Megalithic Burials
-
కడపలో ప్రాచీన చరిత్ర ఆనవాళ్లు... బృహత్ శిలాయుగం నాటి..
వైఎస్సార్ జిల్లా (కడప సెవెన్‌రోడ్స్): జిల్లాకు ఎంతో ప్రాచీన చరిత్ర, సంస్కృతి ఉంది. సుండుపల్లె మండలం దేవావాండ్లపల్లె సమీపాన ఉన్న బృహత్ శిలాయుగపు సమాధులే ఇందుకు నిదర్శనం. ఆ గ్రామానికి ఉత్తరాన మూడు కిలోమీటర్ల దూరాన శేషాచల కొండల్లో బృహత్ శిలాయుగపు సమాధులు ఉన్నాయి. ఇవి మూడు వేల సంవత్సరాల క్రితం నాటి మనుషుల సమాధులు. దేశంలో ఇనుము వాడకం ప్రారంభమైన కాలానికి సంబంధించినవి. ఈ కాలాన్ని ఇనుపయుగం లేదా బృహత్ శిలాయుగం అంటారు. ఆ కాలంలో ఎవరైనా మరణిస్తే ప్రత్యేక పద్దతుల్లో పెద్దపెద్ద బండరాళ్లను ఉపయోగించి సమాధులు నిర్మించేవారు. సమాధుల్లో డాల్మెన్స్, స్టోన్ సర్కిల్స్, మెన్ హిర్స్, సిస్ట్ బరియల్స్, డాల్మెనాయిడ్ సిస్ట్స్ తదితదర రకాలు ఉంటాయి. దేవావాండ్లపల్లె వద్ద శేషాచల అడవుల్లో డాల్మెన్స్ రకానికి చెందిన సమాధులు ఉన్నాయి. ఆర్కియన్ యుగపు గ్రానైట్ రాయిని వీటి నిర్మాణానికి ఉపయోగించారు. ఈ సమాధుల్లో మనిషి శవంతోపాటు ఇనుప పరికరాలు కూడా పూడ్చి పెడతారు. అప్పట్లో బ్లాక్ అండ్ రెడ్ వేర్ మట్టి పాత్రలను వినియోగించేవారు. చనిపోయిన వ్యక్తికి సమాధుల్లో ఆహారం వంటివి అవసరమవుతాయన్న మూఢ విశ్వాసంతో ఈ మట్టిపాత్రలను కూడా వేసి పూడ్చేవారు. ఈ సమాధుల వద్ద నేటికీ కొన్ని మట్టి పెంకులను మనం చూడవచ్చు. డాల్మెన్స్ సమాధుల లోపలి భాగంలో బండలపై తెలుపు రంగులో ఏనుగు, ఏనుగుపై సవారి చేస్తున్న మనిషి, తాబేళ్లు, డైనోసార్స్‌ను పోలిన రేఖాచిత్రాలు ఉన్నాయి. ఆనాటి మనుషులు వీటిని చిత్రించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. వీటిని ఆనుకుని ఉన్న మరో గుట్టపై డాల్మెన్స్ ఎన్ సర్కిల్డ్ విత్ శ్లాబ్స్ ఉన్నాయి. తామరపుష్పం ఆకారంలో ఈ సమాధుల చుట్టూ పెద్దపెద్ద బండరాళ్లు పాతారు. గుప్తనిధుల కోసం కొందరు దుండగులు చాలా సమాధులను పగులగొట్టారు. ఎముకలు, కుండ పెంకులు తప్ప అక్కడ ఏమి లభించవని వారికి తెలియకపోవడం వల్లనే సమాధులు పగులగొట్టి ఉంటారు. ప్రస్తుతం మిగిలినవి, పగుల గొట్టడబడినవి అన్నీ కలిపి 50 సమాధులు ఉన్నాయి. సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఇవి కనిపిస్తాయి. ఇలాంటి సంస్కృతి దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈశాన్య భారతంలో కూడా కొంత ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తర భారతదేశంలో మాత్రం ఇలాంటి సమాధుల సంస్కృతి లేదు. ఆంధ్రప్రదేశ్‌లో మెగా లిథిక్ సైట్స్ ఎక్కువగా రాయలసీమలోనే ఉన్నాయి. అందులో కడపజిల్లాలోనే అధికభాగం ఉన్నట్లు చరిత్ర పరిశోధకులు చెబుతున్నారు. జిల్లాలో ఉన్న మెగా లిథిక్ సైట్స్‌లో దేవావాండ్లపల్లె వద్ద ఉన్నవే పెద్దవి కావడం విశేషం. వీటిలో పాండవులు నివసించారని, కడప, చిత్తూరు జిల్లా ప్రజల విశ్వాసం. కనుక వీటిని ఈ జిల్లాల్లో పాండవ గుళ్లుగా పిలుస్తారు. దేవావాండ్లపల్లె ప్రజలు పాండురాజు గుళ్లు అంటారు. ఇలాంటి సమాధుల్లో రాక్షసులు నివసించారని భావించే కర్నూలు, ప్రకాశం జిల్లాల ప్రజలు వీటిని రాక్షస గుండ్లు అని పిలుస్తారు. దేవావాండ్లపల్లెలోనే కాకుండా జిల్లాలో ఇతర చోట్ల కూడా అక్కడక్కడ ఇలాంటి సమాధులు మనకు కనిపిస్తాయి. టూరిస్ట్ హబ్‌గా మార్చాలి దేవావాండ్లపల్లె సమీపంలో ఉన్న బృహత్ శిలాయుగపు సమాధుల ప్రాంతాన్ని టూరిస్టు హబ్‌గా అభివృద్ది చేయాల్సిన అవసరం ఉంది. సమాధులు ఉన్న ప్రాంతానికి పర్యాటకులు, చరిత్ర పరిశోధకులు సులభంగా చేరుకోవడానికి వీలుగా రహదారి సౌకర్యం కల్పించాలి. సైట్ చుట్టూ రక్షణ కంచె, వివరాలు తెలిపే బోర్డులను ఏర్పాటు చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. – కొండూరు జనార్దన్‌రాజు, కార్యదర్శి, రాయలసీమ టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ, కడప చదవండి: Sirimiri Nutrition Food: ఓ ఇల్లాలి వినూత్న ఆలోచన.. కట్‌చేస్తే.. కోట్లలో లాభం! -
అగ్గి పుట్టించింది మనోడే ..!
సాక్షి, హైదరాబాద్: మధ్య శిలాయుగంలో నిప్పు పుట్టించిన ఆదిమ మానవుడు తెలంగాణ వాడేనని పురావస్తు పరిశోధనల్లో బయటపడింది. ఆదిమ మానవుడు ఎక్కడ నిప్పు పుట్టించాడని నిర్ధారించడానికి చేస్తున్న పరిశోధనల్లో తెలంగాణ ప్రాంతం కీలకమైంది. మహబూబ్‌నగర్ జిల్లా ఉట్నూ ర్లో బయటపడిన బూడిద రాశుల అవశేషాలను పరిశోధించిన బ్రిటిష్ మ్యూజియం పరిశోధక బృందం.. బృహత్ శిలాయుగం నాటి తొలినాళ్లలోనే ఇక్కడ నిప్పు ఉందని తేల్చింది. అంతకుముందే ఇక్కడ మానవ సంచారం ఉందని, బహుశా మధ్యరాతి యుగంలోనే నిప్పు పుట్టడానికి అవకాశం ఉంద ని అంచనాకు వచ్చింది. మానవులు చిన్న చిన్న సమూహాలు గా జీవించడం, వారి మధ్య సాంఘిక సంబంధాలు బలపడటం మధ్య శిలాయుగం నుంచి ఉందని, ఉట్నూరు ఆదిమ మానవులూ సమూహంగానే జీవించారనడానికి పలు ఆనవాళ్లు దొరికాయని శాస్త్రవేత్తల బృందం చెబుతోంది. అగ్గి పుట్టాకే ఆధునిక జీవనం పాతరాతి యుగం మానవుడు పచ్చి మాంసం తినేవాడు. జంతువుల చర్మాలతో శరీరం కప్పుకునేవాడు. అగ్గి పుట్టాకే ఆదిమ మానవుని ఆధునిక జీవనం మొదలైంది. దీంతో తొలిసారి నిప్పు ఎక్కడ పుట్టిందో తెలుసుకోడానికి పరిశోధనలు సాగుతున్నాయి. దీనిలో భాగంగా ఇంగ్లండ్‌కు చెందిన పరిశోధకుడు రాబర్ట్ బ్రూస్‌ఫూట్.. నిప్పు పుట్టుక, ఆదిమానవ జాతుల మనుగడపై భారత్‌లో పరిశోధనలు చేశారు. ఉట్నూరులో ఆయన జరిపిన తవ్వకాల్లో నిప్పును మండించిన తర్వాత మిగిలిన బూడిద రాశుల అవశేషాలు గుర్తించారు. ఈ బూడిద రాశులు పేడ పిడకలవని.. ఇవి వేసవిలో రాపిడికి గురై అంటుకుని బూడిదగా మిగిలాయని తేల్చారు. ఇక్కడి నుంచి కొంత బూడిదను ఇంగ్లండ్ తీసుకెళ్లి బ్రిటిష్ మ్యూజియం ఆర్థిక సాయంతో బూడిద రసాయన విశ్లేషణ పరీక్ష జరిపారు. దేశం మొత్తం మీద నిప్పుకు సంబంధించి తొలి ఆనవాళ్లు తొలిసారి ఇక్కడే లభించినట్లు బ్రూస్‌ఫూట్ అధికారికంగానే చెప్పారు. ఈ పరీక్షలకు సంబంధించి నివేదిక బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరిచారని సమాచారం. మంచిర్యాల బుగ్గగుట్టలో.. పాత, కొత్తరాతి యుగానికి మధ్య కాలాన్ని మధ్య శిలాయు గం అంటారు. ఆది మానవుడు ఈ యుగంలోనే నిప్పుల్లో మాంసం, దుంపలు కాల్చుకొని తినడం ప్రారంభించాడు. మంచిర్యాల జిల్లా బుగ్గగుట్ట అటవీప్రాంతంలో మధ్య రాతి యుగపు ఆనవాళ్లు బయటపడ్డాయి. ఎగువరాతి యుగంలో వాడిన రాతి ఆయుధాలు, ఎముకలతో చేసిన పనిముట్లు వెలుగుచూశాయి. ఇక్కడి ఆది మానవుడు పేడ దిబ్బలకు అగ్గి పెట్టి మాంసం కాల్చినట్లు పరిశోధకులు చెబుతున్నారు. -
ముందు ఇనుము వాడింది ఏపీలోనే!
సాక్షి, అమరావతి బ్యూరో: దేశంలో మొదటిసారిగా ఇనుము వాడింది సింధు నాగరికత ప్రజలని ఇన్నాళ్లూ అనుకున్నాం. కానీ వారి కంటే 500 ఏళ్ల ముందే.. అది కూడా ఏపీలో.. ముందుగా ఇనుమును వాడారని మీకు తెలుసా? గోదావరి నదీ తీరాన మెగాలిథిక్ నాగరికత కాలంలో ఇనుప పనిముట్లు వాడినట్లు ఏపీ పురావస్తు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అంతేకాకుండా సింధు నాగరికత కాలం నాటి ప్రజల కంటే దక్షిణ భారతదేశంలో విలసిల్లిన మెగాలిథిక్ నాగరికత కాలం నాటి ప్రజలు ఆధునికంగా ముందున్నారని స్పష్టమైంది. పుణేకు చెందిన డెక్కన్ కాలేజీ సహకారంతో పురావస్తు శాఖ పోలవరం ముంపు గ్రామాల్లో జరుపుతున్న పరిశోధనలు ఈ విషయాన్ని నిర్ధారించడం విశేషం. బయటపడ్డ మెగాలిథిక్ అవశేషాలు.. పోలవరం ముంపు గ్రామాల్లో పురావస్తు శాఖ 4 నెలలుగా పరిశోధనలు చేస్తోంది. డెక్కన్ కాలేజ్ భాగస్వామ్యంతో తవ్వకాలు చేపడుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాయునిపేట, పశ్చిమగోదావరి రుద్రమకోట వద్ద వందలాది తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో మెగాలిథిక్ యుగం నాటి అవశేషాలు బయటపడ్డాయి. ప్రధానంగా ఆ కాలం నాటి పెద్ద పెద్ద సమాధులను కనుగొన్నారు. వాటిని తవ్వగా మానవుల ఎముకలు, ఇనుప పరికరాలు, అలంకరణ రాళ్లు, మట్టిపాత్రలు బయటపడ్డాయి. మెగాలిథిక్ నాగరికత అంటే.. ఆదిమానవ దశ నుంచి పరిపక్వతతో కూడిన కుటుంబ జీవనానికి మధ్య ఉన్న సంధి దశనే మెగాలిథిక్ నాగరికత అంటారు. క్రీ.పూ.3,000 నుంచి క్రీ.పూ.1,000 మధ్య ఈ నాగరికత దక్షిణ భారతదేశంలో విలసిల్లింది. సింధులోయ నాగరికతలో క్రీ.పూ.2,500 నుంచి క్రీ.పూ.1,750 మధ్య ఇనుము వాడినట్లు పరిశోధకులు నిర్ధారించారు. కానీ అంతకంటే దాదాపు 500 ఏళ్ల క్రితమే మెగాలిథిక్ నాగరికతలో ఇనుము వాడినట్లు పురావస్తు పరిశోధనల్లో వెల్లడైంది. దీంతో నాటి మానవుల జీవన శైలి మీద పరిశోధనలు చేస్తే మరింత సమాచారం లభిస్తుందని భావిస్తున్నారు. తవ్వకాల్లో బయల్పడిన ఎముకల ఆధారంగా అప్పటి మానవుల డీఎన్ఏ మ్యాపింగ్ చేయించాలని పురావస్తు శాఖ కమిషనర్ వాణీమోహన్ నిర్ణయించారు. -
ఖగోళశాస్త్ర పరిజ్ఞానమే ఉగాది..
కాలాన్ని గణించడానికే సమాధులపై రాళ్లు.. నాటి ఖగోళ జ్ఞానమే పంచాంగం హన్మకొండ కల్చరల్ : మనిషి తాను ఎక్కడ, ఎలా, ఎందుకు జీవిస్తున్నాడో తెలు సుకోవడానికి నిరంతరం యత్నిస్తూనే ఉన్నాడు. ఈ సృష్టి ఎలా, ఎప్పటి నుంచి ఏర్పడింది? ఎన్ని రోజులుగా కొనసాగుతుంది? అనే ప్రశ్నలు మనిషిని వెంటాడుతునే ఉన్నాయి. సృష్టిని మనిషి ఊహకు అందని మాయ అని భావించారు. మాయ అనే కాగులోనే సమస్త లోకం సృష్టించబడిందని భావించారు. అందుకే కాలాన్ని పురుషుడిగా భావించారు. కాలపురుషుడే మాయ అనే కాగులో రాత్రి, పగలును ఇంధనంగా వాడి సమస్తలోకాన్ని సృష్టించారని, దివా రాత్రులనే ఇంధనంతో వండుతున్నాడని, ఇందుకోసం సూర్యుడు, అగ్ని, రుతువులు, మాసాలను తెడ్లమాదిరిగా వినియోగించుకుంటున్నాడని, లేకపోతే సమస్తలోకం ఒకేలా ఉండదని మహాభారతంలో ధర్మరాజు తెలిపారు. కాలం తెలియకపోవడం, కాలం తెలిసి ఉండటం అనేది మానవ పరిణామక్రమంలోని అత్యంత క్లిష్టమైన ముఖ్యమైన అభివృద్ధి. నేటి ఆధునిక భౌతికశాస్త్రం కూడా కాలగమన సిద్ధాంతం ఆధారంగానే సుదూరగ్రహాలకు వ్యోమనౌకలను పంపిస్తోంది. 50 వేల ఏళ్ల క్రితమే కాల గణన 50 వేల ఏళ్ల క్రితం శిలాయుగ నాగరికతలో జీవిం చిన మనిషి కూడా కాలాన్ని గణించుకుని జీవించాడంటే నమ్మగలమా? రాక్షసగుడులుగా (మెగాలిథిక్ బరియల్స్) మనం పిలుచుకుంటున్న ఆ కాలం నాటి సమాధులు వాటి చుట్టూ పేర్చిన అతిపెద్ద బండరాళ్లు కేవలం సమాధులే కాదని, అవి కాలాన్ని కొలవడానికి ఉపయోగించారని శాస్త్రవేత్తల అభిప్రాయం. చనిపోయిన తమ పెద్దల పవిత్రమైన ఆత్మలను పూజించడానికే కాక గణిత, ఖగోళ, భౌతిక, జ్యోతిష్య శాస్త్ర రహస్యాలెన్నో ఈ రాళ్లతో తెలుసుకునేవారు. ఇవి కాలాన్ని గణించి రుతువులను, కాలాన్ని అర్థం చేసుకుని కాలవైపరీత్యాల నుంచి రక్షించుకోవడానికి ఉపయోగపడేవి. సూర్య, చంద్ర, శుక్రగ్రహల కదలికలను గమనించి వాటి ద్వారా కాలాన్ని లెక్కించేవారు. చుట్టూ ఉన్న రాళ్ల మధ్యలోని కేంద్ర స్థానా న్ని గుర్తించడం, కేంద్రస్థానం నుంచి ఒక్కో రాయి మధ్య ఉన్న దూరాన్ని గణించడం, మళ్లీ ఒక్కోరాయికి మధ్య ఉన్న దూరాన్ని కొలిచి గణించడం ద్వారా ఒక్కొక్క సమాధి ప్రత్యేకతను తెలుసుకోవచ్చు. మెన్హీర్ అని పిలవబడే సమాధులు పొడవాటి రాళ్లను పాతినట్లు ఉంటాయి. ఇవి వర్ధన్నపేట, జనగామ తదితర చోట్లలో కనిపిస్తాయి. వీటిని అమర్చిన విధానం కొద్దిగా ఏటవాలుగా వంగి ఒక్కొక్క నెలను పౌర్ణమితో గుర్తించే విధంగా ఉంటాయి. చంద్రుడు 29.5 రోజులకు ఒకసారి భూమిని చుట్టి వస్తాడు. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి సంవత్సరకాలం పడుతుంది. ఇది మనకు తెలిసినది మాత్రమే కాదు వేలాది ఏళ్ల క్రితమే నాగరికత లేదనుకున్న చీకటి యుగపు శిలాయుగంలోనే అప్పటి మనుషులు చంద్రుడిని ఆధారంగా చేసుకుని కాలాన్ని గణించడం ఆశ్చర్యం. 11, 12, 13 సంఖ్యల్లో ఈ రాళ్లు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. నవీన విజ్ఞానశాస్త్రం అభివృద్ధి చెందని కాలంలో వేలాది ఏళ్లుగా ఈ రాళ్ల పంచాంగం ద్వారానే కాలగతులు తెలుసుకోనేవారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు పూర్తిగా ఈ రాళ్లు తొలగించబడి ఉనికిని కోల్పోయాయి.