నాగప్రతిష్టల శిలల వద్ద కడియాల వెంకటేశ్వరరావు
తెలుగు ప్రజల తొలి నివాసం రాయలసీమేనని చెప్పేందుకు వైఎస్సార్ జిల్లాలోని మోపూరు కొండపై గల భైరవేశ్వరుడి ఆలయం తిరుగులేని నిదర్శనమని తెనాలికి చెందిన పురావస్తు పరిశోధకుడు, ‘పురాతన’ సంస్థ వ్యవస్థాపకుడు కడియాల వెంకటేశ్వరరావు వెల్లడించారు. రాయల సీమ ప్రాశస్త్యంపై ప్రముఖ చారిత్రక పరిశోధకుడు ప్రొఫెసర్ హెచ్‌డీ సంకాలియా భావనను బలపరిచేలా అతి పురాతనం అనదగ్గ ఆధారాలు అక్కడ ఉన్నాయని చెప్పారు. పర్వతాలు అధికంగా కలిగిన రాయలసీమలో కొండ గుహల్లో ఆది మానవుల జీవనం, సంస్కృతి కొనసాగిందని అభిప్రాయపడ్డారు. కాలక్రమంలో అక్కడ్నుంచి తూర్పుగా మైదాన ప్రాంతానికి విస్తరించారనీ, అందుచేత రాయలసీమే తెలుగు ప్రజల తొలి ఆవాసమని భైరవేశ్వరుడి ఆలయం, పరిసరాల్లో కొన్నేళ్లుగా తాను జరిపిన పరిశోధనల్లో స్పష్టమైందని ‘సాక్షి’కి వెల్లడించారు.
–తెనాలి
ఆ విశేషాలివి.. ‘వైఎస్సార్ జిల్లాలోని వేముల మండలం, నల్లచెరువుపల్లె గ్రామానికి సమీపంలోని మోపూరు కొండపై 18 అడుగుల ఎత్తు, 14 అడుగుల చుట్టుకొలత కలిగిన విగ్రహం శివలింగంగా భక్తుల భావన. ఈ తరహా ఎత్తయిన నిలువురాళ్లను పూజించే ఆచారం అనేక దేశాల్లో ఉంది. వీటిని సూర్యభగవానుడికి సంకేతంగా/ ప్రతిరూపంగా ఆదిమ మానవుల కాలం (కొత్త రాతి యుగం), పాత రాతియుగం కాలం (క్రీ.పూ 3,000–2,000), ఇంకా పూర్వం నుంచీ పూజిస్తున్నారు. ‘వర్షిపింగ్ ఆఫ్ స్టాండింగ్ స్టోన్స్’, ‘డ్రూయిడికల్ రాక్స్’ పేర్లతో పిలుస్తుంటారు. డ్రూయిడ్స్ అంటే విగ్రహారాధకులు అనే అర్థముంది. ఆర్యులు భారత ఉపఖండంలోకి ప్రవేశించే నాటికి ముందుగానే (క్రీ.పూ 1,500–1,000) భారతదేశంలో నిలువురాతి శిలలను పూజించే ఆచారం ఉంది.
ఈ మోపూరు కొండను ఆనుకొని ఉన్న మొగమేరు వాగు వేముల, లింగాల ప్రాంతాల్లో ప్రవహిస్తోంది. ఈ పరీవాహక ప్రాంతమంతా నాటి కాలాలకు చెందిన రాతి ఆయుధాలు, ఆదిమ మానవుల సమాధులు, చారిత్రక యుగంనాటి పరికరాలు గుర్తించారు. ఫలితంగా ఇది ఆదిమవాసుల పవిత్ర ప్రార్ధనాస్థలంగా విలసిల్లింది. భైరవేశ్వరుడిగా పూజలందుకుంటున్న నిలువురాయి 18 అడుగులు ఉండటంతో, దీనిని రెండు అంతస్తుల్లో నిర్మించారు. పంచారామ క్షేత్రాలైన అమరావతి, ద్రాక్షారామ, కుమార ఆరామంలో రెండు అంతస్తులుగా నిర్మించిన శివాలయాలకు, ఈ మోపూరు భైరవేశ్వర ఆలయమే మాతృకగా భావిస్తున్నాం. 8–9 శతాబ్ది నుంచి 15వ శతాబ్దం వరకు కాకతీయులు, విజయనగర చక్రవర్తులు, వినుకొండ వల్లభరాయుడు, గండికోట రాజవంశీకుల విశిష్ట సేవల గురించి ఈ ఆలయం వద్ద దాన శాసనాలు లభించాయి. ఈ ఆలయం వెలుపల 50కి పైగా వీరశిలలు, 20 వరకు నాగ ప్రతిష్టల శిలలుండటం మరో ప్రత్యేకత. వీరశైవ మతంలో దేవుడికి ఆత్మార్పణం చేసుకొనే ఆచారముంది. వారి బలిదానానికి గుర్తుగా వీరశిలలను ప్రతిష్టిస్తుంటారు. శాసనాలూ చెక్కుతారు. ఈ ప్రకారం చూస్తే దక్షిణ భారతదేశంలోనే ఇది వీరశైవకులకు అతిముఖ్యమైన దేవాలయంగా చెప్పొచ్చు’ అని వెంకటేశ్వరరావు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment