పక్షుల జీవ వైవిధ్యం తెలిపే విధంగా ఆకృతులు
పర్యాటకులను ఆకర్షిస్తున్న ‘బర్డ్ ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్’
టెక్కలి: ఏటా శీతాకాలం ఆరంభంలో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో గల సైబీరియా ప్రాంతం నుంచి పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ వలస పక్షులు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తేలినీలాపురం విదేశీ పక్షుల కేంద్రానికి చేరుకుని సంతానోత్పత్తి చేసుకుంటాయి.
తేలినీలాపురం విదేశీ పక్షుల కేంద్రంలో గల చింత, రావి, తుమ్మ, గండ్ర, జూము, వెదురు తదితర చెట్లపై ఆవాసాలు చేసుకుని సమీపంలో చిత్తడి నేలల్లో వేట కొనసాగిస్తాయి. సమీపంలో గల చిత్తడి నేలలో 120 రకాల పక్షులు ఉన్నట్లు అంచనా. దూరం నుంచి పక్షులు చూడడం ఆనందించడం సహజం.
పక్షులను దగ్గరగా చూస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఇక్కడ పక్షుల మ్యూజియం ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడ పక్షుల విన్యాసాలను తిలకించడానికి జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. విదేశీ పక్షులైన పెలికాన్, పెయింటెడ్ స్టార్క్ పక్షుల విన్యాసాలతో పాటు ఈ పక్షుల మ్యూజియం పర్యాటకులను ఆకర్షిస్తోంది.
మ్యూజియంలో నమూనాలు..
విదేశీ పక్షుల ప్రత్యేకతలు ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఆయా ప్రత్యేకతలు మ్యూజియంలో నమూనాలు పరిశీలిస్తే..
పెలికాన్: పెలికాన్ బాతు జాతికి చెందిన పక్షి. దీని బరువు 8 కిలోలు ఉంటుంది. దీని నోరు పొడవు 14 సెంటీమీటీర్లు. దీని రెక్కల పొడవు 118 ఇంచీలు, రోజుకు 4 కిలోల చేపల్ని తింటుంది. ఒకేసారి 2 కిలోల బరువు కలిగిన చేపను సునాయాసంగా తినగలిగే సామర్థ్యం ఉంది. దీని గుడ్డు బరువు సుమారు 150 గ్రాములు.
ప్రతి సీజన్‌కు 4 గుడ్లను మాత్రమే పెడుతుంది. దీని గుడ్డు 28 రోజుల్లో పిల్లగా పరిపక్వత చెందుతుంది. 3 నెలల్లో పిల్ల తల్లిగా మారుతుంది. దీని దవడ సంచి ఆకారంలో ఉంటుంది. రోజుకు 2 సార్లు ఆహారం కోసం బయటకు వెళ్తుంటాయి. గంటకు 100 కిలో మీటర్ల వేగంతో పయనిస్తాయి.
రోజుకు సుమారు 4 సార్లు బయటకు వెళ్తూ ఆహారాన్ని తీసుకువస్తాయి. పెలికాన్ దవడ సంచి ఆకారంలో ఉంటుంది. ఈ దవడలో సుమారు 4 కిలోల వరకు చేపల్ని నిల్వ చేయగలవు. పిల్లలకు ఆహారాన్ని నోటి ద్వారా అందజేస్తాయి. దీని జీవిత కాలం సుమారు 29 ఏళ్లు.
పెయింటెడ్ స్టార్క్:
పెయింటెడ్ స్టార్క్ కొంగ జాతికి చెందిన పక్షి. దీని బరువు సుమారు 5 కిలోలు ఉంటుంది. దీని రెక్కల పొడవు 63 ఇంచీలు, ఇవి చిన్న చేపలు, పురుగులు, నత్తలు తింటాయి. కేవలం పావు కిలో వరకు మాత్రమే నోటిలో ఆహారాన్ని నిల్వ చేయగలుగుతాయి. తీసుకువచ్చిన ఆహారాన్ని గూడు మీద వేస్తే పిల్లలు తింటాయి. దీని నోటి పొడవు సుమారు 16 సెంటీ మీటర్లు.
ఆహారం కోసం రోజుకు 2 సార్లు బయటకు వెళ్తుంటాయి. దీనికి సాధారణ దవడ మాత్రమే ఉంటుంది. దీని గుడ్డు సుమారు 75 గ్రాములు. ఇవి ఒక సీజన్‌లో 4 గుడ్లు మాత్రమే పెడతాయి. 28 రోజుల్లో గుడ్డును పిల్లగా పరిపక్వత చేస్తుంది. పిల్ల తల్లిగా మారాలంటే సుమారు 3 ఏళ్ల కాలం పడుతుంది. దీని జీవిత కాలం సుమారు 29 ఏళ్లు.
120 రకాల పక్షుల్లో కొన్ని పక్షుల ప్రత్యేకతలు..
పొడుగు ముక్కు ఉల్లంకి: ఈ పక్షి మట్టిలో ఆహార ఆన్వేషణకు బురద మట్టి ఇసుక నేలలో అనేక రకాలైన చిన్న పురుగులను కొక్కెం వంటి ముక్కుతో వేట కొనసాగిస్తుంది. ఈ పక్షి నమూనా మ్యూజియంలో ఏర్పాటు చేశారు.
తెడ్డు మూతి కొంగ: ఈ పక్షి మూతి చెంచా ఆకారంలో ఉంటుంది. నీటి అడుగున ఉన్న చిన్న జీవులను వేటాడుతుంది. అర్ధ చంద్రాకారంలో గల మూతితో వేట కొనసాగిస్తుంది.
పాము బాతు : బల్లెం వంటి ముక్కు ఆకారంతో ఈ పక్షి వేట కొనసాగిస్తుంది. మట్టి, నీటిలో పొడుచుకుంటూ ఆహారాన్ని సేకరిస్తుంది.
రాజహంస: జల్లెడ మాదిరిగా ఉన్న ముక్కు కలిగిన ఈ రాజహంస సూక్ష్మ జీవులను సునాయాసంగా వేటాడుతుంది. ఈ పక్షి ముక్కులో ఒక రకమైన వడపోత పరికరం బిగించి ఉన్నట్లు ఉంటుంది.
నత్తగుల్ల కొంగ: నత్తలను వేటాడడంలో ఈ పక్షి ముక్కు ఎంతో షార్ప్‌గా ఉంటుంది. నత్తలను గట్టిగా పట్టుకోవడంతో ఆహారాన్ని సంపాదించుకుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment