కశ్మీర్‌లో హక్కుల హననం | Shekhar Gupta Article On Kashmir Encounter | Sakshi
Sakshi News home page

Published Sat, Jun 16 2018 1:22 AM | Last Updated on Sat, Jun 16 2018 1:22 AM

Shekhar Gupta Article On Kashmir Encounter - Sakshi

కశ్మీర్‌లో రాజకీయాలకు విశ్వసనీయత లేకుండా పోయింది. ప్రజలు ప్రభుత్వానికి దూరమయ్యారు. మానవ హక్కుల పరిస్థితిపై అంతర్జాతీయ ఒత్తిడులు పెరుగు తున్నాయి. పాక్‌ తెగింపు ఎక్కువైంది. జాతీయ రాజకీయాల్లో ఏకాభిప్రాయం లేదు. గతంలో పాశ్చాత్య మానవ హక్కుల సంఘాల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు ఇండియాలో అందరూ కశ్మీర్‌పై ఏకమయ్యారు. కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందానికి ఉన్న విలువపై అప్పటి అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాబిన్‌ రాఫేల్‌ చేసిన ప్రకటన కూడా ఇందుకు దోహదం చేసింది. మళ్లీ ఇప్పుడు బాధ్యతారహితమైన ఐరాస నివేదిక అలాంటి పని చేసింది.

కశ్మీర్‌పై ఐక్యరాజ్యస మితి మానవ హక్కుల మండలి నివేదిక అంతా తప్పుల తడకే. దీనిలో వాస్తవాలు, రూపకల్పనలో పద్ధతులు, లక్ష్యాలపై చర్చించడం శుద్ధ దండగ. కశ్మీర్‌ రాజకీయ పరిస్థితిపై రాసిన విషయాలు పూర్తిగా లోపభూయిష్టమైనవి. ఈ నివేదిక పాకి స్తాన్‌ను గాని, ఇండియాను గాని తప్పుబడుతోందా? అంటే ఏ మాత్రం లేదని చెప్పవచ్చు. రెండు దేశాలూ కశ్మీర్‌ను తోబుట్టువుల ఆస్తి తగాదాలా చూస్తు న్నాయి. ఇక్కడ సీమాంతర ఉగ్రవాదంపై పోరాడు తున్నానని ఇండియా భావిస్తూ మానవహక్కులకు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదు. 

కశ్మీర్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలకు తాను నిధులు, ఆయుధాలు సరఫరాచేస్తున్నట్టు తెలిపే మరో ఐరాస నివేదిక వచ్చినా పాక్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. న్యాయం కోసం నైతిక పోరాటం చేస్తున్నానని పాక్‌ భావిస్తోంది. కశ్మీర్‌లో చిచ్చుకు ఆజ్యం పోస్తున్న కారణంగా  ‘జిహాద్‌ యూనివర్సిటీ’ వంటి ముద్రలను తనకు గౌరవసూచకమైన బిరు దులుగా ఈ దేశం పరిగణిస్తోంది. ఏదేమైనా రెండు దేశాలూ కశ్మీర్‌ కోసం చివరిదాకా పోరాడతాయి. అర్ధంపర్ధం లేని ఈ ఐరాస నివేదిక నివేదికలోని విషయాల గురించి మాత్రం ఇవి పట్టించుకోవు. 

ఈ నివేదిక కశ్మీర్‌ ప్రజలకు మేలు చేస్తుందనే అంచనాల కారణంగా దీన్ని నేను బుర్ర తక్కువ మనుషులు రూపొందించిందని అంటున్నాను. ఈ నివేదిక వల్ల ఇండియా దూకుడు మరింత పెరుగు తుంది. అలాగే, పాకిస్థాన్‌ కూడా ఎక్కువ సంఖ్యలో కశ్మీరీలను, తాను పంపించే యువకులను జిహాదీ లుగా మార్చి కశ్మీర్‌ చిచ్చు పెరిగేలా చేస్తుంది. ఎప్ప టికైనా భారత్‌ను ఈ పద్ధతుల ద్వారానే కశ్మీర్‌ నుంచి వైదొలగేలా చేయగలనని పాక్‌ నమ్ముతోంది. 

1990ల నాటి ప్రమాదకర పరిస్థితుల్లో కశ్మీర్‌
అనేక దురదృష్టకర పరిణామాల ఫలితంగా కశ్మీర్‌ 1990ల నాటి ప్రమాదకర పరిస్థితులకు చేరుకుంది. ఈ కల్లోల రాష్ట్రంలో మానవ హక్కుల పరిస్థితి నానా టికి దిగజారుతుందంటూ ఐరాస, పాశ్చాత్య దేశాల మానవ హక్కుల పరిరక్షణ సంస్థలు ఇండియాపై విపరీతంగా ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ విష యంలో భారత్‌ మరింత బలహీనంగా కనిపిస్తోంది. మరి ఈ సంస్థల నివేదికలపై ఇండియా ఎలా స్పంది స్తోంది? పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రాంతాల న్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెబుతూ భారత పార్లమెంటు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదిం చింది. గతంలో ప్రతిపక్ష నేత అటల్‌ బిహారీ వాజ్‌ పేయి, అప్పటి కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌తో కలిసి వెళ్లిన ద్వైపాక్షిక భారత ప్రతినిధి బృందం జెనీవా సమావేశంలో చారి త్రక విజయం సాధించింది. భారత తీర్మానం ఆమో దానికి మానవ హక్కులకు పెద్దగా విలువ ఇవ్వని చైనా, ఇరాన్‌తో ఇండియా చేతులు కలపాల్సి వచ్చింది. 

ఈ ఐరాస నివేదిక వల్ల కూడా ఇలాంటి అనేక దేశాలు ఏకమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఐరాస మానవహక్కుల మండలి నివేదికను భారత భారత విదేశాంగశాఖ అధికారికంగా ఖండిస్తూ ప్రకటన చేసే లోపే ఈ విషయంలో ప్రభుత్వానికి మద్దతు పలు కుతూ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి టీవీ చానళ్లలో మాట్లాడారు. రైజింగ్‌ కశ్మీర్‌ పత్రిక ఎడిటర్‌ షుజాత్‌ బుఖారీ హత్యతో ఈ నివేదికలోని దుర్మార్గమైన అంశాలను పరిశీలించే అవకాశం లేకుండాపోయింది. దృష్టి అంతా బుఖారీ హత్యపైకి మళ్లింది. రెండు దేశాలూ ఉద్దేశపూర్వకంగానే ఒకేలా వ్యవహరిస్తు న్నాయి. కశ్మీర్‌పై యుద్ధం ప్రకటించడానికి బదులు కశ్మీరీల స్వయం నిర్ణయాధికారాన్ని పరిశీలించాలన్న ఐరాస చేసిన సూచనను భారత్‌ గట్టిగా పట్టించు కోలేదు. అలాగే, స్వయం నిర్ణయాధికారం ప్రజలకు ఇస్తే ఇది చివరికి కశ్మీర్‌ స్వాతంత్య్రానికి దారి తీస్తుందనే భయం పాకిస్థాన్‌కు ఉంది. అందుకు పాక్‌ ఎన్నటికీ అంగీకరించదు. 

1972లో కుదిరిన సిమ్లా ఒప్పందం కశ్మీర్‌ను పూర్తిగా ద్వైపాక్షి సమస్యగా ప్రకటించినప్పటి నుంచి ఐరాస కశ్మీరీల స్వయం నిర్ణయాధికారం లేదా ప్లెబి సైట్‌(జనాభిప్రాయ సేకరణ) గురించి మాట్లాడ లేదు. పాకిస్థాన్‌ అప్పుడప్పుడూ ఈ విషయాలను లేవనెత్తినాగాని లాహోర్, ఇస్లామాబాద్‌ లేదా షర్మెల్‌ షేక్‌లో ఇండియాతో కలిసి చేసిన సంయుక్త ప్రకట నల్లోగాని, ద్వైపాక్షిక ఒప్పందాల్లోగాని ఈ అంశీలపై పట్టుబట్టలేదు. కశ్మీర్‌ వివాదాన్ని రెండు దేశాలే పరిష్కరించుకోవాలని మాత్రమే ప్రకటించాయి. 1989–94 మధ్య ఐదేళ్ల కాలంలో కశ్మీర్‌ తీవ్రవాదం అధ్వాన్న స్థితికి చేరుకుంది. 

ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి కశ్మీర్‌లో కనిపి స్తోందా? అనే విషయం మనం చర్చించాల్సి ఉంది. కశ్మీర్‌లో రాజకీయాలకు విశ్వసనీయత లేకుండా పోయింది. ప్రజలు ప్రభుత్వానికి దూరమయ్యారు. మానవ హక్కుల పరిస్థితిపై అంతర్జాతీయ ఒత్తిడులు పెరుగుతున్నాయి. పాక్‌ తెగింపు ఎక్కువైంది. జాతీయ రాజకీయాల్లో ఏకాభిప్రాయం లేదు. గతంలో పాశ్చాత్య మానవ హక్కుల సంఘాల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు ఇండియాలో అందరూ కశ్మీర్‌పై ఏకమయ్యారు. కశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయడానికి కుదుర్చుకున్న ఒప్పందానికి ఉన్న విలు వపై అప్పటి అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాబిన్‌ రాఫేల్‌ చేసిన ప్రకటన కూడా ఇందుకు దోహదం చేసింది. మళ్లీ ఇప్పుడు బాధ్యతా రహితమైన ఐరాస నివేదిక అలాంటి పని చేసింది.

ఎందుకు ఈ స్థితికి చేరుకున్నాం?
గతంలో ఐరాస, పాశ్చాత్య దేశాలు పదేపదే పనికి మాలిన, రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా ఇండియా తట్టుకుంది. మళ్లీ అదే స్థితికి ఎందుకు చేరుకున్నామో మనం ఆలోచించుకోవాలి. మనం కూడా అలాంటి తప్పులే చేయడం దీనికి కారణం. ఇండియాలో రాజకీయ, సైద్ధాంతిక వాతావరణం మారుతున్న క్రమంలో 1989లో విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక కశ్మీర్‌లో కల్లోలం మొదలైంది. ఈ మైనారిటీ సర్కారుకు బయటి నుంచి వామపక్షాలు, బీజేపీ మద్దతు ఇచ్చిన విష యం తెలిసిందే. కశ్మీర్‌లో బలప్రయోగంతో ‘గట్టి’ వైఖరి అవలంబించాలని బీజేపీ కోరింది. ఫలితంగా, బీజేపీ చెప్పినట్టే కశ్మీరీ తీవ్రవాదులను అణచివేయ డానికి జగ్‌మోహన్‌ను గవర్నర్‌గా పంపించారు. అయితే, వామపక్షాల మద్దతుపై ఆధారపడిన కార ణంగా కేంద్రం ముస్లింలకు అనుకూల ధోరణిని కూడా అనుసరించింది. అదీగాక కశ్మీర్‌కే చెందిన ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ కేంద్ర హోం మంత్రిగా ఉన్నారు. దీనికితోడు కశ్మీరీలంటే ప్రేమ ప్రదర్శించే జార్జి ఫెర్నాండెజ్‌కు కశ్మీరీ వ్యవహరాల శాఖను కూడా అప్పగించారు. 

ఈ పరిస్థితుల్లో కశ్మీర్‌లో ఓ అధికార కేంద్రం దూకుడుగా ప్రవర్తిస్తే, రెండోది ప్రజలకు ఊరట కలి గించే రీతిలో వ్యవహరించేది. హోంమంత్రి సయీద్‌ ఎటు ఉంటారో ఊహకుందని విషయం కాదు. తీవ్ర వాదులు కశ్మీర్‌ లోయ నుంచి దుర్మార్గమైన రీతిలో కశ్మీరీ పండితులను ఊచకోతకోశారు. తీవ్రవాదం పాక్‌ భూభాగం నుంచి విస్తరించింది. తర్వాత కశ్మీర్‌ సమస్యపై పూర్తి అవగాహన ఉన్న పీవీ నరసింహా రావు అధికారంలోకి వచ్చాక సాయుధ దళాలకు అపరిమిత వనరులు, స్వేచ్ఛ కల్పించి, తీవ్రవాదాన్ని అణచివేయడానికి పూర్తి అధికారం ఇచ్చారు. 

రాష్ట్ర మానవ హక్కుల చరిత్రలో ఇది అత్యంత భయనక దశగా చెప్పవచ్చు. ఇంటరాగేషన్‌ పేరుతో దారుణాలకు పాల్పడ్డారు. సాధారణ ప్రజలపై జరి పిన కాల్పుల్లో పెద్ద సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. బిజ్‌బెహరాలో కాల్పుల ఘటన, కునాన్‌ పోష్‌పోరాలో సామూహిక బలాత్కారాల ఆరోపణలు– ఇవన్నీ ఈ కాలంలోనే కశ్మీర్‌ను అత లాకుతలం చేశాయి. అప్పుడే చరారే షరీఫ్‌ సంక్షోభం తలెత్తింది.

కశ్మీర్‌ చరిత్రలో ‘హైదర్‌’ దశ!
కశ్మీర్‌ చరిత్రలో ఈ కాలాన్నే నేటి తరం ప్రజలు హైదర్‌ దశగా గుర్తుంచుకుంటారు. కశ్మీర్‌ సమస్యపై ప్రఖ్యాత బాలీవుడ్‌ దర్శకుడు విశాల్‌ భరద్వాజ్‌ నిర్మించిన చిత్రమే హైదర్‌. 1996లో పీవీ సర్కారు పాలన ముగిసే నాటికి తీవ్రవాదాన్ని చాలా వరకు అణచివేశారు. అయితే, కశ్మీరీల మనోభావాలు బాగా దెబ్బదిన్నాయి. వీపీ సింగ్‌ ప్రభుత్వం మతిమాలిన పోకడలకు ఇండియా ఇంత భారీ మూల్యం చెల్లిం చాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అదే గందరగోళ పరిస్థితి మనకు కనిపిస్తోంది. తేడా ఏమంటే– అప్పట్లో వీపీ సింగ్‌ మైనారిటీ సంకీర్ణ ప్రభుత్వం ఏ రోజుకారోజు నెట్టుకుంటూ నడిచింది. నేటి బలమైన జాతీయవాద ప్రభుత్వానికి పార్లమెంటులో మంచి మెజారిటీ ఉంది. 

ఇంత తేడా ఉన్నా ప్రస్తుత బీజేపీ సర్కారు ఏం చేసింది? పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలను, కశ్మీర్‌ లోయను జమ్మూ ప్రాంతాన్ని కలపడానికి పీడీపీతో బీజేపీ చేతులు కలిపింది. కాని, ఆచరణలో తన ఉద్దేశాలు, లక్ష్యాలకు అనుగుణంగా వ్యవహరించలేక పోయింది. ఏక కాలంలో బలప్రయోగం, ప్రజలను ఊరడించే పద్ధతిని అమల్లోకి తెచ్చింది. ఒకే ప్రభు త్వంలో జగ్‌మోహన్, జార్జి ఫెర్నాండెజ్‌ పనిచేస్తున్న ట్టుగా వ్యవహారం కనిపిస్తోంది. అయితే, కశ్మీర్‌ వ్యవహారంలో లేనిదల్లా›మానవ హక్కుల సంఘాల ఒత్తిడి, కశ్మీర్‌ భారత్‌లో విలీనంపై రాబిన్‌ రాఫేల్‌ వంటి మంత్రులు పశ్నించడమే. ఇప్పుడు అనాలో చితమైన ఐరాస మానవ హక్కుల మండలి నివేదిక కారణంగా ఈ లోటు కూడా తీరిపోయింది. కశ్మీర్‌ కల్లోలం మళ్లీ 1993 నాటి పరిస్థితికి చేరుకుంది.

శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త దప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement