బాధ్యత తీసుకుందాం | Take responsibility | Sakshi
Sakshi News home page

బాధ్యత తీసుకుందాం

Published Fri, Feb 13 2015 10:55 PM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM

బాధ్యత తీసుకుందాం - Sakshi

బాధ్యత తీసుకుందాం

13-19 కేరెంటింగ్
 
అందరూ ఆ దశను దాటి వచ్చినవారే! అందరూ ఆ దశను అర్థం చేసుకోవడం పట్ల నిర్లక్ష్యం చేసేవారే! ఎందుకలా?! జీవితంలో అత్యంత ప్రాధాన్యం గల కౌమార దశను అర్థం చేసుకునేదెలా? సరైన మార్గం చూపేదెలా?! ఆ మార్గం చూపే ప్రయత్నమే ఈ 13-19...
 
‘పద్నాలుగు, పదిహేనేళ్లకే ప్రేమలేంటి?! పిల్లలు చెడిపోతున్నారు. ఈ తప్పంతా పిల్లల్ని భయభక్తుల్లో పెంచలేని తల్లిదండ్రులదే’ అంటారు మొన్నటి తరం పెద్దలు. అర్థం లేని చెత్తనంతా పిల్లల మెదళ్లకు జొప్పిస్తున్న మీడియాదే తప్పు అంటారు ఇప్పటి తల్లిదండ్రులు. నేటి విద్యా వ్యవస్థదే తప్పు అంటున్నాయి ప్రసారమాధ్యమాలు. వచ్చిపడుతున్న టెక్నాలజీదే తప్పు అంటున్నాయి స్కూళ్లు, కాలేజీలు. టెక్నాలజీదేమీ లేదు ఆధునిక సంస్కృతిదే తప్పంతా అని సమాజంలోని ఆలోచనాపరులు అంటున్నారు. ఇంతకీ టీనేజ్ పిల్లలను ముళ్లదారి పట్టించే  తప్పు ఎవరిది?!!
 
మహి 8వ తరగతి చదువుతోంది. ఇంటిపనులు, షాపింగ్‌లతో అమ్మకు తీరిక ఉండదు. వ్యాపార రీత్యా నాన్న ఎప్పుడూ బిజీ! ఒక్కతే కూతురు. తన భావాలు పంచుకోవడానికి ఇంట్లో ఎవరూ లేరు. అదే కాలనీలో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయి, ఇంట్లోనే ఉంటున్న అబ్బాయితో మహికి పరిచయం ఏర్పడింది. అదెలాగంటే.. ఈ మధ్యే మహికి ఆ అబ్బాయి ‘ప్రేమిస్తున్నాను’ అంటూ ప్రపోజ్ చేశాడు.  ఆ రోజు నుంచి ఫ్రెండ్ ఇంటికంటూ బయట తిరగడం, రోజూ ఒంటిగంట వరకు అమ్మనాన్న చూడకుండా దుప్పటి ముసుగేసుకొని ఫోన్‌లో కబుర్లు, మెసేజ్‌లు ఇవ్వడం చేస్తుంది. చదువు మీద శ్రద్ధ పోయింది. ఇటీవల ఆ అబ్బాయి తరచూ డబ్బులు అడుగుతుండటంతో ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర బుక్స్, పెన్నులు కావాలంటూ అడిగి ఆ అబ్బాయికి ఇస్తూ వచ్చింది. సరిపోవడం లేదంటే.. తన మెడలో ఉన్న బంగారు చైన్, చెవి రింగులు కూడా తీసిచ్చింది. ‘ఎందుకలా చేశావు’అంటే.. ‘ప్రేమలో ఉన్నప్పుడు ఆ మాత్రం చేయకపోతే ఎలా?’ అని ఎదురు సమాధానం. ఎవరు చెప్పారు ఆ అమ్మాయికి ఇలాంటివి చేస్తేనే ప్రేమ అని?!
     
హరిణి ఇంటర్మీడియెట్ సెకండియర్ హాస్టల్‌లో ఉండి చదువుతోంది. ఈ మధ్య అమ్మనాన్నలతో ఫోన్‌లో మాట్లాడాలన్నా గిల్టీగా ఉంటోందని బాధపడుతోంది. ‘ఫస్టియర్ సబ్జెక్ట్సే ఇంకా మిగిలి ఉన్నాయి. ‘ఇప్పుడీ చదువు గట్టెక్కేదెలా?’అని ఏడుపు. చదువుకునే ఆసక్తి పోయింది అంటుంది. ‘ఎందుకలా, ఏమైంది?’ అంటే ‘రిలేషన్‌లో ఉన్నాను’ అంది. ఇప్పటి పిల్లలు ‘పాష్’గా మాట్లాడుకునే పదం ఇది. ‘రిలేషన్ అంటే’ అని అడిగితే- అదే ‘ప్రేమ’అంది. తరచి తరచి అడిగితే- ‘పెళ్లి చేసుకుంటాం కదా అని, ఏడాదిగా పెళ్లికాని భార్యాభర్తల్లాగే ఉన్నాం. కానీ, ఇప్పుడు ‘నేనెవరో తెలియదు’  అని మాట్లాడుతున్నాడు. ఆ అబ్బాయి ఇంకో అమ్మాయిని కూడా ట్రాప్ చేశాడు’ అని ఏడుస్తూనే చెప్పింది. ‘అంత గుడ్డిగా అతన్ని ఎలా నమ్మావు?’ అని అడిగితే ‘లవ్ ఈజ్ బ్లైండ్ కదా మేడమ్, అప్పుడు నాకేమీ అర్థం కాలేదు’ అంది. ఈ అమ్మాయికి ప్రేమ గుడ్డిది అని ఎవరు చెప్పారు?! ప్రేమికులకైనా కళ్లుంటాయి కదా!!
 
ప్రేమంటే ఇదేనా?!

 
టీనేజ్‌లో ఉన్న పిల్లలతో ‘ప్రేమలో ఉన్నప్పుడు’ అనే అంశం మీద చర్చించినప్పుడు వారు చెప్పిన సమాధానాలు ‘ఎక్కువసేపు పార్కులో గడుపుతాం. క్లాస్ ఎగ్గొట్టి బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం. ఫోన్‌లో ఎక్కువ సేపు మాట్లాడుకుంటాం. సెక్సువల్ రిలేషన్స్... ఉండచ్చు’ ఇదీ ప్రేమంటే అంటున్నారు. పెళ్లి గురించి మాట్లాడితే ‘సెటిల్ అయిన తర్వాత చేసుకుంటాం’ అంటున్నారు. ప్రేమంటే ఇవేవీ కాదని, కుటుంబసభ్యుల మధ్య ఉండే  ఆప్యాయతలు అని తెలియజెప్పేదెవరు?!
 
పెద్ద రాళ్లతో నింపండి...
 
‘ఫిల్ యువర్ బకెట్ విత్ బిగ్ రాక్స్!’ ఒక బకెట్‌లో ముందు ఇసుక వేశాక అందులో రాళ్లు పట్టవు. అదే ముందు పెద్ద రాళ్లు వేస్తే అంతే ఇసుకను కూడా నింపవచ్చు. ఇప్పటి పిల్లలు తెలియక తమ జీవితంలో ముందు ఇసుకనే నింపుకుంటున్నారు. రాళ్లుగా చెప్పుకునే లక్ష్యాలను వెనకేసుకోవాలనే జ్ఞానం వారికి ఉండటం లేదు. ఈ వయసులో ఆకర్షణలు మామూలే! కానీ అది ఇసుకతో సమానం అనే విషయం పిల్లలకు ఎవరు చెప్పాలి?! ఆ బాధ్యతలో ఎక్కువ భాగం తల్లిదండ్రులది, ఆ తర్వాత గురువులది. ఏది ముఖ్యమైనదో దాన్నే ముందు నింపుకోమనాలి. అంత ముఖ్యం కాని ప్రేమ, ఆకర్షణల కోసం ముఖ్యమైన చదువును పక్కన పెట్టేయవద్దని సూచించాలి. టెక్నాలజీని ఎంత వరకు ఉపయోగించుకోవాలో కూడా వీళ్లే తెలపాలి.
 
పెద్దలూ ఇది మీ కోసమే..!


తీరికలేని పనుల వల్ల పిల్లలేం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించడం లేదు. పిల్లలు తమ సమస్యలను, భావోద్వేగాలను పంచుకోవడానికి ఇంట్లో మనిషే ఉండటం లేదు. అందుకే పిల్లల ఆలోచనల్లో సవ్యత లోపిస్తోంది.
 
ప్రేమలో ఉన్నామనే పిల్లల్ని పలకరిస్తే చాలా మంది అమ్మాయిలు చెప్పే మాట ‘నాకే చిన్న సమస్య వచ్చినా వాడే సాల్వ్ చేస్తాడు. అందుకే వాడంటే ఇష్టం’ అంటారు. ఆ ‘చిన్న’ సమస్యను పెద్దలు తీర్చలేకపోవడమే అతి ‘పెద్ద మైనస్’గా ఉంటోంది.  అబ్బాయిలకు/అమ్మాయిలకు గర్ల్ ఫ్రెండ్/బాయ్‌ఫ్రెండ్ ఉండటం పరువుగా భావిస్తున్నారు. ఇది పాఠశాల స్థాయిలోనే మొదలవుతుంది.
     
పూర్వకాలంలో పావురాలద్వారా సందేశాలు పంపుకునేవారు.  తర్వాత రోజుల్లో ‘ఉత్తరం’ వచ్చింది. కబురు అందడానికి రెండు, మూడు వారాలు పట్టేది. అందుకే సమస్య అప్పుడు నియంత్రణలో ఉంది. ఇప్పుడు ఒకే ఒక్క ‘క్లిక్’ పిల్లల మెదళ్లను మార్చేయడానికి రెడీగా ఉంటోంది.
      
లైఫ్ బోర్ కొడుతుందని టైమ్ పాస్ కోసం ప్రేమలో పడ్డవారు ఇటీవల చాలామంది ఉంటున్నారు. వారంతా టీనేజ్‌లో ఉన్నవారే!
     
డిగ్రీ అయిపోయిన తర్వాత ఉద్యోగాలు లేక కొంతమంది అబ్బాయిలు రోడ్ల మీద తిరుగుతుంటారు. వాళ్లు చదువుకునే ఆడపిల్లలను అట్రాక్ట్ చేసే పనిలో ఉంటున్నారు. ‘ప్రేమలో పడ్డాం’ అని కౌన్సిలింగ్‌కు వచ్చే అమ్మాయిలు దాదాపు నిరుద్యోగులుగా తిరుగుతుండేవారినే ఇష్టపడటం చూస్తున్నాం.
     
అమ్మాయి ప్రేమించకపోతే బలవంతంగానైనా ఒప్పించడం కోసం ‘చేతులు కోసుకోవడం’ దాకా వెళుతున్నారు అబ్బాయిలు. అమ్మాయిలైతే రోజుల తరబడి భోజనం మానేయడం, అనారోగ్యాల పాలవడం చూస్తున్నాం.  సినిమాల ప్రేమలూ ఈ వయసు వారిని ఆకర్షిస్తున్నాయి. సినిమా కేవలం వినోదం కోసం మాత్రమే అనే విషయం పిల్లలకు తెలియడం లేదు.
     
పిల్లల మెదళ్లు ఖాళీగా ఉంటున్నాయి. వాటిలో అర్థం లేని చెత్త అంతా వచ్చి చేరుతోంది.  
 
పిల్లలందరూ సరిగ్గా ఉండటం లేదు, సవ్యమైన మార్గంలో వెళ్లడం లేదు అనేది నిజం కాదు. కానీ, చాలా మంది పిల్లలు ఆకర్షణల వైపు మొగ్గుచూపుతున్నారనేది వాస్తవం. ‘తప్పు’ ఒకరిదే అని ఎదుటివారి మీదకు నెట్టేసి తప్పుకునే ప్రయత్నం ఏ ఒక్కరూ చేయకూడదు. సమాజంలో ప్రతి ఒక్కరికీ ఆ బాధ్యత ఉంది. సమాజంలో మొన్నటి, నిన్నటి తరం, అమ్మనాన్నలు, గురువులు, ప్రసారమాధ్యమాలు.. అందరూ ఉన్నారు. అందుకే ‘తప్పు’లెంచకుండా రేపటి తరం బాధ్యత అందరం నేడే తీసుకుందాం.
 - డా. గీతా చల్లా, సైకాలజిస్ట్
 www.sudishacounselingcentre.org
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement