Modern culture
-
Saxophonist: శాక్సాఫోన్ సుబ్బలక్ష్మి
సుబ్బలక్ష్మి ఇంటి పేరు ఎవరికీ తెలియదు. ప్రపంచమంతా ఆమెను శాక్సాఫోన్ సుబ్బలక్ష్మి అనే పిలుస్తుంది. మగవారు మాత్రమే వాయించే ఈ వాయిద్యంలో సుబ్బలక్ష్మి స్త్రీగా ఉనికి సాధించింది. పట్టుచీర, వడ్డాణం ధరించి వేదిక మీద సంప్రదాయ ఆహార్యంలో ఈ ఆధునిక వాయిద్యం మీద వెస్ట్రన్, కర్నాటక్‌లో అద్భుత ప్రతిభ చూపుతుంది. డైరీలో ఒకరోజు కూడా ఖాళీ ఎరగని ఈ బెంగళూరు వాద్యకారిణి సక్సెస్ స్టోరీ. 40 ఏళ్ల సుబ్బలక్ష్మి ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలంటే సంవత్సరం ముందు బుక్ చేసుకోవాలి. ఆమె డైరీలో ఒక్కరోజు కూడా ఖాళీ ఉండదు. ఇవాళ చెన్నై, రేపు బెంగళూరు, ఎల్లుండి దుబాయ్... ఆమె కచ్చేరీలు సాగిపోతూ ఉంటాయి. భర్త కిరణ్ కుమార్‌కు ఐ.టి. రంగంలో మంచి ఉద్యోగం. కానీ ఈమె కచ్చేరీల బిజీ చూసి ఉద్యోగం మానేసి సాయంగా ఉంటున్నాడు. బెంగళూరులో నివాసం ఉండే సుబ్బలక్ష్మి సొంతింట్లో ఉండేది తక్కువ. కచ్చేరీలకు తిరిగేది ఎక్కువ. కాని ఈ విజయం అంత సులువు కాదు సుమా. ఒక్కతే శిష్యురాలు సుబ్బలక్ష్మి పూర్తిపేరు ఎం.ఎస్.సుబ్బలక్ష్మి. అవును. మహా గాత్ర విద్వాంసులు ఎం.ఎస్.సుబ్బులక్ష్మిని జ్ఞప్తికి తెచ్చే పేరు. ఆ పేరు ప్రభావమో, ఇంట్లో సంగీతం ఉండటమో సుబ్బలక్ష్మికి కూడా సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. సుబ్బలక్ష్మి తాత మైసూర్ సంస్థానంలో ఆస్థాన సంగీత విద్వాంసుడుగా ఉండేవాడు. సుబ్బలక్ష్మి తండ్రి సాయినాథ్ మంగళూరులో మృదంగ విద్వాంసుడు. అతడు అనేకమంది సంగీతకారులకు కచ్చేరీల్లో వాద్య సహకారం అందించేవాడు. ఐదో ఏట నుంచే గాత్ర సంగీతం నేర్చుకుంటున్న సుబ్బలక్ష్మి ఒకసారి తండ్రితోపాటు కచ్చేరీకి వెళ్లింది. అది శాక్సాఫోన్ విద్వాంసుడు కద్రి గోపాల్‌నాథ్ కచ్చేరి. అందులో గోపాల్‌నాథ్ అద్భుతంగా శాక్సాఫోన్ వాయిస్తుంటే సుబ్బలక్ష్మి మైమరిచిపోయింది. తాను కూడా శాక్సాఫోన్ నేర్చుకోవాలనుకుంది. అప్పుడు ఆమెకు 13 ఏళ్లు. ఆ రోజుల్లో ఆడపిల్లలు శాక్సాఫోన్ను అంతగా నేర్చుకునేవారు కాదు. గురువులు నేర్పించేవారు కూడా కాదు. అది పూర్తిగా మగవారి వాయిద్యం. కాని సుబ్బలక్ష్మి పట్టుబట్టింది. మొత్తం 16 మంది శిష్యులు ఆ సమయంలో కద్రి గోపాల్‌నాథ్ దగ్గర ఉంటే వారిలో ఒకే ఒక శిష్యురాలు సుబ్బలక్ష్మి. గర్భం దాల్చాక కూడా సుబ్బలక్ష్మి శాక్సాఫోన్ వాయించడంలో ఒక వరుస ఉంటుంది. ఆమె మొదట కర్నాటక సంగీతం వాయించి ఆ తర్వాత ఫ్యూజన్లోకి వస్తుంది. వెస్ట్రన్‌ను, కర్నాటక్ను మిళితం చేసి కచ్చేరీల్లో ఒక ఊపు తెస్తుంది. అది జనానికి నచ్చుతుంది. ఇది కూడా కొంతమంది శాక్సాఫోన్ విద్వాంసులకు నచ్చదు. ఆమెను విమర్శిస్తుంటారు. ‘నన్ను ఎన్నో విమర్శిస్తారు. కాని నేను భయపడలేదు. కచ్చేరీలు కొనసాగించాను. 7 కిలోల శాక్సాఫోన్ను రెండు గంటల పాటు పట్టుకుని కచ్చేరి చేయడం ఎంత కష్టమో ఆలోచించండి. ఆడది అలా చేయలేదు అనేవాళ్లకు సమాధానంగా నిలిచాను. నా ఊపిరితిత్తుల బలం నాకు సహకరించింది. పెళ్లయి గర్భం దాల్చాక నా శత్రువులు ఇక ఆమె కచ్చేరీలు చేయదు అనే ప్రచారం మొదలెట్టారు. డెలివరీ అయ్యాక కచ్చేరీలు సాధ్యం కాదని ఆర్గనైజర్స్‌ను భయపెట్టారు. దాంతో షోలు బుక్ చేసిన ఆర్గనైజర్స్ అడ్వాన్సులు వెనక్కు ఇమ్మని అడగడం మొదలెట్టారు. నేను పట్టుదలగా ఆ పుకార్లను తోసి పుచ్చాను. రేపు డెలివరీ అనగా ఇవాళ కూడా కచ్చేరీ చేశాను. నిండు గర్భవతిగా స్టేజ్ మీద శాక్సాఫోన్ వాయించింది నేనే అనుకుంటా. అలాగే డెలివరీ అయిన 15 రోజులకు మళ్లీ స్టేజ్ మీదకు వచ్చాను. ఈ రంగంలో నేనేమిటో నిరూపించుకోవాలనే నా పట్టుదలే నాకు బలాన్ని ఇచ్చింది’ అంటుంది సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి సోదరి లావణ్య కూడా శాక్సాఫోన్ విద్వాంసురాలిగా రాణిస్తోంది. వీరు విడివిడిగా కచ్చేరీలు చేసినా కలిసి చేసే కచ్చేరీలు కూడా వీనుల విందుగా ఉంటాయి. ఎన్నో వెక్కిరింతలు సాధనలో అబ్బాయిలు సుబ్బలక్ష్మిని అస్సలు సహించలేదు. ‘నేను శాక్సా పట్టుకుని సాధన చేస్తుంటే వాళ్లు నవ్వుతుండేవారు. కుర్చీ కిర్రుకిర్రుమన్నట్టు ఉంది అనేవారు. గురువు గారి భార్య మా అమ్మకు స్నేహితురాలు. వీళ్లు నవ్వుతుంటే ఆమె బయటికొచ్చి చూసి– వాళ్లు నవ్వనీ ఏమైనా అననీ... నువ్వు మాత్రం ట్రై చేస్తూనే ఉండు. నీకు వస్తుంది అని ఎంకరేజ్ చేసింది. ఆమె ప్రోత్సాహం వల్ల ధైర్యం తెచ్చుకున్నాను. నేను శాక్సాఫోన్ నేర్చుకోవడంలో ప్రోత్సాహం కంటే అవమానమే ఎక్కువ. కచ్చేరీల్లో కావాలని నా టైము మధ్యాహ్నం ఇచ్చేవారు. ఆ సమయంలో ఆడియెన్స్ ఉండరు. మహా అయితే పది నిమిషాలు కేటాయించేవారు. మగవారు సాయంత్రం నిండు సభలో వాయించేవారు. వారికి గంట సమయం దొరికేది. నన్ను ప్రత్యేకంగా మహిళా శాక్సాఫోనిస్ట్ అని విడిగా చూసేవారు’ అని తెలిపింది సుబ్బలక్ష్మి. -
చరిత్రను మార్చడం ఏమార్చడమే!
చరిత్రను సృష్టించకపోయినా ఫరవాలేదు. కాని, దానికి మసిపూసి మారేడుకాయ చేయడం, లేదా అసలు పాఠ్యగ్రంథాల నుంచీ, చరిత్రపుస్తకాల నుంచీ తీసివేయడం కూడదు కదా! ఇవ్వాళ కేంద్ర పాలకులు ఈ దుశ్చర్యకు పూనుకున్నారు. ‘ఒకే దేశం, ఒకే జాతి, ఒకే సంస్కృతి’ వంటి నినాదాలతో రాజకీయాలు చేస్తున్న పెద్దల మాటలు నీటి మూటలని కొన్ని చారిత్రక అంశాలు తేల్చి చెబుతున్నాయి. అందుకే వీరు తమ సిద్ధాంతాల డొల్లతనాన్ని బయటపెట్టే చారిత్రక అంశాలకు తిలోదకాలు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. మానవ పరిణామ క్రమం, మొగలాయీ చక్రవర్తుల పాలనా కాలంలోని ఘట్టాలు వంటి అనేక అంశాలు ఆ విధంగా వీరి కత్తిరింపునకు బలయ్యాయి. భారతదేశంలో పాలకులు చరిత్రను వక్రీకరించాలనే దుర్వ్యూహాలు పన్నుతున్నారు. హిందు మతవాద భావజాలం ఆధారంగా చరిత్రను బోధించాలను కోవడం ఒక అసంబద్ధ చర్యే అవుతుంది. క్రీస్తు పూర్వం 7000 నుంచి 1500 మధ్యలో ఆవిర్భవించిన వైదిక సాహిత్యం... క్రీస్తు పూర్వం 50 వేల ఏళ్ల చరిత్రను కుదించి... భారతీయ మూలాలను దెబ్బతీసింది. రాతియుగాల నుంచీ మానవుడు నేటి ఆధునిక యుగాల వరకూ ఎలా పరిణామం చెందాడనేది మానవ మహాచరిత్రలో అందరూ తెలుసు కోవలసిన ముఖ్యమైన అంశం. ప్రస్తుతం మానవుడు ఉన్న స్థితికి... వందలు, వేల తరాల మానవులు అనుభవ పూర్వకంగా తెలుసుకున్న విజ్ఞానం, దాని ఆధారంగా చేసిన ఆవిష్కరణలు ఎలా కారణమయ్యా యనేది మానవ భవిష్యత్ గమనానికి అద్భుతమైన పాఠం. కానీ ఇవ్వాళ ఇంతటి ప్రాముఖ్యం ఉన్న మానవ పరిణామ క్రమాన్నీ, ఇతర చారిత్రక అంశాలనూ ఎన్సీఆర్టీ పుస్తకాల నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించడానికి నిర్ణయించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. సంస్కృత భాషా గ్రంథాల్లో చేసిన కృత్రిమ కల్పనలు, వ్యుత్ప త్తులు, నీచార్థాల ద్వారా భారతీయ మూలవాసుల సాంస్కృతిక మూలాలను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరిగాయి. సామర్థ్యమూ, శాంతి, సమన్వయము ప్రేమతో కూడిన మూలవాసుల భావనలను ధ్వంసం చేసే క్రమంలో బీభత్స, భయానక రసాలకు ఎక్కువ ప్రాధా న్యత ఇస్తూ చాలా చరిత్ర వక్రీకరణకు గురయ్యింది. భారతదేశానికి ఆర్యుల రాక ముందటి చరిత్ర భారతీయ మూలవాసులదీ, దళితులదీ అని హిందూవాద రచయితలకు తెలుసు. అయినా దాని ప్రస్తావన చరిత్ర రచనలో రానివ్వడం లేదు. చరిత్ర నిర్మాణానికి అవసరమైన పరికరాలనూ, ఆధారాలనూ పరిగణనలోకి తీసుకోకపోవడం సరి కాదు. చరిత్రతో మానవ పరిణామానికి, పురాతత్త్వ శాస్త్రానికి, శాసనా లకు, నాణేలకు ఉన్న అనుబంధాన్ని నిరాకరించి నెట్టివేయడం చారి త్రక ద్రోహమే. ఇప్పుడు పాఠ్యపుస్తకాల నుంచి కొన్ని అంశాలను తొలగించడాన్ని ఈ కోణంలోనే చూడాలి. భారతదేశ చరిత్ర, సంస్కృతులను నిర్మించడంలో పురావస్తు శాస్త్రానిది తిరుగులేని పాత్ర. 19వ శతాబ్దపు చతుర్ధ పాదంలో దేశంలో ఈ శాస్త్రం అడుగిడింది. ఎందరో ప్రముఖులైన బ్రిటిష్, పురాతత్వ వేత్తలు ఈ విజ్ఞానం అభివృద్ధి పొందటానికి ఎంతో తోడ్పడ్డారు. పురావస్తు శాస్త్రం వెలుగులో బయటపడ్డ కొత్త కొత్త మానవ అవశేషాలు, వాడిన పనిముట్లను ఆధారం చేసుకుని నాటి మనిషి ఆర్థిక, సామాజిక, విశ్వాస వ్యవస్థలను నిర్మిస్తూ వస్తున్నారు. అటువంటి చరిత్ర... మతాలు చెప్పే విషయాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. అందుకే మత తత్త్వవాదులు తమకు ఇబ్బంది అనుకున్న అంశాలను పాఠాల నుండి, చరిత్ర గంథాల నుండి మాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. లేదా తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు చరిత్ర పాఠ్యాంశాల నుంచి మానవ పరిణామ క్రమాన్ని తొలగించడం ఇందుకు మంచి ఉదాహరణ. ప్రసిద్ధ చరిత్రకారులు డీడీ కోశాంబి హిందూ పునరుద్ధరణ వాదం వల్ల వచ్చిన అనేక పరిణామాలను మన ముందుకు పరిశోధనాత్మకంగా తెచ్చారు. మూఢాచారాలు మానవ పరిణామాన్ని అడ్డుకుంటాయి అని చెప్పారు. వైదికవాదులు వ్యవసాయ సంస్కృతిని నిరసి స్తారు. కానీ వ్యవసాయం మీద వచ్చే అన్ని ఫలితాలు అనుభవిస్తారు. వాటిని దానం రూపంలో పొందుతారు. అయితే వ్యవసాయదారులను శూద్రులుగాను, వ్యవసాయ కూలీలగానూ, అతిశూద్రులు గానూ చూస్తారు. వీరు ఎంతో బౌద్ధ సాహిత్యాన్ని నాశనం చేశారు. బౌద్ధంలో దాగివున్న సమానతావాదం వీరికి వ్యతిరేకం. గుప్తుల కాలంలో అశ్వమేధ యాగాలతో క్రూరమైన హింస భారతదేశంలో కొనసాగింది. శూద్రులు, అతిశూద్రులు తీవ్ర వధకు గురయ్యారని ఆయన అన్నారు. భారతదేశ చరిత్రలో నూతన అధ్యాయాన్ని నిర్మించిన అశోకుని మానవతావాద పాలనాముద్రను చెరిపివేయాలని గుప్త వంశంలో ప్రసిద్ధుడైన సముద్ర గుప్తుడు ఎలా ప్రయత్నించాడో రొమిల్లా థాపర్ తన ‘భారతదేశ చరిత్ర’లో విశ్లేషణాత్మకంగా వివరించారు. ‘ఈ శాసనం అశోకుని ఇతర శాసనాలతో విభేదిస్తుంది. మౌర్యపాలకుడు, గుప్తులకన్నా విశాలమైన సామ్రాజ్యాన్ని పరిపాలించినా అతడు తన అధికారాన్ని అమలు పరచటంలో చాలా సాత్వికంగా ప్రవర్తించాడు.అశోకుడు దిగ్విజయ యాత్రను వదులుకుంటే, సముద్ర గుప్తుడు దిగ్విజయాలలో తేలియాడాడు. అతడు ఉత్తర రాజస్థాన్‌లోని చిన్న చిన్న రాజ్యాల అధికారాన్ని కూలద్రోశాడు. ఫలితంగా వాయవ్య భారతంపై హూణుల దండయాత్ర, చివరి గుప్త రాజులకు దురదృష్టకరంగా పరిణమించింది’. చరిత్రను వక్రీకరించాలనే ప్రయత్నం వలన భారతదేశ వ్యక్తి త్వానికి దెబ్బ తగులుతుందని తెలుసుకోలేక పోతున్నారు పాలకులు. ఇలా చేస్తే ఉత్పత్తి పరికరాలు కనిపెట్టిన దేశీయుల చరిత్ర మసక బారుతుంది. నదీ నదాలూ, కొండ కోనలూ, దట్టమైన అరణ్యాలూ, సారవంతమైన మైదానాలూ, చిట్టడవులూ... ఇలా విభిన్న ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పరిస్థితులకు అనుకూలమైన జీవన పోరాట పద్ధతులు (స్ట్రాటజీస్)ను రూపొందించుకుని విభిన్న సాంస్కృతిక సమూహాలుగా జనం మనుగడ సాగించే క్రమంలో... అటువంటి సమూహాలను జయించి ఒకే రాజ్యంగానో, సామ్రాజ్యంగానో చేయాలని చేసిన ప్రయత్నాలు చరిత్రలో ఉన్నాయి. ఆ ప్రయత్నాలు కొన్నిసార్లు ఫలించినా... అదను చూసుకుని దేశీ సమూహాలు ఎక్కడి కక్కడ తిరుగుబాట్లు చేసి తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వచ్చాయి. మొగలాయీల కాలం కావచ్చు, బ్రిటిష్ వాళ్ల కాలం కావచ్చు... మూలవాసులైన ఆదివాసుల తిరుగుబాట్లు ఎన్నో మనకు ఇందుకు ఉదాహరణలుగా కనిపిస్తాయి. ఈ చరిత్రను మరచి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ‘ఒకే దేశం, ఒకే మతం, ఒకే జాతి, ఒకే సంస్కృతి’ అనే నినాదాన్ని భుజానికి ఎత్తుకొని చరిత్రలోని ముఖ్యమైన ఘటనలను మాయం చేసే ప్రయత్నాలు చేస్తోంది. భారతదేశ మూలవాసులు ఏ మతాధిపత్యానికి, కులాధి పత్యానికి లొంగలేదు. స్వతంత్ర ప్రతిపత్తితో జీవించారు. మతం అనేది వ్యక్తిగత విశ్వాసంగానే మానవ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు... అత్యధిక కాలం మనుగడ సాగించింది. చరిత్రకారుడు తారాచంద్ చెప్పినట్లు చరిత్ర అనేది అనేక వైవిధ్యాలను సమన్వయం చేస్తుంది. అంతేకాదు అనేక జాతులను, అనేక సంస్కృతులను, అనేక ధర్మాలను, అనేక వ్యక్తిత్వాలను, అనేక ప్రాంతాలను సమన్వయం చేస్తూ గమిస్తుంది. మొగల్ చక్రవర్తి అక్బర్ ఒక గొప్ప చక్రవర్తి. ఆయన చరిత్రను పాఠ్యాంశాల నుండి తొలగించినందువల్ల ఎంతో విలువైన చారిత్రక జ్ఞానాన్ని కోల్పోతాం. ఆయన కాలంలో భారతదేశంలో అనేకమైన మార్పులు జరిగాయి. అక్బరు పాలించిన సుదీర్ఘకాలంలో ఆయన ప్రతి 10 ఏళ్లకు ఒకసారి మారుతూ వచ్చాడు. మొదట హిందూ రాజ్యాలపై కత్తి దూసిన అక్బర్... ఆ తరువాత హిందూ రాజ్యాలతో సమన్వయానికి ఎక్కువ పనిచేశాడు. ఇటువంటి రాజనీతిజ్ఞుడి పాఠం సిలబస్ నుంచి తీసివేస్తే విద్యార్థులకు భారత చరిత్రపై సరైన అవగాహన కలుగదు. నిజానికి అంబేద్కర్, మహాత్మాఫూలే, పెరియార్ రామస్వామి నాయకర్, నారాయణ గురు, ఝల్కారీ బాయి... ఇలా అనేక మంది సామాజిక విప్లవకారుల ప్రభావం దేశం మీద ఎంతో ఉంది. వారి జీవన చిత్రాలను కూడా మన చరిత్రలో ప్రజ్వలింపచేయాలి. అప్పుడే దేశానికి మేలు. ప్రతీ విద్యార్థికి చరిత్ర అనే వెలుగు దిక్సూచి అవుతుంది. చరిత్రను వాస్తవంగా అర్థం చేసుకున్నప్పుడే, భారతదేశాన్ని గానీ, ప్రపంచాన్ని గానీ, పునఃనిర్మించే పనిలో విద్యార్థులు, ప్రజలు విజేతలు అవుతారు. అందుకే చరిత్రను రక్షించుకుందాం, దేశాన్ని రక్షించుకుందాం! డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళిత ఉద్యమ నేత ‘ 98497 41695 -
బాధ్యత తీసుకుందాం
13-19 కేరెంటింగ్ అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19... ‘పద్నాలుగు, పదిహేనేళ్లకే ప్రేమలేంటి?! పిల్లలు చెడిపోతున్నారు. ఈ తప్పంతా పిల్లల్ని భయభక్తుల్లో పెంచలేని తల్లిదండ్రులదే’ అంటారు మొన్నటి తరం పెద్దలు. అర్థం లేని చెత్తనంతా పిల్లల మెదళ్లకు జొప్పిస్తున్న మీడియాదే తప్పు అంటారు ఇప్పటి తల్లిదండ్రులు. నేటి విద్యా వ్యవస్థదే తప్పు అంటున్నాయి ప్రసారమాధ్యమాలు. వచ్చిపడుతున్న టెక్నాలజీదే తప్పు అంటున్నాయి స్కూళ్లు, కాలేజీలు. టెక్నాలజీదేమీ లేదు ఆధునిక సంస్కృతిదే తప్పంతా అని సమాజంలోని ఆలోచనాపరులు అంటున్నారు. ఇంతకీ టీనేజ్ పిల్లలను ముళ్లదారి పట్టించే తప్పు ఎవరిది?!! మహి 8వ తరగతి చదువుతోంది. ఇంటిపనులు, షాపింగ్‌లతో అమ్మకు తీరిక ఉండదు. వ్యాపార రీత్యా నాన్న ఎప్పుడూ బిజీ! ఒక్కతే కూతురు. తన భావాలు పంచుకోవడానికి ఇంట్లో ఎవరూ లేరు. అదే కాలనీలో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయి, ఇంట్లోనే ఉంటున్న అబ్బాయితో మహికి పరిచయం ఏర్పడింది. అదెలాగంటే.. ఈ మధ్యే మహికి ఆ అబ్బాయి ‘ప్రేమిస్తున్నాను’ అంటూ ప్రపోజ్ చేశాడు. ఆ రోజు నుంచి ఫ్రెండ్ ఇంటికంటూ బయట తిరగడం, రోజూ ఒంటిగంట వరకు అమ్మనాన్న చూడకుండా దుప్పటి ముసుగేసుకొని ఫోన్లో కబుర్లు, మెసేజ్‌లు ఇవ్వడం చేస్తుంది. చదువు మీద శ్రద్ధ పోయింది. ఇటీవల ఆ అబ్బాయి తరచూ డబ్బులు అడుగుతుండటంతో ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర బుక్స్, పెన్నులు కావాలంటూ అడిగి ఆ అబ్బాయికి ఇస్తూ వచ్చింది. సరిపోవడం లేదంటే.. తన మెడలో ఉన్న బంగారు చైన్, చెవి రింగులు కూడా తీసిచ్చింది. ‘ఎందుకలా చేశావు’అంటే.. ‘ప్రేమలో ఉన్నప్పుడు ఆ మాత్రం చేయకపోతే ఎలా?’ అని ఎదురు సమాధానం. ఎవరు చెప్పారు ఆ అమ్మాయికి ఇలాంటివి చేస్తేనే ప్రేమ అని?! హరిణి ఇంటర్మీడియెట్ సెకండియర్ హాస్టల్లో ఉండి చదువుతోంది. ఈ మధ్య అమ్మనాన్నలతో ఫోన్లో మాట్లాడాలన్నా గిల్టీగా ఉంటోందని బాధపడుతోంది. ‘ఫస్టియర్ సబ్జెక్ట్సే ఇంకా మిగిలి ఉన్నాయి. ‘ఇప్పుడీ చదువు గట్టెక్కేదెలా?’అని ఏడుపు. చదువుకునే ఆసక్తి పోయింది అంటుంది. ‘ఎందుకలా, ఏమైంది?’ అంటే ‘రిలేషన్లో ఉన్నాను’ అంది. ఇప్పటి పిల్లలు ‘పాష్’గా మాట్లాడుకునే పదం ఇది. ‘రిలేషన్ అంటే’ అని అడిగితే- అదే ‘ప్రేమ’అంది. తరచి తరచి అడిగితే- ‘పెళ్లి చేసుకుంటాం కదా అని, ఏడాదిగా పెళ్లికాని భార్యాభర్తల్లాగే ఉన్నాం. కానీ, ఇప్పుడు ‘నేనెవరో తెలియదు’ అని మాట్లాడుతున్నాడు. ఆ అబ్బాయి ఇంకో అమ్మాయిని కూడా ట్రాప్ చేశాడు’ అని ఏడుస్తూనే చెప్పింది. ‘అంత గుడ్డిగా అతన్ని ఎలా నమ్మావు?’ అని అడిగితే ‘లవ్ ఈజ్ బ్లైండ్ కదా మేడమ్, అప్పుడు నాకేమీ అర్థం కాలేదు’ అంది. ఈ అమ్మాయికి ప్రేమ గుడ్డిది అని ఎవరు చెప్పారు?! ప్రేమికులకైనా కళ్లుంటాయి కదా!! ప్రేమంటే ఇదేనా?! టీనేజ్‌లో ఉన్న పిల్లలతో ‘ప్రేమలో ఉన్నప్పుడు’ అనే అంశం మీద చర్చించినప్పుడు వారు చెప్పిన సమాధానాలు ‘ఎక్కువసేపు పార్కులో గడుపుతాం. క్లాస్ ఎగ్గొట్టి బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం. ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడుకుంటాం. సెక్సువల్ రిలేషన్స్... ఉండచ్చు’ ఇదీ ప్రేమంటే అంటున్నారు. పెళ్లి గురించి మాట్లాడితే ‘సెటిల్ అయిన తర్వాత చేసుకుంటాం’ అంటున్నారు. ప్రేమంటే ఇవేవీ కాదని, కుటుంబసభ్యుల మధ్య ఉండే ఆప్యాయతలు అని తెలియజెప్పేదెవరు?! పెద్ద రాళ్లతో నింపండి... ‘ఫిల్ యువర్ బకెట్ విత్ బిగ్ రాక్స్!’ ఒక బకెట్లో ముందు ఇసుక వేశాక అందులో రాళ్లు పట్టవు. అదే ముందు పెద్ద రాళ్లు వేస్తే అంతే ఇసుకను కూడా నింపవచ్చు. ఇప్పటి పిల్లలు తెలియక తమ జీవితంలో ముందు ఇసుకనే నింపుకుంటున్నారు. రాళ్లుగా చెప్పుకునే లక్ష్యాలను వెనకేసుకోవాలనే జ్ఞానం వారికి ఉండటం లేదు. ఈ వయసులో ఆకర్షణలు మామూలే! కానీ అది ఇసుకతో సమానం అనే విషయం పిల్లలకు ఎవరు చెప్పాలి?! ఆ బాధ్యతలో ఎక్కువ భాగం తల్లిదండ్రులది, ఆ తర్వాత గురువులది. ఏది ముఖ్యమైనదో దాన్నే ముందు నింపుకోమనాలి. అంత ముఖ్యం కాని ప్రేమ, ఆకర్షణల కోసం ముఖ్యమైన చదువును పక్కన పెట్టేయవద్దని సూచించాలి. టెక్నాలజీని ఎంత వరకు ఉపయోగించుకోవాలో కూడా వీళ్లే తెలపాలి. పెద్దలూ ఇది మీ కోసమే..! తీరికలేని పనుల వల్ల పిల్లలేం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించడం లేదు. పిల్లలు తమ సమస్యలను, భావోద్వేగాలను పంచుకోవడానికి ఇంట్లో మనిషే ఉండటం లేదు. అందుకే పిల్లల ఆలోచనల్లో సవ్యత లోపిస్తోంది. ప్రేమలో ఉన్నామనే పిల్లల్ని పలకరిస్తే చాలా మంది అమ్మాయిలు చెప్పే మాట ‘నాకే చిన్న సమస్య వచ్చినా వాడే సాల్వ్ చేస్తాడు. అందుకే వాడంటే ఇష్టం’ అంటారు. ఆ ‘చిన్న’ సమస్యను పెద్దలు తీర్చలేకపోవడమే అతి ‘పెద్ద మైనస్’గా ఉంటోంది. అబ్బాయిలకు/అమ్మాయిలకు గర్ల్ ఫ్రెండ్/బాయ్‌ఫ్రెండ్ ఉండటం పరువుగా భావిస్తున్నారు. ఇది పాఠశాల స్థాయిలోనే మొదలవుతుంది. పూర్వకాలంలో పావురాలద్వారా సందేశాలు పంపుకునేవారు. తర్వాత రోజుల్లో ‘ఉత్తరం’ వచ్చింది. కబురు అందడానికి రెండు, మూడు వారాలు పట్టేది. అందుకే సమస్య అప్పుడు నియంత్రణలో ఉంది. ఇప్పుడు ఒకే ఒక్క ‘క్లిక్’ పిల్లల మెదళ్లను మార్చేయడానికి రెడీగా ఉంటోంది. లైఫ్ బోర్ కొడుతుందని టైమ్ పాస్ కోసం ప్రేమలో పడ్డవారు ఇటీవల చాలామంది ఉంటున్నారు. వారంతా టీనేజ్‌లో ఉన్నవారే! డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగాలు లేక కొంతమంది అబ్బాయిలు రోడ్ల మీద తిరుగుతుంటారు. వాళ్లు చదువుకునే ఆడపిల్లలను అట్రాక్ట్ చేసే పనిలో ఉంటున్నారు. ‘ప్రేమలో పడ్డాం’ అని కౌన్సిలింగ్‌కు వచ్చే అమ్మాయిలు దాదాపు నిరుద్యోగులుగా తిరుగుతుండేవారినే ఇష్టపడటం చూస్తున్నాం. అమ్మాయి ప్రేమించకపోతే బలవంతంగానైనా ఒప్పించడం కోసం ‘చేతులు కోసుకోవడం’ దాకా వెళుతున్నారు అబ్బాయిలు. అమ్మాయిలైతే రోజుల తరబడి భోజనం మానేయడం, అనారోగ్యాల పాలవడం చూస్తున్నాం. సినిమాల ప్రేమలూ ఈ వయసు వారిని ఆకర్షిస్తున్నాయి. సినిమా కేవలం వినోదం కోసం మాత్రమే అనే విషయం పిల్లలకు తెలియడం లేదు. పిల్లల మెదళ్లు ఖాళీగా ఉంటున్నాయి. వాటిలో అర్థం లేని చెత్త అంతా వచ్చి చేరుతోంది. పిల్లలందరూ సరిగ్గా ఉండటం లేదు, సవ్యమైన మార్గంలో వెళ్లడం లేదు అనేది నిజం కాదు. కానీ, చాలా మంది పిల్లలు ఆకర్షణల వైపు మొగ్గుచూపుతున్నారనేది వాస్తవం. ‘తప్పు’ ఒకరిదే అని ఎదుటివారి మీదకు నెట్టేసి తప్పుకునే ప్రయత్నం ఏ ఒక్కరూ చేయకూడదు. సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆ బాధ్యత ఉంది. సమాజంలో మొన్నటి, నిన్నటి తరం, అమ్మనాన్నలు, గురువులు, ప్రసారమాధ్యమాలు.. అందరూ ఉన్నారు. అందుకే ‘తప్పు’లెంచకుండా రేపటి తరం బాధ్యత అందరం నేడే తీసుకుందాం. - డా. గీతా చల్లా, సైకాలజిస్ట్ www.sudishacounselingcentre.org -
ప్రేమాయలో పడొద్దు
ఉన్మాద చర్యలను ఖండించిన విద్యార్థులు శివ శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కళాశాలలో ‘సాక్షి’ చర్చావేదిక కుత్బుల్లాపూర్/గాజులరామారం: వయసు ప్రభావం.. ఆధునిక సంస్కృతి తెస్తున్న వింత పోకలడల వ్యామోహం కలిసి యువత ‘ఆకర్షణ’లో పడుతున్నారు. దీనికే ‘ప్రేమ’ అని పేరుపెట్టి ఊహల్లో తేలిపోతున్నారు. అమ్మాయి పలకరిస్తే చాలు ఏదోలా అయిపోయి కలల్లో మునిగిపోతున్నారు. తీరా అటు నుంచి అనుకున్న స్పందన రాకుంటే బతుకునే బలిపెడుతున్నారు. ‘ప్రేమించలేదని దాడి, ప్రేమికురాలిపై అనుమానంతో దాడి, ఇతరులతో చనువుగా ఉంటుందని దాడి’ ఇలా జరుగుతున్న ప్రతి దాడి వెనుకా ‘ప్రేమ’ మైకమే ఉంటోంది. ఈ తరహా ఉన్మాదంతో అమాయకులైన యువతులను బలి తీసుకుని వారి కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నారు. దాడులకు పాల్పడ్డవారు తమ జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. తాజాగా నగరంలో మొన్న యువతిపై కళాశాలలో తోటి విద్యార్థుల ముందే దాడి.. నిన్న అనుమానంతో ప్రేమికురాలిని మేడపై నుంచి తోసి హత్యాయత్నం ఘటనలు సంచలనమయ్యాయి. ఈ విషాదకర ఘటనలపై ‘సాక్షి’ కొంపల్లి శివ శివాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కళాశాలలో బుధవారం నిర్వహించిన చర్చా వేదికలో యువత తమ మనోభావాలను వ్యక్తపరిచింది. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కలిస్తే అది ప్రేమ కాదని రెండు మనసులు పూర్తి స్థాయిలో కలిస్తేనే ప్రేమ అని స్పష్టం చేశారు. అభిప్రాయ బేధాలు వస్తే కూర్చోని మాట్లాడుకోవాలే తప్ప ఈ తరహా దాడులకు తెగబడటం తగదని సూచించారు. ప్రభుత్వాలు కూడా ఈ తరహా చర్యలకు పాల్పడేవారిని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారించి త్వరగా కఠిన శిక్షలు పడేలా చూడాలని కోరారు. ఎవరి జాగ్రత్తలో వారు.. మన ఆలోచన విధానంలో, ప్రవర్తనలో మార్పు రావాలి. కొన్ని విషయాల్లో అబ్బాయిలదే తప్పని అనడం కరెక్ట్ కాదు. ఏమీ చేయలేని స్థితిలో ఇలాంటి దాడులకు పాల్పడే అవకాశం ఉంది. అబ్బాయిలతో చనువుగా ఉన్నా ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలి. - అనూష ప్రేమా.. ఆకర్షణ..? అమ్మాయి, అబ్బాయి ఎవరైనా ప్రేమలో ఉంటే అది ప్రేమా.. ఆకర్షణ అనేది ముందుగా నిర్ధారణకు రావాలి. నిజమైన ప్రేమలో ఈ తరహా దాడులు జరగవు. ఇలాంటి విషయాలపై పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పించాలి. - సుమ ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి అబ్బాయి అమ్మాయిని ప్రేమించినా, అమ్మాయి అబ్బాయిని ప్రేమించినా తప్పు కాదు. కానీ వారి మధ్య ఆ ప్రేమ ఎంత వరకు ఉంటుందనేదే ప్రశ్న. ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉంటే ఇలాంటి దుర్మార్గపు చర్యలకు స్థానం ఉండదు. - నిఖిత తేలికగా తీసుకోకూడదు.. అబ్బాయిలు అమ్మాయిల వెంటపడడం, వారిని టీజ్ చేయడం సహజం. కానీ అది శృతి మించకూడదు. అదేపనిగా వేధిస్తుంటే ఘాటుగానే స్పందించాలి. అయినా వినకపోతే తేలికగా తీసుకోకుండా పెద్దవారికి సమస్య తెలియజేయాలి. - రితూ దాడులకు పాల్పడటం శాడిజం ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఆమెను అంతం చేయాలనుకోవడం సరైనది కాదు. అలాంటిది ప్రేమ కాదు. హత్యలు, దాడులకు పాల్పడితే దానిని శాడిజం అంటారు. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది. - మనీషా ఇద్దరిలోనూ మార్పు రావాలి ప్రేమోన్మాద చర్యలు జరిగినప్పుడు కేవలం అబ్బాయిలను టార్గెట్ చేయడం సరైంది కాదు. అయితే ఇలాంటి దాడులను అందరూ ఖండించాలి. అయితే ఇద్దరి ప్రవర్తనలో మార్పు రావాలి. మన సంస్కృతి సాంప్రదాయాల అనుసరించి మెలిగితే ఇలాంటి ఘటనలు జరగవు. - ప్రవీణ్ కుమార్ కఠిన శిక్షలు ఉండాలి క్షణికావేశంలో ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి. హద్దులలో ఉంటే ఇలాంటివి జరగవు. ఎన్ని చట్టాలు చేసినా ఇలాంటివి జరుగుతున్నే ఉన్నాయంటే లోపం మన చట్టాలలోనే ఉన్నది. విదేశాలలో ఇలాంటి ఘటనలకు కఠిన శిక్షలు విధిస్తారు. కానీ ఇక్కడ మాత్రం చట్టంలో ఉన్న లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. - రమేష్ ఇలాంటి ఘటనలు బాధాకరం అమ్మాయిలు వస్త్రధారణకు, హవాభావాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఒకరిని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. సమయ సందర్భాలను బట్టి ప్రవర్తించాలి. అబ్బాయిలకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాని గుర్తిస్తే కౌన్సిలింగ్ ఇవ్వాలి. మన కుటుంబంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే ఎంత బాధ కలుగుతుందో ఆలోచించాలి. - దీపిక సంపతి, ఎస్ఎస్ఐఎం డెరైక్టర్ అడ్మినిస్టేట్