టీటీడీలో తవ్వకాల వివరాలు ఇవ్వండి!  | High Court order to the Central and AP Government and TTD | Sakshi
Sakshi News home page

టీటీడీలో తవ్వకాల వివరాలు ఇవ్వండి! 

Published Wed, Jul 4 2018 1:57 AM | Last Updated on Fri, Aug 31 2018 8:42 PM

High Court order to the Central and AP Government and TTD - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పోటులో తవ్వకాలకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు మంగళవారం ఏపీ ప్రభుత్వాన్ని, టీటీడీ ఈవోను ఆదేశించింది. అంతేకాక.. టీటీడీతో పాటు దాని అనుబంధ ఆలయాలన్నింటినీ రక్షిత కట్టడాలుగా పరిగణిస్తామంటూ రాసిన లేఖకు సంబంధించిన వివరాలను కూడా తమ ముందుంచాలని కేంద్ర పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ)ను ఆదేశించింది. వేటి ఆధారంతో వీటిని రక్షిత కట్టడాలుగా పరిగణిస్తారో తెలియజేయాలని ఏఎస్‌ఐ కోరింది.

ఇందులో భాగంగా ఏపీ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ చైర్మన్, టీటీడీ ఈవో, ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) సూపరింటెండెంట్‌లకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. అంతేకాక, వెయ్యి కాళ్ల మండపం కూల్చివేత, నిర్మాణాలతో పాటు టీటీడీలో పలు వివాదాలపై దాఖలైన వ్యాజ్యాలన్నింటినీ కూడా తాజా వ్యాజ్యానికి జతచేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది.  

టీటీడీలోని పోటు నేలమాళిగలో ఉన్న గుప్త నిధుల వ్యవహారాన్ని తేల్చేందుకు ఓ కమిటీని ఏర్పాటుచేయాలని, అలాగే టీటీడీ ఆదాయ, వ్యయాలపై వాస్తవాలను నిగ్గు తేల్చి, కనిపించకుండాపోయిన విలువైన పురాతన ఆభరణాల జాడ తెలుసుకునేందుకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ గుంటూరు జిల్లా అరండల్‌పేటకు చెందిన బూరగడ్డ అనిల్‌కుమార్, గుజరాత్‌ గాంధీనగర్‌కు చెందిన భూపేంద్ర కె.గోస్వామి హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.  

ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.. 
ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కేవలం ఆగమ శాస్త్రాల ప్రకారమే శ్రీవారి కైంకర్యాలు జరగాలని గతంలోనే న్యాయస్థానాలు తీర్పులిచ్చాయని తెలిపారు. అయితే, టీటీడీ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఆలయం లోపల తవ్వకాలు జరుపుతున్నారని వివరించారు. తవ్వకాలు ఎక్కడ జరుపుతున్నారని, అసలు తవ్వకాలు జరుగుతున్నాయని మీకెలా తెలిసిందని ధర్మాసనం ప్రశ్నించింది. పోటులో మరమ్మతుల పేరుతో తవ్వకాలు చేస్తున్నారని, ఈ విషయంపై పత్రికల్లో కథనాలు వచ్చాయని, అలాగే.. ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా చెప్పారని పిటిషనర్ల న్యాయవాది తెలిపారు. శ్రీకృష్ణదేవరాయలతో పాటు అనేకమంది రాజులు ఇచ్చిన పురాతన, అత్యంత విలువైన ఆభరణాలు ఉన్నాయని, వాటి విలువ రూ.52వేల కోట్ల వరకు ఉంటుందని వివరించారు. ఈ ఆభరణాలకు ఇప్పటివరకు బీమా చేయించలేదన్నారు. ఈ ఆభరణాల్లో విలువైన పింక్‌ డైమండ్‌ కనిపించకుండాపోయిందని, దానిని ఇటీవల జెనీవాలో వేలం వేసినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.  

పింక్‌ డైమండ్‌ వ్యవహారం ఇప్పటిది కాదు.. 
దీనికి ధర్మాసనం ఒకింత తీవ్రంగా స్పందిస్తూ.. ‘పింక్‌ డైమండ్‌ వ్యవహారం ఇప్పటిది కాదు. 2010లోనే పింక్‌ డైమండ్‌ పగిలిపోయినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన వివాదం హైకోర్టులో కూడా నడిచింది. అయితే, అది పింక్‌ డైమండ్‌ కాదు.. రూబీ అని అధికారులు చెప్పారు’అని తెలిపింది. ఈ సమయంలో పిటిషనర్ల న్యాయవాది స్పందిస్తూ, 2014 నుంచి అసలు ధర్మ పరిషత్‌ లేకుండానే టీటీడీ అనేక కార్యకలాపాలను నిర్వర్తిస్తోందని చెప్పారు. అసలు ధర్మ పరిషత్‌ ఉంటేనే కార్యకలాపాలు నిర్వహించాలని చట్టంలో ఎక్కడ ఉందో చూపించాలని ధర్మాసనం కోరింది. దీంతో పిటిషనర్ల న్యాయవాది చట్టంలోని ఓ నిబంధనను ప్రస్తావించగా, అది ఎంతమాత్రం ఇక్కడ వర్తించదని ధర్మాసనం స్పష్టంచేసింది. మతపరమైన కార్యకలాపాలకే పరిమితమయ్యేలా టీటీడీని ఆదేశించాలని న్యాయవాది కోరగా, టీటీడీ అనేక కాలేజీలు, ఆసుపత్రులు, సత్రాలను నిర్వహిస్తున్న విష యాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. ఇవన్నీ లౌకిక కార్యకలాపాల కిందకు వస్తాయని, ఇందు లో ఎటువంటి తప్పులేదంది. తలనీలాల వేలం గురించి పిటిషనర్ల న్యాయవాది ప్రస్తావించగా, తలనీలాలు ఇవ్వొద్దని ఆదేశించమంటారా? అంటూ నిలదీసింది. ఈ సమయంలో న్యాయ వాది స్వర్ణ తాపడం గురించి ప్రస్తావించారు. దీనిపై అటు ధర్మాసనానికి, పిటిషనర్ల న్యాయవాది మధ్య కొద్దిసేపు  చర్చ జరిగింది.  

తవ్వకాలు కాదు.. మరమ్మతులే
కాగా, ప్రధాన గోపురానికి స్వర్ణ తాపడం చేస్తున్నారని, దీంతో  శాసనాలు కనిపించకుండాపోయే ప్రమాదం ఉందని పిటిషనర్ల తరఫు న్యాయ వాది చెప్పగా, దానితో ధర్మాసనం విభేదించింది. ప్రధాన గోపురానికి స్వర్ణ తాపడం ఎన్నో ఏళ్ల క్రితం చేశారని, దానిపై శాసనాలు ఏమీలేవని తెలిపింది. ఈ సమయంలోనే ధర్మాసనం.. పోటులో తవ్వకాల గురించి ప్రశ్నించింది. దీనికి ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ సమాధానమిస్తూ, ఎటువంటి తవ్వకాలు జరగలేదని చెప్పారు. కేవలం కొద్దిపాటి మట్టిని తీసి మరమ్మతులు  నిర్వహించారని తెలిపారు. ఏది చేసినా కూడా ఆగమ శాస్త్రం మేరకు సలహాలు తీసుకునే చేస్తున్నారని వివరించారు. ఈ సమయంలో పిటిషనర్ల న్యాయవాది రక్షిత కట్టడాల ప్రస్తావన తీసుకువచ్చారు. దీంతో ధర్మాసనం.. ఏఎస్‌ఐ న్యాయవాదిని వివరణ కోరింది. వేటి ఆధారంగా టీటీడీ, దాని అనుబంధ దేవస్థానాలను రక్షిత కట్టడాలుగా పరిగణిస్తూ లేఖ రాశారో తెలియజేయాలని ఆదేశించింది.  దేశంలో తమకు తెలిసి ఏ ఒక్క దేవస్థానమూ రక్షిత కట్టడాల జాబితాలో లేదని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement