పోలీసులే కొట్టి చంపారు..!
పోలీసులే కొట్టి చంపారు..!
Published Tue, Jul 18 2017 12:24 AM | Last Updated on Tue, Aug 21 2018 6:00 PM
– మృతుని బంధువుల ఆరోపణ
– పారిపోతూ ప్రాణాలు కోల్పాయాడంటున్న పోలీసులు
కర్నూలు సీక్యాంప్: తన తండ్రి వెంకోబనాయుడిని కర్నూలు పోలీసులే కొట్టి చంపారని తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా తుమ్మిళ్ల గ్రామానికి చెందిన మురళీధర్‌నాయుడు ఆరోపించారు. పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేయగా పారిపోతూ ఆదివారం సాయంత్రం కర్నూలు మండలం ఆర్.కొంతలపాడు వద్ద తుంగభద్ర నదిలో మునిగి వెంకోబనాయుడు మృతి చెందిన విషయం విదితమే. మృతదేహానికి కర్నూలు పెద్దాస్పత్రిలో సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు.
ఈ సందర్భంగా మృతుని కుమారుడు మురళీధర్ నాయుడు, అతని బంధువులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి పోలీసులను నిలదీశారు. తుమ్మిళ్ల గ్రామానికి చెందిన వెంకోబ నాయుడు పేకాట ఆడడానికి ఆర్.కొంతలపాడుకు వస్తే పోలీసులు ఉద్దేశపూర్వకంగా కొట్టి చంపారని ఆరోపించారు. అతని దగ్గర ఉన్న రూ.50 వేలు పోలీసులు కాజేశారన్నారు. మృతుని శరీరంపై ఉన్న దెబ్బలు ఉంటడంతో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని చెప్పారు. ఈ ఘటనపై కర్నూలు తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. పేకాట ఆడుతున్న వారిలో 8 మంది పోలీసులకు లొంగిపోయారని, వెంకోబనాయుడు మాత్రం తప్పించుకునే ప్రయత్నంలో తుంగభద్రనదిలో పడి స్పృహ కోల్పోయాడన్నారు. నీళ్లు ఆయన పొట్టలోకి చేరడంతో చనిపోయాడన్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత బంధువులకు అప్పగిస్తామన్నారు.
కలెక్టరేట్ ఎదుట ఆందోళన
తిమ్మిళ్ల గ్రామానికి చెందిన వెంకోబనాయుడు కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబీకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. పేకాట ఆడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా దాడి చేయడంతోనే మరణించాడని ఆరోపించారు. మృతుడి కుటుంబానికి రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఆందోళనలో మృతుడి భార్య పుష్పావతి, కుటుంబీకులు వేణుగోపాల్‌నాయుడు, చిన్న కొండయ్య, జి.కొండయ్య, జి.మాధన్న తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement