు వీడాలి’’ అని అమిత్ షా పిలుపునిచ్చారు. ఛత్తీస్‌గఢ్ విజయం స్ఫూర్తిదాయకం‘‘ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అన్ని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో కొత్త అభివృద్ధి ప్రచారాన్ని ప్రారంభించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలను గిరిజ నులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో ఈఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా 237 మంది నక్సలైట్లు చనిపో యారు. 812 మంది అరెస్టయ్యారు. 723 మంది నక్సలైట్లు లొంగిపోయారు’’ అని వివరించారు. తగ్గిన హింసాత్మక ఘటనలు‘‘ఇటీవలికాలంలో నక్సల్స్ హింసాత్మక ఘటనలు గణనీయంగా తగ్గాయి. నక్సల్స్ హింస ఘటనలు 16,463 నుంచి 7,700కి దిగొచ్చాయి. పౌరులు, భద్రతా సిబ్బంది మరణాలు 70శాతం తగ్గాయి. హింస బారినపడిన జిల్లాల సంఖ్య 96 నుంచి 16కు తగ్గింది. తమ పరిధిలో హింసాత్మక ఘటనలు జరుగుతున్న పోలీసు స్టేషన్ల సంఖ్య 465 నుంచి 171కి తగ్గింది. ఇది కేంద్రం, రాష్ట్రాల ఉమ్మడి ప్రయత్నాల ఫలితం. నక్సలిజం రూపుమాపేందుకు తీసుకునే చర్యల పురోగతిని సీఎంలు నెలకోసారి సమీక్షించాలి. డీజీపీలు ప్రతి 15 రోజులకే సమీక్ష జరపాలి’’ అని అమిత్ సూచించారు. -
నీట్ పరీక్ష వాయిదాకు విపక్ష సీఎంల డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో నీట్ పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులతో పాటు, విపక్ష సీఎంలు, నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రులు అమరీందర్ సింగ్, అశోక్ గహ్లోత్, భూపేష్ బాగేల్, హేమంత్ సోరేన్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రేలు ఈ మేరకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంపై అవసరమైతే కోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ పాలిత సీఎంలు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించకపోవడంపై ఆందోళన వ్యక్తమైంది. రాష్ట్రాలకు సరైన సమయంలో జీఎస్టీ పరిహారం ఇవ్వడం లేదని, బకాయిలు పెరిగిపోయాయని సోనియా గాంధీ అన్నారు. రాష్ట్రాలకు జీఎస్టీ బకాయిలు చెల్లించే పరిస్థితుల్లో కేంద్రం లేదని ఆమె దుయ్యబట్టారు. రైల్వేల ప్రైవేటీకరణ, ఎయిర్‌పోర్టుల వేలం నిర్ణయాలను తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన జాతీయ విద్యా విధానం సరిగా లేదని విమర్శించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వీటిపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. మరోవైపు నీట్ పరీక్షపై విద్యార్ధులు, తల్లితండ్రుల్లో భయాందోళనలు ఉన్నాయని రాహుల్ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ భయపెడుతుంటే కొన్ని రాష్ట్రాల్లో వరదలు సంభవించాయని ఈ పరిస్థితుల్లో నీట్ పరీక్ష నిర్వహించడం సరికాదని రాహుల్ పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలూ కేంద్రం తెలుసుకున్న తర్వాతే ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు. చదవండి : అప్పుడే కాంగ్రెస్ కొత్త సారథి ఎన్నిక!? -
‘కరోనాపై విజయానికి ఆ రాష్ట్రాలే కీలకం’
న్యూఢిల్లీ: పది రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ను కట్టడి చేయగల్గితే.. భారత్ కోవిడ్‌ని జయించగలుగుతుంది అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కరోనా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రులతో మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో 80 శాతం కేసులు పది రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని తెలిపారు. అన్‌లాక్3 ఆంక్షల సడలింపు తర్వాత నేడు ఈ సమావేశం జరిగింది. (ఢిల్లీలో కరోనా కేసులు తగ్గాయి అయితే..) ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘మనం 10 రాష్ట్రాల్లో కరోనాను ఓడిస్తే.. దేశం కోవిడ్‌పై విజయం సాధించగలుగుతుంది. ఇందుకుగాను బిహార్, గుజరాత్, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, తెలంగాణలో పరీక్షల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు కరోనాపై పోరులో నియంత్రణ, కాంటాక్ట్ ట్రేసింగ్, నిఘా అనే ఆయుధాలు అత్యంత ప్రభావవంతంగా పని చేశాయి. 72 గంటల్లోపు కోవిడ్-19 కేసులను గుర్తిస్తే.. వైరస్ వ్యాప్తిని చాలా వరకు కంట్రోల్ చేయవచ్చని నిపుణులు అంచాన వేస్తున్నారు’ అని మోదీ ఈ సమావేశంలో తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశానికి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బిహార్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, పంజాబ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కర్ణాటక తరఫున ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించారు.(స్కూల్స్ ఓపెన్ చేస్తారా ఇప్పుడేలా?!) మహారాష్ట్రలో అత్యధికంగా కోవిడ్-19 కేసులు ఉండగా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వరుసగా రెండు, మూడవ స్థానాల్లో ఉన్నాయి. భారతదేశంలో ఇప్పటివరకు 22.68 లక్షల కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 53,601 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ ఉదయం వరకూ రికవరీ రేటు 69.79 శాతంగా ఉంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ ఐదు రాష్ట్రాలు గత 24 గంటల్లో అత్యధిక కరోనా వైరస్ కేసులు, మరణాలను నమోదు చేశాయి. (100కు ఫోన్ చేసి ప్రధానికి బెదిరింపు) వరద ప్రభావిత రాష్ట్రాలైన అస్సాం, బిహార్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ముఖ్యమంత్రులతో సోమవారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో సహాయక చర్యలపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఫేస్ మాస్క్ ధరించడం, శానిటైజేషన్ వాడకం, సామాజిక దూరాన్ని పాటించడం వంటి అన్ని ఆరోగ్య జాగ్రత్తలను ప్రజలు పాటించేలా చూడాలని రాష్ట్రాలను కోరారు. -
మోదీ ఆలోచనకు కేసీఆర్ మద్దతు
న్యూఢిల్లీ: ప్రణాళిక సంఘంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు పలికారు. ప్రణాళిక సంఘం స్థానే ఏర్పాటు చేయాలని భావిస్తున్న ముఖ్యమంత్రుల మండలి సమర్థవంతంగా పనిచేసేందుకు ప్రత్యేక సెక్రటేరియట్ ఏర్పాటు చేయాలని సూచించారు. సారుప్యత ఉన్న సమస్యలపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉప సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. పంచవర్ష ప్రణాళికల స్థానంలో పది పదిహేనేళ్ల ప్రణాళికలు రూపొందించాలన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న మనఊరు మనప్రణాళికను ప్రధాని మోదీకి వివరించినట్టు కేసీఆర్ తెలిపారు. -
పక్కపక్కనే కూర్చున్న కేసీఆర్, చంద్రబాబు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు కేసీఆర్, చంద్రబాబు పక్కపక్కనే కూర్చుకున్నారు. మధ్యాహ్న భోజన సమయంలోనూ ఇరువురు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునే కేసీఆర్, చంద్రబాబు పక్కనే కూర్చోవడం.. మాట్లాడుకోవడం రాజకీయ వర్గాలకు ఆసక్తి కలిగించింది. కాగా కేంద్ర పథకాలను నిధులను నేరుగా రాష్ట్రాలకు ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరినట్టు చంద్రబాబు తెలిపారు. పెన్షన్లకు ఆధార్ కార్డు అనుసంధానం, ఇసుక రీచ్ లను డ్వాక్రా మహిళలకు అప్పగించిన విషయాన్ని ప్రధానికి చెప్పానని వెల్లడించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై చర్చించలేదని, రాజధాని అంశంపై మాట్లాడానని చెప్పారు.