ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ చైర్‌పర్సన్ కిశోర్ మక్వానాకు ఫిర్యాదు చేస్తున్న ‘లగచర్ల’ బాధితులు
ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్ల ముందు లగచర్ల బాధిత మహిళల కన్నీరు
కలెక్టర్‌పై దాడి సాకుతో అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు
మాతో అనుచితంగా ప్రవర్తించారు.. మా భర్తల్ని కొడుతూ తీసుకెళ్లి జైళ్లలో వేశారు... ఫార్మా కంపెనీలకు భూములివ్వట్లేదని దౌర్జన్యం చేస్తున్నారు
మా జీవనాధారమైన భూములివ్వలేమంటే జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారు
అక్రమ కేసులు బనాయిస్తున్నారు
సీఎం బంధువులకు కంపెనీలు కట్టబెట్టేందుకే కుట్రలు
ఊళ్లో ఉండాలంటేనే భయమేస్తోంది.. మాకు న్యాయం చేయాలంటూ వేడుకోలు
చావనైనా చస్తాం కానీ భూములివ్వబోమని స్పష్టీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఫార్మా కంపెనీలకు భూములివ్వకుంటే కేసులు పెడతామంటున్నారు. జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారు. మా జీవనాధారమైన భూముల్ని ఇవ్వలేమని తెగేసి చెబుతున్నవారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు. బలవంతంగా భూములు లాక్కునేందుకు కుట్ర చేస్తున్నారు. కలెక్టర్‌పై దాడి జరిగిందనే సాకుతో పోలీసులు అర్ధరాత్రి మా ఇళ్లపై దాడులు చేశారు. మహిళలు, పిల్లలు, వృద్ధుల్ని భయభ్రాంతులకు గురిచేశారు. మా గొంతులు పిసికి, కళ్లకు బట్టలు కట్టి కొట్టారు. మాతో అనుచితంగా ప్రవర్తించారు.
పిల్లలు ఏడుస్తున్నా విన్పించుకోకుండా మా భర్తల్ని కొడుతూ తీసుకెళ్లారు. కొందర్ని జైళ్లలో వేశారు. మరికొందరు ఎక్కడ ఉన్నారో కూడా చెప్పట్లేదు. గత మూడ్రోజులుగా అన్నం తినలేదు. నిద్ర కూడా పోవడం లేదు. ఊళ్లో ఉండాలంటేనే భయమేస్తోంది. ఢిల్లీలో న్యాయం జరుగుతుందని వచ్చాం..’ అంటూ లగచర్ల బాధిత మహిళలు జాతీయ ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్ల ముందు కన్నీళ్లతో మొరపెట్టుకున్నారు. బీఆర్‌ఎస్ నేతలు సత్యవతి రాథోడ్, మాలోత్ కవిత, కోవా లక్ష్మిలతో కలిసి ఆదివారం ఢిల్లీకి వచ్చిన మహిళలు.. సోమవారం ఆయా కమిషన్లను కలిశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్‌ల ఏర్పాటు పేరుతో కేవలం గిరిజనుల భూముల లాక్కుంటున్నారని వారు ఫిర్యాదు చేశారు. మూడు పంటలు పండే భూములివ్వలేమని తొమ్మిది నెలలుగా అనేక అర్జీలు ఇస్తున్నా ఎవరూ పట్టించుకోలేదని తెలిపారు. సీఎం బంధువులకు కంపెనీలు కట్టబెట్టేందుకే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు.
మంచి చేస్తడని రేవంత్‌కు ఓటేసినం: కిష్టిబాయి
‘మాకు మంచి చేస్తడని రేవంత్‌రెడ్డికి ఓటేసినం. కానీ మమ్మల్ని రోడ్డుమీద కూర్చునేలా చేసిండు. మేము చావనికైనా సిద్ధం కానీ గుంటెడు భూమి కూడా ఇవ్వం. మా దగ్గరికొస్తే బాగుండదు. తొమ్మిది నెలల నుంచి దీనిపై కొట్లాడుతున్నాం. ఎన్నోమార్లు కలెక్టర్‌కు లేఖలిచ్చి కాళ్ల మీద పడ్డాం. ఎంతోమందిని వేడుకున్నాం. అప్పుడు ముఖ్యమంత్రైనా, ఆయన అన్న తిరుపతిరెడ్డి అయినా రాలేదు.
కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి 500 మంది పోలీసోళ్లను పంపి మా గొంతుక పిసుకుతాడా?, మా ఆడోళ్ల దాడిమీద చేపిస్తవా? ఇదేనా మీ తీరు? మా కొడంగల్ ముఖ్యమంత్రివి అనుకుంటే పూర్తిగా కొడంగల్ పేరునే కరాబ్ చేశావ్. అరెస్టు అయిన మా పిల్లలను బయటకు తేవాలే. మా భూముల జోలికి రావొద్దు..’ అని గిరిజన మహిళ కిష్టిబాయి డిమాండ్ చేసింది.
గిరిజనుల భూములే ఎందుకు ఇవ్వమంటున్నారు?: జ్యోతి
‘ఆ భూములు మా ముత్తాతల నుంచి మాకు వచ్చాయి. అవన్నీ పట్టా భూములే. వాటిని గుంజుకుందామని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మంచిగా పండే పంట పొలాలను లాక్కోవాలని ప్రభుత్వం చూస్తోంది. అక్కడ ఫార్మా కంపెనీ వద్దని చెబుతున్నా వినడం లేదు. చావనైనా చస్తాం కానీ భూములివ్వం. తనపై దాడి జరగలేదని స్వయంగా కలెక్టర్ చెబుతున్నా రైతులపై ఎందుకు కేసులు పెడుతున్నారు? గిరిజనుల భూములే ఎందుకు ఇవ్వమని అంటున్నారు.
బెదిరించి సంతకాలు తీసుకుంటున్నారు. కలెక్టర్ ఊళ్లోకి వస్తే ఇద్దరు పోలీసులు కూడా రాలేదు కానీ ముఖ్యమంత్రి అన్న తిరుపతిరెడ్డి వస్తే రెండు బస్సుల పోలీసులు ఎందుకు వచ్చారు? తిరుపతిరెడ్డి వచ్చి భూములివ్వకుంటే బాగుండదని ఆడవాళ్లని బెదిరిస్తున్నాడు.
కలెక్టర్‌పై దాడి జరిగిందని చెబుతూ తాగొచ్చి ఆడపిల్లలు అని కూడా చూడకుండా తప్పుగా ప్రవర్తించారు. మహిళలను కొట్టిన, తప్పుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. జైల్లో ఉన్న నా భర్తను విపరీతంగా కొట్టారు. ఆయన్ను కొట్టిన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి..’ అని తొమ్మిది నెలల గర్భిణి జ్యోతి విజ్ఞప్తి చేసింది.
మూడ్రోజుల నుంచీ ఏడుస్తూనే ఉన్నాం: దేవీబాయి
‘తొమ్మిది నెలల నుంచి మమ్మల్ని సతాయిస్తున్నారు. అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. భూములు పోతున్నాయని మేము బాధపడుతుంటే రాత్రిళ్లు వచ్చి మా ఇంటోళ్లని, పిల్లలను పట్టుకెళ్లారు. వారెక్కడున్నారో కూడా తెలియదు. మూడ్రోజుల నుంచి తిండీతిప్పలు లేకుండా ఏడుస్తూనే ఉన్నాం. ఢిల్లీలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం..’ అని దేవీబాయి ఆశాభావం వ్యక్తం చేసింది.
దాడి జరగలేదని కలెక్టర్ చెప్పినా అరెస్టులు చేశారు: సుశీల
‘భూములు పోతున్నాయని తిండికూడా పోతలేదు. నిద్రపోవడం లేదు. చిన్నచిన్న భూములున్న మమ్మల్ని అనేక ఇబ్బందులు పెడుతున్నారు. కలెక్టర్ స్వయంగా దాడి జరగలేదని చెప్పినా రాత్రి 12 గంటలప్పుడు కరెంట్ ఆపేసి ఇళ్లల్లోకి చొరబడి దౌర్జన్యం చేశారు. జైల్లో ఉన్న మా వాళ్లను కలవకుండా చేస్తున్నారు. మా ప్రాణాలు పోయినా సరే భూములు మాత్రం ఇవ్వం..’ అని సుశీల తెగేసి చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment