హస్త ముద్రలు
వైవీయూ : రాయలసీమ ప్రాంతంలో రాళ్లపై ఉన్న రాతియుగం, మధ్యయుగం, నవీనశిలాయుగాల నాటి రేఖా చిత్రాలకు సంబంధించి జరుగుతున్న పరిశోధనలు ఓ కొలిక్కి వచ్చాయి. వివిధ కాలాల్లో వాటిని గీసినట్టు పరిశోధనల్లో తేలాయి. క్రీ.పూ ఆరు వేల సంవత్సరాల నుంచి మానవుడు రంగులను వాడినట్టు గుర్తించారు. రేఖా చిత్రాల్లో వాడిన రంగుల్ని బట్టి అవి ఏ యుగానికి చెందినవో తదితర విషయాలు కనుగొన్నారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నిధులతో యోగి వేమన విశ్వవిద్యాలయం చరిత్ర, పురావస్తుశాఖ ఆధ్వర్యంలో సీమలోని నాలుగు జిల్లాల్లో 70 ప్రాంతాల్లో రేఖా చిత్రాల ఆనవాళ్లపై పరిశోధనలు సాగుతున్నాయి.
విశ్వవిద్యాలయంలోని చరిత్ర, పురావస్తుశాఖ సహాయ ఆచార్యులు డాక్టర్ వి.రామబ్రహ్మం ఆధ్వర్యంలో ‘రాక్ ఆర్ట్ ఇన్ రాయలసీమ రీజియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అన్న అంశంపై 2015లో ఈ పరిశోధనలు ప్రారంభమయ్యాయి. నాలుగు జిల్లాల్లో రేఖా చిత్రాలు కలిగిన 70 ప్రదేశాలను గుర్తించారు. వీటిలో వైఎస్సార్ జిల్లా ముద్దనూరులోని చింతకుంటతో పాటు మరో రెండు ప్రాంతాల్లో, కర్నూలు జిల్లా భోగేశ్వరం, కేతవరం, అనంతపురం జిల్లా నెమికల్లు, బూదగవి, చిత్తూరు జిల్లా మల్లయ్యపల్లి, వెంకటేశ్వరకొట్టాలం, బిరదనపల్లి తదితర 10 ప్రాంతాల్లో ప్రత్యేకమైన రేఖాచిత్రాలను వీరి బృందం గుర్తించింది.
మధ్యశిలాయుగం నాటివి
కర్నూలు జిల్లా నంద్యాలకు సమీపంలోని భోగేశ్వరం శివాలయానికి సమీపంలోని బొమ్మలగుండు ప్రాంతంలో కుందూ నదీలోయ ప్రాంతంలో సహజసిద్ధంగా ఏర్పడిన రాతిగుహల్లో పలు రేఖాచిత్రాలను గుర్తించారు. రాతి గుహ గోడకు ఉన్న ఈ రేఖాచిత్రాలు సుమారు ఆరు వేల సంవత్సరాలకు పూర్వం నాటివిగా తేల్చారు. రేఖాచిత్రాల కింద భాగంలో నేలపై ఉన్న సూక్ష్మరాతి పనిముట్ల ఆధారంగా అవి మధ్యశిలాయుగానికి చెందినవిగా నిర్ధారించారు. ఎరుపు రంగులో హస్త ముద్రలు, మామిడి పండును చూస్తున్న నెమలి తదితర రేఖా చిత్రాలు క్రీ.పూ.ఆరు వేల సంవత్సరాల నాటివిగా తేల్చారు.
రాతి పనిముట్లు
ఆయా రంగులు ఆ శిలాయుగాలకు ఆనవాళ్లు
బృహత్ శిలాయుగంలో ఆది మానవుడు మట్టి నుంచి, ఇనుము లోహాన్ని ప్రత్యేక ప్రక్రియలో శుద్ధిచేసి, వివిధ లోహపు వస్తు సామగ్రిని వినియోగించి త్రిశూలం, కత్తులు, బల్లెం వంటి యుద్ధ పరికరాలను తయారుచేసేవారని తెలియజెప్పేలా రేఖా చిత్రాలున్నాయి. వీటితో పాటు పులినోట్లో మనిషి చేయి పెట్టినట్టు, గుర్రపు స్వారీ, నందిపాదాలు తెలుపు వర్ణంలో కనిపించాయని పరిశోధకులు చెబుతున్నారు. చారిత్రకయుగ రేఖాచిత్రాల్లో పసుపు వర్ణంలో శ్రీరాముడు, రావణుడు, ఆంజనేయుడి రేఖాచిత్రాలు కనిపించాయి.
పైవర్ణాల్లో ఒక్కో వర్ణం ఒక్కో యుగానికి చెందినదిగా వీరు గుర్తించారు. ఎరుపు.. మధ్యశిలాయుగం, తెలుపు.. బృహత్ శిలాయుగం, పసుపును చారిత్రక యుగం ఆనవాళ్లుగా చెబుతున్నారు. క్రీ.పూ 6 వేల ఏళ్ల కిందటే ఆదిమానవులు రంగులను వినియోగించినట్టుగా వారు గుర్తించారు. పరిశోధన ఫలితాలను న్యూఢిల్లీలోని యూజీసీకి పంపామని డా.రామబ్రహ్మం చెప్పారు. వైఎస్సార్ జిల్లాలో దావాండ్లపల్లె, రాణిబావి, మల్లెల వంటి ప్రాంతాల్లో, అనంతపురం జిల్లాలో నిమకళ్లులో, చిత్తూరులో కుప్పం సమీపంలోని వెంకటేశ్వరపురం, మల్లయ్యపల్లి, కర్నూలు భోగేశ్వరం వంటి ప్రాంతాల్లో పరిశోధనలు చేసినట్టు తెలిపారు. పరిశోధనల్లో వైవీయూ అకడమిక్ కన్సెల్టెంట్ రఘుయాదవ్, పరిశోధక విద్యార్థులు సి.శివకుమార్, జె.నారాయణ, పి.నగేష్‌లు పాల్గొన్నట్లు వివరించారు.
నాలుగు జిల్లాల్లో పరిశోధనలు చేస్తున్నాం..
రాయలసీమ ప్రాంతంలో రేఖా చిత్రాలున్న 70 ప్రాంతాలను ఇప్పటి వరకు గుర్తించాం. ఇందులో 10 ముఖ్యమైన రేఖాచిత్రాలను గుర్తించాం. 2015 నుంచి నాలుగేళ్లపాటు చేసిన పరిశోధన ఫలితాలను యూజీసీకి పంపాం. యూజీసీ మాకు ఇచ్చిన ప్రాజెక్టు వర్కులో భాగంగా ఈ పరిశోధనలు చేశాం.
–డాక్టర్ వేలూరు రామబ్రహ్మం, సహాయ ఆచార్యులు, చరిత్ర, ఆర్కియాలజీ, వైవీయూ
రేఖాచిత్రాల కథాకమామిషు..
ఎగువ పాత రాతియుగం నాటి మానవులు ఆహారం కోసం వేటాడే సమయంలో అలసట రావడంతో సేదదీరేందుకు కొండగుహలను ఎంచుకునేవారు. ఆ సమయంలో తమ మదిలో మెదిలిన అప్పటి ఘటనలను రేఖాచిత్రాలుగా గీశారన్నది చరిత్రకారుల భావన. వర్షం పడని ప్రాంతాల్లో, రాతి నిర్మాణాల్లో (రాక్ షెల్టర్స్) వీటిని గీయడంతో నేటికీ అవి చెక్కు చెదరలేదు.
- ఇంగ్లాండుకు చెందిన రాబర్ట్ బ్రూస్‌ఫుట్ అనే చరిత్రకారుడు 18వ శతాబ్ధంలోనే ఈ రేఖాచిత్రాలపై పరిశోధనలు ప్రారంభించినట్టు చరిత్రకారులంటున్నారు. 1980వ ప్రాంతంలో ఆస్ట్రియా దేశానికి చెందిన చరిత్ర పరిశోధకుడు న్యుమెయిర్ ఇర్విన్ రాయలసీమ ప్రాంతంలో ఉన్న రేఖాచిత్రాలకు సంబంధించిన సమాచారాన్ని తాను రాసిన ‘లైన్స్ ఆన్ ది స్టోన్’ పుస్తకంలో రాశాడు.
- 2009లో వైఎస్సార్ జిల్లా ముద్దనూరు ప్రాంతంలో ‘చింతకుంట’ రేఖాచిత్రాలు విస్తృతంగా ప్రాచుర్యంలోకొచ్చాయి. దీంతో డాక్టర్ రామబ్రహ్మం ఈ రేఖాచిత్రాలపై పరిశోధన చేసేందుకు ఆయన సేకరించిన సమాచారంతో కూడిన నివేదికను యూజీసీకి అందజేశారు. దీంతో యూజీసీ వారు ఆయనకు ‘రాక్ ఆర్ట్ ఇన్ రాయలసీమ రీజియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో ప్రాజెక్టును మంజూరు చేస్తూ రూ.10 లక్షలు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment