బేలా సోమారి కోసం! | varavara rao writes on human rights activist bela kumari | Sakshi
Sakshi News home page

బేలా సోమారి కోసం!

Published Sun, Feb 5 2017 12:50 AM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM

బేలా సోమారి కోసం!

బేలా సోమారి కోసం!

సందర్భం
బస్తర్‌లో బేలా సోమారి (హక్కుల కార్య కర్త) ఇంటి మీద దాడి జరగడం ఇది రెండోసారి. ఇది ఐజీ కల్లూరి భాషలో స్వచ్ఛందంగా ఆదివాసీలు చేసిన దాడి. కాని ఇది కల్లూరి ఆదేశాలతో పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం, రాజ్యం చేసిన దాడి. హిమాంశు కుమార్‌తో ప్రారంభించి ఇప్పటి వరకు బస్తర్‌లో బయట సమాజం నుంచి వచ్చిన ప్రజాస్వామ్య వాదులు ఎవరూ ఉండకుండా తరిమేయగలిగారు. ఒక్క బేలా భాటియా విషయంలోనే అది సాధ్యం కావడం లేదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆ మేధావి తాను ఆదివాసీగా మారి బేలా సోమారి అయింది. ఆమె విదేశాల్లో చదవవచ్చు, అక్కడే పీహెచ్‌డీ చేయ వచ్చు. ఢిల్లీ యూనివర్సిటీలో స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌లో ప్రొఫెసర్‌ కావచ్చు. ఒకసారి ఢిల్లీ బస్తీలలో, మురికివాడల్లో పనిచేయాలని ఎంచుకున్నదంటే వాటిని తన ఆవాసాలుగా మార్చుకుంటుంది. దండకారణ్యంలో ఆదివాసీ సమాజం గురించి చదవడానికీ, చదువు చెప్పడానికీ చేరిందంటే ఆమె దండకారణ్యంలో భాగమైన గడ్చిరోలీ, బస్తర్‌ ప్రజల మధ్య ఉండడానికి ఎంచుకుంటుంది.

ఆమె మొదటిసారి దండకారణ్యంలోకి వెళ్లే ప్రయత్నంలో నన్ను కలిసింది. ఇటువంటి వాళ్లతో మనకు ఎన్ని విభేదాలైనా ఉండవచ్చు, కానీ తమ విశ్వాసాలతో పాటు మన విశ్వాసాలను కాపాడడానికి వాళ్లు ప్రాణాలు ఒడ్డడానికైనా వెను కాడరు. ఇవాళ ‘బస్తర్‌ను కాపాడుకుందాం’ అని నినదించే వాళ్లందరికీ ఆమె ప్రతీక. బాసగూడ మారణకాండ తరువాత బొజ్జా తారకం నాయ కత్వంలో సీడీఆర్‌ఓ నిజ నిర్ధారణ కమిటీ  వెళ్లి వచ్చిన తరువాత ఆర్‌డిఎఫ్, హైదరా బాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నది. బస్తర్‌ పరిస్థితులను వివరిస్తూ  ‘బస్తర్‌ అడవుల్లో ఒక ఆదివాసీ మహిళ మీదనో, పిల్లల మీదనో ఒక దాడి, ఒక అత్యాచారం, ఒక అన్యాయం జరిగిందంటే పోలీసుస్టేషన్‌లో ఎఫ్‌ఐ ఆర్‌ నమోదు చేయడమే ఒక విప్లవం’ అన్నారామె.

అప్పటి నుంచి ఇప్పటి వరకు బేలా సోమారి లాంటి వాళ్లు ఆ కృషిని ముందుకు తీసుకువెళ్లారు. ఆదివాసీ యువకుల చేతులకు మారణాయుధాలు ఇచ్చి తమ తోటి ఆదివాసుల పైనే దాడులు చేయించి, చంపిం చడం; ఆదివాసీ సమాజంలో ఒక అంతర్యుద్ధం వంటి కల్లోలాన్ని సృష్టించడమేనని సుప్రీంకోర్టు అభిశంసించింది. ఒక్క 2016లోనే ఛత్తీస్‌గఢ్‌లో 134 బూటకపు ఎన్‌కౌంటర్‌ హత్యలు జరిగాయి. ఆదివాస మహిళల మీద భద్రతా బలగాలు సామూహిక లైంగిక అత్యాచారాలు చేశాయి. వీటిని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ దాకా తీసుకురాగలిగారు.

బేలా సోమారి ఇంటిపై దాడికి కొంచెం ముందే మరో హక్కుల కార్యకర్త శాలినీ గేరాపై రద్దయిన నోట్ల మార్పిడి కేసు పెట్టారు. అంతకు కాస్త ముందు డిసెంబర్‌ 25న తెలంగాణ డెమోక్రటిక్‌ ఫోరం బృందం సభ్యులు ఏడుగురు నిజ నిర్ధారణకు వెళ్తూ ఉంటే తెలంగాణ పోలీ సులే దుమ్ముగూడెం దగ్గర అరెస్టు చే¯ì  సుక్మా పోలీసులకు అప్పగించారు. రెండుసార్లు బెయి ల్‌ను నిరాకరించగా ఛత్తీస్‌గఢ్‌ పబ్లిక్‌ సెక్యూరిటీ యాక్ట్‌ కింద వీళ్లు సుక్మా జైలులో మగ్గుతున్నారు. వీరిలో బల్లా రవీంద్రనాథ్‌ స్వయంగా రాజకీయ ఖైదీల విడుదల కమిటీకి రెండు తెలుగు రాష్ట్రాల చాప్టర్‌కు కార్యదర్శి. ఆయనా, చిక్కుడు ప్రభా కర్‌ హైకోర్టు న్యాయవాదులు.

రమడాల లక్ష్మయ్య తుడుందెబ్బ ఆదివాసీ సంఘం నాయ కుడు. దుడ్డు ప్రభాకర్‌ రెండు దశాబ్దాలుగా కుల నిర్మూలన పోరాట సమితి రెండు తెలుగు రాష్ట్రాల నాయకుడు. దుర్గాప్రసాద్‌ సీనియర్‌ జర్నలిస్టు. రాజేంద్రప్రసాద్, నజీర్‌ ఉస్మానియా యూనివర్సిటీలో రిసెర్చ్‌ స్కాలర్లు. రాజేంద్ర ప్రసాద్‌ తెలంగాణ విద్యార్థి వేదిక ఉపాధ్యక్షుడు. నజీర్‌ తెలంగాణ విద్యార్థి వేదిక ఉస్మానియా క్యాంపస్‌ బాధ్యుడు, రచయిత, వక్త. వీళ్ల అరెస్టు సందర్భంలోనే ఐజి కల్లూరి తాను ఉండి ఉంటే వాళ్లను కోర్టుకు అప్పగించేవాడిని కాదని, ఇక నుంచి అంటే 2017లో ‘తెల్ల కాలర్‌ మావోయిస్టు’లను వేధించే అజిత్‌ దోవల్‌ డాక్ట్రిన్‌ (సిద్ధాంతాన్ని) అమలు చేస్తామని నిస్సిగ్గుగా ప్రకటించాడు.


ఎన్‌ఆర్‌పి కల్లూరి మారణకాండను అమలుచేస్తూనే ఉన్నాడు. 2009లో గ్రీన్‌హంట్‌ ఆపరేషన్‌గా ప్రారంభమైన ఈ ప్రజల మీది యుద్ధం మూడు దశలు దాటి ఆపరేషన్‌ విజయ్, హాకా, మిషన్‌ 2016లలో కూడా విఫలమై, ఇప్పుడు మిషన్‌ 2017గా ఆదివాసీ ప్రజలతో పాటు ప్రజాస్వామ్యవాదులపై అమలవుతున్నది. దాని పేరే ‘సఫేద్‌ కాలర్‌ మావోయిస్టు’ల అణచివేత. బేలాపై దాడి అనంతరం తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ఐజీ కల్లూరిని విధుల నుంచి తప్పించి సెలవుపై పంపారు. ఆయన మాట్లాడుతూ బేలా బాటియా గెలిచింది అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ సంద ర్భంగా బేలా ఒక మాటన్నారు. ‘పోరాటం కల్లూరిమీద కాదు. కల్లూరివంటి వారిని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ విధానాల మీద’.


బుద్ధిజీవులకు, ప్రజాస్వామ్యవాదులకు న్యాయం పట్ల, ప్రజా స్వామ్యం పట్ల అంత నిజాయితీతో కూడిన ప్రేమ, పక్షపాతం ఉంటే అది ఒక్కటే ఇవాళ రాజ్యహింసను, రాజ్యం దాడిని ఎదు ర్కోవడానికి మిగిలిన ప్రత్యామ్నాయమైన ప్రజాస్వామిక మార్గం. బేలా సోమారి ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆమెను అక్కడి నుంచి పంపించాలని రాజ్యం చేస్తున్న కుట్రను ప్రతిఘటిస్తూ, ఆదివాసులను నిర్వాసితులను చేస్తున్న ప్రపంచీకరణ విధ్వంసక అభివృద్ధి విధానాలకు వ్యతిరేకంగా పోరాడడం కూడా ఆశ యంగా, లక్ష్యంగా నిర్దేశించుకోవడమే ఇవాళ మన కర్తవ్యం.


వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యుడు
వరవరరావు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement