ఏ ఎండకా గొడుగు | A sunburn umbrella | Sakshi
Sakshi News home page

ఏ ఎండకా గొడుగు

Published Thu, Mar 12 2015 4:36 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

A sunburn umbrella

అమలాపురం టౌన్/ పెద్దాపురం : మానవ హక్కుల పరిరక్షణ ముసుగులో అవినాష్ పాల్పడిన మోసాలు, అక్రమ వసూళ్లపై జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. ఆ టక్కరికి సంబంధించిన ఏ చిన్ని ఆధారం దొరికినా వదలకుండా దర్యాప్తు చేస్తున్నారు. గతంలో జిల్లాలో అవినాష్ ఎక్కడెక్కడకు వెళ్లాడు, ఎవరెవర్ని కలిశాడు... అని కూపీ లాగుతున్నారు. అతడి బంధువులు, స్నేహితులనే కాదు.. పరిచయస్తులను కూడా వదలకుండా విచారణ చేస్తున్నారు. ఇందుకోసం జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ఆరు పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. అవినాష్ అన్వేషణలో ఓ బృందం హైదరాబాద్ వెళ్లగా నిడదవోలు, కొవ్వూరు, భద్రాచలం, పెద్దాపురం, కోనసీమలకు తలో బృందం వెళ్లింది.
 
అవినాష్‌ది ఏ ఎండకా గొడుగు పట్టే స్వభావం. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు తన దందాలు, అక్రమ వసూళ్ల కోసం ఎన్ని అవతారాలైనా ఎత్తుతాడు. ఎంతటి వారితోనైనా సంబంధాలు పెట్టుకుంటాడు. లేని బంధుత్వాలు సృష్టించుకుంటాడు.  నాలుగేళ్ల కిందట స్మగ్లర్ అవతారం ఎత్తి కొందరు అటవీ అధికారలతో అనుబంధం పెంచుకుని అక్రమాలకు పాల్పడ్డాడు. తర్వాత ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ అవతారం ఎత్తి ఉద్యోగాలు వేయిస్తానని మోసాలకు దిగాడు.

రాజప్ప బంధువునని చెప్పుకుంటూ గత అక్టోబరు నుంచి బెదిరింపులకు, దందాలకు దిగాడు. ఇదే సమయంలో 2015 సంవత్సరానికి హ్యూమన్ రైట్స్ చైర్మన్ హోదాతో ఖరీదైన రంగురంగుల పేజీలతో క్యాలెండర్ ముద్రించాడు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలోని ముఖ్యనేతలతో, రాష్ట్రానికి చెందిన ప్రముఖులతో దిగిన ఫొటోలను ఆ క్యాలెండర్‌లో ముద్రించాడు.

తానో దాతనని చెప్పుకునేందుకు పేదలకు ఏవో పంపిణీ చేస్తున్న పలు ఫోటోలు కూడా ముద్రించేశాడు. క్యాలెండర్‌లో మన జిల్లాకు చెందిన ఒకరిద్దరు ఎంపీలు, కొంతమంది ఎమ్మెల్యేలతో దిగిన ఫోటోలను కూడా ప్రచురించుకున్నాడు. ఏదో ఒక సందర్భంలో ప్రముఖులను కలిసినప్పుడు వారితో తీరుుంచుకున్న ఫొటోలను క్యాలెండర్‌లో ముద్రించి వారితో తనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నట్టు నమ్మించే ప్రయత్నం చేశాడు.

కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూ, రాజప్ప బంధువునంటూ, హ్యూమన్ రైట్స్ చైర్మన్‌నంటూ ఆ క్యాలెండర్లతో కాకినాడలోని జిల్లాస్థాయి కార్యాలయాలకూ వెళ్లాడు. డీఎస్పీలు, ఆర్డీఓలకు కూడా విజిటింగ్ కార్డుల్ని, క్యాలెండర్లిచ్చి రాజప్పతో తన బంధుత్వం, తన పదవి గురించి గొప్పగా చెప్పుకుని పరిచయాలు చేసుకున్నాడు. అలా జిల్లా అధికార యంత్రాంగంతో పరిచయం పెంచుకున్నాడు. తాను ఏదైనా పని చేయించుకోవాలన్నా, అక్రమ వసూళ్లకు వల విసరాలన్నా  తెచ్చిపెట్టుకున్న అధికార దర్పంతో, మాటల గారడీతో బురిడీ కొట్టించేవాడు.
 
రాజమండ్రిలో హక్కుల సదస్సు..
 ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ హోదాలో అవినాష్ గత ఏడాది ఆగస్టు 22న రాజమండ్రిలోని ఓ స్టార్ హోటల్‌లో మానవహక్కుల పేరిట జాతీయ సదస్సు నిర్వహించాడు. దానికి సంస్థ హెచ్‌ఆర్‌ఓ ఎన్.బి.నజీర్ అతిథిగా వచ్చాడు. ఇదే వేదికపై మానవహక్కుల రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా రాజమండ్రి ప్రాంతానికి చెందిన రాజేశ్వరి అనే మహిళకు నియామక పత్రం కూడా అవినాష్ అందజేశాడు. ఆ సదస్సులో తమ సంస్థ బాలకార్మికుల నిర్మూలన, మహిళల అక్రమ రవాణా, బాల్యవివాహాలు, గృహహింస వంటి సమస్యలపై పోరాడుతుందని ఆర్భాటంగా చెప్పాడు.
 
పోలీసుల అదుపులో నలుగురు..
 అవినాష్ మోసాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసు బృందాలు బుధవారం జిల్లాలో నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల పెద్దాపురం పోలీసులు అవినాష్‌పై అనుమానం వచ్చి విచారిస్తున్నప్పుడు అతడికి మద్దతుగా వెళ్లిన   మీడియా వర్గానికి చెందిన ముగ్గురిని  అదుపులోకి తీసుకుని, అవినాష్‌తో వారికున్న సంబంధాలను ఆరా తీస్తున్నారు. అంబాజీపేట మండలానికి చెందిన అవినాష్ స్నేహితుడు ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 
స్కూల్లో ఓవర్‌యూక్షన్‌పై ప్రత్యేకాధికారి విచారణ
అవినాష్ గతనెల 25న హ్యూమన్ రైట్స్ చైర్మన్ హోదాతో భద్రతా సిబ్బంది, ఎర్రబుగ్గ కారుతో పెద్దాపురంలోని లూథరన్ హైస్కూలును సందర్శించినట్లు పోలీసు దర్యాప్తులో మంగళవారమే గుర్తించారు. అవినాష్ బచ్చు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కోటేశ్వరరావుతో కలిసి ఆ హైస్కూల్‌ను సందర్శించి పారిశుధ్యం బాగోలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ప్రధానోపాధ్యాయుడు ఇజ్రాయిల్ నుంచి ఈ మేరకు పెద్దాపురం పోలీసులు మంగళవారమే స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. ఈ క్రమంలో  ప్రత్యేకాధికారి, ఎస్సీ, ఎస్టీ డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు ఆ హైస్కూల్‌లో బుధవారం విచారణ చేపట్టారు. అక్కడ అవినాష్ ఓవర్ యాక్షన్‌పై  ఆరా తీసి, సిబ్బంది వాంగ్మూలాలను నమోదు చేశారు. కాగా భద్రాచలం వెళ్లిన బృందం అక్కడికి సమీపంలోని మామిడిగూడెంలో అవినాష్ తల్లి, బంధువులను విచారించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement