ఏపీ కాదంది.. ముక్కలుకానున్న యుద్ధనౌక
న్యూఢిల్లీ: స్వతంత్ర భారత్ మొదటి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌కు జరిగిందే బ్రిటిష్ ఇండియాకు చెందిన ఐఎన్‌ఎస్ విరాట్‌కు కూడా జరగబోతుందా?. నేవీకి 30 ఏళ్ల పాటు సేవలందించిన విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విరాట్‌ను భారత ప్రభుత్వం ముక్కలుగా విడగొట్టాలనే యోచనలో ఉంది. వచ్చే నెల 6వ తేదీన సర్వీసు నుంచి రిటైర్‌కానున్న విరాట్ బ్రిటిష్ ఇండియాకు 27 ఏళ్ల పాటు సేవలందించింది. ఆ తర్వాత 1987లో భారత నేవీలో చేరింది.
రిటైర్మెంట్ తర్వాత విరాట్‌ను మ్యూజియంగా మార్చే అవకాశాలను తొలుత కేంద్ర ప్రభుత్వం పరిశీలించింది. అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది. విరాట్‌ను 13 అంతస్తుల మ్యూజియంగా మార్చేందుకు రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతాయి. ఈ విషయాన్ని కేంద్రం వద్ద ప్రస్తావించిన ఏపీ ప్రభుత్వం రూ.500 కోట్ల వరకూ తాము భరించగలమని మిగతా కేంద్రమే భరించాలని కోరింది. ఏపీ ప్రభుత్వ అభ్యర్ధనను తోసిపుచ్చిన కేంద్రం సాంకేతికంగా అవసరమైతే సాయం చేస్తామని, నిధుల సాయమైతే కష్టమే అనే సంకేతాలు పంపింది. దీంతో ఐఎన్‌ఎస్ విరాట్‌ను తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం నిరాకరించింది.
విక్రాంత్ రిటైర్మెంట్ అనంతరం 17 సంవత్సరాల పాటు మెయింటైన్ చేసిన భారత ప్రభుత్వం ఎక్కువ ఖర్చు అవుతుండటంతో భాగాలను విడగొట్టేందుకు అమ్మేసింది. మార్చి 6వ తేదీన ముంబై పోర్టులో భారతీయ నేవీ విరాట్‌కు విడ్కోలు పలకనుంది. ఈ కార్యక్రమానికి విరాట్ మొదటి కమాండర్‌తో పాటు విరాట్‌లో పనిచేసిన బ్రిటన్‌కు చెందిన పలువురు వెటరన్లు, నేవీ అడ్మిరల్ సునీల్ లాంబా, నేవీ అధికారులు హాజరుకానున్నట్లు తెలిసింది. విరాట్ తన కెరీర్లో ఐదు లక్షల నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించింది.