రాష్ట్రంలో బొమ్మల కొలువు | Actions for setting up a toy museum in AP | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో బొమ్మల కొలువు

Published Mon, Jul 3 2023 3:21 AM | Last Updated on Mon, Jul 3 2023 11:12 AM

Actions for setting up a toy museum in AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టాయ్‌ (బొమ్మల) మ్యూజియం కొలువుదీరనుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన సంస్కృతి, సంప్రదాయాలు, నైపుణ్యాన్ని ప్రతిబింబించే బొమ్మలను ఇందులో ప్రదర్శించనున్నారు. చిన్నారుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసంపెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన విజ్ఞానాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం టాయ్‌ మ్యూజియాలకు శ్రీకారం చుట్టింది.

ఈ మేరకు మూడేళ్ల కిందట తొలి దశలో గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల్లో ప్రతిపాదించింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. రెండేళ్ల క్రితం గుజరాత్‌లో తొలి బొమ్మల మ్యూజియం పనులు ప్రారంభమయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో రూ.15 కోట్ల అంచనా వ్యయంతో విజయనగరంలో బొమ్మల మ్యూజియాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. ఇప్పటికే పురావస్తు, ప్రదర్శనశాలల శాఖ.. సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) తయారు చేసే పనిలో నిమగ్నమైంది. 

దేశం నలుమూలల నుంచి.. 
మన రాష్ట్రంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలతో పాటు జమ్మూకశ్మీర్‌ (పేపర్‌ బొమ్మలు) పంజాబ్‌ (ఫోక్‌), రాజస్థాన్‌ (గుడ్డ, స్టఫ్డ్‌), గుజరాత్‌ (ఎర్ర మట్టి), మహారాష్ట్ర (చెక్క, వంట సామగ్రి), కర్ణాటక (చెన్నపట్న బొమ్మలు), తమిళనాడు (తంజావూరు), తెలంగాణ (నిర్మల్‌), పశ్చిమ బెంగాల్‌ (నాటుంగ్రాం), మధ్యప్రదేశ్‌ (తమలపాకుతో చేసేవి), బిహార్‌ (కన్యాపుత్రి), ఉత్తరప్రదేశ్‌ (చెక్కబొమ్మలు), అసోం (ఆషారికండి) తదితర సుమారు 50కిపైగా ప్రసిద్ధి చెందిన ప్రాం­తాల నుంచి కొబ్బరి పీచు, రబ్బరు, ప్లాస్టిక్, మెటల్, పింగాణీలతో చేసిన కళాకృతులు, బొమ్మలను సేకరించి మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచనున్నారు.

ఈ సాంప్రదాయ బొమ్మలతో పాటు నూతన సాంకేతిక విజ్ఞానాన్ని అందించేలా రోబోటిక్, ఎల్రక్టానిక్‌ వంటి సుమారు లక్ష నుంచి రెండు లక్షల బొమ్మలను ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా మ్యూజియం సందర్శనకు వచ్చే చిన్నారులు ఆడుకునేందుకు ప్రత్యేక గ్యాలరీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. జాతీయ, స్థానిక సంస్కృతికి అద్దం పట్టడంతో పాటు శాస్త్రవేత్తలు, కళాకారులు, ప్రముఖ వ్యక్తుల గురించి బొమ్మల మ్యూజి­యం పరిచయం చేయనుంది. అలాగే పరిశోధన, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రాన్నిప్రోత్సహించనుంది.

గుజరాత్‌లో ప్రపంచంలోనే అతిపెద్దది..
కాగా గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద బొమ్మల మ్యూజియం రూపుదిద్దుకుంటోంది. చిల్డ్రన్స్‌ యూనివర్సిటీ ఈ ప్రాజెక్ట్‌ కోసం పనిచేస్తోంది. 30 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.1,500 కోట్ల అంచనా వ్యయంతో రతన్‌పూర్, షాపూర్‌ గ్రామాల మధ్యలో గిఫ్ట్‌ సిటీ సమీపంలో 11 లక్షలకు పైగా బొమ్మలతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పురాతన కాలం నుంచి ఆధునిక యుగం వరకు అనేక రకాల బొమ్మలను ప్రదర్శించనున్నారు.

ఇస్రో–డీఆర్‌డీవో సహాయంతో ఎల్రక్టానిక్, బ్యాటరీ, సౌర ఆధారిత చిన్న అంతరిక్ష నౌక, పృథ్వీ, అగ్ని క్షిపణులు, ఉపగ్రహాల సాంకేతిక విజ్ఞానంపై అవగాహన కల్పించేలా బొమ్మలను తయారు చేయనున్నారు. ఇప్పటివరకు అమెరికాకు చెందిన మిస్సౌరీ రాష్ట్రంలోని బ్రాన్సన్‌ టాయ్‌ మ్యూజియం 10 లక్షల బొమ్మలతో అతిపెద్ద మ్యూజియంగా గుర్తింపు పొందింది. ఇందులో మోడల్‌ రైళ్లు, విమానాలు, కార్లు, సూపర్‌ హీరో, డిస్నీ వరల్డ్‌ వంటి బొమ్మలు 1800 సంవత్సరం నుంచి తాజా టెక్నాలజీ వరకు ఉన్నాయి.

వారసత్వ, విజ్ఞాన, పరిశోధన కేంద్రంగా.. 
బొమ్మల మ్యూజియం చారిత్రక, వారసత్వ విజ్ఞానాన్ని భద్రపరుస్తుంది. సందర్శకులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకోవచ్చు. విద్యార్థులకు విజ్ఞానం, పరిశోధకులకు రీసెర్చ్‌ సెంటర్‌గా ఎంతో ఉపయోగపడుతుంది.

విజయనగరంలో స్థలం అందుబాటులో ఉండటంతో బొమ్మల మ్యూజియాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం. త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్‌ను పంపించి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక సంపదను కాపాడటంలో విశేష కృషి చేస్తోంది. అందుకే జిల్లాల్లో మ్యూజియాలను అభివృద్ధి చేస్తున్నాం.  – జి.వాణీమోహన్, కమిషనర్,  పురావస్తు–ప్రదర్శనశాలల శాఖ  

భవిష్యత్తు తరాలకు అందించడానికే.. 
భారతదేశం గొప్ప కళలకు ప్రసిద్ధి చెందింది. వాటిని మన భవిష్యత్తు తరాలకు అందించడమే టాయ్‌ మ్యూజియాల లక్ష్యం. అందుకే దేశ వ్యాప్తంగా రకరకాల బొమ్మలను సేకరించి ఇందులో ప్రదర్శిస్తాం. ఈ మ్యూజియాలే పెద్ద వర్క్‌­షాపు సెంటర్లుగా మారనున్నాయి.

బాల్యంలో స్నేహితులతో కలిసి బొమ్మలతో ఆడుకుంటే చిన్నారుల్లో మానసిక ఎదుగుదలతో పాటు సామాజిక స్పృహ, సృజనాత్మకత పెరుగుతుంది. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. టాయ్‌ మ్యూజియం ద్వారా కొంత వరకు దీన్ని అధిగమించవచ్చు.     – రజత్‌భార్గవ,  ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement