ప్రేమాయలో పడొద్దు
- ఉన్మాద చర్యలను ఖండించిన విద్యార్థులు
- శివ శివాని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కళాశాలలో ‘సాక్షి’ చర్చావేదిక
కుత్బుల్లాపూర్/గాజులరామారం: వయసు ప్రభావం.. ఆధునిక సంస్కృతి తెస్తున్న వింత పోకలడల వ్యామోహం కలిసి యువత ‘ఆకర్షణ’లో పడుతున్నారు. దీనికే ‘ప్రేమ’ అని పేరుపెట్టి ఊహల్లో తేలిపోతున్నారు. అమ్మాయి పలకరిస్తే చాలు ఏదోలా అయిపోయి కలల్లో మునిగిపోతున్నారు. తీరా అటు నుంచి అనుకున్న స్పందన రాకుంటే బతుకునే బలిపెడుతున్నారు.
‘ప్రేమించలేదని దాడి, ప్రేమికురాలిపై అనుమానంతో దాడి, ఇతరులతో చనువుగా ఉంటుందని దాడి’ ఇలా జరుగుతున్న ప్రతి దాడి వెనుకా ‘ప్రేమ’ మైకమే ఉంటోంది. ఈ తరహా ఉన్మాదంతో అమాయకులైన యువతులను బలి తీసుకుని వారి కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నారు. దాడులకు పాల్పడ్డవారు తమ జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. తాజాగా నగరంలో మొన్న యువతిపై కళాశాలలో తోటి విద్యార్థుల ముందే దాడి.. నిన్న అనుమానంతో ప్రేమికురాలిని మేడపై నుంచి తోసి హత్యాయత్నం ఘటనలు సంచలనమయ్యాయి.
ఈ విషాదకర ఘటనలపై ‘సాక్షి’ కొంపల్లి శివ శివాని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కళాశాలలో బుధవారం నిర్వహించిన చర్చా వేదికలో యువత తమ మనోభావాలను వ్యక్తపరిచింది. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కలిస్తే అది ప్రేమ కాదని రెండు మనసులు పూర్తి స్థాయిలో కలిస్తేనే ప్రేమ అని స్పష్టం చేశారు. అభిప్రాయ బేధాలు వస్తే కూర్చోని మాట్లాడుకోవాలే తప్ప ఈ తరహా దాడులకు తెగబడటం తగదని సూచించారు. ప్రభుత్వాలు కూడా ఈ తరహా చర్యలకు పాల్పడేవారిని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారించి త్వరగా కఠిన శిక్షలు పడేలా చూడాలని కోరారు.
ఎవరి జాగ్రత్తలో వారు..
మన ఆలోచన విధానంలో, ప్రవర్తనలో మార్పు రావాలి. కొన్ని విషయాల్లో అబ్బాయిలదే తప్పని అనడం కరెక్ట్ కాదు. ఏమీ చేయలేని స్థితిలో ఇలాంటి దాడులకు పాల్పడే అవకాశం ఉంది. అబ్బాయిలతో చనువుగా ఉన్నా ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలి.
- అనూష
ప్రేమా.. ఆకర్షణ..?
అమ్మాయి, అబ్బాయి ఎవరైనా ప్రేమలో ఉంటే అది ప్రేమా.. ఆకర్షణ అనేది ముందుగా నిర్ధారణకు రావాలి. నిజమైన ప్రేమలో ఈ తరహా దాడులు జరగవు. ఇలాంటి విషయాలపై పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పించాలి.
- సుమ
ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి
అబ్బాయి అమ్మాయిని ప్రేమించినా, అమ్మాయి అబ్బాయిని ప్రేమించినా తప్పు కాదు. కానీ వారి మధ్య ఆ ప్రేమ ఎంత వరకు ఉంటుందనేదే ప్రశ్న. ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉంటే ఇలాంటి దుర్మార్గపు చర్యలకు స్థానం ఉండదు.
- నిఖిత
తేలికగా తీసుకోకూడదు..
అబ్బాయిలు అమ్మాయిల వెంటపడడం, వారిని టీజ్ చేయడం సహజం. కానీ అది శృతి మించకూడదు. అదేపనిగా వేధిస్తుంటే ఘాటుగానే స్పందించాలి. అయినా వినకపోతే తేలికగా తీసుకోకుండా పెద్దవారికి సమస్య తెలియజేయాలి.
- రితూ
దాడులకు పాల్పడటం శాడిజం
ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ఆమెను అంతం చేయాలనుకోవడం సరైనది కాదు. అలాంటిది ప్రేమ కాదు. హత్యలు, దాడులకు పాల్పడితే దానిని శాడిజం అంటారు. నిజమైన ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది.
- మనీషా
ఇద్దరిలోనూ మార్పు రావాలి
ప్రేమోన్మాద చర్యలు జరిగినప్పుడు కేవలం అబ్బాయిలను టార్గెట్ చేయడం సరైంది కాదు. అయితే ఇలాంటి దాడులను అందరూ ఖండించాలి. అయితే ఇద్దరి ప్రవర్తనలో మార్పు రావాలి. మన సంస్కృతి సాంప్రదాయాల అనుసరించి మెలిగితే ఇలాంటి ఘటనలు జరగవు.
- ప్రవీణ్ కుమార్
కఠిన శిక్షలు ఉండాలి
క్షణికావేశంలో ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయి. హద్దులలో ఉంటే ఇలాంటివి జరగవు. ఎన్ని చట్టాలు చేసినా ఇలాంటివి జరుగుతున్నే ఉన్నాయంటే లోపం మన చట్టాలలోనే ఉన్నది. విదేశాలలో ఇలాంటి ఘటనలకు కఠిన శిక్షలు విధిస్తారు. కానీ ఇక్కడ మాత్రం చట్టంలో ఉన్న లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.
- రమేష్
ఇలాంటి ఘటనలు బాధాకరం
అమ్మాయిలు వస్త్రధారణకు, హవాభావాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ఒకరిని రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. సమయ సందర్భాలను బట్టి ప్రవర్తించాలి. అబ్బాయిలకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాని గుర్తిస్తే కౌన్సిలింగ్ ఇవ్వాలి. మన కుటుంబంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటే ఎంత బాధ కలుగుతుందో ఆలోచించాలి.
- దీపిక సంపతి, ఎస్‌ఎస్‌ఐఎం డెరైక్టర్ అడ్మినిస్టేట్