ప్రత్యేకత ఉంటేనే వారసత్వ సంపద!
ఏది పడితే అది వారసత్వ సంపద కాదు: సీఎం కేసీఆర్
► చారిత్రక ప్రాధాన్యం ఉండాలి
► వారసత్వ సంపద గుర్తింపు కోసం కమిటీ
► సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు.. ప్రతిపక్ష నేతకూ చోటు
► రాష్ట్రవ్యాప్తంగా కోటలు, ప్రాధాన్యమున్న గడీలను గుర్తిస్తాం
► ప్రాధాన్యమున్న వాటిని సంరక్షిస్తాం.. పనికిరాని వాటిని తొలగిస్తాం
► ప్రైవేటు కట్టడాలను హెరిటేజ్ జాబితాలో ఉంచబోం
► వాటిపై హక్కులను సంబంధీకులకే వదిలేస్తామని వెల్లడి
► తెలంగాణ వారసత్వ కట్టడాల బిల్లుకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: చారిత్రక ప్రాధాన్యత, ప్రత్యేకతలున్న వాటినే ఇక నుంచి వారసత్వ సంపదగా పరిగణిస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తెలిపారు. దేనిని పడితే దానిని వారసత్వ సంపదగా పేర్కొనే విధానానికి స్వస్తి పలుకుతామని చెప్పారు. ఆదివారం శాసనసభలో ‘తెలంగాణ ప్రత్యక్ష, పరోక్ష వారసత్వ సంపద సంరక్షణ, పరిరక్షణ, పునరుద్ధరణ, నిర్వహణ బిల్లు’ను ప్రవేశపెట్టిన కేసీఆర్.. దాని ఉద్దేశాలను వివరించారు.
‘‘వారసత్వ సంపద అంటే అర్థం పర్థం ఉండాలె. గతంలో ఇష్టం వచ్చినట్టు చేశారు. వాటివల్ల ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి. సుప్రీంకోర్టు చెప్పిందన్న పేరుతో గతంలో కేంద్రం కొన్ని ఆదేశాలిస్తే... రాష్ట్రాలు కనిపించిన ఖాళీ భూములన్నింటినీ అటవీ భూములుగా మార్చాయి. ఇప్పుడు గజం స్థలం సేకరించాలంటే.. గ్రీన్ ట్రిబ్యునల్ అని, ఆ ట్రిబ్యునల్ అని, ఈ ట్రిబ్యునల్ అని తిరగాల్సి వస్తోంది. ఈ పద్ధతి మంచిది కాదు.. అందుకే ప్రత్యేక ప్రాధాన్యమున్న వాటినే వారసత్వ జాబితాలో చేరుస్తాం..’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.
అధ్యయనం చేసి నిర్ణయిస్తాం..
మనకంటూ ఉన్న చరిత్ర, ఇతర ప్రాధాన్యానికి గుర్తుగా ఉన్న కట్టడాలు, స్థలాలు, కళలను పరిరక్షించాలని.. అదే సమయంలో భావి అవసరాలకు తగ్గట్టు జరిగే అభివృద్ధికి నిరోధకంగా మారే విధానాలను మార్చుకోవాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చిన వారసత్వ చట్టంలో అనేక లొసుగులున్నాయన్నారు.
హైదరాబాద్ పరిధిలో ఎన్నో చారిత్రక అవశేషాలు ఉన్నాయని, వాటిని విస్మరించారని చెప్పారు. మరోవైపు కొన్ని ప్రైవేటు భవనాలను వారసత్వ సంపద కిందకు తీసుకొచ్చారని.. గ్రీన్‌ల్యాండ్ గెస్ట్‌హౌస్‌ను కూడా అందులో చేర్చడమేమిటని పేర్కొన్నారు. వారసత్వ సంపద అంటే హైదరాబాద్‌కే పరిమితం కాకూడదని.. రాష్ట్రవ్యాప్తంగా కోటలు, చారిత్రక కట్టడాల వంటివాటిపై సమగ్ర అధ్యయనం చేసేందుకు సీఎస్ నేతృత్వంలో కమిటీ వేశామని కేసీఆర్ వెల్లడించారు. ఆ కమిటీలో ప్రతిపక్ష నేతకు కూడా చోటు కల్పించనున్నట్టు తెలిపారు.
గందరగోళం తప్పేలా ఉండాలి
పురావస్తు శాఖ పరిధిలో ఉన్న జోగు ళాంబ దేవాలయంలో కొత్తగా ఎక్కడైనా దీపం పెడదామంటే పంచాయితీ ఉందని.. ఢిల్లీలో ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఎగురేసినట్టు మన గోల్కొండ కోటలో ఎగరే యాలంటే ప్రతిసారి కేంద్ర పురావస్తు శాఖ అనుమతి పొందాలని.. ఈ గందరగోళ మంతా ఎందుకని కేసీఆర్ పేర్కొన్నారు.
సచివాలయంలో సమాధిలాగా మారిన పురా తన జీబ్లాక్ భవనాన్ని కూల్చి వేద్దామంటే దిక్కుమాలిన హెరిటేజ్ నిబంధన అడ్డం వస్తోందన్నారు. కోటలు, ప్రముఖ గడీలతో పాటు ముఖ్యమైన చారిత్రక కట్టడాలను సంరక్షించి, పునరుద్ధరించుకోవాల్సిన అవస రముందని.. పనికిరాని కట్టడాలను తొలగిం చాల్సిందేనని పేర్కొన్నారు. ‘‘బ్రెజిల్‌లోని ప్రముఖ నగరం రియో కు మేయర్‌గా వచ్చిన ఓ వ్యక్తి.. పట్టణ ప్రాంతాల భూవినియోగ ప్రాధాన్యాన్ని గుర్తించి తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ఇప్పుడా నగరం ప్రపంచంలోనే ముఖ్యమైన హరిత నగరాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. జనం పెరుగుతున్న తరు ణంలో వారి అవసరాలకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది’’ అని చెప్పారు.
కబ్జాలు, ఆక్రమణలు నిరోధించండి
చారిత్రక ప్రాంతాల్లో కబ్జాలను నిరోధించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ సభ్యుడు సంపత్ ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు వద్ద ఆక్రమణలు లేకుండా చూడాలన్నారు. తాను చిన్నప్పటి నుంచి చూస్తున్న బంజారాహిల్స్ రోడ్డు నం.14లోని ఓ హెరిటేజ్ ప్యాలెస్ ఉన్నట్టుండి కనుమరుగైందని, దానికి కారణమేమిటని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్.. ఆ ప్యాలెస్ హెరిటేజ్ జాబితాలో లేదని సమాధానమిచ్చారు. ప్రైవేటు వ్యక్తులకు చెందిన కట్టడాలను వారసత్వ సంపద జాబితాలో ఉంచబోమని.. వాటిపై హక్కు వారికే వదిలేస్తామని, వాటి నిర్వహణను ప్రభుత్వం ఎలా తీసుకుంటుందని చెప్పారు. అనంతరం బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రకటించారు.