‘దక్షిణాసియాలో మానవ హక్కులు’ అనే అంశం మీద మంగళవారం యు.ఎస్.లో సదస్సు జరుగుతోంది. ఆ సదస్సును ఏర్పాటు చేసింది యు.ఎస్. హౌస్ కమిటీ. హౌస్ అంటే ‘హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్’. ప్రతినిధుల సభ. ఆ సభ నేతృత్వంలో విదేశీ వ్యవహారాల మీద చర్చలకు, తీర్మానాలకు ‘హౌస్ కమిటీ ఆన్ ఫారిన్ అఫైర్స్’ పని చేస్తుంటుంది. ఆ కమిటీ ఆధ్వర్యంలోనే మంగళవారం నాటి సదస్సు జరిగింది. అందులో మాట్లాడ్డం కోసం ఆసియా దేశాల్లోని జర్నలిస్టులు కొందరికి ప్రత్యేక ఆహ్వానాలు వెళ్లాయి.
ఇండియా నుంచి ప్రముఖ పాత్రికేయురాలు ఆర్తిసింగ్‌కు ఆహ్వానం అందింది. ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. వారిలో ఎక్కుమంది కశ్మీర్ గురించి మాట్లాడుతున్నారు. వారి మాటల్ని బట్టి.. ఆర్టికల్ 370 తర్వాత కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని బయటిదేశాల్లో ఇప్పటికే బాగా ప్రచారం అయిందని ఆర్తికి అర్థమైంది. ఏ ప్రచారంలోనైనా ప్రపంచ మీడియా పాత్ర బలంగా ఉంటుంది. అందుకని ఆర్తి తన ప్రసంగంలో.. ప్రచారం జరుపుతున్న వారి బాధ్యతారాహిత్యం మీద ప్రశ్నలు గుప్పించారు.
‘‘ముప్పై ఏళ్లుగా కశ్మీర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న విషయంపై ప్రపంచ మీడియా ఒక్కసారైనా నోరు మెదిపిందా? కశ్మీర్‌లో పాక్ ఉగ్రవాద బాధితుల గురించి గళమెత్తడం తమ కనీస ధర్మం అని ప్రపంచ మీడియాతో పాటు, ప్రపంచ మానవ హక్కుల కార్యకర్తలు ఏనాడైనా అనుకున్నారా?’’ అని ఆర్తి విమర్శించారు.
ఈ వ్యాఖ్యలపై పాక్ స్పందన, పాక్‌ను సమర్థించే దేశాల ప్రతిస్పందన ఎలా ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల నుండి ఆర్తిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆర్తి ప్రస్తుతం ఒక జాతీయ దినపత్రికలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్‌గా ఉన్నారు. న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీ నుంచి అంతర్జాతీయ వ్యవహారాలలో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆర్తి, గతంలో జమ్మూకశ్మీర్‌లో ఏడేళ్లపాటు న్యూస్ కరస్పాండెంట్‌గా పని చేశారు.
Comments
Please login to add a commentAdd a comment