అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ స్టార్టప్‌ల విస్తరణకు ప్రయత్నాలు
ఇప్పటికే 42 దేశాలకు చెందిన సంస్థలతో భాగస్వామ్యం
ఫాల్కన్ ఎక్స్, కొస్మె తదితర సంస్థలతో ఒప్పందాలు
తాజాగా నేపాల్ పరిశ్రమల శాఖ, డొల్మెతోనూ ఒప్పందం
అంతర్జాతీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన మన స్టార్టప్‌లు 300కుపైనే..
‘టీ–బ్రిడ్జ్’తో దేశ విదేశీ సంస్థలతో అనుసంధానానికి మార్గం సుగమం
సాక్షి, హైదరాబాద్: భారత స్టార్టప్ రంగంలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేస్తున్న ‘టీ–హబ్’... విదేశాల్లోనూ తనదైన ముద్ర వేసే దిశగా దూసుకువెళుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ స్టార్టప్‌ల కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. విదేశీ మార్కెట్లలోకి భారతీయ స్టార్టప్‌ల ప్రవేశం, కార్యకలాపాలకు ఊతమివ్వడం, అక్కడి నిపుణుల మార్గదర్శనం, నిధుల సేకరణ లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపడుతోంది.
ఇదే సమయంలో విదేశీ స్టార్టప్‌లు భారత్‌తోపాటు దక్షిణాసియా దేశాల్లో కార్యకలాపాలు విస్తరించుకునేందుకు సాయం అందిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ‘టీ–బ్రిడ్జ్’అనే అనుబంధ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. భారతీయ స్టార్టప్‌ల ఆవిష్కరణలను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం చేసి వ్యాపారపరంగా విజయవంతం అయ్యేలా తీర్చిదిద్దడంలో ‘టీ–బ్రిడ్జి’క్రియాశీలకంగా పనిచేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్పోరేట్ సంస్థలు, స్టార్టప్‌లు, ఇంక్యుబేటర్లు, యాక్సిలేటర్లు (ప్రోత్సాహక సంస్థలు), విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థలను ‘టీ–బ్రిడ్జి’అనుసంధానం చేసి... భారతీయ స్టార్టప్‌లు అంతర్జాతీయ మార్కెట్‌లో కార్యకలాపాలు విస్తరించేందుకు అనువైన వాతావరణాన్ని సిద్ధం చేసింది.
42 దేశాల్లో మార్కెట్‌తో అనుసంధానం..
భారతీయ, అంతర్జాతీయ స్టార్టప్‌ల ఆవిష్కరణలు, మార్కెటింగ్, నిధుల సేకరణకు వీలుగా టీ–హబ్ 42 దేశాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇప్పటివరకు 300కు పైగా భారతీయ స్టార్టప్‌లు, మరో 200కుపైగా అంతర్జాతీయ స్టార్టప్‌లు తమ ఆవిష్కరణలను మార్కెటింగ్ చేసుకునేందుకు టీ–హబ్ అంతర్జాతీయ ఒప్పందాలు దోహదం చేసినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
అంతర్జాతీయంగా భారతీయ స్టార్టప్‌లను విస్తరించేందుకు ‘ఇండియా మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్ (ఐమ్యాప్), గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్ (జీమ్యాప్)’వంటి కార్యకలాపాలను చేపట్టింది. అమెరికా మార్కెట్లోకి భారతీయ స్టార్టప్‌ల ప్రవేశం, అక్కడి నిపుణుల మార్గనిర్దేశనం కోసం సిలికాన్ వ్యాలీలోని ‘ఫాల్కన్ ఎక్స్’సంస్థతో టీ–హబ్ ఒప్పందం కుదుర్చుకుంది.
‘కొరియాకు చెందిన చిన్న, మధ్యతరహా సంస్థల స్టార్టప్ ఏజెన్సీ (కొస్మె)’తోనూ టీ–హబ్‌కు భాగస్వామ్య ఒప్పందం ఉంది. అంతర్జాతీయ సంస్థ రెడ్‌బెర్రీతో కుదిరిన భాగస్వామ్య ఒప్పందం ద్వారా ఉత్తర అమెరికాలో ఆవిష్కరణల ఔట్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసింది. గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్ ద్వారా పేమాట్రిక్స్, ఆన్‌కానీ విజన్, డేటావెర్స్ వంటి భారతీయ స్టార్టప్‌లు అంతర్జాతీయంగా మార్కెట్‌ను విస్తరించుకోవడంతోపాటు అనేక భాగస్వామ్యాలు, పెట్టుబడులను సాధించగలిగాయి.
టీ–హబ్‌ప్రయాణంలో మైలు రాళ్లు ఇవీ..
» వివిధ రంగాలకు చెందిన 2వేలకుపైగా స్టార్టప్‌లకు మార్గదర్శనం, నిధుల సేకరణ, నెట్‌వర్కింగ్‌లో ఊతం అందించింది.
» పెట్టుబడి సంస్థలు, కార్పోరేట్ సంస్థలు తదితరాల నుంచి స్టార్టప్‌లకు రూ.1,300 కోట్లకు పైగా నిధుల సేకరణలో సాయం చేసింది.
» ఆవిష్కరణలు, భాగస్వామ్యాలు, పైలట్ ప్రాజెక్టులు తదితర అంశాల్లో 200కుపైగా కార్పోరేట్ సంస్థలతో స్టార్టప్‌లు భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంలో కీలకంగా వ్యవహరించింది.
» ఎంట్రప్రెన్యూర్‌షిప్, ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం పరస్పర బదిలీ తదితరాల కోసం 100కు పైగా కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లను నిర్వహించింది.
» అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ స్టార్టప్‌లకు అవకాశాల కోసం విదేశీ సంస్థలు, ఇంక్యుబేటర్లు తదితరాలతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది.
నేపాల్‌సంస్థలతోనూ ఒప్పందాలు
నేపాల్, భారత్ నడుమ ఆవిష్కరణలు, వాణిజ్యాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా టీ–హబ్ ఇటీవల నేపాల్ పరిశ్రమలు, వాణిజ్య శాఖతోపాటు అక్కడి మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ సంస్థ ‘డోల్మె’తోనూ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఎంఎస్‌ఎంఈలకు సంబంధించిన స్టార్టప్‌లను ప్రోత్సహించడంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక బదిలీ, రెండు దేశాల నడుమ దృఢమైన ఆర్థిక బంధం ఏర్పడేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని పేర్కొంటోంది.
Comments
Please login to add a commentAdd a comment