సాక్షి, హైదరాబాద్: కొందరు చేసిన సోషల్ మీడియా ప్రచారం చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని జన దిగ్భందనం చేసింది. ప్రస్తుతం చిలుకూరు బాలాజీ ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా పిల్లలు లేని తల్లితండ్రులకు ప్రత్యేకంగా గరుడ ప్రసాదం ఇస్తారని నిన్న(గురువారం) సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆలయ అధికారులు కానీ, పూజారులు కానీ ప్రత్యక్షంగా చేయకున్నా.. దీన్ని ఎవరూ ఖండించలేదు.
దీంతో నేడు ఉదయం 5గంటల నుంచే భారీగా భక్తులు పోటెత్తడంతో చిలుకూరు ఏరియా మొత్తం స్తంభించిపోయింది. సిటీతోపాటు చుట్టుపక్కల నుంచి చిలుకురూరుకు భక్తులు క్యూ కట్టారు. మాసబ్‌ట్యాంక్ నుంచి మెహదీపట్నం, లంగర్‌హౌస్, సన్‌సిటీ, కాళీమందిర్ అప్పా జంక్షన్ మీదుగా హిమాయత్ సాగర్ వరకు ట్రాఫిక్ జాం ఏర్పడింది.గచ్చిబౌలిలోని ఔటర్ రింగ్ సర్వీస్ రోడ్డు కూడా వాహనాలతో నిండిపోయింది.
రంగారెడ్డి జిల్లా తెలంగాణ పోలీస్ అకాడమీ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం నుంచి చిలుకూరు ఆలయానికి 50 వేల మందికిపైగా జనాలు చేరుకున్నారని పోలీసులు చెబుతున్నారు. ఇంకా వస్తూనే ఉన్నారని తెలిపారు. ఆలయం వద్ద గరుడ ప్రసాదం ఇస్తున్నారన్న విషయం తెలిసి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణికులు రావొద్దని కోరారు.
రంగారెడ్డి జిల్లా చిలుకూరులో ఉన్న బాలాజీ దేవాలయానికి వీసా దేవుడని పేరు. సాధారణంగానే భారీగా భక్తులు వస్తారు. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు.. పైగా ప్రసాదం ప్రచారంతో భక్తులు పోటెత్తారు. ఏకంగా ఔటర్ రింగ్ రోడ్డు వరకు ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దాదాపు 12 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాజేంద్రనగర్‌లోని కాళీమాత టెంపుల్ నుంచి చిలుకూరు టెంపుల్ వరకు ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఈ రూటులో బోలెడు ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. అలాగే కొన్నిసంస్థలున్నాయి. ట్రాఫిక్‌జాంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
చిలుకూరు ట్రాఫిక్ జాం : గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment