సాక్షి, హైదరాబాద్: చిలుకూరు అనగానే అందరికీ బాలాజీ దేవాలయం గుర్తుకొస్తుంది. హైదరాబాద్ నుంచే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. అమెరికా వెళ్లాలనుకునే యువత ప్రదక్షిణలతో నిత్యం ఈ ఆలయం రద్దీగా ఉంటుంది. వీసా బాలాజీ అంటూ వారు పిలుచుకుంటుంటారు. చిలుకూరు బాలాజీ దేవాలయం చేరువలోనే మరో అత్యంత పురాతన శివాలయం ఉందని, ఈ ప్రాంతాన్ని పాలించిన రాష్ట్రకూటుల కాలం నాటిదని తాజాగా చరిత్ర పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు.
స్థానికులు దానికి సున్నం వేసి పూజాదికాలు నిర్వహిస్తున్నప్పటికీ, అది బాగా శిథిలావస్థకు చేరుకుంది. తాజాగా శివనాగిరెడ్డి ‘ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టెరిటీ’కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని చారిత్రక ఆనవాళ్లపై పరిశోధించారు. ఈ సందర్భంగా ఈ శివాలయాన్ని పరిశీలించి, నిర్మాణ శైలి, అందులోని విగ్రహాల శైలి ఆధారంగా అది వెయ్యేళ్ల క్రితంనాటిదని తేల్చారు. ఆలయ అధిష్టానం ఇప్పటికే భూమిలోకి కూరుకుపోయిందని, ఆలయ రాళ్ల మధ్య పగుళ్లేర్పడి విచ్చుకుపోతున్నాయని, శిఖరభాగంలోని రాళ్లు దొర్లిపోతున్నాయని పేర్కొన్నారు. 9–10 శతాబ్దాల్లో నిర్మించిన ఈ ఆలయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించారు.
జైన బసదిగా విలసిల్లిన గ్రామం
వేములవాడ చాళుక్యుల కాలంలో ఈ గ్రామం జైన బసదిగా విలసిల్లిందని, ఇక్కడ అద్భుత జైన నిర్మాణాలుండేవని, ఇక్కడి కొన్ని శిల్పాలు ప్రస్తుతం గోల్కొండలోని ఖజానా బిల్డింగ్ మ్యూజియంలో భద్రంగా ఉన్నాయని, ఇప్పటికీ గ్రామంలోని చాలా ప్రాంతాల్లో జైన శిల్పాలు కనిపిస్తున్నాయని శివనాగిరెడ్డి చెప్పారు. రాష్ట్రకూటుల శైలి శివాలయం పక్కన కూడా జైన శిల్పముందన్నారు. గ్రామంలోని పోచమ్మ గుడి వద్ద చెల్లాచెదురుగా పడి ఉన్న భైరవ, వీరుల, నాగదేవత, భక్తురాలి శిల్పాలను సరిగ్గా ప్రతిష్టించాలని, చెరువుకట్ట వద్ద ఉన్న పురాతన మండపాన్ని కూడా పునరుద్ధరించాలని సూచించారు.
చదవండి: మినరల్ వాటర్.. మిల్లెట్ భోజనం!
Comments
Please login to add a commentAdd a comment