
నిరసన తెలిపే హక్కును హరిస్తున్నారు
► ప్రభుత్వంపై హైకోర్టు న్యాయవాది సురేష్‌కుమార్ ధ్వజం
ఒంగోలు టౌన్ : భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగంగా ప్రజలు తమకు జరిగిన అన్యాయంపై నిరసన తెలుపుకునే హక్కును కూడా రాష్ట్ర ప్రభుత్వం హరిస్తోందని హైకోర్టు న్యాయవాది, పౌరహక్కుల సంఘ రాష్ట్ర కార్యదర్శి పీ సురేష్‌కుమార్ ధ్వజమెత్తారు. శనివారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన ఏపీ పౌరహక్కుల సంఘ జిల్లా కమిటీ ఆవిర్భావ సదస్సు సందర్భంగా పోలీసు చట్టాలు – పౌరహక్కులు అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పాలనలో పౌరహక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతోందన్నారు.
భావ ప్రకటనా స్వేచ్ఛలో భాగంగా ఎవరికైనా నిరసన తెలియజేసే హక్కు ఉందని, దీనిని కూడా ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో నిరసన తెలుపుకునే స్వేచ్ఛ కూడా లేకుండా పోతోందన్నారు. 144 సెక్షన్ అత్యవసర సమయాల్లో అమలు చేయాల్సి ఉంటుందని, కానీ, రాష్ట్రంలో ప్రతి చిన్నపాటి సంఘటనకు కూడా దాన్ని అమలుచేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఈ సెక్షన్ పరిధిలో లేని అనేక నిబంధనలను పోలీసులు అమలు చేస్తున్నారన్నారు. సెక్షన్ 30, సెక్షన్ 144 ద్వారా పోలీసులు ఉపయోగించే నిబంధనలు పౌరహక్కులను దెబ్బతీస్తున్నాయన్నారు. సెక్షన్ 43 ప్రకారం రాత్రి సమయాల్లో మహిళలను అరెస్టు చేయకూడదని, ఇక్కడ మాత్రం రాత్రివేళల్లో మహిళలను పోలీసు స్టేషన్లలోనే ఉంచుతున్నారని పేర్కొన్నారు. అధికారపార్టీ నేతలు ఎప్పుడు ఏది చేయమంటే అదే పోలీసులు చేస్తున్నారు తప్పితే చట్టాలను అమలు చేయడం లేదని విమర్శించారు.
ఆడపిల్లల కేసుల విషయంలో వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సి ఉందని, ఇలా నమోదు చేయకపోతే సంబంధిత పోలీసు అధికారిపై ఆ మహిళ కేసు పెట్టవచ్చని తెలిపారు. రూల్ ఆఫ్ లా ప్రకారం పోలీసులు తమ విధులు నిర్వహించడం లేదన్నారు. దేశంలో న్యాయవ్యవస్థ ఉంది కాబట్టి ఈ మాత్రమైనా ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారన్నారు. ఓపీడీఆర్ రాష్ట్ర నాయకుడు సీహెచ్ సుధాకర్ మాట్లాడుతూ జిల్లాలో పౌర హక్కుల ఉల్లంఘనలు అనేకం జరుగుతున్నాయన్నారు. ప్రజలు తమ సమస్యలపై అధికారులకు విన్నవించుకునే స్వేచ్ఛను కూడా పోలీసులు హరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పౌరహక్కుల ఉల్లంఘనపై ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఐలు జిల్లా కార్యదర్శి వై.రమేష్ మాట్లాడారు.
జిల్లా నూతన కమిటీ ఎన్నిక...: ఏపీ పౌరహక్కుల సంఘ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా బీ దశరథరామయ్య, సభ్యులుగా వై.రమేష్, కాశీ, యూ మల్లికార్జున్, శాస్త్రి, ఎం.కొండలరావు, ఎం.మల్లికార్జున, బీ రూపేష్, బీ రఘురామ్, అజీజ్‌లను ఎన్నుకున్నారు.