Archeology department
-
రాష్ట్రంలో బొమ్మల కొలువు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టాయ్ (బొమ్మల) మ్యూజియం కొలువుదీరనుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన సంస్కృతి, సంప్రదాయాలు, నైపుణ్యాన్ని ప్రతిబింబించే బొమ్మలను ఇందులో ప్రదర్శించనున్నారు. చిన్నారుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసంపెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన విజ్ఞానాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం టాయ్ మ్యూజియాలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మూడేళ్ల కిందట తొలి దశలో గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల్లో ప్రతిపాదించింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. రెండేళ్ల క్రితం గుజరాత్లో తొలి బొమ్మల మ్యూజియం పనులు ప్రారంభమయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో రూ.15 కోట్ల అంచనా వ్యయంతో విజయనగరంలో బొమ్మల మ్యూజియాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. ఇప్పటికే పురావస్తు, ప్రదర్శనశాలల శాఖ.. సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేసే పనిలో నిమగ్నమైంది. దేశం నలుమూలల నుంచి.. మన రాష్ట్రంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలతో పాటు జమ్మూకశ్మీర్ (పేపర్ బొమ్మలు) పంజాబ్ (ఫోక్), రాజస్థాన్ (గుడ్డ, స్టఫ్డ్), గుజరాత్ (ఎర్ర మట్టి), మహారాష్ట్ర (చెక్క, వంట సామగ్రి), కర్ణాటక (చెన్నపట్న బొమ్మలు), తమిళనాడు (తంజావూరు), తెలంగాణ (నిర్మల్), పశ్చిమ బెంగాల్ (నాటుంగ్రాం), మధ్యప్రదేశ్ (తమలపాకుతో చేసేవి), బిహార్ (కన్యాపుత్రి), ఉత్తరప్రదేశ్ (చెక్కబొమ్మలు), అసోం (ఆషారికండి) తదితర సుమారు 50కిపైగా ప్రసిద్ధి చెందిన ప్రాంతాల నుంచి కొబ్బరి పీచు, రబ్బరు, ప్లాస్టిక్, మెటల్, పింగాణీలతో చేసిన కళాకృతులు, బొమ్మలను సేకరించి మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచనున్నారు. ఈ సాంప్రదాయ బొమ్మలతో పాటు నూతన సాంకేతిక విజ్ఞానాన్ని అందించేలా రోబోటిక్, ఎల్రక్టానిక్ వంటి సుమారు లక్ష నుంచి రెండు లక్షల బొమ్మలను ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా మ్యూజియం సందర్శనకు వచ్చే చిన్నారులు ఆడుకునేందుకు ప్రత్యేక గ్యాలరీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. జాతీయ, స్థానిక సంస్కృతికి అద్దం పట్టడంతో పాటు శాస్త్రవేత్తలు, కళాకారులు, ప్రముఖ వ్యక్తుల గురించి బొమ్మల మ్యూజియం పరిచయం చేయనుంది. అలాగే పరిశోధన, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రాన్నిప్రోత్సహించనుంది. గుజరాత్లో ప్రపంచంలోనే అతిపెద్దది.. కాగా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద బొమ్మల మ్యూజియం రూపుదిద్దుకుంటోంది. చిల్డ్రన్స్ యూనివర్సిటీ ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తోంది. 30 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.1,500 కోట్ల అంచనా వ్యయంతో రతన్‌పూర్, షాపూర్ గ్రామాల మధ్యలో గిఫ్ట్ సిటీ సమీపంలో 11 లక్షలకు పైగా బొమ్మలతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పురాతన కాలం నుంచి ఆధునిక యుగం వరకు అనేక రకాల బొమ్మలను ప్రదర్శించనున్నారు. ఇస్రో–డీఆర్డీవో సహాయంతో ఎల్రక్టానిక్, బ్యాటరీ, సౌర ఆధారిత చిన్న అంతరిక్ష నౌక, పృథ్వీ, అగ్ని క్షిపణులు, ఉపగ్రహాల సాంకేతిక విజ్ఞానంపై అవగాహన కల్పించేలా బొమ్మలను తయారు చేయనున్నారు. ఇప్పటివరకు అమెరికాకు చెందిన మిస్సౌరీ రాష్ట్రంలోని బ్రాన్సన్ టాయ్ మ్యూజియం 10 లక్షల బొమ్మలతో అతిపెద్ద మ్యూజియంగా గుర్తింపు పొందింది. ఇందులో మోడల్ రైళ్లు, విమానాలు, కార్లు, సూపర్ హీరో, డిస్నీ వరల్డ్ వంటి బొమ్మలు 1800 సంవత్సరం నుంచి తాజా టెక్నాలజీ వరకు ఉన్నాయి. వారసత్వ, విజ్ఞాన, పరిశోధన కేంద్రంగా.. బొమ్మల మ్యూజియం చారిత్రక, వారసత్వ విజ్ఞానాన్ని భద్రపరుస్తుంది. సందర్శకులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకోవచ్చు. విద్యార్థులకు విజ్ఞానం, పరిశోధకులకు రీసెర్చ్ సెంటర్‌గా ఎంతో ఉపయోగపడుతుంది. విజయనగరంలో స్థలం అందుబాటులో ఉండటంతో బొమ్మల మ్యూజియాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం. త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌ను పంపించి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక సంపదను కాపాడటంలో విశేష కృషి చేస్తోంది. అందుకే జిల్లాల్లో మ్యూజియాలను అభివృద్ధి చేస్తున్నాం. – జి.వాణీమోహన్, కమిషనర్, పురావస్తు–ప్రదర్శనశాలల శాఖ భవిష్యత్తు తరాలకు అందించడానికే.. భారతదేశం గొప్ప కళలకు ప్రసిద్ధి చెందింది. వాటిని మన భవిష్యత్తు తరాలకు అందించడమే టాయ్ మ్యూజియాల లక్ష్యం. అందుకే దేశ వ్యాప్తంగా రకరకాల బొమ్మలను సేకరించి ఇందులో ప్రదర్శిస్తాం. ఈ మ్యూజియాలే పెద్ద వర్క్‌షాపు సెంటర్లుగా మారనున్నాయి. బాల్యంలో స్నేహితులతో కలిసి బొమ్మలతో ఆడుకుంటే చిన్నారుల్లో మానసిక ఎదుగుదలతో పాటు సామాజిక స్పృహ, సృజనాత్మకత పెరుగుతుంది. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. టాయ్ మ్యూజియం ద్వారా కొంత వరకు దీన్ని అధిగమించవచ్చు. – రజత్‌భార్గవ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
Taj Mahal: రూ.1.9 కోట్లు ట్యాక్స్ కట్టాలని తాజ్‌మహల్‌కు నోటీసులు..
లక్నో: ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ కట్టాలని చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌కు నోటీసులు పంపారు ఆగ్రా మున్సిపల్ అధికారులు. రూ.1.94 కోట్లు నీటి పన్ను, రూ.1.47లక్షలు ఇంటిపన్ను కట్టాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)ని అడిగారు. ప్రేమకు చిహ్నంగా చెప్పుకునే స్మారక కట్టడమైన తాజ్‌మహల్‌కు.. పన్ను కట్టాలని నోటీసులు పంపడం చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2021-22, 2022-23కు సంబంధించిన ఈ ట్యాక్స్‌ను 15 రోజుల్లోగా చెల్లించాలని, లేదంటే ఈ ప్రాపర్టీని అటాచ్ చేస్తామని ఆగ్రా మున్సిపల్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే తాజ్‌మహల్‌కు నోటీసులు పంపిన విషయం తన దృష్టికి రాలేదని మున్సిపల్ కమిషనర్ నిఖిల్ టీ ఫుండే తెలిపారు. పన్ను లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన బౌగోళిక సమాచార వ్యవస్థ(జీఐఎస్) ఆధారంగా చాలా ప్రాపర్టీలకు నోటీసులు పంపినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాలు, మతపరమైన స్థలాలు సహా అన్నింటికి నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. అవసరమైతే చట్టపరంగా పన్నులో రాయితీ ఉంటుందన్నారు. మరోవైపు తాజ్‌మహల్‌కు పొరపాటుగా నోటీసులు వచ్చి ఉంటాయని ఆర్కియలాజికల్ సర్వే అధికారులు పేర్కొన్నారు. దీన్ని రక్షిత స్మారక కట్టడంగా 1920లోనే ప్రకటించారని గుర్తు చేశారు. బ్రిటిష్ కాలంలో కూడా దీనికి ఎలాంటి పన్నులు వసూలు చేయలేదని స్పష్టం చేశారు. తాజ్‌మహల్‌కు ప్రాపర్టీ ట్యాక్స్ వర్తించదని పేర్కొన్నారు. ఇలా నోటీసులు రావడం ఇదే తొలిసారి అని చెప్పారు. చదవండి: మెస్సీ లేరా.. సోషల్ మీడియాలో కాంతారా మీమ్ వైరల్.. -
బయటపడ్డ పదో శతాబ్దం నాటి శిల్పాలు..ఎలా ఉన్నాయో తెలుసా?
సాక్షి, నార్సింగి(తూప్రాన్): మెదక్‌జిల్లా నార్సింగి మండల కేంద్రశివారులో శైవవీరగల్లు వీరుల రాతి శిల్పాలు గుర్తించామని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ హరగోపాల్ అన్నారు. నార్సింగి శివారులో రెండోరోజు పర్యటనలో భాగంగా గురువారం గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల వద్ద రాష్ట్ర కూటుల కాలం నాటివిగా భావించే రాతిపై చెక్కిన శిల్పాలను గుర్తించామన్నారు. మూడు రకాల వీరగల్లుల శిల్పాలు ఉండగా, వాటిలో కత్తిని చేబట్టి చేతిలో ఫలం పట్టుకున్న ఆత్మాహుతి వీరగల్లు శిల్పం ముఖ్యమైందన్నారు. 10వ శతాబ్దానికి చెందిన ఈ శిల్పాలు పెద్ద పెద్ద మీసాలతో భయంగొలిపే ముఖంతో ఉన్నాయని తెలిపారు. శిల్పాలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి పుస్తక రూపంలో ప్రచురిస్తామని చెప్పారు. క్షేత్ర పరిశోధనలో ఫొటోగ్రాఫర్ కొలిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అంతుచిక్కని కట్టడం.. గుర్తు తెలియని దేవుడికి బలులు
రియాద్: సౌదీ అరేబియాలో పురావస్తుశాఖ వారు అద్భుతమైన నియోలితిక్(నవీన శిలా యుగము) క్రీ.పూ.10000-5000) కాలానికి సంబంధించిన కట్టడాలను కనుగొన్నారు. ఈ కట్టడాలు ఈజిప్టులోని పిరమిడ్స్ కంటే చాలా పురాతనమైనవని పురావస్తుశాఖ వారు అంచనా వేస్తున్నారు. వాయువ్య అరేబియాలో 7,000 సంవత్సరాల పురాతన దీర్ఘచతురస్రాకార రాతి నిర్మాణాలపై పురావస్తు శాఖ చేస్తున్న సర్వేలో పురాతన కాలానికి చెందిన భారీ కట్టడాలను కనుగొన్నారు. ముస్టాటిల్స్ గా పిలుస్తున్న ఈ కట్టడాలను మత విశ్వాసాల కారణంగా నిర్మించారని పురావస్తు శాఖ వారు పేర్కొన్నారు. ఈ కట్టడాలు తొలిసారిగా 1970లో వెలుగులోకి వచ్చినప్పటీకి, ఈ నిర్మాణాలు కొన్ని దశాబ్ధాల పాటు అంతు చిక్కని రహస్యంగా ఉండిపోయాయి. దీర్ఘచతురస్రంగా పిలిచే అరబిక్ పదానికి ముస్టాటిల్స్ గా పేరుపెట్టారు. వీటి నిర్మాణంలో ప్రతి చివర ఒక వేదికను కలిగి ఉన్నాయి. ఇవి సుమారు 20 నుంచి 620 మీటర్ల వరకు భారీ రాతి నిర్మాణాలను కలిగి ఉన్నాయి. ఈ భారీ రాతి కట్టడాలు సౌదీ అరేబియాలోని అలులా , ఖైబర్ కౌంటీ ప్రాంతాలలో అధిక భాగం ఉన్నాయి.వెస్ట్రన్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం ఈ ప్రాంతంపై సర్వే నిర్వహించింది. ఈ ప్రాంతంపై ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద పురావస్తు అధ్యయనం. ఈ పరిశోధనకు రాయల్ కమిషన్ ఫర్ అలులా (ఆర్‌సియు) నిధులు సమకూర్చింది. ఈ బృందం క్రమబద్ధమైన రిమోట్ సెన్సింగ్ ద్వారా 641 ముస్టాటిల్స్ ను కనుగొన్నారు, ఈ పరిశోధనలను సుమారు 350 వైమానిక సర్వేలను నిర్వహించారు. రెండు లక్షల కిలోమీటర్ల పరిధిలో సుమారు 1,000 కంటే ఎక్కువ ముస్టాటిల్స్ ను కనుగొన్నారు. గతంలో ఉనికిలోకి వచ్చిన వాటికంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ.ఈ కట్టడాల్లో ప్రత్యేకమైన ప్రవేశ మార్గాలు, వ్యవస్థీకృత గదులు, పొడవాటి ప్రాంగణ నిర్మాణాలు ఉన్నాయి. ఈ స్మారక కట్టడాలను నిర్మించడానికి ఈ ప్రాంతంలో నివసించిన పూర్వ సమాజాల భాగస్వామ్య నమ్మకాలు వీటిని నిర్మించిడానికి దోహదంపడ్డాయని పరిశోధకులు తెలిపారు. ఈ కట్టడాలపై రేడియోకార్బన్ పరీక్షలు నిర్వహించిన తరువాత , అవి నియోలిథిక్ కాలంకు చెందినవని కనుగొన్నారు.అంతేకాకుండా ఈ ప్రాంతంలో నిర్వహించిన తవ్వకాల్లో భారీ ఎత్తున పశువుల ఎముకలు లభించాయి. గుర్తు తెలియని దేవుళ్లకు భారీ ఎత్తున పశువుల బలులు జరిగి ఉండవచ్చునని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. నార్త్-వెస్ట్ అరేబియాకు చెందిన ఈ ముస్టాటిల్స్ ప్రపంచంలోనే మొట్టమొదటి అతి పెద్ద స్మారక కట్టడాలుగా నిలుస్తాయని ప్రాజెక్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మెలిస్సా కెన్నెడీ తెలిపారు. ముస్టాటిల్స్ నియోలిథిక్ కాలానికి చెందిన వారి పూర్వీకుల గురించి తెలియజేయడానికి ప్రాదేశిక గుర్తులుగా కూడా పనిచేసి ఉండవచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు. చదవండి: స్వదేశానికి వస్తే ఐదేళ్ల జైలు శిక్ష..! -
ఘన చరితం.. రేనాటి శాసనం
వైవీయూ: ముద్దనూరు మండలం చిన్నదుద్యాల గ్రామ సమీపంలో లభించిన శాసనం ఆధారంగా చోళ మహారాజు రేనాడు ప్రాంతం నుంచి పరిపాలన సాగించినట్లు రూఢీ అయిందని వైవీయూ వైస్ చాన్సలర్ ఆచార్య మునగాల సూర్యకళావతి అన్నారు. బుధవారం వైవీయూ చరిత్ర, పురావస్తుశాఖ పరిశోధకులు, సహాయ ఆచార్యులు డాక్టర్ వి. రామబ్రహ్మం రేనాటి చోళరాజు శాసనం వివరాలను, దాని వెనుక ఉన్న చరిత్ర సంగతులను వైస్ చాన్సలర్ దృష్టికి తీసుకువచ్చారు. చిన్నదుద్యాల సమీపంలో లభించిన రేనాటి చోళరాజు శాసనం అత్యంత అరుదైనదన్నారు. ఆ గ్రామానికి చెందిన బి.శివనారాయణరెడ్డి పొలంలో ఇది బయల్పడినట్లు తెలిపారు. వైవీయూ ఎంఏ చరిత్ర, పురావస్తుశాఖ విద్యార్థి వాసుదేవరెడ్డికి ముందుగా ఈ విషయం తెలియడంతో ఆయన డా. రామబ్రహ్మం దృష్టికి తీసుకువచ్చారు. శాసనం, ఆ సమాచారాన్ని మైసూర్‌లోని భారత పురాతత్వశాఖ(ఏఎస్ఐ)కు తెలియజేశారు. ఏఎస్ఐ, వైవీయూ చరిత్ర పురావస్తుశాఖ పంపిన శాసనం గురించి అధ్యయనం చేయగా పలు చారిత్రక అంశాలు వెలుగుచూశాయని ఆయన తెలిపారు. ►రేనాటి చోళుల రాజైన చోళమహారాజు ఈ శాసనం వేయించారు. అందులో (తొలితరం) తెలుగుభాష, తెలుగు లిపిలో క్రీ.శ. 8వ శతాబ్దంలో శాసనం వేయించినట్లు ఉంది. పిడుకుల గ్రామంలోని దేవాలయాన్ని దేవాలయ బ్రాహ్మణులకు ఆరు మర్తల (8పుట్ల ధాన్యం పండేభూమి) సేద్యానికి ఇచ్చినట్లు నమోదై ఉంది. అలానే ఈ శాసనంలో చోళమహారాజు రేనాడు ప్రాంతం నుంచి పరిపాలన కొనసాగించినట్లు తెలుస్తోంది. ఎవరైతే ధాన్యాన్ని పరిరక్షిస్తారో వారికి (శాసనంలో లైన్ నెంబర్ 21, నవారికి ఆశ్వ : 22 లైన్లో మేద : (ం) బుదీని’ ఉంది) అశ్వమేధయాగం చేసిన ఫలితం దక్కుతుందని, ఎవరైతే హానిచేస్తారో వారు వారణాసిలో చంపిన పాపాన్ని (23. చెర్రివారు, 24 బారనసి ప్ర) పొందుతారని శాసనంలో లిఖించారు. ►పరిశోధకులు డాక్టర్ రామబ్రహ్మంను వైవీయూ వైస్ చాన్సలర్ ఆచార్య మునగాల సూర్యకళావతి, రిజిస్ట్రార్ ఆచార్య డి. విజయరాఘవప్రసాద్‌లు అభినందించారు. వైవీయూ అధికారుల ఆదేశానుసారం ‘ఎక్స్‌ఫ్లోరేషన్ ఆఫ్ ఆన్ – ఎర్త్డ్ ఇన్స్క్రిప్షన్, స్ల్కప్ఫర్ అండ్ టెంప్లెస్ ఆఫ్ వైఎస్ఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ పేరుతో యూనివర్సిటీ గ్రాంటు కమిషన్‌కు ప్రాజెక్టును పంపనున్నట్లు డాక్టర్ రామబ్రహ్మం తెలిపారు. -
సీమలో రాతియుగపు ఆనవాళ్లు
వైవీయూ: రాయలసీమ ప్రాంతంలో పురావస్తు ఆనవాళ్లపై యోగివేమన విశ్వవిద్యాలయం చరిత్ర, పురావస్తుశాఖ విభాగం ఆధ్వర్యంలో పరిశోధనలు గత కొంతకాలంగా జరుగుతూనే ఉన్నాయి. ఈ విభాగంలో అకడమిక్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్ రఘుయాదవ్ చేసిన పరిశోధనల్లో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ♦ ఎథ్నో ఆర్కియాలజిస్టు అయిన ఈయన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం, గూడూరు మండలాల సరిహద్దుల్లో వందల సంవత్సరాల క్రితం ధ్వంసమైన సూరబోయిన పాడు (ప్రస్తుతం ప్యాలకుర్తి గ్రామానికి 8 కి.మీ సమీపంలో) అనే పాడుబడిన ప్రదేశంలో నిర్వ హించిన క్షేత్ర పరిశోధనల్లో కొత్తరాతి యుగం నాటి పురావస్తు ఆధారాలు లభించాయి. ♦మొత్తం నల్లరేగడి నేలలో విస్తరించిన ఈ ప్రాంతం వంక ఒడ్డున ఉంది. ఈ వంక తుంగభద్ర నది ఉపనది అయిన హంద్రీనీవలో కలుస్తుంది. ప్యాలకుర్తి గ్రామస్తులు ఈ పరిశోధక ప్రాంతాన్ని ‘పాటి’ మీదిగా పిలుస్తున్నారు. పూర్వం ఈ ప్రాంతాన్ని సుధారపాడు అని పిలుచేవారని స్థానికుల అభిప్రాయం. కంభంపాటి సత్యనారాయణ గారి ఆంధ్రుల చరిత్ర –సంస్కృతిలో సూరబోయినపాడుగా పేర్కొన్నారు. ♦ప్యాలకుర్తి, సూరబోయిన పాడు గ్రామాలను నివాసయోగ్యంగా మార్చేందుకు ఇక్కడ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు నాటి విజయనగర సామ్రాజ్యస్థాపకుడు అయి న మొదటి హరిహరరాయలు (క్రీ.శ. 1336– 1356) నరసింహ అనే వ్యక్తికి అధికారం ఇచ్చి నట్లు తెలుస్తోంది. విజయనగర సామ్రాజ్యం ప తనం అనంతరం ఈ గ్రామం శిథిలమై ఉంటుందని.. ఇందుకు సాక్షాలుగా ఇప్పటికీ అక్క డ శిథిలమై ఉన్న శివాలయం, ఆంజనేయస్వా మి గుడి, బుగ్గరామేశ్వరుని గుడి, చౌడమ్మ విగ్రహాలను పరిశోధకులు గుర్తించారు. ♦లభించిన పూసలు ఒక రంధ్రాన్ని మాత్రమే కలిగి ఉన్నాయి. అయితే అవి విభిన్న ఆకారాలను కలిగి ఉన్నాయి. స్థూపాకారం, గుండ్రంగా వలయాకారం, గొట్టపు ఆకారం, పీపా ఆకారంతో ఉన్నాయి. రాతి పనిముట్లు.. ♦గుండ్రాళ్లు, నూరుడు రాళ్లు ♦వడిసెల రాయి è రాతి గోలీలు మట్టిపాత్రలు.. ♦ఎరుపు, నలుపు రంగులో గల కుండపెంకులు ♦ఎరుపు రంగులోని కెటిల్ వంటి చిన్న మట్టికుండ ♦ఎరుపు రంగులోని కుండ మూత, తొక్కుడు బిళ్ల ఆభరణాలు (పగడాలు, పచ్చలు, పూసలు, గాజులు) ♦ఎర్రని పగడాలు è పచ్చలు ♦స్టియటైట్ (మెత్తని రాయి) పూసలు ♦టెర్రాకొట్ట (మట్టి) పూసలు ♦తెల్లని శంఖుతో తయారైన పూసలు ♦ తెల్లని శంఖుతో తయారైన గాజులు (విరిగిపోయినవి) ♦ పెద్దసైజులో గల ఎర్రమట్టి ఇటుకలు, జంతువుల పళ్లు ♦కొత్త రాతియుగం, మధ్య యుగ కాలం నాటి రాళ్లు, పూసలు లభ్యం ♦కర్నూలు జిల్లా ప్యాలకుర్తి సమీపంలో ఆనవాళ్లు లభ్యం ♦వెలుగులోకి తెచ్చిన వైవీయూ అధ్యాపకుడు స్పష్టమైన ఆధారాలు లభించాయి.. మేము చేపట్టిన పరిశోధనల్లో స్పష్టమైన ఆధారాలు లభించాయి. లభించిన పనిముట్ల ఆధారంగా శిథిలమైన సూరబోయినపాడు గ్రామప్రజలు కొత్తరాతియుగం నుంచి చారిత్రక యుగంలో మధ్యయుగ కాలం వరకు కూడా ఇక్కడ మానవ జీవనం కొనసాగి ఘనమైన చరిత్ర కలిగి ఉండేవని తెలుస్తోంది. వారి జీవన విధానం తెలియజెప్పేలా రాతి పనిముట్లు, మట్టిపాత్రలు, ఆభరణాలు లభ్యమయ్యాయ. – డాక్టర్ రఘుయాదవ్, అకడమిక్ కన్సల్టెంట్, వైవీయూ -
సీమలో 'శిలా'యుగపు 'చిత్రాలు'
వైవీయూ : రాయలసీమ ప్రాంతంలో రాళ్లపై ఉన్న రాతియుగం, మధ్యయుగం, నవీనశిలాయుగాల నాటి రేఖా చిత్రాలకు సంబంధించి జరుగుతున్న పరిశోధనలు ఓ కొలిక్కి వచ్చాయి. వివిధ కాలాల్లో వాటిని గీసినట్టు పరిశోధనల్లో తేలాయి. క్రీ.పూ ఆరు వేల సంవత్సరాల నుంచి మానవుడు రంగులను వాడినట్టు గుర్తించారు. రేఖా చిత్రాల్లో వాడిన రంగుల్ని బట్టి అవి ఏ యుగానికి చెందినవో తదితర విషయాలు కనుగొన్నారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నిధులతో యోగి వేమన విశ్వవిద్యాలయం చరిత్ర, పురావస్తుశాఖ ఆధ్వర్యంలో సీమలోని నాలుగు జిల్లాల్లో 70 ప్రాంతాల్లో రేఖా చిత్రాల ఆనవాళ్లపై పరిశోధనలు సాగుతున్నాయి. విశ్వవిద్యాలయంలోని చరిత్ర, పురావస్తుశాఖ సహాయ ఆచార్యులు డాక్టర్ వి.రామబ్రహ్మం ఆధ్వర్యంలో ‘రాక్ ఆర్ట్ ఇన్ రాయలసీమ రీజియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అన్న అంశంపై 2015లో ఈ పరిశోధనలు ప్రారంభమయ్యాయి. నాలుగు జిల్లాల్లో రేఖా చిత్రాలు కలిగిన 70 ప్రదేశాలను గుర్తించారు. వీటిలో వైఎస్సార్ జిల్లా ముద్దనూరులోని చింతకుంటతో పాటు మరో రెండు ప్రాంతాల్లో, కర్నూలు జిల్లా భోగేశ్వరం, కేతవరం, అనంతపురం జిల్లా నెమికల్లు, బూదగవి, చిత్తూరు జిల్లా మల్లయ్యపల్లి, వెంకటేశ్వరకొట్టాలం, బిరదనపల్లి తదితర 10 ప్రాంతాల్లో ప్రత్యేకమైన రేఖాచిత్రాలను వీరి బృందం గుర్తించింది. మధ్యశిలాయుగం నాటివి కర్నూలు జిల్లా నంద్యాలకు సమీపంలోని భోగేశ్వరం శివాలయానికి సమీపంలోని బొమ్మలగుండు ప్రాంతంలో కుందూ నదీలోయ ప్రాంతంలో సహజసిద్ధంగా ఏర్పడిన రాతిగుహల్లో పలు రేఖాచిత్రాలను గుర్తించారు. రాతి గుహ గోడకు ఉన్న ఈ రేఖాచిత్రాలు సుమారు ఆరు వేల సంవత్సరాలకు పూర్వం నాటివిగా తేల్చారు. రేఖాచిత్రాల కింద భాగంలో నేలపై ఉన్న సూక్ష్మరాతి పనిముట్ల ఆధారంగా అవి మధ్యశిలాయుగానికి చెందినవిగా నిర్ధారించారు. ఎరుపు రంగులో హస్త ముద్రలు, మామిడి పండును చూస్తున్న నెమలి తదితర రేఖా చిత్రాలు క్రీ.పూ.ఆరు వేల సంవత్సరాల నాటివిగా తేల్చారు. రాతి పనిముట్లు ఆయా రంగులు ఆ శిలాయుగాలకు ఆనవాళ్లు బృహత్ శిలాయుగంలో ఆది మానవుడు మట్టి నుంచి, ఇనుము లోహాన్ని ప్రత్యేక ప్రక్రియలో శుద్ధిచేసి, వివిధ లోహపు వస్తు సామగ్రిని వినియోగించి త్రిశూలం, కత్తులు, బల్లెం వంటి యుద్ధ పరికరాలను తయారుచేసేవారని తెలియజెప్పేలా రేఖా చిత్రాలున్నాయి. వీటితో పాటు పులినోట్లో మనిషి చేయి పెట్టినట్టు, గుర్రపు స్వారీ, నందిపాదాలు తెలుపు వర్ణంలో కనిపించాయని పరిశోధకులు చెబుతున్నారు. చారిత్రకయుగ రేఖాచిత్రాల్లో పసుపు వర్ణంలో శ్రీరాముడు, రావణుడు, ఆంజనేయుడి రేఖాచిత్రాలు కనిపించాయి. పైవర్ణాల్లో ఒక్కో వర్ణం ఒక్కో యుగానికి చెందినదిగా వీరు గుర్తించారు. ఎరుపు.. మధ్యశిలాయుగం, తెలుపు.. బృహత్ శిలాయుగం, పసుపును చారిత్రక యుగం ఆనవాళ్లుగా చెబుతున్నారు. క్రీ.పూ 6 వేల ఏళ్ల కిందటే ఆదిమానవులు రంగులను వినియోగించినట్టుగా వారు గుర్తించారు. పరిశోధన ఫలితాలను న్యూఢిల్లీలోని యూజీసీకి పంపామని డా.రామబ్రహ్మం చెప్పారు. వైఎస్సార్ జిల్లాలో దావాండ్లపల్లె, రాణిబావి, మల్లెల వంటి ప్రాంతాల్లో, అనంతపురం జిల్లాలో నిమకళ్లులో, చిత్తూరులో కుప్పం సమీపంలోని వెంకటేశ్వరపురం, మల్లయ్యపల్లి, కర్నూలు భోగేశ్వరం వంటి ప్రాంతాల్లో పరిశోధనలు చేసినట్టు తెలిపారు. పరిశోధనల్లో వైవీయూ అకడమిక్ కన్సెల్టెంట్ రఘుయాదవ్, పరిశోధక విద్యార్థులు సి.శివకుమార్, జె.నారాయణ, పి.నగేష్‌లు పాల్గొన్నట్లు వివరించారు. నాలుగు జిల్లాల్లో పరిశోధనలు చేస్తున్నాం.. రాయలసీమ ప్రాంతంలో రేఖా చిత్రాలున్న 70 ప్రాంతాలను ఇప్పటి వరకు గుర్తించాం. ఇందులో 10 ముఖ్యమైన రేఖాచిత్రాలను గుర్తించాం. 2015 నుంచి నాలుగేళ్లపాటు చేసిన పరిశోధన ఫలితాలను యూజీసీకి పంపాం. యూజీసీ మాకు ఇచ్చిన ప్రాజెక్టు వర్కులో భాగంగా ఈ పరిశోధనలు చేశాం. –డాక్టర్ వేలూరు రామబ్రహ్మం, సహాయ ఆచార్యులు, చరిత్ర, ఆర్కియాలజీ, వైవీయూ రేఖాచిత్రాల కథాకమామిషు.. ఎగువ పాత రాతియుగం నాటి మానవులు ఆహారం కోసం వేటాడే సమయంలో అలసట రావడంతో సేదదీరేందుకు కొండగుహలను ఎంచుకునేవారు. ఆ సమయంలో తమ మదిలో మెదిలిన అప్పటి ఘటనలను రేఖాచిత్రాలుగా గీశారన్నది చరిత్రకారుల భావన. వర్షం పడని ప్రాంతాల్లో, రాతి నిర్మాణాల్లో (రాక్ షెల్టర్స్) వీటిని గీయడంతో నేటికీ అవి చెక్కు చెదరలేదు. - ఇంగ్లాండుకు చెందిన రాబర్ట్ బ్రూస్‌ఫుట్ అనే చరిత్రకారుడు 18వ శతాబ్ధంలోనే ఈ రేఖాచిత్రాలపై పరిశోధనలు ప్రారంభించినట్టు చరిత్రకారులంటున్నారు. 1980వ ప్రాంతంలో ఆస్ట్రియా దేశానికి చెందిన చరిత్ర పరిశోధకుడు న్యుమెయిర్ ఇర్విన్ రాయలసీమ ప్రాంతంలో ఉన్న రేఖాచిత్రాలకు సంబంధించిన సమాచారాన్ని తాను రాసిన ‘లైన్స్ ఆన్ ది స్టోన్’ పుస్తకంలో రాశాడు. - 2009లో వైఎస్సార్ జిల్లా ముద్దనూరు ప్రాంతంలో ‘చింతకుంట’ రేఖాచిత్రాలు విస్తృతంగా ప్రాచుర్యంలోకొచ్చాయి. దీంతో డాక్టర్ రామబ్రహ్మం ఈ రేఖాచిత్రాలపై పరిశోధన చేసేందుకు ఆయన సేకరించిన సమాచారంతో కూడిన నివేదికను యూజీసీకి అందజేశారు. దీంతో యూజీసీ వారు ఆయనకు ‘రాక్ ఆర్ట్ ఇన్ రాయలసీమ రీజియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో ప్రాజెక్టును మంజూరు చేస్తూ రూ.10 లక్షలు విడుదల చేశారు. -
మినీ గోవాగా ఖ్యాతిగాంచిన గ్రామం
సాక్షి, కృష్ణ (మక్తల్) : నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోని ముడుమాల్ గ్రామం ఓ విశిష్టమైన, ఆధ్యాత్మిక, చారిత్రకమైన ప్రాంతంగా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఆదిమానవులు, రుషులు, దేవతలు నడియాడిన ప్రాంతంగా ఇప్పటికే గుర్తింపు పొందింది. ఈ గ్రామంలోని నిలువురాళ్లు ఆదిమానవులు ఏర్పాటు చేసినవిగా ఇప్పటికే పురావస్తు శాఖ గుర్తించి వాటిని కాపాడడానికి ప్రభుత్వం కృషిచేయాలని సంబంధిత శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఇక్కడ చారిత్రాత్మకమైన యాదవేంద్రస్వామి మఠం, శివాలయాలు ఉన్నాయి. ఇక్కడ మంత్రాలయ గురు రాఘవేంద్రస్వామి తపస్సు ఆచరించినట్లు ఆధారాలు ఉండడంతోపాటు ఆయన సమకాలికుడే ఈ యాదవేంద్రస్వామి అని ఆలయ అర్చకులు చెబుతున్నారు. మరోపక్క ఈ మఠం పక్కనే కృష్ణానది, ఆ నదిలో ఇసుక మేటలతో సరిగ్గా గోవాలోని బీచును తలదిన్నే విధంగా ఉండడంతో ఇక్కడికి కర్ణాటక నుంచి ప్రతినిత్యం పర్యాటకులు వస్తుంటారు. ఇలాంటివి ఒకేచోట.. ఒకే గ్రమంలో ఉండడం అరుదు. ఏడాది క్రితం మహబూబ్‌నగర్ కలెక్టర్ సతీమణి, పురావస్తు శాఖ రాష్ట్ర డైరెక్టర్ విశాలాచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించి మంత్రముగ్ధులయ్యారు. దీంతో అప్పట్లో ఆమె పలుమార్లు కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌తో కలిసి వ్యక్తిగతంగా పర్యటించారు. అదేవిదంగా ఈ గ్రామం గతంలో రాజులు, సంస్థానాధీశులు పరిపాలించారు. అప్పటి సంస్థానాధీశులు ఇక్కడి పేద ప్రజలకు వేలాది ఎకరాల భూములను ఇనాంగా ఇచ్చారు. ఇంతటి విశిష్టమైన ప్రాంతాన్ని ప్రభుత్వం గుర్తించకపోవడం దారుణమని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా ఈ గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ధిపర్చాలని డిమాండ్ గ్రామస్తులు చేస్తున్నారు. ఇది చదవండి : కొండా.. కోనల్లో.. లోయల్లో.. సౌకర్యాలు కల్పించాలి ముడుమాల్ను ప్రభుత్వం పర్యాటక కేంద్రంగా గుర్తించి చారిత్రాత్మకమైన ఆలయాలను అభివృద్ధిపర్చాలి. అదేవిధంగా ఇక్కడికి వచ్చే పర్యాటకులకు తాగునీటితోపాటూ ఇతర సౌకర్యాలు కల్పించాలి. ఇందుకు గాను ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు జిల్లా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధికి చొరవ చూపాలి. – అనిల్, ముడుమాల్ -
త్వరలో మరిన్ని శిల్పారామాలు
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను సంరక్షించడంతో పాటు చేతి వృత్తుల కళాకారులకు ఉపాధి కల్పించడమే శిల్పారామం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, టూరిజం, సాంస్కృతిక, పురాతత్వశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఉప్పల్‌లో ఏర్పాటుచేసిన మినీ శిల్పారామం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, పశుసంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. శిల్పారామాన్ని ఆదరించాలని ఆయన ప్రజలను కోరారు. తెలంగాణలోని అన్ని జిల్లాలు సాంస్కృతిక సాంప్రదాయాలకు నెలవని, దానిని దృష్టిలో పెట్టుకొని ప్రతి జిల్లాకు ఒక శిల్పారామం నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఉప్పల్‌లో ఏర్పాటుచేసిన శిల్పారామం ఉప్పల్ పరిసర ప్రాంతాలైన కాప్రా, ఎల్బీనగర్, ఘట్కేసర్, హయత్‌నగర్ తదితర ప్రాంతాలకు ఉల్లాసాన్ని ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు మంత్రి శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. కళలను, కళాకారులను, చేతి వృత్తుల మీద ఆధారపడిన వారికి శిల్పారామం తోడుగా ఉంటుందన్నారు. స్వయం ఉపాధితో పాటు ఆహ్లాదాన్ని కూడా పంచుతుందన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాల ద్వారా ఇక్కడి భగాయత్ రైతులు 12 సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడ్డారని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులంతా ఆనందంతో ఉన్నారని, ఉప్పల్ రూపురేఖలు మార్చారని గుర్తు చేశారు. ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుల త్యాగంతోనే మెట్రో రైల్ స్టేషన్ నిలబడిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో భాగంగా రైతులకు ఎకరానికి వెయ్యి గజాలు, సీలింగ్ భూముల రైతులకు 600 గజాల చొప్పున కేటాయించిందని, సీలింగ్ భూములకు కూడా వెయ్యి గజాలు కేటాయించాలని, మెట్రోలో భూములు కోల్పోయిన వారికి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని మంత్రులను కోరారు. దానికి సానుకూలంగా స్పందించిన మంత్రులు ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి రైతుల సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే భగాయత్ భూముల్లో కొందరికి వీధి పోట్ల ప్లాట్లు లాటరీలో కేటాయించారని వాటిని మార్చాలని కొందరు రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పందించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్ మేకల అనలా హన్మంత్‌రెడ్డి, కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు. మంత్రులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటుచేసిన సాంస్కృతిక కళా ప్రదర్శనలు డప్పులు, డోలు వాయిద్యాలు, నృత్యాలు, ఎంతగానో ఆకట్టుకున్నాయి. -
ఇక.. జల‘సమాధే’
కొన్నింటిని కాపాడితే...చరిత్ర మిగులుతుంది ‘ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రాజెక్టుల వల్ల ముంపు ఏర్పడే చోట చారిత్రక అవశేషాలుంటే వాటిల్లో కొన్నింటిని పదిలపరిచి భావితరాలకు అందించిన దాఖలాలున్నాయి. భవిష్యత్తులో అధ్యయనానికి కూడా అది వీలు కల్పిస్తుంది. పులిచింతల బ్యాక్‌వాటర్ ముంపు ప్రాంతంలో కూడా అలా కొన్నింటిని పరిరక్షించాలి. కుదిరితే ఓ మినీ మ్యూజియం ఏర్పాటు చేయాలి. అరుదైన చరిత్ర అంతరించకుండా కాపాడుకోవాల్సి ఉంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇటీవల వేముగంటి మురళి, చంటి, రాము, గోపి, పాలూరి మోష తదితరులతో కలసి ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఎన్నో అరుదైన నిర్మాణాల అవశేషాలు కనిపించాయి’. – శ్రీరామోజు హరగోపాల్, తెలంగాణ జాగృతి సాక్షి, హైదరాబాద్: రాతియుగం నాటి నిర్మాణమిది. ఇలాంటివి పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో ఎన్నో ఉన్నాయి. పూర్తిగా భూఉపరితలంలో నిర్మాణమైన సమాధులూ ఉన్నాయి. క్యాప్‌స్టోన్ లేని నిర్మాణాలైతే కోకొల్లలు. ఇప్పుడు ఇవన్నీ జలసమాధి కాబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పులిచింతల ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో సూర్యాపేట, నల్లగొండ జిల్లాల పరిధిలోకి వచ్చే కొన్ని గ్రామాలు మునిగిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామాల పునరావాసం దాదాపు పూర్తయింది. మరికొన్ని ముంపు గ్రామాల తరలింపు జరగాల్సి ఉంది. పాత ఊళ్లు నిర్మానుష్యంగా మారి కొత్త ప్రాంతాల్లో ఇళ్లు వెలుస్తున్నాయి. భవిష్యత్తులో ఆ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం క్రమంగా పెరగనున్నందున, ముంపు ప్రాంతాలుగా నిర్ధారించిన పరిధి నీటితో నిండిపోనుంది. గ్రామాల పునరావాసం కొనసాగుతున్నా ‘చరిత్ర’పునరావాసం జాడే లేదు. ఈ విషయమై చరిత్రకారులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి ప్రాంతానికి పూర్వపు చరిత్ర ఉంటుంది. దానికి ఎన్నో ప్రత్యేకతలుంటాయి. ఆయా ప్రాంతాల్లో వెలుగు చూసే పురాతన ఆనవాళ్లు ఆ విశేషాలను వెల్లడిస్తాయి, నాటి చరిత్రకు సజీవసాక్ష్యాలుగా నిలుస్తాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా చారిత్రక ఆనవాళ్లను పదిలం చేస్తుంటారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి రాతియుగం నాటి సమాధులు, వాటి చుట్టుపక్కల ఆదిమానవుల ఆవాసజాడలు వెలుగు చూశాయి. కానీ, ఒక్కో ప్రాంతంలోని నిర్మాణాలు ఒక్కో రకంగా ఉండటం ఆసక్తి కలిగించే విషయమే. ఆయా ప్రాంతాల్లో నేలస్వభావం, దొరికే రాళ్లు, భౌగోళిక స్వారూపం... ఇలాంటివాటి ఆధారంగా నిర్మాణాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. తెలంగాణలో భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల సరిహద్దులో వెలుగుచూసిన డోల్మెన్ సమాధులకు, ఇతర ప్రాంతాల్లోని సిస్ట్ సమాధులకు, ఇప్పుడు పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో లభించిన సమాధులకు తేడాలున్నాయి. సాధారణంగా ఆదిమానవులు క్రూరమృగాల నుంచి రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకునేవారు. వీలైనంతవరకు గుట్టలపై గుంపుగా జీవనం సాగించేవారు. కానీ పులిచింతల ముంపు ప్రాంతాల్లో ఎత్తయిన గుట్టలు లేవు. అన్నీ రాతి మైదానాలే కావడంతో ఆ రాళ్లనే ఆవాసంగా చేసుకున్నారు. ఇక్కడి షాబాద్ రాతి పొరలున్నందున, సమాధుల నిర్మాణానికి కూడా ఆ రాతినే వినియోగించారు. మూడు దశాబ్దాల క్రితం... కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో 30 ఏళ్ల క్రితం భట్టాచారి అనే అధికారి నేతృత్వంలో ఈ ప్రాంతంలో కొంత అధ్యయనం జరిగింది. మచ్చుకు నాలుగు ప్రాంతాలను ఎంపిక చేసుకుని పరిశోధించారు. ఇక్కడ వందల సంఖ్యలో ఇలాంటి నిర్మాణాలున్నాయని గుర్తించారు. చాలావరకు ఇప్పుడు భూగర్భంలో ఉన్నాయి. వాటిల్లో ఇప్పటికీ ఎముకలు, వారు వినియోగించిన వస్తు అవశేషాలున్నాయి. పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తే నాటిచరిత్రకు సంబంధించిన ఎన్నో కొత్త విషయాలు తెలిసేవి. కానీ అధ్యయనం అసంపూర్తిగానే ముగిసింది. ఈలోపు కృష్ణానదిపై పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం జరగటంతో నీళ్లు నిలిచి చాలాప్రాంతాలు ముంపుబారిన పడటం మొదలైంది. ఈ క్రమంలో చారిత్రక ఆనవాళ్లు కూడా జలసమాధి అవుతున్నాయి. భవిష్యత్తులో అధ్యయనం చేసేందుకు కూడా ఆనవాళ్లు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ఇక ఈ చరిత్రే సమాధి అవబోతోంది. అందుకోసం కొన్ని సమాధులు, నాటి ఇతర ఆనవాళ్లను గుర్తించి వాటిని యథాతథంగా మరో ప్రాంతానికి తరలించి ఏర్పాటు చేయాలని, తద్వారా కొంతమేర అధ్యయనానికి అవకాశం ఉంటుందని చరిత్రకారులు అంటున్నారు. -
టీటీడీలో తవ్వకాల వివరాలు ఇవ్వండి!
సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పోటులో తవ్వకాలకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు మంగళవారం ఏపీ ప్రభుత్వాన్ని, టీటీడీ ఈవోను ఆదేశించింది. అంతేకాక.. టీటీడీతో పాటు దాని అనుబంధ ఆలయాలన్నింటినీ రక్షిత కట్టడాలుగా పరిగణిస్తామంటూ రాసిన లేఖకు సంబంధించిన వివరాలను కూడా తమ ముందుంచాలని కేంద్ర పురావస్తు శాఖ (ఏఎస్ఐ)ను ఆదేశించింది. వేటి ఆధారంతో వీటిని రక్షిత కట్టడాలుగా పరిగణిస్తారో తెలియజేయాలని ఏఎస్ఐ కోరింది. ఇందులో భాగంగా ఏపీ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, టీటీడీ చైర్మన్, టీటీడీ ఈవో, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సూపరింటెండెంట్లకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. అంతేకాక, వెయ్యి కాళ్ల మండపం కూల్చివేత, నిర్మాణాలతో పాటు టీటీడీలో పలు వివాదాలపై దాఖలైన వ్యాజ్యాలన్నింటినీ కూడా తాజా వ్యాజ్యానికి జతచేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. టీటీడీలోని పోటు నేలమాళిగలో ఉన్న గుప్త నిధుల వ్యవహారాన్ని తేల్చేందుకు ఓ కమిటీని ఏర్పాటుచేయాలని, అలాగే టీటీడీ ఆదాయ, వ్యయాలపై వాస్తవాలను నిగ్గు తేల్చి, కనిపించకుండాపోయిన విలువైన పురాతన ఆభరణాల జాడ తెలుసుకునేందుకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ గుంటూరు జిల్లా అరండల్‌పేటకు చెందిన బూరగడ్డ అనిల్‌కుమార్, గుజరాత్ గాంధీనగర్‌కు చెందిన భూపేంద్ర కె.గోస్వామి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కేవలం ఆగమ శాస్త్రాల ప్రకారమే శ్రీవారి కైంకర్యాలు జరగాలని గతంలోనే న్యాయస్థానాలు తీర్పులిచ్చాయని తెలిపారు. అయితే, టీటీడీ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఆలయం లోపల తవ్వకాలు జరుపుతున్నారని వివరించారు. తవ్వకాలు ఎక్కడ జరుపుతున్నారని, అసలు తవ్వకాలు జరుగుతున్నాయని మీకెలా తెలిసిందని ధర్మాసనం ప్రశ్నించింది. పోటులో మరమ్మతుల పేరుతో తవ్వకాలు చేస్తున్నారని, ఈ విషయంపై పత్రికల్లో కథనాలు వచ్చాయని, అలాగే.. ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు కూడా చెప్పారని పిటిషనర్ల న్యాయవాది తెలిపారు. శ్రీకృష్ణదేవరాయలతో పాటు అనేకమంది రాజులు ఇచ్చిన పురాతన, అత్యంత విలువైన ఆభరణాలు ఉన్నాయని, వాటి విలువ రూ.52వేల కోట్ల వరకు ఉంటుందని వివరించారు. ఈ ఆభరణాలకు ఇప్పటివరకు బీమా చేయించలేదన్నారు. ఈ ఆభరణాల్లో విలువైన పింక్ డైమండ్ కనిపించకుండాపోయిందని, దానిని ఇటీవల జెనీవాలో వేలం వేసినట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. పింక్ డైమండ్ వ్యవహారం ఇప్పటిది కాదు.. దీనికి ధర్మాసనం ఒకింత తీవ్రంగా స్పందిస్తూ.. ‘పింక్ డైమండ్ వ్యవహారం ఇప్పటిది కాదు. 2010లోనే పింక్ డైమండ్ పగిలిపోయినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన వివాదం హైకోర్టులో కూడా నడిచింది. అయితే, అది పింక్ డైమండ్ కాదు.. రూబీ అని అధికారులు చెప్పారు’అని తెలిపింది. ఈ సమయంలో పిటిషనర్ల న్యాయవాది స్పందిస్తూ, 2014 నుంచి అసలు ధర్మ పరిషత్ లేకుండానే టీటీడీ అనేక కార్యకలాపాలను నిర్వర్తిస్తోందని చెప్పారు. అసలు ధర్మ పరిషత్ ఉంటేనే కార్యకలాపాలు నిర్వహించాలని చట్టంలో ఎక్కడ ఉందో చూపించాలని ధర్మాసనం కోరింది. దీంతో పిటిషనర్ల న్యాయవాది చట్టంలోని ఓ నిబంధనను ప్రస్తావించగా, అది ఎంతమాత్రం ఇక్కడ వర్తించదని ధర్మాసనం స్పష్టంచేసింది. మతపరమైన కార్యకలాపాలకే పరిమితమయ్యేలా టీటీడీని ఆదేశించాలని న్యాయవాది కోరగా, టీటీడీ అనేక కాలేజీలు, ఆసుపత్రులు, సత్రాలను నిర్వహిస్తున్న విష యాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. ఇవన్నీ లౌకిక కార్యకలాపాల కిందకు వస్తాయని, ఇందు లో ఎటువంటి తప్పులేదంది. తలనీలాల వేలం గురించి పిటిషనర్ల న్యాయవాది ప్రస్తావించగా, తలనీలాలు ఇవ్వొద్దని ఆదేశించమంటారా? అంటూ నిలదీసింది. ఈ సమయంలో న్యాయ వాది స్వర్ణ తాపడం గురించి ప్రస్తావించారు. దీనిపై అటు ధర్మాసనానికి, పిటిషనర్ల న్యాయవాది మధ్య కొద్దిసేపు చర్చ జరిగింది. తవ్వకాలు కాదు.. మరమ్మతులే కాగా, ప్రధాన గోపురానికి స్వర్ణ తాపడం చేస్తున్నారని, దీంతో శాసనాలు కనిపించకుండాపోయే ప్రమాదం ఉందని పిటిషనర్ల తరఫు న్యాయ వాది చెప్పగా, దానితో ధర్మాసనం విభేదించింది. ప్రధాన గోపురానికి స్వర్ణ తాపడం ఎన్నో ఏళ్ల క్రితం చేశారని, దానిపై శాసనాలు ఏమీలేవని తెలిపింది. ఈ సమయంలోనే ధర్మాసనం.. పోటులో తవ్వకాల గురించి ప్రశ్నించింది. దీనికి ఏపీ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ సమాధానమిస్తూ, ఎటువంటి తవ్వకాలు జరగలేదని చెప్పారు. కేవలం కొద్దిపాటి మట్టిని తీసి మరమ్మతులు నిర్వహించారని తెలిపారు. ఏది చేసినా కూడా ఆగమ శాస్త్రం మేరకు సలహాలు తీసుకునే చేస్తున్నారని వివరించారు. ఈ సమయంలో పిటిషనర్ల న్యాయవాది రక్షిత కట్టడాల ప్రస్తావన తీసుకువచ్చారు. దీంతో ధర్మాసనం.. ఏఎస్ఐ న్యాయవాదిని వివరణ కోరింది. వేటి ఆధారంగా టీటీడీ, దాని అనుబంధ దేవస్థానాలను రక్షిత కట్టడాలుగా పరిగణిస్తూ లేఖ రాశారో తెలియజేయాలని ఆదేశించింది. దేశంలో తమకు తెలిసి ఏ ఒక్క దేవస్థానమూ రక్షిత కట్టడాల జాబితాలో లేదని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. -
‘కోటిలింగాల’లో చరిత్ర విధ్వంసం!
నాలుగు వైపులా మహా బురుజులు, వాటిని అను సంధానిస్తూ మహా ప్రాకారంతో ఉండిన కోటి లింగాల నగరం తెలుగు చరిత్రకు ఆద్యులుగా పేర్కొనే శాతవాహనుల తొలి రాజధాని. దేశంలో మూడోవంతు ప్రాంతాన్ని మూడు శతాబ్దాల పాటు ఏలిన ఘన చరిత్ర వారి సొంతం. జగి త్యాల జిల్లా వెల్గటూరు మండలంలోని గోదావరి తీరంలో ఈ నగరం ఉంది. 1 970వ దశాబ్దంలోనే పురావస్తు శాఖ అధికారులు తాత్కాలికంగా తవ్వ కాలు జరిపి అలనాటి నగర ఆనవాళ్లను గుర్తిం చారు. దాని ఆధారంగా నగరం విస్తీర్ణం, దాని రూపుపై ప్రాథమిక అంచనాలు వెల్లడించారు. అయితే ఇక్కడ కోటిలింగాలలో పూర్తి స్థాయిలో తవ్వకాలు జరిపే అంశం 40 ఏళ్లుగా పక్కన పడింది. ఇటీవల హెరిటేజ్ తెలంగాణ డైరెక్టర్ విశా లాచ్చి దీనిపై దృష్టి సారించారు. ఆ ప్రాంతంలోని భూములను సేకరించి.. తవ్వకాలు జరిపే ప్రతి పాదనను తెరపైకి తెచ్చారు. కానీ.. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంతో చారిత్రక ఆనవాళ్లు ప్రమాదంలో పడ్డాయి. – సాక్షి, హైదరాబాద్ పుష్కరాల సందర్భంగా.. గోదావరి పుష్కరాల సమయంలో జిల్లా అధికారులు కనీస అవగాహన లేకుండా చారిత్రక ఆనవాళ్లున్న ప్రాం తాన్ని దెబ్బతీశారు. ఇక్కడ నదిలో పుణ్యస్నానాలు చేసేందుకు వచ్చే భక్తుల వాహనాల కోసం చారిత్రక ఆన వాళ్లున్న స్థలాన్నే పార్కింగ్‌గా వినియో గించారు. ఆ స్థలంలో పెద్ద సంఖ్యలో ట్రాక్టర్లతో మొరం మట్టి పోయించి.. రోడ్డు రోలర్లతో చదును చేయించారు. దాంతో చారిత్రక ఆనవాళ్లకు నష్టం కలిగి ఉండవచ్చని ఆందోళన వ్యక్తమవు తోంది. గోదావరి పుష్కరాలు 2015 జూలైలోనే జరిగినా.. ఇప్పటివరకు పురావస్తుశాఖ గుర్తించలేకపోయింది. ఇటీవల దీనిపై ఫిర్యాదులు రావడంతో.. వెళ్లి పరిశీలించిన పురావస్తు అధికారులు అవాక్క యినట్టు తెలిసింది. పార్కింగ్ కోసం మట్టిపోసి చదును చేసిన చోట చారిత్రక నిర్మాణాల పైభాగాలు దెబ్బతిని ఉంటాయని భావిస్తున్నారు. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టుతో ఆ ప్రాంతంలో సాగు పెరిగింది. కోటిలింగాలలోనూ 30 ఎకరాల మేర వ్యవసాయం మొదలైంది. దీంతో భూగర్భంలోని నిర్మాణాలు దెబ్బతినే అవకాశముందని అంటున్నారు. -
కదంబ రాజ్యంపై మరిన్ని ఆధారాలు..!
సాక్షి, బెంగుళూరు: కన్నడ మాతృ భాషగా వర్థిల్లిన కదంబ రాజ్యానికి సంబంధించి మరిన్ని ఆధారాలు లభించనున్నాయి. కర్ణాటకలో ప్రధాన పట్టణమైన శివమొగ్గకు 80 కి.మీ దూరంలోని తాలగుండ ప్రాంతంలో కదంబ విలసిల్లింది. దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలను వెలికితీసేందుకు నమూనా తవ్వకాలను చేపడతామని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు వెల్లడించారు. తవ్వకాలు జరిపే ప్రదేశంలోనే ప్రసిద్ధ ప్రణవేశ్వర స్వామి ఆలయం ఉంది. ఏడున్నర ఎకరాల్లో తవ్వకాలు జరపనున్నట్లు బెంగుళూరు ఏఎస్ఐ సూపరింటెండెంట్ కె.మూర్తేశ్వరి తెలిపారు. తవ్వకాలకు సంబంధించిన క్లియరెన్స్‌లు మరో పదిరోజుల్లో వస్తాయని అన్నారు. కీ.శ.350లో మయూర శర్మన్ కదంబ రాజ్యాన్ని స్థాపించాడని చరిత్ర చెబుతోంది. సుమారు 200 ఏళ్లపాటు ఈ రాజ్యం ఉనికిలో ఉంది. రాజ్యంలో కదంబ చెట్లు అధికంగా ఉండడంతో రాజ్యానికి ఆ పేరు వచ్చిందని ఏఎస్ఐ అధికారులు తెలిపారు. ‘ప్రణవేశ్వర ఆలయాన్ని పునఃనిర్మించే క్రమంలో బంగారు, వెండి నాణేలు లభించడంతో మా నమ్మకాలు మరింత బలపడ్డాయి’ అని రిటైర్డ్ ఏఎస్ఐ సూపరింటెండెంట్ టీఎం కేశవ అన్నారు. కీ.శ.450 కి చెందిన రాగి శాసనం హాసన్ జిల్లా హాల్మిడి ప్రాతంలో బయటపడిందన్నారు. ఇదే కన్నడ భాషలో లిఖించబడ్డ అతి పురాతన శాసనమని తెలిపారు. -
445 ఏళ్ల నాటి రాతి శాసనం
వెంకటగిరి: జిల్లాలోని చిల్లకూరు మండలం చేడిమాలలో 1572 నాటి తెలుగు శాసనం గురువారం లభ్యమైంది. భారత పురావస్తుశాఖ అధికారి ఎం.యేసుబాబు, వెంకటగిరికి చెందిన చరిత్రకారుడు షేక్ రసూల్ అహ్మద్ కథనం మేరకు.. వారం రోజులుగా తాము జిల్లాలో చరిత్ర మూలాలపై పరిశోధనలు చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో చిల్లకూరు మండలం చేడిమాలలో పురాతన ఈశ్వరాలయం వెనుక భాగంలో ముళ్ల పొదల మధ్య 6 అడుగుల పొడవు, 2.5 అడుగుల వెడల్పుతో 21 వరుసలు ఉన్న తెలుగు శాసనాన్ని గుర్తించామని తెలిపారు. చేడిమాల చెరువుకు సంబంధించిన శాసనమని పేర్కొన్నారు. ఈ శాసనంలో శాలివాహన శకర్షము, జయ సంవత్సరంలో రాజైన ముద్దుకృష్ణమనాయనికి పుణ్యముగా కొప్పూరి వీరమురసయ్య చేడిమాలలో చెరువును తవ్వించి మాన్యాలను కేటాయిస్తూ గ్రామ అధికారి పర్యవేక్షణలో ఉండేటట్లు నిర్ణయించబడినట్లు ఉందని పురావస్తుశాఖ అధికారి యేసుబాబు వివరించారు. అప్పట్లో ఈ ప్రాంతం దుగరాజపట్నం, వెంకటగిరికి ప్రముఖ కూడలిగా వర్ధిల్లిందని, ఇక్కడ ప్రాచీన కట్టడాలను బట్టి చెప్పవచ్చునన్నారు. జిల్లాలో ముద్దుకృష్ణమనాయునికి సంబంధించి అరుదైన శాసనంగా పేర్కొన్నారు. -
ప్రత్యేకత ఉంటేనే వారసత్వ సంపద!
ఏది పడితే అది వారసత్వ సంపద కాదు: సీఎం కేసీఆర్ ► చారిత్రక ప్రాధాన్యం ఉండాలి ► వారసత్వ సంపద గుర్తింపు కోసం కమిటీ ► సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు.. ప్రతిపక్ష నేతకూ చోటు ► రాష్ట్రవ్యాప్తంగా కోటలు, ప్రాధాన్యమున్న గడీలను గుర్తిస్తాం ► ప్రాధాన్యమున్న వాటిని సంరక్షిస్తాం.. పనికిరాని వాటిని తొలగిస్తాం ► ప్రైవేటు కట్టడాలను హెరిటేజ్ జాబితాలో ఉంచబోం ► వాటిపై హక్కులను సంబంధీకులకే వదిలేస్తామని వెల్లడి ► తెలంగాణ వారసత్వ కట్టడాల బిల్లుకు ఆమోదం సాక్షి, హైదరాబాద్: చారిత్రక ప్రాధాన్యత, ప్రత్యేకతలున్న వాటినే ఇక నుంచి వారసత్వ సంపదగా పరిగణిస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తెలిపారు. దేనిని పడితే దానిని వారసత్వ సంపదగా పేర్కొనే విధానానికి స్వస్తి పలుకుతామని చెప్పారు. ఆదివారం శాసనసభలో ‘తెలంగాణ ప్రత్యక్ష, పరోక్ష వారసత్వ సంపద సంరక్షణ, పరిరక్షణ, పునరుద్ధరణ, నిర్వహణ బిల్లు’ను ప్రవేశపెట్టిన కేసీఆర్.. దాని ఉద్దేశాలను వివరించారు. ‘‘వారసత్వ సంపద అంటే అర్థం పర్థం ఉండాలె. గతంలో ఇష్టం వచ్చినట్టు చేశారు. వాటివల్ల ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి. సుప్రీంకోర్టు చెప్పిందన్న పేరుతో గతంలో కేంద్రం కొన్ని ఆదేశాలిస్తే... రాష్ట్రాలు కనిపించిన ఖాళీ భూములన్నింటినీ అటవీ భూములుగా మార్చాయి. ఇప్పుడు గజం స్థలం సేకరించాలంటే.. గ్రీన్ ట్రిబ్యునల్ అని, ఆ ట్రిబ్యునల్ అని, ఈ ట్రిబ్యునల్ అని తిరగాల్సి వస్తోంది. ఈ పద్ధతి మంచిది కాదు.. అందుకే ప్రత్యేక ప్రాధాన్యమున్న వాటినే వారసత్వ జాబితాలో చేరుస్తాం..’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. అధ్యయనం చేసి నిర్ణయిస్తాం.. మనకంటూ ఉన్న చరిత్ర, ఇతర ప్రాధాన్యానికి గుర్తుగా ఉన్న కట్టడాలు, స్థలాలు, కళలను పరిరక్షించాలని.. అదే సమయంలో భావి అవసరాలకు తగ్గట్టు జరిగే అభివృద్ధికి నిరోధకంగా మారే విధానాలను మార్చుకోవాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చిన వారసత్వ చట్టంలో అనేక లొసుగులున్నాయన్నారు. హైదరాబాద్ పరిధిలో ఎన్నో చారిత్రక అవశేషాలు ఉన్నాయని, వాటిని విస్మరించారని చెప్పారు. మరోవైపు కొన్ని ప్రైవేటు భవనాలను వారసత్వ సంపద కిందకు తీసుకొచ్చారని.. గ్రీన్‌ల్యాండ్ గెస్ట్‌హౌస్‌ను కూడా అందులో చేర్చడమేమిటని పేర్కొన్నారు. వారసత్వ సంపద అంటే హైదరాబాద్‌కే పరిమితం కాకూడదని.. రాష్ట్రవ్యాప్తంగా కోటలు, చారిత్రక కట్టడాల వంటివాటిపై సమగ్ర అధ్యయనం చేసేందుకు సీఎస్ నేతృత్వంలో కమిటీ వేశామని కేసీఆర్ వెల్లడించారు. ఆ కమిటీలో ప్రతిపక్ష నేతకు కూడా చోటు కల్పించనున్నట్టు తెలిపారు. గందరగోళం తప్పేలా ఉండాలి పురావస్తు శాఖ పరిధిలో ఉన్న జోగు ళాంబ దేవాలయంలో కొత్తగా ఎక్కడైనా దీపం పెడదామంటే పంచాయితీ ఉందని.. ఢిల్లీలో ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఎగురేసినట్టు మన గోల్కొండ కోటలో ఎగరే యాలంటే ప్రతిసారి కేంద్ర పురావస్తు శాఖ అనుమతి పొందాలని.. ఈ గందరగోళ మంతా ఎందుకని కేసీఆర్ పేర్కొన్నారు. సచివాలయంలో సమాధిలాగా మారిన పురా తన జీబ్లాక్ భవనాన్ని కూల్చి వేద్దామంటే దిక్కుమాలిన హెరిటేజ్ నిబంధన అడ్డం వస్తోందన్నారు. కోటలు, ప్రముఖ గడీలతో పాటు ముఖ్యమైన చారిత్రక కట్టడాలను సంరక్షించి, పునరుద్ధరించుకోవాల్సిన అవస రముందని.. పనికిరాని కట్టడాలను తొలగిం చాల్సిందేనని పేర్కొన్నారు. ‘‘బ్రెజిల్‌లోని ప్రముఖ నగరం రియో కు మేయర్‌గా వచ్చిన ఓ వ్యక్తి.. పట్టణ ప్రాంతాల భూవినియోగ ప్రాధాన్యాన్ని గుర్తించి తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ఇప్పుడా నగరం ప్రపంచంలోనే ముఖ్యమైన హరిత నగరాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. జనం పెరుగుతున్న తరు ణంలో వారి అవసరాలకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది’’ అని చెప్పారు. కబ్జాలు, ఆక్రమణలు నిరోధించండి చారిత్రక ప్రాంతాల్లో కబ్జాలను నిరోధించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ సభ్యుడు సంపత్ ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు వద్ద ఆక్రమణలు లేకుండా చూడాలన్నారు. తాను చిన్నప్పటి నుంచి చూస్తున్న బంజారాహిల్స్ రోడ్డు నం.14లోని ఓ హెరిటేజ్ ప్యాలెస్ ఉన్నట్టుండి కనుమరుగైందని, దానికి కారణమేమిటని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్.. ఆ ప్యాలెస్ హెరిటేజ్ జాబితాలో లేదని సమాధానమిచ్చారు. ప్రైవేటు వ్యక్తులకు చెందిన కట్టడాలను వారసత్వ సంపద జాబితాలో ఉంచబోమని.. వాటిపై హక్కు వారికే వదిలేస్తామని, వాటి నిర్వహణను ప్రభుత్వం ఎలా తీసుకుంటుందని చెప్పారు. అనంతరం బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రకటించారు. -
చరిత్ర ఆనవాళ్లను చెరిపేయొద్దు
నంగునూరు: తవ్వకాల సందర్భంగా గ్రామాలలో బయటపడుతున్న చారిత్రక ఆనవాళ్లను కాపాడాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని పురావస్తు శాఖ సంచాలకులు విశాలాక్షి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకులలో రెండో విడత తవ్వకాలను ఆమె బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలమాకులలోని రక్కిసరాళ్ల ప్రాంతంలో ఆది మానవుల అవశేషాలు ఉన్నాయన్నారు. సుమారు 3,500 సంవత్సరాల కిందట ఇక్కడ మానవులు జీవించారని, సిస్ట్ బరియల్ సమాధులను నిర్మించారని చెప్పారు. ఆదిమానవులు ఎక్కడి నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారో శాస్త్రీయంగా పరిశోధిస్తామన్నారు. పుల్లూర్‌లో జరిపిన తవ్వకాల్లో 2,500 యేండ్ల నాటి సమాధులుగా తేల్చామని, నర్మెట, పాలమాకులలో లభించే వస్తువులపై డీఎన్ఏ పరీక్షలు చేసి వాస్తవాలు వెలికి తీస్తామన్నారు. తెగిన క్రేన్ వైర్లు తవ్వకాల్లో భాగంగా బయటపడ్డ అతి పెద్ద రాతి సమాధిని తెరిచేందుకు రెండు క్రేన్లతో ప్రయత్నించగా.. ఓ క్రేన్ తీగలు తెగి గాలిలోకి లేచింది. రాతిబండ చాలా బరువు ఉందని, హైదరాబాద్ నుంచి రెండు భారీ క్రేన్లను తెప్పించి కప్పులను తొలగిస్తామని విశాలక్షి తెలిపారు. ఆమె వెంట పురావస్తుశాఖ ఉప సంచాలకులు రాములునాయక్, సహాయ సంచాలకులు పద్మనాభం, జెడ్పీవైస్ చైర్మన్ సారయ్య, ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, సర్పంచ్ రవీందర్‌రెడ్డి, పురావస్తుశాక సహాయ సంచాలకులు నాగరాజు, ప్రాచీన కట్టడాల సంరక్షకుడు భానుమూర్తి, స్థానిక నాయకులు ఉన్నారు. -
అద్భుత ‘ఆదిమ’ చిత్రాల నెలవు తెలంగాణ
పురావస్తు శాఖ ప్రత్యేకాధికారి రంగాచార్యులు సాక్షి, హైదరాబాద్: ఆదిమ మానవులు గీసిన అద్భుత వర్ణచిత్రాలకు తెలంగాణ నెలవని పురావస్తు శాఖ ప్రత్యేకాధికారి రంగాచార్యులు అన్నారు. అలాంటి చిత్రాలున్న ఎన్నో ప్రాంతాలను గత మూడు దశాబ్దాల్లో సహచర ఉద్యోగులతో కలసి వెలుగులోకి తేవడం తన జీవితాంతం గుర్తుండిపోతుందన్నారు. తెలంగాణ రాతి వర్ణ చిత్రాలపై అంతర్జాతీయ పురావస్తు సదస్సులో ఆయన పత్రాలు సమర్పించారు. యునెస్కో గుర్తింపు పొందిన భీంబెట్కా కంటే వరంగల్ సమీపంలోని పాండవుల గుట్ట గొప్పదన్నారు. వచ్చే సదస్సు నాటికి వంద ‘ఆదిమ’ ప్రాంతాలు రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో ఆదిమ మానవుల వర్ణచి త్రాలున్న 26 ప్రాంతాలనే గుర్తించగా, తదనంతరం తనవంటి వారు వాటిని 66కు చేర్చారు. వచ్చే అంతర్జాతీయ సదస్సు నాటికి ఈ సంఖ్య 100కు చేరవచ్చు. – ద్యావనపల్లి సత్యనారాయణ, పురావస్తు పరిశోధకుడు సదస్సు నిర్వహణ భేష్... సదస్సును గొప్పగా నిర్వహించారంటూ ప్రతినిధులు అభినంది స్తున్నారు. ముఖ్యంగా విదేశీ ప్రతినిధుల నుంచి ప్రత్యేక అభినంద నలు వచ్చాయి. – రాములు నాయక్, పురావస్తు శాఖ సహాయ సంచాలకుడు నాణేలూ చరిత్ర చెబుతాయి: డాక్టర్ రాజారెడ్డి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో లభించిన పురాతన నాణేలు చరిత్రకు సంబంధించి కొత్త పాఠాలు చెబుతున్నాయని నాణేల సేకరణలో అపూర్వ అనుభవమున్న డాక్టర్ రాజారెడ్డి పేర్కొన్నారు. 3.5 లక్షల నాణేలతో హైదరాబాద్ స్టేట్ మ్యూజియం ప్రపంచంలోనే గొప్ప నాణేల మ్యూజియంగా వర్ధిల్లుతోందన్నారు. హైదరాబాద్‌పై ప్రత్యేకాభిమానం చూపే 92 ఏళ్ల జగదీశ్‌మిట్టల్ నడవలేని స్థితిలో ఉండి కూడా సదస్సులో పాల్గొని పలు సూచనలు చేశారు. వచ్చే ఏడాది వరంగల్‌లో సదస్సు పురావస్తు శాఖ నిర్వహించిన తొలి అంతర్జాతీయ సదస్సు విజయవంతం కావడంతో ఇకపై వీటిని ఏటా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి సదస్సు రెండు రోజులు జరగ్గా, ఇకపై మూడు రోజల పాటు నిర్వహించనున్నారు. 2018 జనవరి 18– 20 మధ్య వరంగల్‌లో సదస్సు జరపాలని నిర్ణయించారు. చివరి రోజు ప్రధాన పర్యాటక, పురావస్తు ప్రాంతాల్లో క్షేత్ర పర్యటనలు జరపాలని నిర్ణయించినట్టు పురావస్తు శాఖ సంచాలకురాలు విశాలాచ్చి తెలిపారు. -
‘మమ్మీ’కి ప్రాణం..!
- జర్మనీ నుంచి ఆక్సిజన్ ఫ్రీషోకేస్ కొనుగోలు - విదేశీ సంస్థతో ఒప్పందం.. మరో నెలలో ఏర్పాటు - షోకేస్‌లోకి గాలిచొరబడకుండా నైట్రోజన్ జనరేటర్ - ఇప్పటికీ మమ్మీ సురక్షితమేనని స్కానింగ్, ఎక్స్‌రే ద్వారా నిర్ధారణ సాక్షి, హైదరాబాద్: మనిషికి ప్రాణవాయువు గాలి.. అది అందకుంటే ఉక్కిరిబిక్కిరవుతాడు.. కానీ అదే ఆక్సిజన్ ‘ఆమె’ను అవసానదశకు చేర్చింది.. ఇప్పుడు ఆమెను రక్షించేం దుకు ఆక్సిజన్ అందకుండా చేయబోతున్నా రు. ఇందుకోసం జర్మనీ నుంచి ప్రత్యేక పరికరాన్ని తెప్పిస్తున్నారు. ఇదంతా డాక్టర్ వైఎస్సా ర్ స్టేట్ మ్యూజియంలో ఉన్న ‘మమ్మీ’ కథ. స్టేట్ మ్యూజియంలో ఉన్న ప్రత్యేకతల్లో ముఖ్యమైంది ఈజిప్షియన్ మమ్మీ. సందర్శకులు దీన్ని ఆసక్తిగా తిలకిస్తుంటారు. అందుకే మ్యూజియం హాలులో ప్రాధాన్యం కల్పించి దీన్ని ఏర్పాటు చేశారు. కానీ దానికి శాస్త్రీయ సురక్షిత కవచం లేకపోవటంతో వాతావరణ పరిస్థితులు, వాయు, శబ్ద కాలుష్యం బారిన పడి దెబ్బతింది. ఇప్పుడు దీన్ని ‘రక్షించేం దుకు’ పురావస్తు శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రూ.58 లక్షలు వెచ్చించి ఆక్సిజన్ జొరబడని ఎయిర్ ఫ్రీ గ్లాస్ షోకేసును కొంటోంది. ఈ మేరకు జర్మనీకి చెందిన ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. మరో నెల రోజుల్లో ఈ షోకేసు నగరానికి చేరనుంది. ఎందుకీ పరిస్థితి.. దేశంలోని ఆరు ప్రాంతాల్లో ఈజిప్షియన్ మమ్మీలు ఉన్నాయి. ఇందులో దక్షిణాదిలో ఏకైక మమ్మీ మన స్టేట్ మ్యూజియంలో కొలువుదీరింది. 2353 ఏళ్ల క్రితం చనిపోయిన యువతి శవాన్ని ఈజిప్షియన్ పద్ధతుల్లో మమ్మీగా మార్చారు. దాన్ని ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ అల్లుడు వేయి పౌండ్లు వెచ్చించి భాగ్యనగరానికి తెప్పించారు. ఆ తర్వాత ఇది ఏడో నిజాం మీర్ఉస్మాన్ అలీఖాన్‌కు బహుమతిగా రావటంతో 1930లో దాన్ని ఆయన స్టేట్ మ్యూజియంకు బహూకరించారు. అప్పటి నుంచి అది మ్యూజి యంలో ప్రధాన ఆకర్షణగా ఉంది. 4 వైపులా అద్దాలున్న చెక్క షోకేసులో ఈ మమ్మీని ఉంచారు. దీంతో లోనికి సులభంగా ఆక్సిజన్ జొరబడి బ్యాక్టీరియా ఉత్పన్నమై మమ్మీ క్రమంగా శిథిలమవుతూ వచ్చింది. బాగా దెబ్బతిన్నాకగానీ పురావస్తు శాఖ అధికారులు దీనిని గుర్తించలేదు. దీంతో మమ్మీని ఎలా కాపాడాలో తెలియక ఇరాన్‌కు చెందిన నిపుణులకు కబురుపెట్టారు. వారు వచ్చి వెంటనే ఆక్సిజన్ ఫ్రీ షోకేస్ ఏర్పాటు చేయాలని చెప్పటంతో ఇప్పుడు దాన్ని తెప్పించే ఏర్పాట్లు చేశారు. ఇటీవల ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకటన ఇవ్వటంతో జర్మనీకి చెందిన గ్లాస్బా అనే సంస్థ రూ.58 లక్షలకు కొటేషన్ వేసి ఎంపికైంది. ఇప్పుడు ఆ సంస్థతో పురావసు ్తశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. మూడేళ్ల వారంటీ తో మరో నెల రోజుల్లో అది ఆక్సిజన్ ఫ్రీ షోకేస్‌ను సమకూర్చనుంది. దీనికి నైట్రోజన్ సరఫరా చేసే జనరేటర్ కూడా ఉంటుంది. ఇది బ్యాక్టీరియాను నియంత్రిస్తుంది. ఆ మమ్మీ 16 ఏళ్ల యువతిది కాదట.. మ్యూజియంలో ఉన్న మమ్మీ ఈజిప్టు రాజకుటుంబానికి చెందిన 16 ఏళ్ల యువతిదిగా భావిస్తూ వచ్చారు. కానీ.. ఇటీవల స్కానింగ్, ఎక్స్‌రేలు తీసి పరిశీలించగా, అది 25 ఏళ్ల యువతిదని తేల్చారు. ఇప్పటికీ మెదడులోని కొంతభాగం చెక్కుచెదర లేదని, ఇతర ప్రధాన శరీర భాగాలు కూడా బాగానే ఉన్నాయని తేలింది. ఇది తదుపరి పరిశోధనలకూ ఉపయోగపడుతుందని గుర్తించారు. -
‘కోటి లింగాల’కు కోటి కష్టాలు!
- చారిత్రక నగరానికి ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ముప్పు - జలాశయాన్ని ఈసారి పూర్తిగా నింపాలని సర్కారు నిర్ణయం - పురాతన నగరమున్న ప్రాంతంలో కొంతమేర మునిగే అవకాశం - నీరు చేరకుండా భారీ రక్షణ గోడ ఏర్పాటు యోచన - సర్వే చేసిన నిపుణులు..త్వరలో పనులు! సాక్షి, హైదరాబాద్ : దేశంలోనే మూడోవంతు ప్రాంతాన్ని ఏలిన శాతవాహనుల చారిత్రక మహా నగరం ‘కోటి లింగాల’ ఆనవాళ్లకు ముప్పు వచ్చింది. దశాబ్దాల పాటు తీవ్ర నిర్లక్ష్యానికి గురై.. ఇంతకాలానికి వెలుగు చూడబోతోందనగా మరో సమస్య వచ్చి పడింది. ఎల్లంపల్లి ప్రాజెక్టును ఈసారి పూర్తిస్థాయిలో నింపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఈ చారిత్రక నగరం ఆనవాళ్లున్న ప్రదేశంలో కొంతభాగం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో మునిగిపోయే అవకాశముంది. దేశంలోనే తొలిసారిగా.. కోటిలింగాలలో దాదాపు వంద ఎకరాల విస్తీర్ణంలో శాతవాహనుల తొలి రాజధాని కోటిలింగాల నగరం ఆనవాళ్లున్నట్లు 1978లో జరిపిన తవ్వకాల్లో గుర్తించారు. కానీ ఇంతకాలం దానిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆ వంద ఎకరాల స్థలంలో తవ్వకాలు జరిపి నగరాన్ని వెలుగులోకి తెచ్చేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆ ప్రదేశానికి ఉత్తరం వైపు గోదావరి నది ఉంది. అక్కడికి కొద్ది దూరంలో కట్టిన ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఈసారి 20 టీఎంసీల మేర నీటిని నిల్వచేయాలని తాజాగా సర్కారు నిర్ణయించింది. ఆ మేర నిల్వచేస్తే ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ కోటిలింగాల ప్రాంతంలో కొంతభాగం మునిగిపోయే అవకాశముంది. అదే జరిగితే తవ్వకాలు జరపడం సాధ్యం కాదు. ఎండాకాలంలో నీటిమట్టం తగ్గినప్పుడు తవ్వినా.. తిరిగి వానాకాలంలో ముంపు తప్పదు. ఈ నేపథ్యంలో శాశ్వత పరిష్కారంగా నదికి వారగా భారీ రక్షణ గోడను నిర్మించాలని పురావస్తుశాఖ నిర్ణయించింది. నీటిని ఇవతలివైపు రానీయని విధంగా విదేశాల్లో నదీముఖంగా అలాంటి గోడలు నిర్మిస్తుంటారు. మనదేశంలో తొలిసారిగా ఓ చారిత్రక కట్టడానికి రక్షణగా ఆ గోడను నిర్మించనున్నారు. దీనికి సంబంధించి నిపుణుల బృందం ఇటీవల సర్వే చేసింది. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా ఖర్చు అంచనాలు రూపొందించి, ప్రభుత్వం అనుమతితో పనులు చేపట్టాలని పురావస్తుశాఖ భావిస్తోంది. ఇదంతా సెప్టెంబర్‌లోపు పూర్తి చేయాలని భావిస్తున్నారు. కర్ణమామిడి లోనూ తవ్వకాలు గోదావరి నదికి అవతలి భాగంలో ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే కర్ణమామిడి వద్ద కూడా పురావస్తు శాఖ తవ్వకాలు జరపనుంది. అయితే ఆ ప్రాంతం పూర్తిగా ప్రాజెక్టు నీటిలో మునిగిపోనుంది. అందువల్ల నీళ్లు చేరేలోపే తవ్వకాలు జరిపి అధ్యయనం చేయనున్నారు. ఈ ప్రాంతం శాతవాహనుల కంటే ముందు రాజుల ఏలుబడిలో ప్రాధాన్యమున్న ప్రాంతంగా పురావస్తు శాఖ భావిస్తోంది. దాని విస్తీర్ణం స్వల్పంగానే ఉంటుందని అంచనా. అది పూర్తిగా మునిగిపోయే ప్రాంతం కావడంతో.. కట్టడాల ప్రాధాన్యాన్ని బట్టి మరో ప్రాంతానికి తరలించే యోచనలో ఉన్నారు. ఇక్కడ ఆగస్టు చివరికల్లా తవ్వకాలు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. -
ఎమ్మెల్యే కోన చొరవతో గాలిగోపురం
► పనులకు శంకుస్థాపన ► మూడునెలల్లోగా మొదటి దశ పనులు పూర్తి చేస్తాం ► ప్రతిష్టాత్మకంగా నిర్మాణం ఎమ్మెల్యే కోన రఘుపతి బాపట్ల : బాపట్ల ప్రాంతం ప్రజల చిరకాలకోర్కె, ఎమ్మెల్యే కోన రఘుపతి ఎన్నికల హామీల్లో ఒకటైన భావన్నారాయణస్వామి దేవాలయ గాలిగోపురం శంకుస్థాపన ఎట్టకేలకు బుధవారం చేపట్టారు. 2011 అక్టోబరు 23వతేదీన గాలిగోపురం కూలిపోవటం దగ్గర నుంచి ఎంతో మంది ఎన్నోరకాలుగా పనులు చేపట్టేందుకు ప్రయత్నించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రత్యేక చొరవ చూపి పురావస్తుశాఖతో చేసిన సంప్రదింపులు ఫలించాయి. గాలిగోపురం నిర్మాణానికి రూ.2.62 కోట్లు ప్రతిపాదించగా మొదటి విడతగా రూ.95లక్షల నిధులు విడుదల చేయించి తొలి పునాదిరాయి వేయించగలిగారు. కేంద్ర పురావస్తుశాఖ సూపరింటెండెంట్ నిజాముద్దీన్ తహిర్, ఏఈలు ఎన్‌సిహెచ్ పెద్దింట్ల, వెంకటేశ్వరరావు, ఆలయ ప్రధాన పూజారి నల్లూరి రంగాచార్యులు సమక్షంలో ప్రత్యేక పూజల మధ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ గాలిగోపురం పనులు ప్రారంభించాలని ఎన్నోసార్లు పురావస్తుశాఖ ఢిల్లీ కార్యాలయం చుట్టూ తిరిగామని చెప్పారు. డిజైన్ నుంచి మెటీరీయల్ వరకు పలుమార్లు అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. వాటిని తిరిగి ప్రతిపాదించటంతోపాటు టెండర్లలో 35 శాతం తక్కువకు కోడ్ చేయటంతో పనులలో జాప్యం నెలకొందని పేర్కొన్నారు. బాపట్లకే తలమానికంగా ఉన్న క్షీరభావన్నారాయణస్వామి దేవాలయం అభివృద్ధి చేయాలనే తలంపు ఈ ప్రాంత ప్రజల కోర్కె అన్నారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నిర్మాణం చేస్తామన్నారు. మూడు నెలల్లోగా మొదటి దశ పనులు పూర్తిచేస్తామని వెల్లడించారు. పురావస్తుశాఖ సూపరింటెండెంట్ నిజాముద్దీన్ తహిర్ మాట్లాడుతూ ప్రజల మనోభావాలకు అనుగుణంగా గాలిగోపురం పనులు పూర్తి చేస్తామని వివరించారు. బిఎస్ నారాయణభట్టు, తిలక్, బాబునాగేంద్రం, వెదురుపర్తి లక్ష్మణ, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు కోకి రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మధ్యయుగంలోనే ‘గాజు పరిశ్రమ’
నల్లగొండ జిల్లాలో లభించిన చారిత్రక ఆధారాలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ : చారిత్రక ఆధారాలకు నెలవైన నల్లగొండ జిల్లాలో మరో కీలక చారిత్రక ఆధారం లభ్యమైంది. మధ్యయుగ కాలంలోనే (క్రీ.శ. 8-12 శతాబ్దాలు) ఇక్కడ గాజు పరిశ్రమ ఉందని చెప్పేందుకు అవసరమైన ఆనవాళ్లు లభించాయి. జిల్లాలోని కనగల్ మండలం పగిడిమర్రి గ్రామంలో బుధవారం పురావస్తు శాఖ అధికారులు జరిపిన తవ్వకాల్లో మధ్య యుగం నాటి రంగు పెంకులు లభించాయి. పచ్చడి పెట్టుకునే జాడీల లోపలి భాగం మాదిరిగా నున్నగా ఉన్న ఈ రాళ్లు ఆనాడే జిల్లాలో గాజు పరిశ్రమ ఉందని చెప్పేందుకు ఆధారాలని పురావస్తు అధికారులు చెపుతున్నారు. ఈ తవ్వకాల్లోనే తొలియుగం నాటి (క్రీ.శ. 1-3 శతాబ్దాలు) జీవన ఆధారాలు, మధ్యయుగంలో నిర్మించిన ప్రాచీన శివాలయం కూడా లభించింది. ఈ శివాలయంలో సప్తఅశ్వ (ఏడు గుర్రాలు) రథాన్ని నడుపుతున్న సూర్య భగవానుడి విగ్రహం కూడా లభించడం విశేషం. ప్రాచీన శివాలయం కూడా..: కనగల్ మండలం పగిడిమర్రి గ్రామంలో జరిపిన తవ్వకాల్లో ఎక్కువగా కుండపెంకులే లభించాయి. నల్లని, ఎర్రని, రెండు రంగులు కలిపి ఉన్న పెంకులు పురావస్తు అధికారులు సేకరించారు. వీటితోపాటు తొక్కుడు బిళ్లలు (హాప్స్కాచ్), టైట మట్టితో చేసిన అద్దకపు పనిముట్లు, సానరాళ్లు లభించాయి. ఇవి చారిత్రక యుగాల ఆనవాళ్లని పురావస్తు అధికారులు చెపుతున్నారు. అదే విధంగా మధ్యయుగ కాలానికి సంబంధించి నలుపు, ఎరుపు, నీలి, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న పెంకులు కూడా లభించాయి. ఈ పెంకులన్నీ చౌడుమట్టితో తయారుచేసినవి. వీటిని సానబట్టి (పాలిష్ చేసి) నున్నగా తయారు చేశారు. ఈ తవ్వకాల్లోనే మధ్యయుగ కాలంలో (కాకతీయుల సామ్రాజ్యంలో) నిర్మించిన ఓ ప్రాచీన శివాలయాన్ని కూడా పురావస్తు అధికారులు గుర్తించారు. ఈ ఆలయం నిర్మించిన సమయంలో ఈ ప్రాంతాన్ని కాకతీయుల సామంతులైన కందూరు చోళులు పాలించారని అంచనా. -
మనదగ్గరే.. ‘మహాతలవర’ సామంత పాలన!
♦ లభించిన చారిత్రక ఆధారాలు.. ♦ నల్లగొండ జిల్లా పజ్జూరు ♦ పురావస్తు తవ్వకాల్లో బయల్పడిన నాటి నాణేలు సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణలో ‘మహాతలవర’ సామంత రాజుల పాలనకు సంబంధించిన చారిత్రక ఆధారాలు లభించాయి. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల పరిధిలోని పజ్జూరు - ఎర్రగడ్డల గూడెం గ్రామాల సరిహద్దులోని పాటి మీద పురావస్తుశాఖ ఆధ్వర్యంలో జరుపుతున్న తవ్వకాల్లో ఈ చారిత్రక ఆధారాలు లభించాయి. తొలియుగ చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయన్న కారణంతో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి మేరకు గత 50 రోజులుగా ఇక్కడ పురావస్తుశాఖ తవ్వకాలు జరుపుతోంది. తవ్వకాల్లో ఇప్పటికే గృహ సముదాయం బయల్పడగా, తాజాగా మహాతలవర సామంతుల పాలనను నిర్ధారించే నాణేలు బయటకు వచ్చాయి. తవ్వకాల్లో భాగంగా బుధవారం ఓ సీసం, ఓ రాగి నాణేలు బయటపడ్డాయని, ఇవి మహాతల వర కాలం నాటివని పురావస్తు అధికారులు చెపుతున్నారు. మట్టిపూసలు, మహిళలు తిలకం దిద్దుకునేందుకు సాధనం కూడా లభ్యమయ్యాయి. క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు తెలంగాణను శాతవాహనులు, ఇక్ష్వాకులు పాలిం చారు. వీరికి సామంతులుగా మహాతలవరులు పనిచేసేవారు. ‘మహాతల’ అంటే పెద్దవాడు అని, ‘వర’ అంటే వరించినవాడు లేదా పొందినవాడు అని అర్థమన్నది అధికారుల భావన. -
పజ్జూరులో త్వరలో తవ్వకాలు
పురావస్తు శాఖ డిప్యూటీ డెరైక్టర్ బ్రహ్మచారి తిప్పర్తి: నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామ శివారు పరిధి పాటివారి స్థలంలో తొలి చారిత్రక యుగం నాటి ఆనవాళ్లు లభించాయని, త్వరలో తవ్వకాలు చేపట్టనున్నామని పురావస్తు శాఖ డిప్యూటీ డెరైక్టర్ బ్రహ్మచారి తెలిపారు. గురువారం ఆయన పజ్జూరులో పాటివారి స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. తవ్వకాలకు సంబంధించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనుమతి వచ్చిందని, రైతులు, గ్రామస్తుల సహకారంతో నాటి ఆధారాలను వెలికితీయనున్నట్లు తెలిపారు. ఒకటి, రెండో యుగం కాలం నాటి ఆనవాళ్లు లభించడంతోపాటు 10, 12వ యుగం నాటి ఆలయం కూడా ఇదే గ్రామంలో ఉందని, ఈ తవ్వకాలతో మధ్యకాలంలో ఉన్న చరిత్ర, ఆధారాలు బయటపడే అవకాశముందని చెప్పారు. ఆయన వెంట పురావస్తుశాఖ అధికారులు నాగరాజు, భానుమూర్తి, తదితరులు ఉన్నారు. -
పుల్లూర్‌లో కొనసాగుతున్న తవ్వకాలు
వేటాడే పరికరం లభ్యం సిద్దిపేట రూరల్: మెదక్ జిల్లా సిద్దిపేట మండలంలోని పుల్లూర్ గ్రామ శివారులో పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాలు కొనసాగుతున్నాయి. బుధవారం పురావస్తు శాఖ డిప్యూటీ డెరైక్టర్ బ్రహ్మచారి తవ్వకాలను పరిశీలించారు. బృహత్శిలా యుగపు సమాధుల తవ్వకాల్లో భాగంగా జంతువులను వేటాడే పరికరం (ఈటె) కనిపించింది. ఇది ప్రస్తుతం 61 సెంటీమీటర్ల మేర బయటకు కనిపిస్తోంది. అది సుమారుగా మీటరు లోతున ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే భోజనం చేసే బౌల్స్, ఉలి (చీజిల్), మృణ్మయ పాత్రలు, ఇతర ఇనుప పనిముట్లు లభ్యమవుతున్నాయి. పనులను ఎప్పటికప్పుడు పురావస్తు శాఖ సాంకేతిక సహాయకులు టి. ప్రేమ్‌కుమార్, రిటైర్డు ముఖ్య సంరక్షకుడు ఎర్రమరాజు భానుమూర్తి పరిశీలిస్తున్నారు.