పోరాటమే లక్ఘ్యం | Today is the Day of Human Rights | Sakshi
Sakshi News home page

పోరాటమే లక్ఘ్యం

Published Sat, Dec 9 2017 11:59 PM | Last Updated on Tue, Aug 28 2018 7:24 PM

Today is the Day of Human Rights - Sakshi

ఒక లక్ష్యం కోసం పోరాడినా... ఆ లక్ష్యాన్ని సాధించలేనప్పుడు
పోరాటం ఆగాలా..! పోరాటం సాగాలా..!!
మహాత్మాగాంధీ అన్నట్టు
‘‘వాళ్లు నా శరీరాన్ని హింసించవచ్చు, నా ఎముకలు విరిచేయవచ్చు,
నన్ను చంపేయొచ్చు కూడా... అప్పుడైనా వాళ్లకు దొరికేది
నా దేహమే... నా విధేయత కాదు’’
నేడు మానవ హక్కుల దినోత్సవం

మానవ హక్కులు దేవతావస్త్రాల్లా తయారయ్యాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఘనత చాటుకునే మన భారత్‌లోను, అతిపాత ప్రజాస్వామ్య దేశంగా జబ్బలు చరుచుకునే అగ్రరాజ్యం అమెరికాలోనూ మానవ హక్కుల ఉల్లంఘనలు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. ఇక నియంతృత్వ పాలన సాగుతున్న దేశాల పరిస్థితి ఎలా ఉంటుందో తేలికగానే అర్థం చేసుకోవచ్చు. చాలాచోట్ల ప్రభుత్వాలే నిస్సిగ్గుగా మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి. ఇంకొన్ని చోట్ల ప్రభుత్వాలు మానవ హక్కుల పరిరక్షణకు కంటితుడుపుగా అధికారిక వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నా, అలాంటి చోట్ల ప్రభుత్వాల అధీనంలో పనిచేసే శాంతిభద్రతల బలగాలు, రక్షణ బలగాలు ప్రజల కనీస మానవ హక్కులను కాలరాస్తున్నాయి.

ప్రపంచంలోని మిగిలిన దేశాల సంగతి సరే, ముందు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఘనత పొందిన మన భారత దేశంలో మానవ హక్కుల పరిస్థితిని ఒకసారి చూద్దాం. మన రాజ్యాంగం జీవించే హక్కును, సమానత్వ హక్కును, దోపిడీకి గురికాకుండా ఉండే హక్కును, భావ ప్రకటనా స్వేచ్ఛను, విద్యాహక్కును, సాంస్కృతిక స్వేచ్ఛను, మత స్వేచ్ఛను, గోప్యత హక్కును ప్రాథమిక హక్కులుగా గుర్తించింది. ఈ హక్కులకు భంగం వాటిల్లితే రాజ్యాంగ పరిధిలో చట్టపరంగా రక్షణ పొందే హక్కును కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించింది. మన రాజ్యాంగంలో హక్కులు, మన చట్టాల్లో హక్కుల పరిరక్షణ మార్గాలు చాలా పకడ్బందీగానే ఉన్నా, మన దేశంలో యథేచ్ఛగా హక్కుల ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో మానవ హక్కులకు రక్షణ కల్పించడానికి 1993లో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఏర్పడింది. తర్వాతి కాలంలో వివిధ రాష్ట్రాల్లోనూ మానవ హక్కుల కమిషన్‌లు ఏర్పడ్డాయి. ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నా, మానవ హక్కులకు భరోసా కల్పించడంలో మన దేశంలో పెద్దగా సాధించినదేమీ లేకపోగా, ఎక్కడో ఒకచోట సామాన్యుల హక్కులకు తరచుగా విఘాతం కలుగుతూనే ఉంది.

హక్కుల ఉల్లంఘనలో మన రికార్డు
స్వాతంత్య్రం వచ్చి డెబ్భై ఏళ్లు నిండినా, ఆధునిక బానిసత్వంలో, వెట్టిచాకిరిలో మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. కట్టుబానిసలుగా వెట్టి చాకిరిలో మగ్గిపోతున్న అమాయకుల సంఖ్య మన దేశంలో 1.83 కోట్లు అని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వెట్టి చాకిరిలో మగ్గుతున్న వారి సంఖ్య 4.58 కోట్లు అయితే, వారిలో దాదాపు మూడోవంతుకు పైగా వెట్టి కార్మికులు మన దేశంలోనే ఉన్నారు. దోపిడీకి గురికాకుండా ఉండే హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించిన మన దేశమే శ్రమ దోపిడిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తుండటం విషాదకర వాస్తవం. దేశంలో విద్యా హక్కు అమలులో ఉన్నా, దాదాపు 1.26 కోట్ల మంది చిన్నారులు పొట్ట పోసుకోవడానికి ప్రమాదకరమైన పరిశ్రమల్లో పనులు చేస్తున్నారు. వీరిలో చాలామంది నామమాత్రపు ప్రతిఫలానికి వెట్టిచాకిరి చేస్తున్నవారే. పేదరికం వల్ల అప్పులపాలైన తల్లిదండ్రులు తమ పిల్లలను రుణదాతల వద్ద వెట్టిచాకిరికి పెడుతున్నారు. వెట్టిచాకిరి కోరల్లో చిక్కుకుంటున్న బాలికల్లో చాలామంది లైంగిక దోపిడీకి గురవుతున్నారు.

రక్షకులే భక్షకులు
మానవ హక్కుల పరిరక్షణలో, శాంతిభద్రతల అమలులో కీలక పాత్ర పోషించాల్సిన పోలీసు బలగాలు యథేచ్ఛగా హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయి. పోలీసుల కస్టడీలోను, జుడీషియల్‌ కస్టడీలోను చిత్రహింసలకు తాళలేక చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మన దేశంలోని పరిస్థితినే గమనిస్తే, 2001–13 మధ్య కాలంలో 1,275 మంది పోలీసు కస్టడీలో మరణించారు. అదే కాలంలో ఏకంగా 12,727 మంది జుడీషియల్‌ కస్టడీలో ప్రాణాలు వదిలారు. పోలీసు కస్టడీ మరణాలకు సంబంధించి మహారాష్ట్ర (306), ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ (210), గుజరాత్‌ (152) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. కస్టడీ మరణాలకు సంబంధించి 2013 సంవత్సరం తర్వాతి లెక్కలను అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఆ లెక్కలను కూడా కలుపుకుంటే, ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుంది. ఇక ఎన్‌కౌంటర్ల పేరిట భద్రతా బలగాలు పొట్టన పెట్టుకుంటున్న వారి సంఖ్య దీనికి అదనం. జమ్ము కశ్మీర్‌లోను, ఈశాన్య రాష్ట్రాల్లోను భద్రతా బలగాలు సామాన్యులపై సాగించే దమనకాండకు సంబంధించి నిత్యం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎవరిపై అయినా ఉగ్రవాదులు, తీవ్రవాదులు అనే అనుమానం వస్తే చాలు, కాల్చి పారేయడమే పనిగా పెట్టుకున్న పోలీసులు ఈశాన్య రాష్ట్రాల్లో చాలామందే ఉన్నారు. ఉగ్రవాదులుగా అనుమానించిన దాదాపు వందమందిని తాను స్వయంగా కాల్చి చంపానని మణిపూర్‌కు చెందిన హెరోజిత్‌ అనే మాజీ పోలీసు అధికారి పాత్రికేయుల వద్ద సగర్వంగా చెప్పుకున్నాడంటే ఆ ప్రాంతంలో మానవ హక్కుల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పోలీసు కస్టడీ, జుడీషియల్‌ కస్టడీల్లో సంభవిస్తున్న మరణాలకు సంబంధించి బాధ్యులకు శిక్షలు పడుతున్న సందర్భాలు దాదాపు రెండు శాతం మాత్రమే ఉంటున్నాయి. కస్టడీ మరణాలు, బూటకపు ఎన్‌కౌంటర్లు ఒక ఎత్తయితే, మరోవైపు... బెదిరింపులు, బలవంతపు వసూళ్లకు పాల్పడటం, కూంబింగ్‌ ఆపరేషన్ల పేరిట అత్యాచారాలకు తెగబడటం, చట్ట విరుద్ధంగా సెటిల్‌మెంట్లు చేయడం, పౌరుల పట్ల నిష్కారణంగా దురుసుగా ప్రవర్తించడం, భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించడం వంటి ‘ఘన’కార్యాలు కూడా మన పోలీసులకు చాలా మామూలు విషయాలు. కేవలం 2015 సంవత్సరంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో 46 మంది మహిళలు పోలీసుల చేతిలో అత్యాచారాలకు గురయ్యారని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ వెల్లడించింది. మన పోలీసుల మానవ హక్కుల ఉల్లం‘ఘన’ చరిత్ర విదేశాలకూ పాకింది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నందున సీఆర్పీఎఫ్‌ మాజీ ఐజీ తేజీందర్‌ సింగ్‌ ధిల్లాన్‌కు వీసా ఇచ్చేందుకు కెనడా నిరాకరించింది. మానవ హక్కుల ఉల్లంఘనలో మన పోలీసుల ‘ఘనత’కు ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి పోలీసులపై గత ఏడాది 36 వేలకు పైగా కేసులు నమోదైనట్లు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ప్రకటించింది.

భావప్రకటనకూ దిక్కులేదు
స్వతంత్ర భారత దేశంలో భావ ప్రకటనకూ దిక్కులేకుండా పోతోంది. ఎమర్జెన్సీకాలంలో భావప్రకటనకు పూర్తిగా సంకెళ్లు పడ్డాయి. ఆ తర్వాత ఇటీవలి కాలంలో భావప్రకటనా స్వేచ్ఛకు తరచుగా అవరోధాలు ఏర్పడుతున్నాయి. కార్టూన్లు వేసినందుకు, వ్యాసాలు, పుస్తకాలు రాసినందుకు, చివరకు సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేసినందుకు కటకటాల వెనక్కు వెళ్లే పరిస్థితులు, కేసుల్లో చిక్కుకునే పరిస్థితులు దాపురిస్తున్నాయి. ప్రభుత్వంపైన, ప్రభుత్వాధినేతలపైన విమర్శలు చేసే వారికి బెదిరింపులు, భౌతిక దాడులు ఎదురవుతున్నాయి. అవినీతి బాగోతాలను బట్టబయలు చేసేందుకు సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయిస్తున్న వారిలో కొందరికి ఏకంగా ప్రాణాలకే ముప్పు ఎదురవుతోంది. సమాజంలో భిన్నాభిప్రాయాలను గౌరవించే లక్షణం తగ్గిపోతోంది. ఒక వర్గం అభిప్రాయాలకు భిన్నంగా మరోవర్గానికి చెందిన వారెవరైనా అభిప్రాయాలను వ్యక్తం చేస్తే, వారిపై భౌతిక దాడులకు తెగబడే మూకలు పేట్రేగిపోతున్నాయి. ఒక్కోసారి ప్రాణాలను హరించడానికి కూడా అలాంటి మూకలు వెనుకాడటం లేదు. వీళ్ల తాకిడికి ఎక్కువగా రచయితలు, కళాకారులు, అవినీతి పాలనపై విమర్శలు సంధించే వాళ్లు, నిబంధనలకు కట్టుబడి నిజాయతీగా విధులు నిర్వర్తించే ప్రభుత్వాధికారులు బాధితులవుతున్నారు. కర్ణాటకలో పత్రికా సంపాదకురాలు గౌరీ లంకేష్‌ హత్య, ‘పద్మావతి’ సినిమా దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, ఆ సినిమా కథానాయకురాలు దీపికా పదుకొనెలపై బెదిరింపులు, ఫత్వాలు ఇలాంటి పోకడలకు తాజా ఉదాహరణలు. ఇలాంటి బెదిరింపులకు పాల్పడే వారిలో మత ఛాందసులతో పాటు రాజకీయ పదవుల్లో కొనసాగుతున్న నాయకులు కూడా ఉంటున్నారు. దేశ రాజ్యాంగంపైన కనీస గౌరవం లేని ఇలాంటి నాయకులు చట్టసభల్లో కొనసాగుతున్నారు.

బలహీనులే బాధితులు
మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి బలహీనులే బాధితులుగా మిగులుతున్నారు. సమాజంలోని బలహీనులు తరచుగా హక్కుల అణచివేతకు గురవుతున్నా, వారికి న్యాయం దక్కుతున్న సందర్భాలు మాత్రం అరుదుగానే ఉంటున్నాయి. మహిళలు, దళితులు, మైనారిటీలు తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారు. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం మన దేశంలో గత ఏడాది దళితులపై 45 వేలకు పైగా నేరాలు జరిగాయి. గిరిజనులపై 11వేలకు పైగా నేరాలు జరిగాయి. గడచిన రెండేళ్లలో మైనారిటీలపైన, దళితులపైన గోపరిరక్షక దళాల దాడులు గణనీయంగా పెరిగాయి. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం 2015లో మత ఘర్షణలకు సంబంధించి దాదాపు 750 సంఘటనలు జరిగాయి. ఈ సంఘటనల్లో 97 మంది మైనారిటీలు ప్రాణాలు కోల్పోయారు. 2016 సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లోనే ఇలాంటి 275 మత ఘర్షణలు జరిగి 38 మంది మరణాలకు దారితీశాయి. కుల మతాలకు అతీతంగా ప్రేమించుకున్న ప్రేమజంటలు పరువు హత్యలకు గురవుతున్నారు. సభ్య సమాజంలో ఇలాంటి పరువు హత్యలు అత్యంత హేయమైనవి అంటూ సుప్రీంకోర్టు ఒక తీర్పులో తీవ్రంగా అభిశంసించినా, ఈ సంఘటనలు తగ్గకపోగా మరింతగా పెరుగుతున్నాయి. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 2014లో 28 పరువు హత్యలు జరిగితే, 2015లో ఏకంగా 251 హత్యలు జరిగాయి. ఎక్కువగా దళితులు, మైనారిటీలు, మహిళలే పరువు హత్యల బారిన పడుతున్నారు.

ప్రపంచంలో కొన్ని దారుణమైన ఉల్లంఘనలు
ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో రకరకాలుగా మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. పలు దేశాల్లో ప్రభుత్వాలు, ప్రభుత్వ అధీనంలోని ‘రక్షణ’బలగాలు ఇష్టానుసారం సామాన్యుల హక్కులను కాలరాస్తున్నాయి. ప్రపంచమంతటికీ మానవ హక్కులపై సుద్దులు చెప్పే పెద్దన్న అమెరికాలో నల్లజాతి వారికి సమాన హక్కులు ఇప్పటికీ దక్కడం లేదు. అక్కడి చట్టాల ప్రకారం పౌరులందరికీ సమాన హక్కులు ఉన్నా, అమెరికన్‌ పోలీసులు మాత్రం నల్లజాతి ప్రజల పట్ల వివక్ష చూపుతూనే ఉన్నారు. కేవలం ‘అనుమానం’తో నల్లజాతి వారిపై ఏకపక్షంగా కాల్పులకు తెగబడుతున్న ఉదంతాలు తరచుగా వార్తల్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఉత్తర ఇరాక్, సిరియా ప్రాంతాలను గుప్పిట్లో పెట్టుకున్న ‘ఐసిస్‌’ పాల్పడుతున్న ఘాతుకాల గురించి చెప్పుకుంటే పెద్ద గ్రంథమే తయారవుతుంది. ఇండోనేసియా జాతీయ పోలీసు దళంలోకి మహిళలు ఎవరైనా చేరాలనుకుంటే వారు తప్పనిసరిగా కన్యత్వ పరీక్షలను ఎదుర్కోవాల్సిందే. ఎడాపెడా మరణశిక్షలను అమలు చేయడంలో చైనా రూటే సెపరేటు. మరణశిక్ష విధించిన ఖైదీల నుంచి అవయవాలు సేకరించి, వాటిని అవయవ మార్పిడి చికిత్సలకు ఉపయోగించడం అక్కడ సర్వసాధారణం. కాంగో, గాంబియా వంటి ఆఫ్రికా దేశాలైతే పౌరుల పాలిట ప్రత్యక్ష నరకాలే! ఉత్తర కొరియాలో పరిస్థితి మరీ దారుణం. అక్కడ అధ్యక్షుడి ఆగ్రహానికి గురైతే ఎంతటి వారైనా ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే! అక్కడి మహిళా సైనికులపై జరుగుతున్న ఘాతుకాలపై వెలుగులోకి వచ్చిన కథనాలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. మయన్మార్‌లో అక్కడి బలగాలు రోహింగ్యాలకు కనీస హక్కులను నిరాకరించడమే కాకుండా, బలప్రయోగంతో దేశం నుంచి వెళ్లగొడుతుండటం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారిన సంగతి కూడా తెలిసిందే.
 

ఆంధ్రప్రదేశ్‌లో అణచివేతలు...
ఆంధ్రప్రదేశ్‌లోనూ హక్కుల ఉల్లంఘనలు కొత్త ముచ్చటేమీ కాదు. ప్రజల హక్కులకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వమే హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఉదంతాలు ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలంలోని తుందుర్రు గ్రామ ప్రజలు తమ ఉనికికే ముప్పుగా మారిన గోదావరి మెగా అక్వా ఫుడ్‌ పార్కు పేరిట రొయ్యల ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగితే, ప్రభుత్వం వారిపై దమనకాండకు పాల్పడింది. రొయ్యల ఫ్యాక్టరీ నుంచి వెలువడే రసాయనాల వల్ల వాతావరణ కాలుష్యంతో పాటు భూగర్భ జలాలు కలుషితమవడమే కాకుండా, సమీప గ్రామాల మత్స్యకారులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉండటంతో ఆందోళనలు చెలరేగాయి. రొయ్యల ఫ్యాక్టరీని గ్రామాలకు చేరువలో కాకుండా, సముద్ర తీరానికి తరలించాలంటూ తుందుర్రు చుట్టుపక్కల దాదాపు నలభై గ్రామాల ప్రజలు ఆందోళన బాటపట్టారు. ఈ ఆందోళనకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు పలికినా, ప్రభుత్వం మాత్రం గ్రామస్తుల గోడు పట్టించుకోకుండా ఆందోళనకారులపై కేసులు బనాయించి, జైళ్లలోకి నెట్టింది.

►కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దారుగా ఉన్న సమయంలో ఇసుక మాఫియాను అడ్డుకున్న వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ప్రోద్బలంతో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా చాలానే జరుగుతున్నాయి.

►భీమవరానికి చేరువలోని గరగపర్రు గ్రామంలో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేసినందుకు మూడువందల దళిత కుటుంబాలను అగ్రవర్ణాల వారు సాంఘిక బహిష్కరణకు గురిచేశారు.

►శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని కొవ్వాడలో తలపెట్టిన అణు విద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా సమీప గ్రామాల ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఆందోళనలను ఎలాగైనా అణచివేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆ ప్రాంతంలో సంక్షేమ పథకాలతో పాటు, స్థిరాస్తుల క్రయవిక్రయాలను కూడా నిలిపివేసింది.

►నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం పంట భూములను బలవంతంగా సేకరిస్తుండటానికి వ్యతిరేకంగా గుంటూరు జిల్లా ఉండవల్లి మండలంలోని పెనుమాక గ్రామస్తులు మూడేళ్లుగా పోరాటం సాగిస్తున్నారు.

►కర్నూలు జిల్లా పాములపాడు మండలంలోని వెంపెంట గ్రామస్తులు తమ ఉనికికే ముప్పుగా మారిన పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా ఏళ్ల తరబడి పోరాటం కొనసాగిస్తున్నా, ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది.

►తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్‌ పరిశ్రమకు ప్రభుత్వం 505 ఎకరాల అసైన్డ్‌ భూమిని కేటాయించింది. ఈ పరిశ్రమ ఏర్పాటైతే తమ మనుగడకే ముప్పు వాటిల్లుతుందంటూ పంపాదిపేట పరిసర గ్రామాల ప్రజలు న్యాయపోరాటం సాగిస్తున్నారు.

►ఇవన్నీ ఒక ఎత్తయితే, రెండేళ్ల కిందట చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లనే నెపంతో ఇరవై మంది కూలీలను పోలీసులు కాల్చి చంపారు. ఈ సంఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్‌ తీవ్రంగా అభిశంసించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement