శుక్రవారం హైకోర్టు గేటు వద్ద ఆందోళన చేస్తున్న లాయర్లు
సాక్షి, హైదరాబాద్ : న్యాయవాదుల విధుల బహిష్కరణతో హైకోర్టు కార్యకలాపాలు రెండో రోజు కూడా స్తంభించాయి. న్యాయవాదుల అభ్యర్థన మేరకు న్యాయమూర్తులు అత్యవసర కేసులు మినహా వేరే కేసుల విచారణ చేపట్టలేదు. శుక్రవారం ఉదయం కోర్టు పని వేళలు ప్రారంభం కాగానే న్యాయవాదులు ఆయా కోర్టు హాళ్లలోకి వెళ్లి విధుల బహిష్కరణకు సహకరించాలని సహచర న్యాయవాదులను కోరారు. దీంతో కోర్టు హాళ్లలో ఉన్న న్యాయవాదులందరూ బయటకు వచ్చేశారు. రెండో రోజు కూడా హైకోర్టు బార్ కౌన్సిల్ గేటు నుంచి మదీనా వరకు ర్యాలీ నిర్వహించారు.
త్వరలో భవిష్యత్ కార్యాచరణ..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల న్యాయవాదుల సంఘాల అధ్యక్షులు జెల్లి కనకయ్య, చల్లా ధనంజయలతో నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు. వెంటనే హైకోర్టు న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేయాలంటూ నినాదాలు చేస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. హైకోర్టు నాలుగో గేటు వద్ద బైఠాయించి కొద్దిసేపు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉభయ సంఘాల అధ్యక్షులు మాట్లాడుతూ.. ప్రస్తుతం హైకోర్టులో తగినంత మంది న్యాయమూర్తులు లేరని, దీంతో కక్షిదారులు తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేసులు విచారణకు నోచుకోకపోవడంతో కక్షిదారులు సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో న్యాయవాదులు ఉన్నారని చెప్పారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు, కేంద్రం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రెండు వారాల తర్వాత సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను నిర్ణయిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment