Stone Age
-
చరిత్రను మార్చడం ఏమార్చడమే!
చరిత్రను సృష్టించకపోయినా ఫరవాలేదు. కాని, దానికి మసిపూసి మారేడుకాయ చేయడం, లేదా అసలు పాఠ్యగ్రంథాల నుంచీ, చరిత్రపుస్తకాల నుంచీ తీసివేయడం కూడదు కదా! ఇవ్వాళ కేంద్ర పాలకులు ఈ దుశ్చర్యకు పూనుకున్నారు. ‘ఒకే దేశం, ఒకే జాతి, ఒకే సంస్కృతి’ వంటి నినాదాలతో రాజకీయాలు చేస్తున్న పెద్దల మాటలు నీటి మూటలని కొన్ని చారిత్రక అంశాలు తేల్చి చెబుతున్నాయి. అందుకే వీరు తమ సిద్ధాంతాల డొల్లతనాన్ని బయటపెట్టే చారిత్రక అంశాలకు తిలోదకాలు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. మానవ పరిణామ క్రమం, మొగలాయీ చక్రవర్తుల పాలనా కాలంలోని ఘట్టాలు వంటి అనేక అంశాలు ఆ విధంగా వీరి కత్తిరింపునకు బలయ్యాయి. భారతదేశంలో పాలకులు చరిత్రను వక్రీకరించాలనే దుర్వ్యూహాలు పన్నుతున్నారు. హిందు మతవాద భావజాలం ఆధారంగా చరిత్రను బోధించాలను కోవడం ఒక అసంబద్ధ చర్యే అవుతుంది. క్రీస్తు పూర్వం 7000 నుంచి 1500 మధ్యలో ఆవిర్భవించిన వైదిక సాహిత్యం... క్రీస్తు పూర్వం 50 వేల ఏళ్ల చరిత్రను కుదించి... భారతీయ మూలాలను దెబ్బతీసింది. రాతియుగాల నుంచీ మానవుడు నేటి ఆధునిక యుగాల వరకూ ఎలా పరిణామం చెందాడనేది మానవ మహాచరిత్రలో అందరూ తెలుసు కోవలసిన ముఖ్యమైన అంశం. ప్రస్తుతం మానవుడు ఉన్న స్థితికి... వందలు, వేల తరాల మానవులు అనుభవ పూర్వకంగా తెలుసుకున్న విజ్ఞానం, దాని ఆధారంగా చేసిన ఆవిష్కరణలు ఎలా కారణమయ్యా యనేది మానవ భవిష్యత్ గమనానికి అద్భుతమైన పాఠం. కానీ ఇవ్వాళ ఇంతటి ప్రాముఖ్యం ఉన్న మానవ పరిణామ క్రమాన్నీ, ఇతర చారిత్రక అంశాలనూ ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించడానికి నిర్ణయించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. సంస్కృత భాషా గ్రంథాల్లో చేసిన కృత్రిమ కల్పనలు, వ్యుత్ప త్తులు, నీచార్థాల ద్వారా భారతీయ మూలవాసుల సాంస్కృతిక మూలాలను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరిగాయి. సామర్థ్యమూ, శాంతి, సమన్వయము ప్రేమతో కూడిన మూలవాసుల భావనలను ధ్వంసం చేసే క్రమంలో బీభత్స, భయానక రసాలకు ఎక్కువ ప్రాధా న్యత ఇస్తూ చాలా చరిత్ర వక్రీకరణకు గురయ్యింది. భారతదేశానికి ఆర్యుల రాక ముందటి చరిత్ర భారతీయ మూలవాసులదీ, దళితులదీ అని హిందూవాద రచయితలకు తెలుసు. అయినా దాని ప్రస్తావన చరిత్ర రచనలో రానివ్వడం లేదు. చరిత్ర నిర్మాణానికి అవసరమైన పరికరాలనూ, ఆధారాలనూ పరిగణనలోకి తీసుకోకపోవడం సరి కాదు. చరిత్రతో మానవ పరిణామానికి, పురాతత్త్వ శాస్త్రానికి, శాసనా లకు, నాణేలకు ఉన్న అనుబంధాన్ని నిరాకరించి నెట్టివేయడం చారి త్రక ద్రోహమే. ఇప్పుడు పాఠ్యపుస్తకాల నుంచి కొన్ని అంశాలను తొలగించడాన్ని ఈ కోణంలోనే చూడాలి. భారతదేశ చరిత్ర, సంస్కృతులను నిర్మించడంలో పురావస్తు శాస్త్రానిది తిరుగులేని పాత్ర. 19వ శతాబ్దపు చతుర్ధ పాదంలో దేశంలో ఈ శాస్త్రం అడుగిడింది. ఎందరో ప్రముఖులైన బ్రిటిష్, పురాతత్వ వేత్తలు ఈ విజ్ఞానం అభివృద్ధి పొందటానికి ఎంతో తోడ్పడ్డారు. పురావస్తు శాస్త్రం వెలుగులో బయటపడ్డ కొత్త కొత్త మానవ అవశేషాలు, వాడిన పనిముట్లను ఆధారం చేసుకుని నాటి మనిషి ఆర్థిక, సామాజిక, విశ్వాస వ్యవస్థలను నిర్మిస్తూ వస్తున్నారు. అటువంటి చరిత్ర... మతాలు చెప్పే విషయాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. అందుకే మత తత్త్వవాదులు తమకు ఇబ్బంది అనుకున్న అంశాలను పాఠాల నుండి, చరిత్ర గంథాల నుండి మాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. లేదా తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చరిత్ర పాఠ్యాంశాల నుంచి మానవ పరిణామ క్రమాన్ని తొలగించడం ఇందుకు మంచి ఉదాహరణ. ప్రసిద్ధ చరిత్రకారులు డీడీ కోశాంబి హిందూ పునరుద్ధరణ వాదం వల్ల వచ్చిన అనేక పరిణామాలను మన ముందుకు పరిశోధనాత్మకంగా తెచ్చారు. మూఢాచారాలు మానవ పరిణామాన్ని అడ్డుకుంటాయి అని చెప్పారు. వైదికవాదులు వ్యవసాయ సంస్కృతిని నిరసి స్తారు. కానీ వ్యవసాయం మీద వచ్చే అన్ని ఫలితాలు అనుభవిస్తారు. వాటిని దానం రూపంలో పొందుతారు. అయితే వ్యవసాయదారులను శూద్రులుగాను, వ్యవసాయ కూలీలగానూ, అతిశూద్రులు గానూ చూస్తారు. వీరు ఎంతో బౌద్ధ సాహిత్యాన్ని నాశనం చేశారు. బౌద్ధంలో దాగివున్న సమానతావాదం వీరికి వ్యతిరేకం. గుప్తుల కాలంలో అశ్వమేధ యాగాలతో క్రూరమైన హింస భారతదేశంలో కొనసాగింది. శూద్రులు, అతిశూద్రులు తీవ్ర వధకు గురయ్యారని ఆయన అన్నారు. భారతదేశ చరిత్రలో నూతన అధ్యాయాన్ని నిర్మించిన అశోకుని మానవతావాద పాలనాముద్రను చెరిపివేయాలని గుప్త వంశంలో ప్రసిద్ధుడైన సముద్ర గుప్తుడు ఎలా ప్రయత్నించాడో రొమిల్లా థాపర్ తన ‘భారతదేశ చరిత్ర’లో విశ్లేషణాత్మకంగా వివరించారు. ‘ఈ శాసనం అశోకుని ఇతర శాసనాలతో విభేదిస్తుంది. మౌర్యపాలకుడు, గుప్తులకన్నా విశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించినా అతడు తన అధికారాన్ని అమలు పరచటంలో చాలా సాత్వికంగా ప్రవర్తించాడు.అశోకుడు దిగ్విజయ యాత్రను వదులుకుంటే, సముద్ర గుప్తుడు దిగ్విజయాలలో తేలియాడాడు. అతడు ఉత్తర రాజస్థాన్‌లోని చిన్న చిన్న రాజ్యాల అధికారాన్ని కూలద్రోశాడు. ఫలితంగా వాయవ్య భారతంపై హూణుల దండయాత్ర, చివరి గుప్త రాజులకు దురదృష్టకరంగా పరిణమించింది’. చరిత్రను వక్రీకరించాలనే ప్రయత్నం వలన భారతదేశ వ్యక్తి త్వానికి దెబ్బ తగులుతుందని తెలుసుకోలేక పోతున్నారు పాలకులు. ఇలా చేస్తే ఉత్పత్తి పరికరాలు కనిపెట్టిన దేశీయుల చరిత్ర మసక బారుతుంది. నదీ నదాలూ, కొండ కోనలూ, దట్టమైన అరణ్యాలూ, సారవంతమైన మైదానాలూ, చిట్టడవులూ... ఇలా విభిన్న ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పరిస్థితులకు అనుకూలమైన జీవన పోరాట పద్ధతులు (స్ట్రాటజీస్)ను రూపొందించుకుని విభిన్న సాంస్కృతిక సమూహాలుగా జనం మనుగడ సాగించే క్రమంలో... అటువంటి సమూహాలను జయించి ఒకే రాజ్యంగానో, సామ్రాజ్యంగానో చేయాలని చేసిన ప్రయత్నాలు చరిత్రలో ఉన్నాయి. ఆ ప్రయత్నాలు కొన్నిసార్లు ఫలించినా... అదను చూసుకుని దేశీ సమూహాలు ఎక్కడి కక్కడ తిరుగుబాట్లు చేసి తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వచ్చాయి. మొగలాయీల కాలం కావచ్చు, బ్రిటిష్ వాళ్ల కాలం కావచ్చు... మూలవాసులైన ఆదివాసుల తిరుగుబాట్లు ఎన్నో మనకు ఇందుకు ఉదాహరణలుగా కనిపిస్తాయి. ఈ చరిత్రను మరచి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ‘ఒకే దేశం, ఒకే మతం, ఒకే జాతి, ఒకే సంస్కృతి’ అనే నినాదాన్ని భుజానికి ఎత్తుకొని చరిత్రలోని ముఖ్యమైన ఘటనలను మాయం చేసే ప్రయత్నాలు చేస్తోంది. భారతదేశ మూలవాసులు ఏ మతాధిపత్యానికి, కులాధి పత్యానికి లొంగలేదు. స్వతంత్ర ప్రతిపత్తితో జీవించారు. మతం అనేది వ్యక్తిగత విశ్వాసంగానే మానవ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు... అత్యధిక కాలం మనుగడ సాగించింది. చరిత్రకారుడు తారాచంద్ చెప్పినట్లు చరిత్ర అనేది అనేక వైవిధ్యాలను సమన్వయం చేస్తుంది. అంతేకాదు అనేక జాతులను, అనేక సంస్కృతులను, అనేక ధర్మాలను, అనేక వ్యక్తిత్వాలను, అనేక ప్రాంతాలను సమన్వయం చేస్తూ గమిస్తుంది. మొగల్ చక్రవర్తి అక్బర్ ఒక గొప్ప చక్రవర్తి. ఆయన చరిత్రను పాఠ్యాంశాల నుండి తొలగించినందువల్ల ఎంతో విలువైన చారిత్రక జ్ఞానాన్ని కోల్పోతాం. ఆయన కాలంలో భారతదేశంలో అనేకమైన మార్పులు జరిగాయి. అక్బరు పాలించిన సుదీర్ఘకాలంలో ఆయన ప్రతి 10 ఏళ్లకు ఒకసారి మారుతూ వచ్చాడు. మొదట హిందూ రాజ్యాలపై కత్తి దూసిన అక్బర్... ఆ తరువాత హిందూ రాజ్యాలతో సమన్వయానికి ఎక్కువ పనిచేశాడు. ఇటువంటి రాజనీతిజ్ఞుడి పాఠం సిలబస్ నుంచి తీసివేస్తే విద్యార్థులకు భారత చరిత్రపై సరైన అవగాహన కలుగదు. నిజానికి అంబేద్కర్, మహాత్మాఫూలే, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణ గురు, ఝల్కారీ బాయి... ఇలా అనేక మంది సామాజిక విప్లవకారుల ప్రభావం దేశం మీద ఎంతో ఉంది. వారి జీవన చిత్రాలను కూడా మన చరిత్రలో ప్రజ్వలింపచేయాలి. అప్పుడే దేశానికి మేలు. ప్రతీ విద్యార్థికి చరిత్ర అనే వెలుగు దిక్సూచి అవుతుంది. చరిత్రను వాస్తవంగా అర్థం చేసుకున్నప్పుడే, భారతదేశాన్ని గానీ, ప్రపంచాన్ని గానీ, పునఃనిర్మించే పనిలో విద్యార్థులు, ప్రజలు విజేతలు అవుతారు. అందుకే చరిత్రను రక్షించుకుందాం, దేశాన్ని రక్షించుకుందాం! డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమ నేత ‘ 98497 41695 -
తెలుగువారి తొలి నివాసం 'రాయలసీమ'
తెలుగు ప్రజల తొలి నివాసం రాయలసీమేనని చెప్పేందుకు వైఎస్సార్ జిల్లాలోని మోపూరు కొండపై గల భైరవేశ్వరుడి ఆలయం తిరుగులేని నిదర్శనమని తెనాలికి చెందిన పురావస్తు పరిశోధకుడు, ‘పురాతన’ సంస్థ వ్యవస్థాపకుడు కడియాల వెంకటేశ్వరరావు వెల్లడించారు. రాయల సీమ ప్రాశస్త్యంపై ప్రముఖ చారిత్రక పరిశోధకుడు ప్రొఫెసర్ హెచ్డీ సంకాలియా భావనను బలపరిచేలా అతి పురాతనం అనదగ్గ ఆధారాలు అక్కడ ఉన్నాయని చెప్పారు. పర్వతాలు అధికంగా కలిగిన రాయలసీమలో కొండ గుహల్లో ఆది మానవుల జీవనం, సంస్కృతి కొనసాగిందని అభిప్రాయపడ్డారు. కాలక్రమంలో అక్కడ్నుంచి తూర్పుగా మైదాన ప్రాంతానికి విస్తరించారనీ, అందుచేత రాయలసీమే తెలుగు ప్రజల తొలి ఆవాసమని భైరవేశ్వరుడి ఆలయం, పరిసరాల్లో కొన్నేళ్లుగా తాను జరిపిన పరిశోధనల్లో స్పష్టమైందని ‘సాక్షి’కి వెల్లడించారు. –తెనాలి ఆ విశేషాలివి.. ‘వైఎస్సార్ జిల్లాలోని వేముల మండలం, నల్లచెరువుపల్లె గ్రామానికి సమీపంలోని మోపూరు కొండపై 18 అడుగుల ఎత్తు, 14 అడుగుల చుట్టుకొలత కలిగిన విగ్రహం శివలింగంగా భక్తుల భావన. ఈ తరహా ఎత్తయిన నిలువురాళ్లను పూజించే ఆచారం అనేక దేశాల్లో ఉంది. వీటిని సూర్యభగవానుడికి సంకేతంగా/ ప్రతిరూపంగా ఆదిమ మానవుల కాలం (కొత్త రాతి యుగం), పాత రాతియుగం కాలం (క్రీ.పూ 3,000–2,000), ఇంకా పూర్వం నుంచీ పూజిస్తున్నారు. ‘వర్షిపింగ్ ఆఫ్ స్టాండింగ్ స్టోన్స్’, ‘డ్రూయిడికల్ రాక్స్’ పేర్లతో పిలుస్తుంటారు. డ్రూయిడ్స్ అంటే విగ్రహారాధకులు అనే అర్థముంది. ఆర్యులు భారత ఉపఖండంలోకి ప్రవేశించే నాటికి ముందుగానే (క్రీ.పూ 1,500–1,000) భారతదేశంలో నిలువురాతి శిలలను పూజించే ఆచారం ఉంది. ఈ మోపూరు కొండను ఆనుకొని ఉన్న మొగమేరు వాగు వేముల, లింగాల ప్రాంతాల్లో ప్రవహిస్తోంది. ఈ పరీవాహక ప్రాంతమంతా నాటి కాలాలకు చెందిన రాతి ఆయుధాలు, ఆదిమ మానవుల సమాధులు, చారిత్రక యుగంనాటి పరికరాలు గుర్తించారు. ఫలితంగా ఇది ఆదిమవాసుల పవిత్ర ప్రార్ధనాస్థలంగా విలసిల్లింది. భైరవేశ్వరుడిగా పూజలందుకుంటున్న నిలువురాయి 18 అడుగులు ఉండటంతో, దీనిని రెండు అంతస్తుల్లో నిర్మించారు. పంచారామ క్షేత్రాలైన అమరావతి, ద్రాక్షారామ, కుమార ఆరామంలో రెండు అంతస్తులుగా నిర్మించిన శివాలయాలకు, ఈ మోపూరు భైరవేశ్వర ఆలయమే మాతృకగా భావిస్తున్నాం. 8–9 శతాబ్ది నుంచి 15వ శతాబ్దం వరకు కాకతీయులు, విజయనగర చక్రవర్తులు, వినుకొండ వల్లభరాయుడు, గండికోట రాజవంశీకుల విశిష్ట సేవల గురించి ఈ ఆలయం వద్ద దాన శాసనాలు లభించాయి. ఈ ఆలయం వెలుపల 50కి పైగా వీరశిలలు, 20 వరకు నాగ ప్రతిష్టల శిలలుండటం మరో ప్రత్యేకత. వీరశైవ మతంలో దేవుడికి ఆత్మార్పణం చేసుకొనే ఆచారముంది. వారి బలిదానానికి గుర్తుగా వీరశిలలను ప్రతిష్టిస్తుంటారు. శాసనాలూ చెక్కుతారు. ఈ ప్రకారం చూస్తే దక్షిణ భారతదేశంలోనే ఇది వీరశైవకులకు అతిముఖ్యమైన దేవాలయంగా చెప్పొచ్చు’ అని వెంకటేశ్వరరావు వివరించారు. -
సీమలో 'శిలా'యుగపు 'చిత్రాలు'
వైవీయూ : రాయలసీమ ప్రాంతంలో రాళ్లపై ఉన్న రాతియుగం, మధ్యయుగం, నవీనశిలాయుగాల నాటి రేఖా చిత్రాలకు సంబంధించి జరుగుతున్న పరిశోధనలు ఓ కొలిక్కి వచ్చాయి. వివిధ కాలాల్లో వాటిని గీసినట్టు పరిశోధనల్లో తేలాయి. క్రీ.పూ ఆరు వేల సంవత్సరాల నుంచి మానవుడు రంగులను వాడినట్టు గుర్తించారు. రేఖా చిత్రాల్లో వాడిన రంగుల్ని బట్టి అవి ఏ యుగానికి చెందినవో తదితర విషయాలు కనుగొన్నారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ నిధులతో యోగి వేమన విశ్వవిద్యాలయం చరిత్ర, పురావస్తుశాఖ ఆధ్వర్యంలో సీమలోని నాలుగు జిల్లాల్లో 70 ప్రాంతాల్లో రేఖా చిత్రాల ఆనవాళ్లపై పరిశోధనలు సాగుతున్నాయి. విశ్వవిద్యాలయంలోని చరిత్ర, పురావస్తుశాఖ సహాయ ఆచార్యులు డాక్టర్ వి.రామబ్రహ్మం ఆధ్వర్యంలో ‘రాక్ ఆర్ట్ ఇన్ రాయలసీమ రీజియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ అన్న అంశంపై 2015లో ఈ పరిశోధనలు ప్రారంభమయ్యాయి. నాలుగు జిల్లాల్లో రేఖా చిత్రాలు కలిగిన 70 ప్రదేశాలను గుర్తించారు. వీటిలో వైఎస్సార్ జిల్లా ముద్దనూరులోని చింతకుంటతో పాటు మరో రెండు ప్రాంతాల్లో, కర్నూలు జిల్లా భోగేశ్వరం, కేతవరం, అనంతపురం జిల్లా నెమికల్లు, బూదగవి, చిత్తూరు జిల్లా మల్లయ్యపల్లి, వెంకటేశ్వరకొట్టాలం, బిరదనపల్లి తదితర 10 ప్రాంతాల్లో ప్రత్యేకమైన రేఖాచిత్రాలను వీరి బృందం గుర్తించింది. మధ్యశిలాయుగం నాటివి కర్నూలు జిల్లా నంద్యాలకు సమీపంలోని భోగేశ్వరం శివాలయానికి సమీపంలోని బొమ్మలగుండు ప్రాంతంలో కుందూ నదీలోయ ప్రాంతంలో సహజసిద్ధంగా ఏర్పడిన రాతిగుహల్లో పలు రేఖాచిత్రాలను గుర్తించారు. రాతి గుహ గోడకు ఉన్న ఈ రేఖాచిత్రాలు సుమారు ఆరు వేల సంవత్సరాలకు పూర్వం నాటివిగా తేల్చారు. రేఖాచిత్రాల కింద భాగంలో నేలపై ఉన్న సూక్ష్మరాతి పనిముట్ల ఆధారంగా అవి మధ్యశిలాయుగానికి చెందినవిగా నిర్ధారించారు. ఎరుపు రంగులో హస్త ముద్రలు, మామిడి పండును చూస్తున్న నెమలి తదితర రేఖా చిత్రాలు క్రీ.పూ.ఆరు వేల సంవత్సరాల నాటివిగా తేల్చారు. రాతి పనిముట్లు ఆయా రంగులు ఆ శిలాయుగాలకు ఆనవాళ్లు బృహత్ శిలాయుగంలో ఆది మానవుడు మట్టి నుంచి, ఇనుము లోహాన్ని ప్రత్యేక ప్రక్రియలో శుద్ధిచేసి, వివిధ లోహపు వస్తు సామగ్రిని వినియోగించి త్రిశూలం, కత్తులు, బల్లెం వంటి యుద్ధ పరికరాలను తయారుచేసేవారని తెలియజెప్పేలా రేఖా చిత్రాలున్నాయి. వీటితో పాటు పులినోట్లో మనిషి చేయి పెట్టినట్టు, గుర్రపు స్వారీ, నందిపాదాలు తెలుపు వర్ణంలో కనిపించాయని పరిశోధకులు చెబుతున్నారు. చారిత్రకయుగ రేఖాచిత్రాల్లో పసుపు వర్ణంలో శ్రీరాముడు, రావణుడు, ఆంజనేయుడి రేఖాచిత్రాలు కనిపించాయి. పైవర్ణాల్లో ఒక్కో వర్ణం ఒక్కో యుగానికి చెందినదిగా వీరు గుర్తించారు. ఎరుపు.. మధ్యశిలాయుగం, తెలుపు.. బృహత్ శిలాయుగం, పసుపును చారిత్రక యుగం ఆనవాళ్లుగా చెబుతున్నారు. క్రీ.పూ 6 వేల ఏళ్ల కిందటే ఆదిమానవులు రంగులను వినియోగించినట్టుగా వారు గుర్తించారు. పరిశోధన ఫలితాలను న్యూఢిల్లీలోని యూజీసీకి పంపామని డా.రామబ్రహ్మం చెప్పారు. వైఎస్సార్ జిల్లాలో దావాండ్లపల్లె, రాణిబావి, మల్లెల వంటి ప్రాంతాల్లో, అనంతపురం జిల్లాలో నిమకళ్లులో, చిత్తూరులో కుప్పం సమీపంలోని వెంకటేశ్వరపురం, మల్లయ్యపల్లి, కర్నూలు భోగేశ్వరం వంటి ప్రాంతాల్లో పరిశోధనలు చేసినట్టు తెలిపారు. పరిశోధనల్లో వైవీయూ అకడమిక్ కన్సెల్టెంట్ రఘుయాదవ్, పరిశోధక విద్యార్థులు సి.శివకుమార్, జె.నారాయణ, పి.నగేష్‌లు పాల్గొన్నట్లు వివరించారు. నాలుగు జిల్లాల్లో పరిశోధనలు చేస్తున్నాం.. రాయలసీమ ప్రాంతంలో రేఖా చిత్రాలున్న 70 ప్రాంతాలను ఇప్పటి వరకు గుర్తించాం. ఇందులో 10 ముఖ్యమైన రేఖాచిత్రాలను గుర్తించాం. 2015 నుంచి నాలుగేళ్లపాటు చేసిన పరిశోధన ఫలితాలను యూజీసీకి పంపాం. యూజీసీ మాకు ఇచ్చిన ప్రాజెక్టు వర్కులో భాగంగా ఈ పరిశోధనలు చేశాం. –డాక్టర్ వేలూరు రామబ్రహ్మం, సహాయ ఆచార్యులు, చరిత్ర, ఆర్కియాలజీ, వైవీయూ రేఖాచిత్రాల కథాకమామిషు.. ఎగువ పాత రాతియుగం నాటి మానవులు ఆహారం కోసం వేటాడే సమయంలో అలసట రావడంతో సేదదీరేందుకు కొండగుహలను ఎంచుకునేవారు. ఆ సమయంలో తమ మదిలో మెదిలిన అప్పటి ఘటనలను రేఖాచిత్రాలుగా గీశారన్నది చరిత్రకారుల భావన. వర్షం పడని ప్రాంతాల్లో, రాతి నిర్మాణాల్లో (రాక్ షెల్టర్స్) వీటిని గీయడంతో నేటికీ అవి చెక్కు చెదరలేదు. - ఇంగ్లాండుకు చెందిన రాబర్ట్ బ్రూస్‌ఫుట్ అనే చరిత్రకారుడు 18వ శతాబ్ధంలోనే ఈ రేఖాచిత్రాలపై పరిశోధనలు ప్రారంభించినట్టు చరిత్రకారులంటున్నారు. 1980వ ప్రాంతంలో ఆస్ట్రియా దేశానికి చెందిన చరిత్ర పరిశోధకుడు న్యుమెయిర్ ఇర్విన్ రాయలసీమ ప్రాంతంలో ఉన్న రేఖాచిత్రాలకు సంబంధించిన సమాచారాన్ని తాను రాసిన ‘లైన్స్ ఆన్ ది స్టోన్’ పుస్తకంలో రాశాడు. - 2009లో వైఎస్సార్ జిల్లా ముద్దనూరు ప్రాంతంలో ‘చింతకుంట’ రేఖాచిత్రాలు విస్తృతంగా ప్రాచుర్యంలోకొచ్చాయి. దీంతో డాక్టర్ రామబ్రహ్మం ఈ రేఖాచిత్రాలపై పరిశోధన చేసేందుకు ఆయన సేకరించిన సమాచారంతో కూడిన నివేదికను యూజీసీకి అందజేశారు. దీంతో యూజీసీ వారు ఆయనకు ‘రాక్ ఆర్ట్ ఇన్ రాయలసీమ రీజియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో ప్రాజెక్టును మంజూరు చేస్తూ రూ.10 లక్షలు విడుదల చేశారు. -
అగ్గి పుట్టించింది మనోడే ..!
సాక్షి, హైదరాబాద్: మధ్య శిలాయుగంలో నిప్పు పుట్టించిన ఆదిమ మానవుడు తెలంగాణ వాడేనని పురావస్తు పరిశోధనల్లో బయటపడింది. ఆదిమ మానవుడు ఎక్కడ నిప్పు పుట్టించాడని నిర్ధారించడానికి చేస్తున్న పరిశోధనల్లో తెలంగాణ ప్రాంతం కీలకమైంది. మహబూబ్‌నగర్ జిల్లా ఉట్నూ ర్లో బయటపడిన బూడిద రాశుల అవశేషాలను పరిశోధించిన బ్రిటిష్ మ్యూజియం పరిశోధక బృందం.. బృహత్ శిలాయుగం నాటి తొలినాళ్లలోనే ఇక్కడ నిప్పు ఉందని తేల్చింది. అంతకుముందే ఇక్కడ మానవ సంచారం ఉందని, బహుశా మధ్యరాతి యుగంలోనే నిప్పు పుట్టడానికి అవకాశం ఉంద ని అంచనాకు వచ్చింది. మానవులు చిన్న చిన్న సమూహాలు గా జీవించడం, వారి మధ్య సాంఘిక సంబంధాలు బలపడటం మధ్య శిలాయుగం నుంచి ఉందని, ఉట్నూరు ఆదిమ మానవులూ సమూహంగానే జీవించారనడానికి పలు ఆనవాళ్లు దొరికాయని శాస్త్రవేత్తల బృందం చెబుతోంది. అగ్గి పుట్టాకే ఆధునిక జీవనం పాతరాతి యుగం మానవుడు పచ్చి మాంసం తినేవాడు. జంతువుల చర్మాలతో శరీరం కప్పుకునేవాడు. అగ్గి పుట్టాకే ఆదిమ మానవుని ఆధునిక జీవనం మొదలైంది. దీంతో తొలిసారి నిప్పు ఎక్కడ పుట్టిందో తెలుసుకోడానికి పరిశోధనలు సాగుతున్నాయి. దీనిలో భాగంగా ఇంగ్లండ్‌కు చెందిన పరిశోధకుడు రాబర్ట్ బ్రూస్‌ఫూట్.. నిప్పు పుట్టుక, ఆదిమానవ జాతుల మనుగడపై భారత్‌లో పరిశోధనలు చేశారు. ఉట్నూరులో ఆయన జరిపిన తవ్వకాల్లో నిప్పును మండించిన తర్వాత మిగిలిన బూడిద రాశుల అవశేషాలు గుర్తించారు. ఈ బూడిద రాశులు పేడ పిడకలవని.. ఇవి వేసవిలో రాపిడికి గురై అంటుకుని బూడిదగా మిగిలాయని తేల్చారు. ఇక్కడి నుంచి కొంత బూడిదను ఇంగ్లండ్ తీసుకెళ్లి బ్రిటిష్ మ్యూజియం ఆర్థిక సాయంతో బూడిద రసాయన విశ్లేషణ పరీక్ష జరిపారు. దేశం మొత్తం మీద నిప్పుకు సంబంధించి తొలి ఆనవాళ్లు తొలిసారి ఇక్కడే లభించినట్లు బ్రూస్‌ఫూట్ అధికారికంగానే చెప్పారు. ఈ పరీక్షలకు సంబంధించి నివేదిక బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరిచారని సమాచారం. మంచిర్యాల బుగ్గగుట్టలో.. పాత, కొత్తరాతి యుగానికి మధ్య కాలాన్ని మధ్య శిలాయు గం అంటారు. ఆది మానవుడు ఈ యుగంలోనే నిప్పుల్లో మాంసం, దుంపలు కాల్చుకొని తినడం ప్రారంభించాడు. మంచిర్యాల జిల్లా బుగ్గగుట్ట అటవీప్రాంతంలో మధ్య రాతి యుగపు ఆనవాళ్లు బయటపడ్డాయి. ఎగువరాతి యుగంలో వాడిన రాతి ఆయుధాలు, ఎముకలతో చేసిన పనిముట్లు వెలుగుచూశాయి. ఇక్కడి ఆది మానవుడు పేడ దిబ్బలకు అగ్గి పెట్టి మాంసం కాల్చినట్లు పరిశోధకులు చెబుతున్నారు. -
ఈ గండ శిలల గుండెల్లో ఖగోళం గుట్టు
-
ఈ గండ శిలల గుండెల్లో ఖగోళం గుట్టు
ముడుమాల ముడుపుకట్టిన మూడువేల ఏళ్లనాటి అపూర్వ విజ్ఞానం ► పాలమూరు జిల్లాలో బృహత్ శిలాయుగం నాటి చారిత్రక సంపద... ప్రపంచంలోనే అరుదైన నిర్మాణాలు ► ఖగోళశాస్త్ర అబ్జర్వేటరీగా భావిస్తున్న నిపుణులు ► సెంట్రల్ వర్సిటీ అధ్యయనంతో రంగంలోకి పురావస్తు శాఖ ► ఆ ప్రాంతాన్ని సందర్శించిన ఉన్నతాధికారులు... చుట్టూ కంచె వేయాలని నిర్ణయం ► సోమవారం ప్రభుత్వానికి నివేదిక.. సర్వేకు శ్రీకారం సాక్షి, హైదరాబాద్: ప్రపంచాన్నే అబ్బురపరిచే అరుదైన చారిత్రక సంపదకు మహబూబ్‌నగర్ జిల్లా ముడుమాల వేదికైంది. వేల ఏళ్ల కిందే ఖగోళం గుట్టును గుర్తించే ‘ఖగోళశాస్త్ర పరిశోధనశాల (ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ)’కి కేంద్రంగా నిలిచింది. నిలువెత్తును మించిన గండ శిలలతో రుతుపవనాలు సహా వివిధ వాతావరణ అంశాలను గుర్తించే పరిజ్ఞానానికి సజీవ సాక్ష్యంగా నిలి చింది. ఆకాశంలో నక్షత్రాలను చూసి దిక్కులను, సమయాన్ని కచ్చితంగా గుర్తించేందుకు తోడ్పడే సప్తర్షి మండలాన్ని వేల ఏళ్ల కిందే చిత్రించిన విజ్ఞానం విశేషాలు తాజా పరిశోధనల్లో వెల్లడయ్యాయి. దీంతో ప్రపంచంలోనే అత్యంత అరుదైన పురావస్తు ప్రాధాన్యమున్న ప్రాంతంగా ముడుమాల నిలుస్తోంది. ఇటీవల సెంట్రల్ వర్సిటీ బృందం పరిశోధన జరిపి ఇచ్చిన నివేదికతో పురావస్తు శాఖ కదిలింది. ఈ ప్రాంతాన్ని పరిరక్షించి, పరిశోధనలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం పురావస్తు శాఖ డెరైక్టర్ విశాలాక్షి ఆధ్వర్యంలో అధికారుల బృందం ముడుమాల ప్రాంతాన్ని పరిశీలించింది. ఈ మేరకు నివేదికను సోమవారం ప్రభుత్వానికి సమర్పించనుంది. సోమవారం నుంచే ఈ ప్రాంతంలో నిపుణులతో సర్వే ప్రారంభించాలని కూడా నిర్ణయించారు. ఇక ఈ చారిత్రక సంపదపై అవగాహనలేని స్థానికులు వాటిని ధ్వంసం చేస్తూ వచ్చారు. దీంతో ఈ ప్రాంతం చుట్టూ కంచెను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. వేల సంఖ్యలో.. కర్ణాటక-తెలంగాణ సరిహద్దుల్లో మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా మండలం పరిధిలోని కృష్ణా నదీ తీరం వెంబడి ఉన్న ముడుమాల గ్రామ పరిధిలో బృహత్ శిలాయుగానికి చెందిన చారిత్రక సంపద బయటపడింది. బృహత్ శిలాయుగానికి చెందిన సమాధులు అక్కడక్కడా కనిపించడం సాధారణమే. ఈ సమాధులకు గుర్తుగా భారీ రాళ్లను పాతుతారు. కానీ ముడుమాల పరిధిలో మాత్రం ఏకంగా 14 అడుగుల ఎత్తున్న గండ శిలలను ఓ క్రమపద్ధతిలో పాతిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటివి దాదాపు 80కి పైగా ఇక్కడ ఉన్నాయి. ఇక అదే తరహాలో పాతిన చిన్న రాళ్లు మూడున్నరవేల వరకు ఉన్నాయి. మొత్తంగా దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో ఈ సమాధులు ఉండడం గమనార్హం. దెయ్యాల దిబ్బగా భావిస్తూ.. కొన్నేళ్ల కిందటి వరకు స్థానికులు ఈ ప్రాంతాన్ని దెయ్యాల దిబ్బగా భావిస్తూ అటువైపు వెళ్లేందుకే జంకేవారు. తర్వాత ఈ విషయం తెలిసిన పురావస్తు నిపుణులు వాటిపై దృష్టి సారించటంతో చారిత్రక సంపద వెలుగు చూసింది. ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చరిత్ర విభాగం ప్రొఫెసర్ కె.పుల్లారావు ఆధ్వర్యంలోని బృందం వాటిని పరిశోధించింది. అవి సాధారణ సమాధి రాళ్లు కావని, క్రీస్తుపూర్వం వెయ్యేళ్ల నాటి మానవులు ఖగోళ పరిజ్ఞానానికి తగ్గట్టుగా వాటిని ఏర్పాటు చేసుకున్నారని గుర్తించారు. ఆకాశంలోని నక్షత్ర సమూహాల్లో సప్తర్షి మండలంగా భావించే ఆకృతి కూడా ఇక్కడి ఓ రాతిపై చెక్కి ఉండడం గమనార్హం. దానిని ఈ నిలువు రాళ్లకు కేంద్ర బిందువుగా ఏర్పాటు చేశారు. సూర్యుడి గమనం ఆధారంగా పడే ఈ రాళ్ల నీడలను బట్టి వాతావరణ సమయాలను అప్పటివారు గుర్తించేవారు. ఉదాహరణకు ఆ నీడలు ఓ క్రమంలో, ఓ నిర్దిష్ట ప్రాంతంలో పడడం మొదలుకాగానే రుతుపవనాలు ప్రారంభమవుతాయని తెలుసుకునేవారు. నీడలు మరో క్రమంలో, మరో చోటికి మారితే ఎండాకాలం వచ్చిందని.. ఇలా ఆ రాళ్ల ఆధారంగా పరిస్థితులను తెలుసుకునేవారని నిపుణుల బృందం గుర్తించింది. దీనిని ఆనాటి ఖగోళశాస్త్ర పరిశోధన శాల (ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ)గా భావిస్తున్నారు. ఇక మరో ప్రొఫెసర్ల బృందం కూడా ఈ ప్రాంతంపై పరిశోధన చేసింది. ఇంకా మరెన్నో రహస్యాలు ఈ నిర్మాణం వెనుక దాగున్నాయని వారు పేర్కొంటున్నారు. పూర్తి స్థాయిలో పరిశోధనలు చేస్తే మరెన్నో కొత్త విషయాలు వెలుగుచూస్తాయని చెబుతున్నారు. కృష్ణా నది నుంచి నల్లరాళ్లు.. ఇక్కడ పాతిన నిలువు రాళ్లన్నీ నల్లరాళ్లే కావటం విశేషం. వాటిని కృష్ణా నది ఒడ్డు నుంచి తెచ్చినట్టు పరిశోధకులు గుర్తించారు. అవి చాలా కాలం నీళ్లలో నానిన రాళ్లుగా తేల్చారు. కేవలం నిలువుగా పాతేందుకు ప్రత్యేకంగా నల్లరాళ్లను వాడడం వెనక మర్మం తెలియాల్సి ఉంది. నిధి అన్వేషణ కోసం విధ్వంసం భారీ శిలలతో కూడిన ఓ వృత్తాకార నిర్మాణం కూడా ఇక్కడ ఉండేది. ఆసియా ఖండంలోనే అలాంటిది ఇదొక్కటేనని గతంలోనే పురావస్తు నిపుణులు గుర్తించారు. కానీ దాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాయచూరు ప్రాంతానికి చెందిన కొందరు నిధి అన్వేషకులు ప్రభుత్వ సిబ్బందిగా చెప్పుకొని 2006లో ప్రొక్లెయినర్‌తో ఆ నిర్మాణాన్ని ధ్వంసం చేసి తవ్వకాలు జరిపారు. ఎటువంటి నిధీ దొరకక రాత్రికే ఉడాయించారు. కానీ వారి కారణంగా ప్రపంచంలోనే అరుదైన చారిత్రక నిర్మాణం నాశనమైంది. ఇక ఈ ప్రాంతంలోని అసైన్మెంట్ భూములను ప్రభుత్వం కొందరు రైతులకు పంచింది. వారిలో కొందరు రైతులు ఈ నిర్మాణాల్లో కొన్నింటిని ధ్వంసం చేసి.. వ్యవసాయం ప్రారంభించారు. అయితే ఇటీవలి పరిశోధనలతో మిగతా రాళ్లు ధ్వంసం కాకుండా చర్యలు ప్రారంభించారు. మనకిది గొప్ప కానుక ‘‘ప్రపంచంలోనే ఇది అరుదైన చారిత్రక ప్రాధాన్యమున్న ప్రాంతం. దీన్ని కాపాడడంతోపాటు ప్రపంచానికి పరిచయం చేయాల్సి ఉంది. పురావస్తు పరిశోధకులకు ఇదో పరిశోధనశాల అవుతుంది. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారేందుకు ఇక్కడ అన్ని హంగులు ఉన్నాయి. ఇక్కడి ప్రైవేటు భూములను సేకరిస్తేనే చారిత్రక సంపద పరిరక్షణ సాధ్యమవుతుంది. దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నాం. ప్రభుత్వ ఆదేశం మేరకు చర్యలు తీసుకుంటాం..’’ - విశాలాక్షి, పురావస్తు శాఖ డెరైక్టర్ అంతర్జాతీయ స్థాయిలో.. ముడుమాల ప్రాంతంపై అధ్యయనం చేసిన సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.పుల్లారావు ఇటీవల బెల్జియంలో జరిగిన ఓ సదస్సులో, అమెరికాలోని నార్తర్న్ అరిజోనా వర్సిటీలో జరిగిన ఆర్కియో ఆస్ట్రానమీ సదస్సులో, యురోపియన్ అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రానమీ ఇన్ కల్చర్ ఆధ్వర్యంలో ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో జరిగిన సదస్సులో ముడుమాల ప్రాధాన్యాన్ని వివరించారు. పలు పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఆ వివరాలు చూసి అక్కడి పురావస్తు పరిశోధకులు ఆశ్చర్యపోయారు. ఇంత ప్రాధాన్యమున్న ప్రాంతాన్ని స్వయంగా చూడాలని అనుకుంటున్నామని వారు పేర్కొనడం విశేషం. డిసెంబరులో సందర్శించనున్న కొరియా బృందం కొరియాలోని జ్యోంగీ ప్రావిన్షియల్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆ దేశానికి చెందిన పురావస్తు అధ్యయన బృందం డిసెంబరులో ముడుమాలకు రానుంది. ఇక్కడ ఒకరోజు పాటు ప్రాథమిక అధ్యయనం జరపనుంది. దాని ఆధారంగా భవిష్యత్తులో పూర్తిస్థాయి అధ్యయనాన్ని చేపట్టనుంది. ఇంగ్లండులో అలా.. ఇంగ్లండులోని విల్షైర్ ప్రాంతంలో ఈ తరహా నిర్మాణం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. స్టోన్ హెంజ్‌గా పేరుపెట్టిన ఈ నిర్మాణాన్ని పరిరక్షించిన అక్కడి ప్రభుత్వం.. ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చింది. దానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కూడా దక్కడంతో పర్యాటకులు వెల్లువెత్తుతున్నారు. ముడుమాలకు కూడా అలాంటి ఖ్యాతి దక్కే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఏనుగు మాంసంతో ఎనర్జీ!
ఇప్పటి చికెన్ ప్రియుల్లో కొందరు లెగ్ పీస్‌లు, బ్రెస్ట్ ముక్కల్ని ఇష్టపడ్డట్టే.. ఏనుగు మాంసం ప్రియులైన 'వాళ్లు'.. దాని తలను ఇష్టంగా తినేవారు. దాదాపు 400 కేజీల బరువుండే ఏనుగు తలలో 6.5 కేజీలుండే మెదడును తింటే మనిషికి ఎక్కడలేని శక్తి పుట్టుకొస్తుంది. రమారమి 180 కేజీల బరువుండే ఏనుగు తొండాన్ని, 44 కేజీల చెవులను, 14 కేజీల నాలుకను కత్తితో ముక్కలు చేసి.. వీలైతే నిప్పుల్లో కాల్చి, లేకుంటే పచ్చిగానే తినేవారు. 'ఏనుగు తల' అనే దివ్యశక్తిని తమతోనే ఉంచుకుని, ఎక్కడికి వెళ్లినా వెంటతీసుకెళ్లేవారు. అలా వారితోపాటు వేళ్లమైళ్లు ప్రయాణించి పూర్తిగా సంబంధంలేని ప్రాంతానికి వచ్చిపడ్డ ఏనుగుల పుర్రెలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. ఆ పరిశోధనల్లో పైన మనం చెప్పుకున్నరాతియుగపు మనిషి ఆహార శైలికి సంబంధించి ఆసక్తికరమైన విషయాల్లెన్నో వెల్లడయ్యాయి. ఇప్పటికీ జింబాబ్వే, థాయిలాండ్ లాంటి దేశాల్లో కొందరు ఏనుగు తలను ఇష్టంగా తినడానికి వెనకున్నకారణాలు తెలిసివచ్చాయి.. డైనోసార్లు అంతరించిన తర్వాత భూమి మీద సంచరించే అతిపెద్ద జీవిగా గుర్తింపుపొందిన ఏనుగును మనిషి ఎప్పటి నుంచి తింటున్నాడు? అనే విషయంపై ఇజ్రాయెల్ కు చెందిన టెల్ అవివ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. పురాతన ఆఫ్రికా ఏనుగు పుర్రెల అవశేషాలు.. ఇజ్రాయెల్, యూరప్, రష్యా లాంటి ప్రదేశాల్లో లభించడంతో ఈ పరిశోధన మొదలైంది. రాతియుగపు మనిషి వేట ఆధారంగానే జీవించేవాడని, సేకరించిన మాంసాన్ని తనతోపాటే ఉంచుకుని సంచరించేవాడన్న సంగతి తెలిసిందే. అయితే ఏనుగు పుర్రెలను వెంటపెట్టుకుని తిరగాల్సిన అవసరం ఏమొచ్చింది? అనే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఏనుగు తల మాంసంలో ఎక్కవ కేలరీల శక్తి ఉంటుందని అనుభవం ద్వారా తెలుసుకున్న రాతియుగపు మనిషి ఆ ఆహారాన్ని వీలైనంత ఎక్కువగా తినేవాడని, పుర్రెలను తనతోనే ఉంచుకునేవాడని టెల్ అవివ్ వర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు. ఇవ్వాళ్టి ఏనుగుల కంటే నాటి ఏనుగురు మరింత పెద్దవిగా, శక్తిమంతంగా ఉండేవని, వాటిని చంపడం నేర్చుకోకముందు.. చచ్చినవాటిని మాత్రమే మనిషి తినేవాడని పేర్కొన్నారు. ఈ మేరకు అవివ్ వర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనా పత్రాలను వారి పరిశోధనలు ప్రఖ్యాత క్వాటెర్నరే ఇంటర్నేషనల్ జర్నల్స్ ప్రచురించింది. ప్రస్తుత కాలంలో మనం(భారతీయులం) ఏనుగును దైవంగా బావిస్తాం. అదే థాయిలాండ్,జింబాబ్వే లాంటి దేశాల్లో మాత్రం ఏనుగు ఇప్పటికీ హాట్ డిషే. గతేడాది మార్చి 1న తన పుట్టినరోజు వేడుకల్లో అతిథులకు ఏనుగు మాంసం వడ్డించానని సాక్షాత్తు జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాంబే ప్రకటించిన సంగతి గుర్తేకదా! (కొన్నేళ్ల కిందట జింబాబ్వే అటవీ ప్రాంతంలో ఏనుగు వధకు సంబంధించిన ఫొటోలివి.)