
ముడుమాలలో మూడువేల ఏళ్లనాటి గండ శిలలు ఇవే..
ముడుమాల ముడుపుకట్టిన మూడువేల ఏళ్లనాటి అపూర్వ విజ్ఞానం
► పాలమూరు జిల్లాలో బృహత్ శిలాయుగం నాటి చారిత్రక సంపద... ప్రపంచంలోనే అరుదైన నిర్మాణాలు
► ఖగోళశాస్త్ర అబ్జర్వేటరీగా భావిస్తున్న నిపుణులు
► సెంట్రల్ వర్సిటీ అధ్యయనంతో రంగంలోకి పురావస్తు శాఖ
► ఆ ప్రాంతాన్ని సందర్శించిన ఉన్నతాధికారులు... చుట్టూ కంచె వేయాలని నిర్ణయం
► సోమవారం ప్రభుత్వానికి నివేదిక.. సర్వేకు శ్రీకారం
సాక్షి, హైదరాబాద్:
ప్రపంచాన్నే అబ్బురపరిచే అరుదైన చారిత్రక సంపదకు మహబూబ్‌నగర్ జిల్లా ముడుమాల వేదికైంది. వేల ఏళ్ల కిందే ఖగోళం గుట్టును గుర్తించే ‘ఖగోళశాస్త్ర పరిశోధనశాల (ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ)’కి కేంద్రంగా నిలిచింది. నిలువెత్తును మించిన గండ శిలలతో రుతుపవనాలు సహా వివిధ వాతావరణ అంశాలను గుర్తించే పరిజ్ఞానానికి సజీవ సాక్ష్యంగా నిలి చింది. ఆకాశంలో నక్షత్రాలను చూసి దిక్కులను, సమయాన్ని కచ్చితంగా గుర్తించేందుకు తోడ్పడే సప్తర్షి మండలాన్ని వేల ఏళ్ల కిందే చిత్రించిన విజ్ఞానం విశేషాలు తాజా పరిశోధనల్లో వెల్లడయ్యాయి. దీంతో ప్రపంచంలోనే అత్యంత అరుదైన పురావస్తు ప్రాధాన్యమున్న ప్రాంతంగా ముడుమాల నిలుస్తోంది. ఇటీవల సెంట్రల్ వర్సిటీ బృందం పరిశోధన జరిపి ఇచ్చిన నివేదికతో పురావస్తు శాఖ కదిలింది.
ఈ ప్రాంతాన్ని పరిరక్షించి, పరిశోధనలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం పురావస్తు శాఖ డెరైక్టర్ విశాలాక్షి ఆధ్వర్యంలో అధికారుల బృందం ముడుమాల ప్రాంతాన్ని పరిశీలించింది. ఈ మేరకు నివేదికను సోమవారం ప్రభుత్వానికి సమర్పించనుంది. సోమవారం నుంచే ఈ ప్రాంతంలో నిపుణులతో సర్వే ప్రారంభించాలని కూడా నిర్ణయించారు. ఇక ఈ చారిత్రక సంపదపై అవగాహనలేని స్థానికులు వాటిని ధ్వంసం చేస్తూ వచ్చారు. దీంతో ఈ ప్రాంతం చుట్టూ కంచెను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
వేల సంఖ్యలో..
కర్ణాటక-తెలంగాణ సరిహద్దుల్లో మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా మండలం పరిధిలోని కృష్ణా నదీ తీరం వెంబడి ఉన్న ముడుమాల గ్రామ పరిధిలో బృహత్ శిలాయుగానికి చెందిన చారిత్రక సంపద బయటపడింది. బృహత్ శిలాయుగానికి చెందిన సమాధులు అక్కడక్కడా కనిపించడం సాధారణమే. ఈ సమాధులకు గుర్తుగా భారీ రాళ్లను పాతుతారు. కానీ ముడుమాల పరిధిలో మాత్రం ఏకంగా 14 అడుగుల ఎత్తున్న గండ శిలలను ఓ క్రమపద్ధతిలో పాతిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటివి దాదాపు 80కి పైగా ఇక్కడ ఉన్నాయి. ఇక అదే తరహాలో పాతిన చిన్న రాళ్లు మూడున్నరవేల వరకు ఉన్నాయి. మొత్తంగా దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో ఈ సమాధులు ఉండడం గమనార్హం.
దెయ్యాల దిబ్బగా భావిస్తూ..
కొన్నేళ్ల కిందటి వరకు స్థానికులు ఈ ప్రాంతాన్ని దెయ్యాల దిబ్బగా భావిస్తూ అటువైపు వెళ్లేందుకే జంకేవారు. తర్వాత ఈ విషయం తెలిసిన పురావస్తు నిపుణులు వాటిపై దృష్టి సారించటంతో చారిత్రక సంపద వెలుగు చూసింది. ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చరిత్ర విభాగం ప్రొఫెసర్ కె.పుల్లారావు ఆధ్వర్యంలోని బృందం వాటిని పరిశోధించింది. అవి సాధారణ సమాధి రాళ్లు కావని, క్రీస్తుపూర్వం వెయ్యేళ్ల నాటి మానవులు ఖగోళ పరిజ్ఞానానికి తగ్గట్టుగా వాటిని ఏర్పాటు చేసుకున్నారని గుర్తించారు. ఆకాశంలోని నక్షత్ర సమూహాల్లో సప్తర్షి మండలంగా భావించే ఆకృతి కూడా ఇక్కడి ఓ రాతిపై చెక్కి ఉండడం గమనార్హం. దానిని ఈ నిలువు రాళ్లకు కేంద్ర బిందువుగా ఏర్పాటు చేశారు.
సూర్యుడి గమనం ఆధారంగా పడే ఈ రాళ్ల నీడలను బట్టి వాతావరణ సమయాలను అప్పటివారు గుర్తించేవారు. ఉదాహరణకు ఆ నీడలు ఓ క్రమంలో, ఓ నిర్దిష్ట ప్రాంతంలో పడడం మొదలుకాగానే రుతుపవనాలు ప్రారంభమవుతాయని తెలుసుకునేవారు. నీడలు మరో క్రమంలో, మరో చోటికి మారితే ఎండాకాలం వచ్చిందని.. ఇలా ఆ రాళ్ల ఆధారంగా పరిస్థితులను తెలుసుకునేవారని నిపుణుల బృందం గుర్తించింది. దీనిని ఆనాటి ఖగోళశాస్త్ర పరిశోధన శాల (ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ)గా భావిస్తున్నారు. ఇక మరో ప్రొఫెసర్ల బృందం కూడా ఈ ప్రాంతంపై పరిశోధన చేసింది. ఇంకా మరెన్నో రహస్యాలు ఈ నిర్మాణం వెనుక దాగున్నాయని వారు పేర్కొంటున్నారు. పూర్తి స్థాయిలో పరిశోధనలు చేస్తే మరెన్నో కొత్త విషయాలు వెలుగుచూస్తాయని చెబుతున్నారు.
కృష్ణా నది నుంచి నల్లరాళ్లు..
ఇక్కడ పాతిన నిలువు రాళ్లన్నీ నల్లరాళ్లే కావటం విశేషం. వాటిని కృష్ణా నది ఒడ్డు నుంచి తెచ్చినట్టు పరిశోధకులు గుర్తించారు. అవి చాలా కాలం నీళ్లలో నానిన రాళ్లుగా తేల్చారు. కేవలం నిలువుగా పాతేందుకు ప్రత్యేకంగా నల్లరాళ్లను వాడడం వెనక మర్మం తెలియాల్సి ఉంది.
నిధి అన్వేషణ కోసం విధ్వంసం
భారీ శిలలతో కూడిన ఓ వృత్తాకార నిర్మాణం కూడా ఇక్కడ ఉండేది. ఆసియా ఖండంలోనే అలాంటిది ఇదొక్కటేనని గతంలోనే పురావస్తు నిపుణులు గుర్తించారు. కానీ దాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాయచూరు ప్రాంతానికి చెందిన కొందరు నిధి అన్వేషకులు ప్రభుత్వ సిబ్బందిగా చెప్పుకొని 2006లో ప్రొక్లెయినర్‌తో ఆ నిర్మాణాన్ని ధ్వంసం చేసి తవ్వకాలు జరిపారు. ఎటువంటి నిధీ దొరకక రాత్రికే ఉడాయించారు. కానీ వారి కారణంగా ప్రపంచంలోనే అరుదైన చారిత్రక నిర్మాణం నాశనమైంది. ఇక ఈ ప్రాంతంలోని అసైన్‌మెంట్ భూములను ప్రభుత్వం కొందరు రైతులకు పంచింది. వారిలో కొందరు రైతులు ఈ నిర్మాణాల్లో కొన్నింటిని ధ్వంసం చేసి.. వ్యవసాయం ప్రారంభించారు. అయితే ఇటీవలి పరిశోధనలతో మిగతా రాళ్లు ధ్వంసం కాకుండా చర్యలు ప్రారంభించారు.
మనకిది గొప్ప కానుక
‘‘ప్రపంచంలోనే ఇది అరుదైన చారిత్రక ప్రాధాన్యమున్న ప్రాంతం. దీన్ని కాపాడడంతోపాటు ప్రపంచానికి పరిచయం చేయాల్సి ఉంది. పురావస్తు పరిశోధకులకు ఇదో పరిశోధనశాల అవుతుంది. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారేందుకు ఇక్కడ అన్ని హంగులు ఉన్నాయి. ఇక్కడి ప్రైవేటు భూములను సేకరిస్తేనే చారిత్రక సంపద పరిరక్షణ సాధ్యమవుతుంది. దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నాం. ప్రభుత్వ ఆదేశం మేరకు చర్యలు తీసుకుంటాం..’’
- విశాలాక్షి, పురావస్తు శాఖ డెరైక్టర్
అంతర్జాతీయ స్థాయిలో..
ముడుమాల ప్రాంతంపై అధ్యయనం చేసిన సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.పుల్లారావు ఇటీవల బెల్జియంలో జరిగిన ఓ సదస్సులో, అమెరికాలోని నార్తర్న్ అరిజోనా వర్సిటీలో జరిగిన ఆర్కియో ఆస్ట్రానమీ సదస్సులో, యురోపియన్ అసోసియేషన్ ఆఫ్ ఆస్ట్రానమీ ఇన్ కల్చర్ ఆధ్వర్యంలో ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో జరిగిన సదస్సులో ముడుమాల ప్రాధాన్యాన్ని వివరించారు. పలు పరిశోధనా పత్రాలను సమర్పించారు. ఆ వివరాలు చూసి అక్కడి పురావస్తు పరిశోధకులు ఆశ్చర్యపోయారు. ఇంత ప్రాధాన్యమున్న ప్రాంతాన్ని స్వయంగా చూడాలని అనుకుంటున్నామని వారు పేర్కొనడం విశేషం.
డిసెంబరులో సందర్శించనున్న కొరియా బృందం
కొరియాలోని జ్యోంగీ ప్రావిన్షియల్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆ దేశానికి చెందిన పురావస్తు అధ్యయన బృందం డిసెంబరులో ముడుమాలకు రానుంది. ఇక్కడ ఒకరోజు పాటు ప్రాథమిక అధ్యయనం జరపనుంది. దాని ఆధారంగా భవిష్యత్తులో పూర్తిస్థాయి అధ్యయనాన్ని చేపట్టనుంది.
ఇంగ్లండులో అలా..
ఇంగ్లండులోని విల్‌షైర్ ప్రాంతంలో ఈ తరహా నిర్మాణం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. స్టోన్ హెంజ్‌గా పేరుపెట్టిన ఈ నిర్మాణాన్ని పరిరక్షించిన అక్కడి ప్రభుత్వం.. ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చింది. దానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కూడా దక్కడంతో పర్యాటకులు వెల్లువెత్తుతున్నారు. ముడుమాలకు కూడా అలాంటి ఖ్యాతి దక్కే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.