చరిత్రను సృష్టించకపోయినా ఫరవాలేదు. కాని, దానికి మసిపూసి మారేడుకాయ చేయడం, లేదా అసలు పాఠ్యగ్రంథాల నుంచీ, చరిత్రపుస్తకాల నుంచీ తీసివేయడం కూడదు కదా! ఇవ్వాళ కేంద్ర పాలకులు ఈ దుశ్చర్యకు పూనుకున్నారు. ‘ఒకే దేశం, ఒకే జాతి, ఒకే సంస్కృతి’ వంటి నినాదాలతో రాజకీయాలు చేస్తున్న పెద్దల మాటలు నీటి మూటలని కొన్ని చారిత్రక అంశాలు తేల్చి చెబుతున్నాయి.
అందుకే వీరు తమ సిద్ధాంతాల డొల్లతనాన్ని బయటపెట్టే చారిత్రక అంశాలకు తిలోదకాలు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. మానవ పరిణామ క్రమం, మొగలాయీ చక్రవర్తుల పాలనా కాలంలోని ఘట్టాలు వంటి అనేక అంశాలు ఆ విధంగా వీరి కత్తిరింపునకు బలయ్యాయి.
భారతదేశంలో పాలకులు చరిత్రను వక్రీకరించాలనే దుర్వ్యూహాలు పన్నుతున్నారు. హిందు మతవాద భావజాలం ఆధారంగా చరిత్రను బోధించాలను కోవడం ఒక అసంబద్ధ చర్యే అవుతుంది. క్రీస్తు పూర్వం 7000 నుంచి 1500 మధ్యలో ఆవిర్భవించిన వైదిక సాహిత్యం... క్రీస్తు పూర్వం 50 వేల ఏళ్ల చరిత్రను కుదించి... భారతీయ మూలాలను దెబ్బతీసింది. రాతియుగాల నుంచీ మానవుడు నేటి ఆధునిక యుగాల వరకూ ఎలా పరిణామం చెందాడనేది మానవ మహాచరిత్రలో అందరూ తెలుసు కోవలసిన ముఖ్యమైన అంశం.
ప్రస్తుతం మానవుడు ఉన్న స్థితికి... వందలు, వేల తరాల మానవులు అనుభవ పూర్వకంగా తెలుసుకున్న విజ్ఞానం, దాని ఆధారంగా చేసిన ఆవిష్కరణలు ఎలా కారణమయ్యా యనేది మానవ భవిష్యత్ గమనానికి అద్భుతమైన పాఠం. కానీ ఇవ్వాళ ఇంతటి ప్రాముఖ్యం ఉన్న మానవ పరిణామ క్రమాన్నీ, ఇతర చారిత్రక అంశాలనూ ఎన్‌సీఆర్టీ పుస్తకాల నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించడానికి నిర్ణయించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.
సంస్కృత భాషా గ్రంథాల్లో చేసిన కృత్రిమ కల్పనలు, వ్యుత్ప త్తులు, నీచార్థాల ద్వారా భారతీయ మూలవాసుల సాంస్కృతిక మూలాలను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరిగాయి. సామర్థ్యమూ, శాంతి, సమన్వయము ప్రేమతో కూడిన మూలవాసుల భావనలను ధ్వంసం చేసే క్రమంలో బీభత్స, భయానక రసాలకు ఎక్కువ ప్రాధా న్యత ఇస్తూ చాలా చరిత్ర వక్రీకరణకు గురయ్యింది. భారతదేశానికి ఆర్యుల రాక ముందటి చరిత్ర భారతీయ మూలవాసులదీ, దళితులదీ అని హిందూవాద రచయితలకు తెలుసు.
అయినా దాని ప్రస్తావన చరిత్ర రచనలో రానివ్వడం లేదు. చరిత్ర నిర్మాణానికి అవసరమైన పరికరాలనూ, ఆధారాలనూ పరిగణనలోకి తీసుకోకపోవడం సరి కాదు. చరిత్రతో మానవ పరిణామానికి, పురాతత్త్వ శాస్త్రానికి, శాసనా లకు, నాణేలకు ఉన్న అనుబంధాన్ని నిరాకరించి నెట్టివేయడం చారి త్రక ద్రోహమే. ఇప్పుడు పాఠ్యపుస్తకాల నుంచి కొన్ని అంశాలను తొలగించడాన్ని ఈ కోణంలోనే చూడాలి.
భారతదేశ చరిత్ర, సంస్కృతులను నిర్మించడంలో పురావస్తు శాస్త్రానిది తిరుగులేని పాత్ర. 19వ శతాబ్దపు చతుర్ధ పాదంలో దేశంలో ఈ శాస్త్రం అడుగిడింది. ఎందరో ప్రముఖులైన బ్రిటిష్, పురాతత్వ వేత్తలు ఈ విజ్ఞానం అభివృద్ధి పొందటానికి ఎంతో తోడ్పడ్డారు. పురావస్తు శాస్త్రం వెలుగులో బయటపడ్డ కొత్త కొత్త మానవ అవశేషాలు, వాడిన పనిముట్లను ఆధారం చేసుకుని నాటి మనిషి ఆర్థిక, సామాజిక, విశ్వాస వ్యవస్థలను నిర్మిస్తూ వస్తున్నారు.
అటువంటి చరిత్ర... మతాలు చెప్పే విషయాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. అందుకే మత తత్త్వవాదులు తమకు ఇబ్బంది అనుకున్న అంశాలను పాఠాల నుండి, చరిత్ర గంథాల నుండి మాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. లేదా తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చరిత్ర పాఠ్యాంశాల నుంచి మానవ పరిణామ క్రమాన్ని తొలగించడం ఇందుకు మంచి ఉదాహరణ.
ప్రసిద్ధ చరిత్రకారులు డీడీ కోశాంబి హిందూ పునరుద్ధరణ వాదం వల్ల వచ్చిన అనేక పరిణామాలను మన ముందుకు పరిశోధనాత్మకంగా తెచ్చారు. మూఢాచారాలు మానవ పరిణామాన్ని అడ్డుకుంటాయి అని చెప్పారు. వైదికవాదులు వ్యవసాయ సంస్కృతిని నిరసి స్తారు. కానీ వ్యవసాయం మీద వచ్చే అన్ని ఫలితాలు అనుభవిస్తారు. వాటిని దానం రూపంలో పొందుతారు.
అయితే వ్యవసాయదారులను శూద్రులుగాను, వ్యవసాయ కూలీలగానూ, అతిశూద్రులు గానూ చూస్తారు. వీరు ఎంతో బౌద్ధ సాహిత్యాన్ని నాశనం చేశారు. బౌద్ధంలో దాగివున్న సమానతావాదం వీరికి వ్యతిరేకం. గుప్తుల కాలంలో అశ్వమేధ యాగాలతో క్రూరమైన హింస భారతదేశంలో కొనసాగింది. శూద్రులు, అతిశూద్రులు తీవ్ర వధకు గురయ్యారని ఆయన అన్నారు.
భారతదేశ చరిత్రలో నూతన అధ్యాయాన్ని నిర్మించిన అశోకుని మానవతావాద పాలనాముద్రను చెరిపివేయాలని గుప్త వంశంలో ప్రసిద్ధుడైన సముద్ర గుప్తుడు ఎలా ప్రయత్నించాడో రొమిల్లా థాపర్ తన ‘భారతదేశ చరిత్ర’లో విశ్లేషణాత్మకంగా వివరించారు. ‘ఈ శాసనం అశోకుని ఇతర శాసనాలతో విభేదిస్తుంది.
మౌర్యపాలకుడు, గుప్తులకన్నా విశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించినా అతడు తన అధికారాన్ని అమలు పరచటంలో చాలా సాత్వికంగా ప్రవర్తించాడు.అశోకుడు దిగ్విజయ యాత్రను వదులుకుంటే, సముద్ర గుప్తుడు దిగ్విజయాలలో తేలియాడాడు. అతడు ఉత్తర రాజస్థాన్‌లోని చిన్న చిన్న రాజ్యాల అధికారాన్ని కూలద్రోశాడు. ఫలితంగా వాయవ్య భారతంపై హూణుల దండయాత్ర, చివరి గుప్త రాజులకు దురదృష్టకరంగా పరిణమించింది’.
చరిత్రను వక్రీకరించాలనే ప్రయత్నం వలన భారతదేశ వ్యక్తి త్వానికి దెబ్బ తగులుతుందని తెలుసుకోలేక పోతున్నారు పాలకులు. ఇలా చేస్తే ఉత్పత్తి పరికరాలు కనిపెట్టిన దేశీయుల చరిత్ర మసక బారుతుంది. నదీ నదాలూ, కొండ కోనలూ, దట్టమైన అరణ్యాలూ, సారవంతమైన మైదానాలూ, చిట్టడవులూ... ఇలా విభిన్న ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పరిస్థితులకు అనుకూలమైన జీవన పోరాట పద్ధతులు (స్ట్రాటజీస్)ను రూపొందించుకుని విభిన్న సాంస్కృతిక సమూహాలుగా జనం మనుగడ సాగించే క్రమంలో... అటువంటి సమూహాలను జయించి ఒకే రాజ్యంగానో, సామ్రాజ్యంగానో చేయాలని చేసిన ప్రయత్నాలు చరిత్రలో ఉన్నాయి.
ఆ ప్రయత్నాలు కొన్నిసార్లు ఫలించినా... అదను చూసుకుని దేశీ సమూహాలు ఎక్కడి కక్కడ తిరుగుబాట్లు చేసి తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వచ్చాయి. మొగలాయీల కాలం కావచ్చు, బ్రిటిష్ వాళ్ల కాలం కావచ్చు... మూలవాసులైన ఆదివాసుల తిరుగుబాట్లు ఎన్నో మనకు ఇందుకు ఉదాహరణలుగా కనిపిస్తాయి.
ఈ చరిత్రను మరచి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ‘ఒకే దేశం, ఒకే మతం, ఒకే జాతి, ఒకే సంస్కృతి’ అనే నినాదాన్ని భుజానికి ఎత్తుకొని చరిత్రలోని ముఖ్యమైన ఘటనలను మాయం చేసే ప్రయత్నాలు చేస్తోంది. భారతదేశ మూలవాసులు ఏ మతాధిపత్యానికి, కులాధి పత్యానికి లొంగలేదు. స్వతంత్ర ప్రతిపత్తితో జీవించారు. మతం అనేది వ్యక్తిగత విశ్వాసంగానే మానవ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు... అత్యధిక కాలం మనుగడ సాగించింది.
చరిత్రకారుడు తారాచంద్ చెప్పినట్లు చరిత్ర అనేది అనేక వైవిధ్యాలను సమన్వయం చేస్తుంది. అంతేకాదు అనేక జాతులను, అనేక సంస్కృతులను, అనేక ధర్మాలను, అనేక వ్యక్తిత్వాలను, అనేక ప్రాంతాలను సమన్వయం చేస్తూ గమిస్తుంది. మొగల్ చక్రవర్తి అక్బర్ ఒక గొప్ప చక్రవర్తి. ఆయన చరిత్రను పాఠ్యాంశాల నుండి తొలగించినందువల్ల ఎంతో విలువైన చారిత్రక జ్ఞానాన్ని కోల్పోతాం.
ఆయన కాలంలో భారతదేశంలో అనేకమైన మార్పులు జరిగాయి. అక్బరు పాలించిన సుదీర్ఘకాలంలో ఆయన ప్రతి 10 ఏళ్లకు ఒకసారి మారుతూ వచ్చాడు. మొదట హిందూ రాజ్యాలపై కత్తి దూసిన అక్బర్... ఆ తరువాత హిందూ రాజ్యాలతో సమన్వయానికి ఎక్కువ పనిచేశాడు. ఇటువంటి రాజనీతిజ్ఞుడి పాఠం సిలబస్ నుంచి తీసివేస్తే విద్యార్థులకు భారత చరిత్రపై సరైన అవగాహన కలుగదు.
నిజానికి అంబేద్కర్, మహాత్మాఫూలే, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణ గురు, ఝల్కారీ బాయి... ఇలా అనేక మంది సామాజిక విప్లవకారుల ప్రభావం దేశం మీద ఎంతో ఉంది. వారి జీవన చిత్రాలను కూడా మన చరిత్రలో ప్రజ్వలింపచేయాలి. అప్పుడే దేశానికి మేలు. ప్రతీ విద్యార్థికి చరిత్ర అనే వెలుగు దిక్సూచి అవుతుంది. చరిత్రను వాస్తవంగా అర్థం చేసుకున్నప్పుడే, భారతదేశాన్ని గానీ, ప్రపంచాన్ని గానీ, పునఃనిర్మించే పనిలో విద్యార్థులు, ప్రజలు విజేతలు అవుతారు. అందుకే చరిత్రను రక్షించుకుందాం, దేశాన్ని రక్షించుకుందాం!
డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త దళిత ఉద్యమ నేత ‘ 98497 41695
Comments
Please login to add a commentAdd a comment