
రాజ్యం అధికార బలంతో పౌరుల హక్కుల్ని కాలరాసినపుడు మానవహక్కుల సంఘం వంటి సంస్థలు పౌర రక్షణకు వచ్చిన సందర్భాలెన్నో! ప్రభుత్వాల దయా దాక్షిణ్యాల మేరకు కాకుండా రాజ్యాంగం కల్పించిన ఓ సదుపాయంగా హక్కుల సంస్థలు రూపొందాలి. రాజ్యాంగ స్ఫూర్తికి ఏ మాత్రం భంగం కలగనీయకుండా వాటి నిర్వహణ చట్టబద్ధంగా సాగాలి. సర్కార్లు నిర్వీర్యపరుస్తున్నపుడు ‘మనదేం పోయింది..?’ అనే అలసత్వంతో కాకుండా పౌర సమాజం బాధ్యతగా వాటిని పరిరక్షించుకోవాలి. అప్పుడే, సామాన్యుడు మాన్యుడవుతాడు. రాజ్యాంగ స్ఫూర్తి రహిస్తుంది, ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.
పౌర హక్కుల స్ఫూర్తికి ప్రభుత్వాలే పాతరేస్తు న్నాయి. ప్రజలకు రాజ్యాం గం కల్పించిన హక్కుల్ని, ప్రత్యామ్నాయ సదుపా యాల్ని నిలువునా తొక్కేస్తున్నాయి. ఫలితంగా... చట్టాలు అయినవాళ్లకు చుట్టాలయి, కాని వాళ్లకు కష్టాలయి కూర్చున్నాయి. ప్రజల హక్కులకు భంగం కలిగినపుడు ఆసరాగా నిలిచే పలు స్వతంత్ర, ప్రజా స్వామ్య, హక్కుల సంస్థల్ని పనిగట్టుకు నీరుగారు స్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. పౌరసమాజం వీధుల్లో పోరాడో, న్యాయస్థానాల తలుపు తట్టో వాటిని నిలుపుకోవాల్సి వస్తోంది. ఆయా సంస్థల్ని ప్రభుత్వాలు అసలు ఏర్పాటే చేయవు. చేసినా... పాలకులు అక్కడ తగిన బాధ్యుల్ని నియ మించరు. నియమించినా... అందుకు అవసరమైన సదుపా యాలు కల్పించరు, అరకొర కల్పించిన చోట కూడా... నామ మాత్రపు వ్యవహారమే తప్ప స్ఫూర్తిని రక్షించే ఒక్క చర్యా ఉండదు.
ఇలా నిర్లక్ష్యం లానో, ఉదాసీనత లాగానో బయటకు కనిపించే సర్కారు చర్యల వెనుక లోతైన వ్యూహమో, ఎత్తుగడో దాగి ఉండటం ఇటీవలి పరిణామాల్లో కొట్టొచ్చినట్టు కని పిస్తోంది. అది మరింత బాధాకరం! కొంచెం లోతుగా పరిశీలిస్తే... ప్రజాస్వామ్య సంస్థల్ని ఏలిన వారు నిర్వీర్యం చేయడం వెనుక ఉండే దురుద్దేశాలు ఒకటొకటిగా తేటతెల్లమౌతున్నాయి. కేంద్రంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. మానవహక్కుల సంఘాలు లేవు, లోక్‌పాల్–లోకాయుక్తల్లేవు, బాలల హక్కుల సంఘా లదీ అదే గతి! సమాచార హక్కు కమిషన్ ఒక చోట లేనే లేదు, మరోచోట నామమాత్రం! పరిపాలనా ట్రిబ్యునల్ ఒక చోట లేనే లేదు మరో చోట అంతంత మాత్రమే. అఖిల భారత స్థాయిలో హరిత న్యాయ స్థానాల వ్యవస్థను పలుచన చేస్తున్నారు.
ఇంకా ఇతరేతర సంస్థల్లోనూ ముఖ్యమైన పోస్టులన్నీ ఖాళీ, ఖాళీ! ఇదీ వరుస! పరిపాలనలో పారదర్శకత కోసం రాజ్యాంగం ప్రసాదించిన హక్కు నీడన పనిచేయా ల్సిన సమాచార హక్కు కమిషన్లను నిర్వీర్యం చేస్తున్న వైనాన్ని సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టే తప్పుబట్టింది. ‘కమిషన్లు ఎందుకు పనిచేయ ట్లేదు? కమిషనర్లను ఎందుకు నియమించలేదు? పెండింగ్ ఫిర్యాదులు, అప్పీళ్లనెలా పరిష్కరిస్తార’న్న సుప్రీంకోర్టు ప్రశ్నకు విస్పష్టంగా సమాధానమే లేని దుస్థితి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది! మూడు వారా లకు వాయిదా పడిన తాజా కేసులో, సుప్రీంకోర్టుకి అవేం సమాధానం చెబుతాయో వేచి చూడాలి.
కనీస హక్కుల రక్షణకు వ్యవస్థల్లేవు!
మానవ హక్కుల ఉల్లంఘన జరిగినపుడు వాటిని ఎత్తి చూపి, తగు రక్షణ పొందే వ్యవస్థల్ని మన రాజ్యాంగమే కల్పించింది. అటువంటి ఉపద్రవాల నుంచి సాధారణ పరిస్థితుల్లో ప్రభుత్వాలే పౌరులను కాపాడాలి. ప్రభుత్వాలు, వాటి వివిధ విభాగాలు, సంస్థలు నైతిక సూత్రాలను, చట్ట నిబంధనలను ఉల్లంఘించినపుడు, తద్వారా మానవ హక్కులకు భంగం కలిగినపుడు పౌరులకు రక్షణ అవసరం. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థల్ని అందుకే నెల కొల్పుతారు. చట్టాల అమలుకు బాధ్యత వహించా ల్సిన ప్రభుత్వాలే కట్టుదప్పి వ్యవహరిస్తే, ఆ తప్పుల్ని ఎత్తిచూపే తెగువ, స్వేచ్ఛ, చొరవ కోసమే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన తటస్థ సంస్థల ఏర్పా టును రాజ్యాంగంలో పొందుపరిచారు. రాజ్యం అధి కార బలంతో పౌరుల హక్కుల్ని కాలరాసినపుడు మానవహక్కుల సంఘం వంటి సంస్థలు పౌర రక్ష ణకు వచ్చిన సందర్భాలెన్నో! అందుకే, నేరుగా రాజ్యాంగం ద్వారా కొన్ని, అందులోని స్ఫూర్తితో రూపొందించుకున్న చట్టాల ద్వారా మరికొన్ని సంస్థలు ఏర్పడ్డాయి.
ఆ స్ఫూర్తి కోసమే ఆయా సంస్థలు సంపూర్ణ స్థాయిలో, స్వేచ్ఛగా, ఏ అవరో ధాలూ లేకుండా పనిచేయాలి. కానీ, ప్రభుత్వాలు అలా చేయనీయవు. సదరు సంస్థల్ని కొన్నిసార్లు అసలు ఏర్పాటే చేయవు! తమకు ఇతరేతర విష యాలు ప్రాధాన్యమైనట్టు, ఆయా విషయాల్ని పట్టిం చుకోవడానికి తమ వద్ద సమయమే లేనట్టు ప్రభు త్వాలు నటిస్తుంటాయి. ప్రస్తుతం జరుగుతున్నదదే! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పుడు లోకా యుక్త, ఉప లోకాయుక్త సంస్థలకు అధిపతులు లేరు. రెండు చోట్లా మానవహక్కుల సంఘాలూ పనిచే యడం లేదు. మానవహక్కుల సంఘానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రిటైర్ట్ ప్రధాన న్యాయమూర్తి స్థాయి వారు నేతృత్వం వహించాలి. జస్టిస్ నిస్సార్ అహ్మద్ కక్రూ పదవీ విరమణ తర్వాత మరెవరినీ ఆ పదవిలో నియమించలేదు.
ఇప్పుడక్కడ సభ్యులు కూడా లేరు. నిబంధనలకు భిన్నంగా... కార్యదర్శి స్థాయి అధికారే ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు, కమిష న్‌ను నడుపుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత, ఉద్యోగుల సర్వీసు వివాదాలు పరిష్కరించే పరిపా లనా ట్రిబ్యునల్ (ఏటీ) తెలంగాణకు లేకుండా పోయింది. అధికారికంగా దాని రద్దు ప్రకటించారు. ఉద్యోగులు అవినీతికి పాల్పడ్డపుడు నమోదయ్యే ఏసీబీ కేసులు, ఉన్నతాధికారులపై వచ్చే అభియో గాల విచారణను నిర్ణయించాల్సిన విజిలెన్స్ కమిషన్ కూడా పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. పలు ఇతర హక్కుల సంస్థలదీ ఇదే గతి!
హైకోర్టు మందలించినా తోలు మందమే!
పాలనలో పారదర్శకత కోసం దేశంలో పుష్కర కాలంగా అమలవుతున్న సమాచార హక్కు చట్టానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కష్టకాలమొచ్చింది. రాష్ట్ర విభజనకు ముందు నుంచే ఈ చట్టం అమలుకు ప్రభుత్వాలు తూట్లు పొడుస్తూ వస్తున్నాయి. చట్టం అమలును పర్యవేక్షించే, ఫిర్యాదులు–అప్పీళ్లు పరిష్క రించే కమిషన్‌ను క్రమంగా బలహీనపరిచాయి. ఈ పరిస్థితులు, పౌరులు కోరుకునే సమాచారం వెల్లడి విషయమై అన్ని స్థాయిల్లో అలసత్వాన్ని పెంచి పోషించాయి. సమాచారం సులువుగా లభించని పూర్వస్థితి మళ్లీ బలపడుతుండటంతో ప్రజలు భంగ పోతున్నారు. అంతకుముందు నియమించిన కమి షనర్ల పదవీ కాలం ముగిసి, కమిషన్‌లో అసలు కమి షనర్లే లేని పరిస్థితి తలెత్తినా... ప్రభుత్వాలు పట్టించు కోలేదు. ఆ దశలో జోక్యం చేసుకున్న ఉమ్మడి హైకోర్టు, నిర్దిష్టంగా ఒక తేదీ లోపల కమిషన్ ఏర్పాటు చేసి, కమిషనర్లను నియమించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలనూ ఆదేశించింది.
తెలంగాణ ప్రభుత్వం ‘ఆ మేరకు’ ప్రధాన సమాచార కమిష నర్‌తో పాటు ఒక కమిషనర్‌ను నియమిస్తూ కమిషన్ ఏర్పాటు చేసింది. తొమ్మిది వేలకు పైగా అప్పీళ్లు పెండింగ్‌లో ఉంటే, పది మంది వరకు కమిషనర్లను నియమించుకునే వెసలుబాటున్నా, ఎందుకు నియ మించటం లేదన్నది న్యాయస్థానాల ప్రశ్న. అదనపు సమయం కావాలని పలుమార్లు వాయిదాలు కోరిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దాదాపు పదినెలలు కావ స్తున్నా ఇప్పటివరకు కమిషనర్లను నియమించలేదు. కమిషన్ ఏర్పాటుకు ఒక ఉత్తర్వు, కమిషనర్ల పోస్టుల్ని ఏర్పాటు చేస్తున్నట్టు మరో ఉత్తర్వు ఇచ్చి చేతులు దులుపుకొంది. కమిషనర్ల నియామకాలు జరుపలేదు. ఇదే విషయమై హైకోర్టు గట్టిగా నిలదీసినపుడు, చేసేస్తున్నామని మాట ఇచ్చింది.
కానీ, ఇప్పటికీ అదేమీ చేయకపోవడం న్యాయధిక్కా రమనే అభియోగంతో కొందరు తిరిగి కోర్టును ఆశ్ర యించిన కేసు శుక్రవారం విచారణకు రానుంది. ప్రజ లకు మేలు చేయడం కన్నా, తమ వారికి పదవులు కట్టబెట్టి, అధికారంలో తామున్నా, లేకున్నా రాబోయే అయిదేళ్లు వారిని కీలకస్థానాల్లో చూసుకోవాలనే రాజకీయ స్వార్థంతోనే ఈ వ్యూహాలన్న విమర్శలు న్నాయి. వారి ఎత్తుగడల్లో చిత్తవుతున్నది మాత్రం ప్రజా ప్రయోజనాలు! జరుగుతున్నది పౌర హక్కుల హననం!
చట్టం చెప్పే ప్రమాణాలు తుంగలో
సమాచార హక్కు కమిషన్లలో ఖాళీలు భర్తీ చేయండి అన్న సుప్రీంకోర్టు సూచనకే హక్కుల కార్యకర్తలు సంబరపడి పోతున్నారు. ఈ ఇల్లు అలకడాలతో పండు గైపోయినట్టు కాదు. నిజానికి, చట్ట స్ఫూర్తి గల్లంతవు తున్న మతలబంతా అక్కడే ఉంది. ఈ ప్రభుత్వాలు తమకు వీలయినంత కాలం కమిషన్లను ఏర్పాటు చేయవు. ఇక తప్పదన్నపుడు, చట్టం నిర్దేశిం చిన అర్హతా ప్రమాణాలతో నిమిత్తం లేకుండా ‘తమ’ వారితో కమిషన్లను నింపేస్తున్నాయి. స్వతంత్ర ప్రతి పత్తి స్ఫూర్తినే గంగలో కలిపి, ఆయా సర్కార్లు– సదరు కమిషనర్లు పరస్పర ప్రయోజనకరంగా వ్యవహ రించడం దేశవ్యాప్తంగా విమర్శలకు తావిచ్చింది. ముఖ్యంగా అఖిల భారత సర్వీసు రిటైర్డ్ అధికారుల్ని ముఖ్య కమిషనర్లుగా, కమిషనర్లుగా నియమిస్తు న్నారు.
సర్వీసు కాలమంతా సమాచారాన్ని చెరబట్టి, జనాన్ని విలువైన సమాచారానికి దూరం పెట్టిన వారు అంత సులువుగా సమాచార వ్యాప్తికి ఎలా నడుం కడతారన్న పౌర సంఘాల ప్రశ్నకు సమాధానమే లేదు! ఆర్టీఐ చట్టం (2005), సెక్షన్లు 12 (5), 15 (5)లో కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషనర్లుగా నియా మకానికి ఎలాంటి వారై ఉండాలో విస్పష్టంగా పేర్కొ న్నారు. ప్రజాజీవితంలో ప్రముఖులై ఉండి, న్యాయ, శాస్త్ర–సాంకేతిక, సామాజిక సేవ, యాజమాన్య నిర్వ హణ, జర్నలిజం, జనమాధ్య మాలు, పరిపాలనలో విశేషానుభవం కలిగిన వారై ఉండాలని పేర్కొన్నారు.
అంటే, అవన్ని రంగాల్లో విస్తృత పరిజ్ఞానమో, ఆ ప్రాధాన్యతా క్రమంలో ఏదైనా అంశంలో విశేష ప్రజ్ఞనో కలిగి ఉండటం ప్రామాణికం. అంతే తప్ప, ప్రభుత్వ సర్వీసుల్లో పదవీ విరమణ చేసిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం తప్పు. దాని వల్ల వివిధ స్థాయిల్లో చిక్కులు తలెత్తుతున్నాయి. కమిషన్ నిర్వ హణ, సమచారం ఇచ్చే ప్రక్రియ, ఫిర్యాదులు–అప్పీ ళ్లను పరిష్కరించే విధానం అన్నిట్లోనూ ఈ ‘అధికార ముద్ర’ ఆధిపత్యమే కనిపిస్తోంది. ఫలితంగా, సమా చార కమిషన్ వ్యవస్థ కూడా జనహితానికి భిన్నంగా పనిచేస్తోందన్న విమర్శ వినిపిస్తోంది.
ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మేరకు కాకుండా రాజ్యాంగం కల్పించిన ఓ సదుపాయంగా హక్కుల సంస్థలు రూపొందాలి. రాజ్యాంగ స్ఫూర్తికి ఏ మాత్రం భంగం కలగనీయకుండా వాటి నిర్వహణ చట్ట బద్ధంగా సాగాలి. సర్కార్లు నిర్వీర్యపరుస్తున్నపుడు ‘మనదేం పోయింది..?’ అనే అలసత్వంతో కాకుండా పౌర సమాజం బాధ్యతగా వాటిని పరిరక్షించుకోవాలి. అప్పుడే, సామాన్యుడు మాన్యుడవుతాడు. రాజ్యాంగ స్ఫూర్తి రహిస్తుంది, ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.
దిలీప్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment