ఏడాదిన్నర పాటు ఖాకీల కళ్లుగప్పిన నిందితుడు
కళ్ల ముందు తిరుగుతున్నా గుర్తించని విచారణాధికారులు
మరో రెండు ప్రాణాలను బలిగొన్న హంతకుడు
కేసుల దర్యాప్తులో రాచకొండ పోలీసుల డొల్లతనం
శాస్త్రీయ కోణంలో ఆధారాలు సేకరించడంలో విఫలం
సాక్షి, హైదరాబాద్: మద్యం మత్తులో మహిళలపై అఘాయిత్యాలకు తెగబడటం, ప్రతిఘటించిన వారిని హత్య చేసి పరారయ్యే హంతకుడిని పట్టుకోవడంలో రాచకొండ పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు. హత్య చేసి ఏడాదిన్నర కాలం పాటు పోలీసుల కళ్లగప్పి వారి ముందే తిరుగుతున్నా గుర్తించలేకపోయారు. మరో ఇద్దరిని హత్య చేసి, తనంతట తాను దొరికితే తప్ప విచారణాధికారులు నిందితుడిని పట్టుకోలేకపోయారు. శాస్త్రీయ కోణంలో ఆధారాలు సేకరించి తొలి కేసులోనే నిందితుడిని పట్టుకుని ఉంటే.. ఇద్దరు ప్రాణాలతో మిగిలేవారు. కేసుల దర్యాప్తులో రాచకొండ పోలీసుల డొల్లతనంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాగితే అఘాయిత్యమే..
దాసర్లపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల శివ కుమార్ మద్యం మత్తులో సైకోలాగా ప్రవర్తిస్తుంటాడు. తాగిన మైకంలో ఫామ్ హౌస్‌లు, నిర్మానుష్య ప్రాంతాల్లో సంచరిస్తూ ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిపై కన్నేసేవాడు. అదను చూసి మద్యం తాగి వారిపై అఘాయిత్యానికి పాల్పడేవాడు. ఎవరైనా ప్రతిఘటిస్తే అక్కడే ఉన్న పదునైన ఆయుధంతో వారిని హత్య చేసి పరారయ్యేవాడు. ఈ ఘటనను ఎవరైనా చూస్తే.. సాక్ష్యం మిగలకుండా వారిని కూడా అంతం చేసేందుకు వెనుకాడేవాడు కాదు. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే అతను తన కార్యకలాపాలను ఎప్పటికప్పుడు వాటిలో పోస్ట్ చేస్తూ పెద్ద సంఖ్యలో ఫాలోవర్లను కలిగి ఉన్నట్లు గుర్తించారు.
ఆధారాల సేకరణలో విఫలం..
దాసర్లపల్లిలోని అరుణ ఫామ్ హౌస్‌లో పనిచేసే శైలజ అనే మహిళపై కన్నేసిన అతను గతేడాది మార్చి 3న ఆమెను హత్య చేశాడు. అనంతరం హతురాలి ఇంట్లో ఉన్న రెండు విదేశీ మద్యం బాటిళ్లు నిందితుడికంట పడ్డాయి. దీంతో ఒక బాటిల్‌ను తీసుకుని, మరొకటి తీస్తుండగా చేయి జారి కింద పడిపోయింది. పగిలిన బాటిల్‌పై ఉన్న నిందితుడి వేలిముద్రలను పోలీసులు సేకరించారు. అయితే హతురాలు, నిందితుడు ఇద్దరూ అదే గ్రామానికి చెందినవారే అయినా పోలీసులు ఊరిలో ఉన్న అనుమానితులను విచారించలేదు. దీంతో నిందితుడు శివ కళ్ల ముందు ఉన్నా గుర్తించలేకపోయారు.
అంతే కాకుండా హత్య అనంతరం సంఘటనా స్థలానికి పోలీసులు వచి్చన సమయంలోనూ నిందితుడు కూడా అక్కడే ఉండి ఆధారాల సేకరణలో వారికి సహాయపడినట్లు తెలిసింది. వాసన పసిగట్టి డాగ్ స్క్వాడ్ వెంబడిస్తాయని ముందుగానే తెలుసుకున్న నిందితుడు... అవి రాకముందే అక్కడ్నుంచి పరారయ్యేవాడు. శైలజా రెడ్డిని హత్య చేసిన తర్వాత ఏడాదిన్నర కాలం పాటు అదే ఊర్లో తిరుగుతున్నా పోలీసులు గుర్తించలేకపోయారు. మరోసారి మద్యం మత్తులో మ్యాంగో ఆర్చిడ్స్ ఫామ్ హౌస్‌లో పని చేస్తున్న శాంతమ్మపై అత్యాచారానికి యతి్నంచాడు. ఆమె ప్రతిఘటించడంతో వేట కొడవలితో హత్య చేశాడు. ఇది చూశాడన్న అనుమానంతో ఆమె భర్త మూగ హోసయ్యనూ అంతం చేశాడు. తొలి కేసులోనే పోలీసులు హంతుకుడు శివను పట్టుకుని ఉంటే ఇద్దరి ప్రాణాలకు దక్కేవని స్థానికులు పేర్కొంటున్నారు.
పాత కేసులపై ఆరా..
హత్యలు జరిగిన రెండు ఫామ్ హౌస్‌లలోనూ సీసీటీవీ కెమెరాలు లేకపోవడం కూడా పోలీసుల దర్యాప్తునకు సవాల్‌గా మారింది. రూ.కోట్లు ఖర్చు పెట్టి వ్యవసాయ క్షేత్రాలను ఏర్పాటు చేసుకునే యజమానులు, సిబ్బంది భద్రత, రక్షణ కోసం కనీసం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని ఉండాల్సిందని పోలీసులు సూచిస్తున్నారు. ఫామ్ హౌస్‌లకు వచ్చివెళ్లే దారిలో కూడా ఎలాంటి నిఘా నేత్రాలు లేకపోవడం నిందితులు ఎలాంటి బెరుకు లేకుండా నేరాలకు పాల్పడుతుంటారని అధికారులు చెబుతున్నారు.
సాధారణంగా నిందితుడు సాయంత్రం వేళల్లో మద్యం తాగి, మహిళలపై అత్యాచారానికి పాల్పడుతుంటాడు. అడ్డుపడిన వారిపై పదునైన ఆయుధంతో హత్య చేస్తుంటాడు. దీంతో మహేశ్వరం జోన్ పరిధిలో ఇదే తరహాలో ఏమైనా హత్య కేసులు నమోదయ్యాయా అనే కోణంలో పోలీసులు పునఃసమీక్షిస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాలు, ఫామ్ హౌస్‌లు, గృహాలలో సాయంత్రం వేళల్లో జరిగిన మహిళల హత్య కేసులను ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment