మధ్యయుగంలోనే ‘గాజు పరిశ్రమ’
నల్లగొండ జిల్లాలో లభించిన చారిత్రక ఆధారాలు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : చారిత్రక ఆధారాలకు నెలవైన నల్లగొండ జిల్లాలో మరో కీలక చారిత్రక ఆధారం లభ్యమైంది. మధ్యయుగ కాలంలోనే (క్రీ.శ. 8-12 శతాబ్దాలు) ఇక్కడ గాజు పరిశ్రమ ఉందని చెప్పేందుకు అవసరమైన ఆనవాళ్లు లభించాయి. జిల్లాలోని కనగల్ మండలం పగిడిమర్రి గ్రామంలో బుధవారం పురావస్తు శాఖ అధికారులు జరిపిన తవ్వకాల్లో మధ్య యుగం నాటి రంగు పెంకులు లభించాయి. పచ్చడి పెట్టుకునే జాడీల లోపలి భాగం మాదిరిగా నున్నగా ఉన్న ఈ రాళ్లు ఆనాడే జిల్లాలో గాజు పరిశ్రమ ఉందని చెప్పేందుకు ఆధారాలని పురావస్తు అధికారులు చెపుతున్నారు. ఈ తవ్వకాల్లోనే తొలియుగం నాటి (క్రీ.శ. 1-3 శతాబ్దాలు) జీవన ఆధారాలు, మధ్యయుగంలో నిర్మించిన ప్రాచీన శివాలయం కూడా లభించింది. ఈ శివాలయంలో సప్తఅశ్వ (ఏడు గుర్రాలు) రథాన్ని నడుపుతున్న సూర్య భగవానుడి విగ్రహం కూడా లభించడం విశేషం.
ప్రాచీన శివాలయం కూడా..: కనగల్ మండలం పగిడిమర్రి గ్రామంలో జరిపిన తవ్వకాల్లో ఎక్కువగా కుండపెంకులే లభించాయి. నల్లని, ఎర్రని, రెండు రంగులు కలిపి ఉన్న పెంకులు పురావస్తు అధికారులు సేకరించారు. వీటితోపాటు తొక్కుడు బిళ్లలు (హాప్‌స్కాచ్), టైట మట్టితో చేసిన అద్దకపు పనిముట్లు, సానరాళ్లు లభించాయి. ఇవి చారిత్రక యుగాల ఆనవాళ్లని పురావస్తు అధికారులు చెపుతున్నారు. అదే విధంగా మధ్యయుగ కాలానికి సంబంధించి నలుపు, ఎరుపు, నీలి, ఆకుపచ్చ రంగుల్లో ఉన్న పెంకులు కూడా లభించాయి. ఈ పెంకులన్నీ చౌడుమట్టితో తయారుచేసినవి. వీటిని సానబట్టి (పాలిష్ చేసి) నున్నగా తయారు చేశారు. ఈ తవ్వకాల్లోనే మధ్యయుగ కాలంలో (కాకతీయుల సామ్రాజ్యంలో) నిర్మించిన ఓ ప్రాచీన శివాలయాన్ని కూడా పురావస్తు అధికారులు గుర్తించారు. ఈ ఆలయం నిర్మించిన సమయంలో ఈ ప్రాంతాన్ని కాకతీయుల సామంతులైన కందూరు చోళులు పాలించారని అంచనా.