
సాక్షి, హైదరాబాద్: మధ్య శిలాయుగంలో నిప్పు పుట్టించిన ఆదిమ మానవుడు తెలంగాణ వాడేనని పురావస్తు పరిశోధనల్లో బయటపడింది. ఆదిమ మానవుడు ఎక్కడ నిప్పు పుట్టించాడని నిర్ధారించడానికి చేస్తున్న పరిశోధనల్లో తెలంగాణ ప్రాంతం కీలకమైంది. మహబూబ్‌నగర్ జిల్లా ఉట్నూ ర్‌లో బయటపడిన బూడిద రాశుల అవశేషాలను పరిశోధించిన బ్రిటిష్ మ్యూజియం పరిశోధక బృందం.. బృహత్ శిలాయుగం నాటి తొలినాళ్లలోనే ఇక్కడ నిప్పు ఉందని తేల్చింది. అంతకుముందే ఇక్కడ మానవ సంచారం ఉందని, బహుశా మధ్యరాతి యుగంలోనే నిప్పు పుట్టడానికి అవకాశం ఉంద ని అంచనాకు వచ్చింది. మానవులు చిన్న చిన్న సమూహాలు గా జీవించడం, వారి మధ్య సాంఘిక సంబంధాలు బలపడటం మధ్య శిలాయుగం నుంచి ఉందని, ఉట్నూరు ఆదిమ మానవులూ సమూహంగానే జీవించారనడానికి పలు ఆనవాళ్లు దొరికాయని శాస్త్రవేత్తల బృందం చెబుతోంది.
అగ్గి పుట్టాకే ఆధునిక జీవనం
పాతరాతి యుగం మానవుడు పచ్చి మాంసం తినేవాడు. జంతువుల చర్మాలతో శరీరం కప్పుకునేవాడు. అగ్గి పుట్టాకే ఆదిమ మానవుని ఆధునిక జీవనం మొదలైంది. దీంతో తొలిసారి నిప్పు ఎక్కడ పుట్టిందో తెలుసుకోడానికి పరిశోధనలు సాగుతున్నాయి. దీనిలో భాగంగా ఇంగ్లండ్‌కు చెందిన పరిశోధకుడు రాబర్ట్ బ్రూస్‌ఫూట్.. నిప్పు పుట్టుక, ఆదిమానవ జాతుల మనుగడపై భారత్‌లో పరిశోధనలు చేశారు. ఉట్నూరులో ఆయన జరిపిన తవ్వకాల్లో నిప్పును మండించిన తర్వాత మిగిలిన బూడిద రాశుల అవశేషాలు గుర్తించారు. ఈ బూడిద రాశులు పేడ పిడకలవని.. ఇవి వేసవిలో రాపిడికి గురై అంటుకుని బూడిదగా మిగిలాయని తేల్చారు. ఇక్కడి నుంచి కొంత బూడిదను ఇంగ్లండ్ తీసుకెళ్లి బ్రిటిష్ మ్యూజియం ఆర్థిక సాయంతో బూడిద రసాయన విశ్లేషణ పరీక్ష జరిపారు. దేశం మొత్తం మీద నిప్పుకు సంబంధించి తొలి ఆనవాళ్లు తొలిసారి ఇక్కడే లభించినట్లు బ్రూస్‌ఫూట్ అధికారికంగానే చెప్పారు. ఈ పరీక్షలకు సంబంధించి నివేదిక బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరిచారని సమాచారం.
మంచిర్యాల బుగ్గగుట్టలో..
పాత, కొత్తరాతి యుగానికి మధ్య కాలాన్ని మధ్య శిలాయు గం అంటారు. ఆది మానవుడు ఈ యుగంలోనే నిప్పుల్లో మాంసం, దుంపలు కాల్చుకొని తినడం ప్రారంభించాడు. మంచిర్యాల జిల్లా బుగ్గగుట్ట అటవీప్రాంతంలో మధ్య రాతి యుగపు ఆనవాళ్లు బయటపడ్డాయి. ఎగువరాతి యుగంలో వాడిన రాతి ఆయుధాలు, ఎముకలతో చేసిన పనిముట్లు వెలుగుచూశాయి. ఇక్కడి ఆది మానవుడు పేడ దిబ్బలకు అగ్గి పెట్టి మాంసం కాల్చినట్లు పరిశోధకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment