మంచిరేవులలో పేకాటరాయుళ్లు పట్టుబడిన ఫాంహౌస్
మణికొండ (హైదరాబాద్): నగర శివారులోని ప్రముఖుల ఫాంహౌజ్‌లను అద్దెకు తీసుకొని పేకాట దందా సాగిస్తున్న వ్యవహారాన్ని సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్‌ఓటీ) బట్టబయలు చేసింది. ప్రముఖులకు బర్త్‌డే పార్టీ పేరిట వాట్సాప్‌లో ఆహ్వానాలు పంపి క్యాసినోలు నడిపిస్తున్న ప్రధాన సూత్రదారితోపాటు 30మంది పేకాటరాయుళ్లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
సూత్రధారి సుమన్ చౌదరి
గుంటూరు జిల్లాకు చెందిన గుత్తా సుమన్‌కుమార్ చౌదరి ఓ టీవీ చానల్‌లో డైరెక్టర్‌గా, రియల్టర్‌గా అవతారం ఎత్తాడు. సినిమాల్లో పెట్టుబడులు పెడుతుండటంతోపాటు పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటాడు. అతను గతంలో గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో భూకబ్జాకు పాల్పడి పోలీసులకు చిక్కాడు. పేకాటరాయుళ్లను గ్రూపులుగా చేసి హైదరాబాద్ శివార్లలోని మంచిరేవులకు రప్పించాడు. సినీహీరో నాగశౌర్య తండ్రి వాసవి రవీంద్రప్రసాద్ లీజుకు తీసుకున్న ఫాంహౌస్‌లో పెద్దఎత్తున పేకాట శిబిరాన్ని ప్రారంభించాడు. అది ఎస్‌ఓటీ పోలీసులకు తెలియటంతో ఆదివారం రాత్రి దాడులు చేసి అరెస్టు చేశారు. ఫాంహౌజ్‌ను లీజుకు తీసుకున్న రవీంద్రప్రసాద్‌కు నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేసి స్టేషన్‌కు రప్పించి విచారించారు.
అంతా ప్రముఖులే...
ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంలో పోలీసులకు చిక్కిన వారిలో రాజకీయ, రియల్‌ఎస్టేట్ గ్రూపులకు చెందిన ప్రముఖులు ఉన్నారు. మహాబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్యతోపాటు వాసవి డెవలపర్స్ గ్రూప్‌నకు చెందిన రాజారామ్, మద్దుల ప్రకాశ్‌లతోపాటు మరీడు తనున్, గుమ్మడి రామస్వామి చౌదరి, ననదిగ ఉదయ్, సీహెచ్ శ్రీనివాసరావు, టి.శివరామకృష్ణ, బాడిగ సుబ్రమణ్యం, పండిటాగ సురేష్, నాగార్జున, కౌతాపు వెంకటేశ్, మిర్యాల భానుప్రకాశ్, పాతూరి తిరుమల, వీర్ల శ్రీకాంత్, ఎం.మల్లిఖార్జున్‌రెడ్డి, బొగ్గారాపూర్ నాగ, గట్ట వెంకటేశ్వర్‌రావు, ఎస్‌ఎస్‌ఎన్ రాజు, యు.గోపాల్‌రావు, బి.రమేశ్‌కుమార్, కాంపల్లి శ్రీనివాస్, ఇమ్రాన్ ఖాన్, టి.రోహిత్, బొల్లబోడ ఆదిత్య, సీహెచ్ గణేష్, తోట ఆనందకిషోర్, షేక్ ఖదీర్, బి.రాజేశ్వర్ ఉన్నారు.
రెడ్‌కాయిన్‌కు రూ.5 వేలు
ఫామ్‌హౌజ్‌లో ప్రముఖులతో మూడు ముక్కల ఆట ఆడించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పేకాట శిబిరాల్లో డబ్బు బదులుగా కాయిన్స్‌ను సరఫరా చేస్తారు. రెడ్ కాయిన్‌కు ఐదు వేలు, గ్రీన్ కాయిన్‌కు రెండువేలు, బ్లూ కాయిన్‌కు వెయ్యి రూపాయల లెక్క కడుతున్నారు. పోలీసులకు చిక్కిన 30 మందికి రాజేంద్రనగర్ అడిషనల్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. కొందరు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, వాటిని న్యాయమూర్తి తిరస్కరించారు.
చంద్రబాబు, లోకేశ్‌లతో ఫొటోలు
మంచిరేవుల ఫాంహౌజ్‌లో క్యాసినో నిర్వహిస్తున్న గుత్తా సుమన్ చౌదరి ప్రముఖులతో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తోపాటు ఓ పత్రిక యజమానితో ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి.
చదవండి: సినీ హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాటరాయుళ్ల పట్టివేత
Comments
Please login to add a commentAdd a comment